కొనుగోలుదారులు (కవిత)

కొనుగోలుదారులు (కవిత)
ప్రకృతిని ఎవరో కొనేసినట్లున్నారు
ఏ సమయంలో
ఎలా పనిచేయాలో అనేది
ఎవరినో అడిగి మరీ చేస్తోంది.
వేడిని, తడిని రెంటినీ కలగలిపి
అంతా అయోమయాన్ని సృష్టిస్తోంది.
అమ్మాయి నుండి అమ్మతనం దాకా
ఆధునికత పేరుతో ఎవరో కొనేసినట్లున్నారు.
నా అనుకునే బంధాలన్నీ
ఆస్తులకు, అంతస్తులకు అమ్ముడుపోయి
కృత్రిమ హావభావాల్ని కనబరుస్తున్నాయి..
ప్రాంతాలకతీతంగా
కీర్తిని అందరూ కొనేసినట్లున్నారు
కులమతాలను పావుల్లా వాడుకుంటూ
అంగబలం, అర్థబలం
రెండూ కలిసి
ఉమ్మడి వ్యాపారం చేస్తూ ఎంతో వత్తిడిలో ఉంది..
జాలి, కరుణ, ప్రేమ, ఆత్మీయత
అన్నింటినీ
గుత్తాగా కొనేసినట్లున్నారు
అరణ్య రోదనే
సమాధానమవుతోంది
వాటి స్థానంలో
కర్కశత్వం, క్రూరత్వం, దుర్మార్గం
అన్నీ కలిసి
ధైర్యంగా నవ్వుతూ
పరిపాలన చేస్తున్నాయి
అమ్ముడుపోవడమే
జన్మహక్కుగా భావించి
సామాన్యుడు కూడా
ఆ ఒక్కపూట మందు, విందుకు
చాలా సులువుగా అమ్ముడుపోయాడు..
భావితరాల్ని తాకట్టుపెట్టి మరీ
వారి ముఖాల్ని కల్లుసీసాల్లోంచి చూస్తూ
ఈ రోజు మాత్రమే జీవితం అనే వాస్తవంలో
ఈత కొడుతున్నాడు...
నా స్వేచ్ఛను, ప్రశాంతతను
కొనేసిన ఈ
కొనుగోలుదారులు మాత్రం
కోట్లు కూడబెట్టుకుంటున్నారు
- శైలజామిత్ర