Telugu Global
Arts & Literature

గజల్...నా లోని నువ్వు (కవిత)

గజల్...నా లోని  నువ్వు (కవిత)
X

చూపు వెలిగిపోతున్నది నిను చూసిన నయనంలో

ప్రేమ పెరిగిపోతున్నది నిను వలచిన హృదయంలో

నీ బుగ్గల సిగ్గున్నది అరుణోదయ సమయంలో

నీ నీడల మెరుపున్నది చందమామ కిరణంలో

వేల ముళ్ళు దిగుతున్నా పూలస్పర్శలా ఉన్నది

పూలకారు తోడున్నది నిను చేరిన పయనంలో

నిను చూడని రాత్రులలో గడియ గడపలేకున్నా

నన్ను తోసి వెళ్ళిపోకు వేధించే విరహంలో

మేడలొద్దు మిద్దెలొద్దు నీవు నేను ఉండేందుకు

గూడు కట్టుకుందామే సిరివెన్నెల వలయంలో

విరజాజులు మల్లెపూలు స్వాగతాలు చెబుతున్నవి

వెన్నెల విరిసిన రాతిరి మునుగుదాము సరసంలో

చీకటన్నదే లేదని చెప్పగలను "నెలరాజా"

జాబిలిలా వెలుగుతావు నా మానసగగనంలో.

- ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

First Published:  14 May 2023 2:23 PM IST
Next Story