ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ (కథ)
"ఒరేయ్!ప్రకాశం !నా పెళ్లి పత్రిక అందిందా! "అని ఫోన్ చేశాడు రమేష్
" అందిందిరా !కానీ ఆ రోజుల్లో నా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంటుందేమోరా" అన్నాడు ప్రకాశం
"అదేం కుదరదు ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్స్ పంపిస్తున్నాను ఒకరోజు ముందే వచ్చేసేయి"అని ఆర్డరేశాడు రమేశ్
హైదరాబాదులో అతనికి మంచి హోటల్లో బస ఏర్పాటు చేశాడు రమేష్ కలిసిన తర్వాత ఈరోజు నేను కొంచెం పెళ్లి పనుల్లో బిజీ ఉంటాను అంతదాకా మా డ్రైవరు నిన్ను హైదరాబాద్ మొత్తం సైట్ సీయింగ్ కి పంపుతాడు
రమేష్ ,ప్రకాశం లు బాల్య స్నేహితులు వైజాగ్ దగ్గరలో భీముని పట్టణంలో వాళ్ళు ఉండేది .స్కూలు ,కాలేజీ ఇంజనీరింగ్ అన్ని కలిసిచదువుకున్నారు
అలా వారి మధ్య బలీయమైన స్నేహంఏర్పడింది . ఉద్యోగరీత్యా ప్రకాశం వైజాగ్ లో రమేష్ హైదరాబాదులో స్థిరపడ్డారు మధ్య మధ్యలో హైదరాబాదులో కానీ వైజాగ్ లో కానీ కలుసుకునేవారు
ఈ మధ్య వారి మీటింగ్స్ లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చింది . ఈ రూపంగా నైనా ప్రకాశం రమేశ్ ని కలవచ్చని సంతోషపడ్డాడు. ఏదో వాడు ఏమంటాడోచూద్దామని ఆఫీసులో ఇన్స్పెక్షన్ అని అబద్ధం ఆడాడు .
ప్రకాశం హైదరాబాద్ చేరుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యాక డ్రైవరు అతనికి కారులో ముఖ్యమైన ప్రదేశాలు మెట్రో ట్రైన్లు , విశాలమైన రోడ్లు ,ఫ్లైఓవర్లు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ,నూతన సెక్రటేరియట్ భవనం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం అటు పక్క ఉన్న అమరవీరుల జ్యోతి స్థూపం,ట్యాంక్ బండ్ ,నెక్లెస్ రోడ్, చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్ వగైరా ప్రదేశాలన్నీ చూపించాడు ఇవన్నీ చూసేసరికి ప్రకాశానికి చాలా ఆశ్చర్యమేసింది ఇంతకు ముందు కంటే ఇప్పుడు హైదరాబాద్ బాగా మారిపోయిందిఅనుకున్నాడు
సాయంత్రం రిసెప్షన్ ఓ పెద్ద స్టార్ హోటల్లో జరుగుతున్నది వెనుకటి కాలం వారు ఎదుర్కోళ్లు అని అంటారట. కూర్చున్న చోటికే స్నాక్స్, డ్రింక్స్ సప్లై అవుతున్నాయి. స్టేజ్ మీద వధూవరుల
తల్లిదండ్రుల సమక్షంలో వరపూజ, వధువు నిశ్చితార్థ కార్యక్రమం ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నాయి .స్టేజ్ కి ఇరువైపులా రెండు పెద్ద స్క్రీన్లు అమర్చారు
సడన్ గా స్క్రీన్ మీద రమేష్ అతని కాబోయే శ్రీమతి ఉమా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు దృశ్యం కనబడింది తర్వాత సినిమా చూపిస్తున్నట్లు హీరో హీరోయిన్లు రమేష్ ,ఉమ లు చెట్లల్లో కొమ్మల్లో,గార్డెన్లో ,పూల మొక్కల దగ్గర, కొండల్లో, కోనల్లో డ్యూయెట్లు పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారు.
.తర్వాత సీను ఓ లేక్ దగ్గర అందులో బోటింగ్ కూడా చేశారు ఒడ్డు మీద ఉన్న ఓ చెట్టు చాటుకెళ్లి ముద్దులు పెట్టుకున్నట్లు హగ్ చేసుకుంటున్నట్లు ఎఫెక్ట్ కలిగించారు కొన్ని ప్రాంతాల్లో రకరకాల యాంగిల్స్ లో పోజులిస్తూ లిప్ లాక్ లతో అక్కడ ఉన్న వారికి ఆహ్లాదం కలిగించారు .ఇదంతా చూస్తుంటే ప్రకాశానికి మతిపోయింది .అలా నోరు తెరిచి హాశ్చర్యంగా చూస్తుండి పోయాడు
నెక్స్ట్ సీను ఏటవాలుగా ఉన్న ఓ ఎత్తైన ప్రదేశం పైనుండి ఒకరి మీద ఒకరు దొర్లుతూ కిందికి వచ్చారు లేచిన తర్వాత ఒకరి కళ్ళల్లో మరొకరు అలా చూస్తుండి పోయారు.
ఇంతలో సీను ఓ హోటల్ కి మారింది ఓ కార్నర్ల్లో వధూవరులిద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు హీరో స్టైల్ గా సిగరెట్ తీశాడు .వెలిగించి పొగను రింగులు రింగులుగా వధువు వైపు వదిలాడు హీరోయిన్ ఊరుకుంటుందా అతని చేతిలో సిగరెట్టు లాక్కొని తాను కూడా అలాగే అతని మీదకి పొగను రింగులు రింగులుగా వదిలింది .వారి మధ్య సంభాషణ వినబడటం లేదు బహుశా నేను ఎక్కువ రింగులు వదిలానంటే కాదు నేనే ఎక్కువ రింగులు వదిలాననే మాటలు ఉండొచ్చు.
కొద్దిసేపటికి వారి ముందు విస్కీ తో కూడిన గ్లాసులు పెట్టారు బేరర్ నంజుకోవడానికి చికెన్ పీసెస్ సోడాతో పాటు టేబుల్ మీద పెట్టాడు అబ్బాయిగారు పెగ్ ఫిక్స్ చేసి అమ్మాయి నోటికి అందించాడు ఇష్టం లేనట్లు అలవాటు లేనట్టు మొహం పెట్టినా రమేష్ ఊరుకోలేదు తప్పదు అన్నట్లు కొంచెం తాగి తాను కూడా అలాగే అదే గ్లాసును రమేష్ నోటికి అందించింది
ఇక లాస్ట్ సీన్ అలంకరించిన శోభనం గది .గదిలోకి వరుడి నోటికి వధువు పాలు అందించడం ఆ తర్వాత ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి పోవడంతో సినిమా అయిపోతుంది .ఇదే సినిమాను రిపీటెడ్ గా చూపిస్తున్నారు
వచ్చిన ఆహుతులంతా ఈ సినిమా చూశాక ప్రకాశం లాంటి అవస్థలోనే ఉన్నారు.
కొందరు ముసలాళ్లు ముఖ్యంగా అమ్మలక్కలు నోరు నొక్కుకుంటూ పిదప వేషాలు పిదప బుద్దులు. మా కాలంలో ఇలాంటివి మేమెరుగమమ్మా!
మా పెళ్లైయ్యాక కూడా శోభనం ముహూర్తం కుదరలేదని ఆరు నెలలు దూరం ఉంచారు పైగా ఆషాడమాసం ఇంకా చూడడం కూడానా ఇదేం వేషాలు అని ఈసడించుకుంటే ఆమె పక్కనే కూర్చున్న ఆమె మనుమరాలు "బామ్మా! దీన్నే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటారు"అంది
" అంటే ఏంటే"
"ఏం లేదు పెళ్లికి ముందు ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి,అభిరుచులు తెలుసుకోవడానికి ఈ ఫోటో సూట్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట "
"ఏంటి అర్థం చేసుకోవడమా! పెళ్లయ్యాక అన్ని అర్థమవుతాయి డక్కామొక్కీలు తింటుంటే అవే తెలుస్తాయి దానికి ఇంత రాద్ధాంతం అవసరం లేదు "
"అది కాదు బామ్మా !ఈరోజుల్లో ఇది ఒక ట్రెండ్, ఫ్యాషన్ "అని నచ్చచెప్పబోయింది
"ఛీ!ఛీ ! పెళ్లికి ముందే ఈ వెర్రివేషాలేంటీ!మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి ఇలాంటి వారి పోకడలతో" అని ఈసడించుకుంది సో కాల్డ్ చాదస్తపు బామ్మ .
స్టేజ్ మీద వరపూజ అయ్యాక రమేష్ అందర్నీ కలుస్తూ ప్రకాశం దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు
ప్రకాశం" కంగ్రాచులేషన్స్ రా! అయినా ఏంటిరా ఈ సినిమా ఏంటి మీరిద్దరూ ఇలా హీరో హీరోయిన్లుగా డ్యాన్సులు వగైరాలేంటీ!" అని ఉండబట్టలేక అడిగాడు ప్రకాశం
"ఒరేయ్ మొద్దూ!నీవు ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ రా .దీన్ని ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్అంటారు .ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ రా ఇది" అన్నాడు రమేష్ .
"అంటే వెడ్డింగ్ తర్వాత ఇక ఏ షూట్లు ఉండవా!తెలియకఅడుగుతున్నాను రా ఏమనుకోకు "అన్నాడు ప్రకాశం.
" అది కాదురా పెళ్లికి ముందే వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఇలా ఏర్పాటు చేసుకుంటారు"
"అంటే ఈ లిప్ లాకులు హగ్గింగులు మందు కొట్టడాలు కూడా అందులో భాగమేనా? "
"అవన్నీ ఉండవు .మేమే అనుకొని వెరైటీగా ఉంటుందని అలా షూట్ చేసుకున్నాం అన్నమాట " నవ్వాడు రమేష్ .
వెనకనుంచి ఓ పెద్దాయన
" ఏడ్చినట్లుంది ఏదైనా పిడికిలి మూసి ఉన్నంత కాలమే రహస్యం .తెరిచిన తర్వాత ఇంకేముంటుంది అంతా బహిర్గత మైతే ! పడక గది విషయాలు ఎప్పటికీ బయటకు రాకూడదు."అని అన్నాడు .
విని నివ్వెరపోయారిరువురు.
వైజాగ్ వెళ్ళాక ప్రకాశం ఆలోచనలో పడ్డాడు .ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల కాబోయే భార్య అభిరుచులు అభిప్రాయాలు తెలుసుకోవచ్చన్నమాట అయితే తాను కూడా తన పెళ్లికి ముందు ఈ కార్యక్రమాన్ని ఆచరిద్దామని డిసైడయ్యాడు .
రమేష్ తో ఫోన్లో" నీ ఆలోచన చాలా బాగుందిరా !నా పెళ్లికి కూడా ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామనుకుంటున్నాను నువ్వే డైరెక్షన్ చేయాలి" మాట్లాడుతూ ప్రకాశం తన కలల సుందరిని ఊహించుకుంటూ కొండల్లో కోనల్లో విహరిస్తూ రమేష్ ఫోన్ ని పట్టిచ్చుకోలేదు ఇంతవరకు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిలను రిజెక్ట్ చేసిన ప్రకాశం ఇప్పుడు పెళ్లికి ఆత్రుత పడసాగాడు తన తల్లికి చెప్పి పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించాడు.
చంద్రకళ చక్కని అమ్మాయి.అమాయకురాలు ఉన్నంతలో స్థితిమంతులు. ప్రకాశానికి నచ్చింది. ఒంటరిగామాట్లాడుకుంటామని మేడ పైకి వెళ్లారు వెళ్లాక ఆమెతో "మీరు నాకు బాగా నచ్చారండి .మరి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ చేసుకుందాం? ఎన్ని రోజులు చేసుకుందాం "అని అడిగాడు
ఆ అమ్మాయి బిత్తర పోయింది ఆ మాటలు సరిగ్గా అర్థం కాక పెళ్లికి ముందే శోభనం అంటున్నాడు ఏమో అని కంగారుగా "అమ్మా! "అంటూ గాబరాగా వచ్చి తల్లి ఒడిలో పడింది
"ఏమైందమ్మా? ఏమన్నారు అల్లుడుగారు "
ఏమి మాట్లాడకుండా చంద్రకళ భయపడి లోపలికి వెళ్ళిపోయింది
తల్లి ప్రకాశంనుద్ధేశించి " ఏమండీ! మా అమ్మాయిని ఏమని అడిగి బెదిరించారు! చూడండి పిల్ల ఎంత భయపడిపోయిందో .పెళ్ళికి ముందే ఇలా ప్రవర్తించారంటే మీకు చాలానే కనెక్షన్లు ఉన్నాయి అన్నమాట ."అంది
" అదేం లేదండీ!నేను ......."అని సర్ది చెప్పబోతుంటే ప్రకాశంతో
" ముందు మీరు ఇక్కడ నుండిబయటకు నడవండి మా అమ్మాయిని మీకిచ్చే ఆలోచన విరమించుకున్నాను "అని గెంటేసినంత పనిచేసింది .
మరో సంబంధం రమణిని చూశాడు ప్రకాశం ఒంటరిగా ఉన్నప్పుడు చంద్రకళను అడిగినట్లు అడిగాడు అది విని రమణి "ఓ! ఆ షూటా! నేను గతంలో సత్యంతో చాలాసార్లు చేశాను ఇప్పుడు మీతోనా సరే కానీయండి"
మనవాడు పరుగో పరుగు
ఇంకో సంబంధం ధనలక్ష్మి వంతైంది .అదే ప్రశ్నకు ఆమె సమాధానమేమంటే
" ఆయ్! ఇది పెళ్లికి ముందే ఉంటుందాండి !తీయగా ఉంటుందా! కారం కారంగా ఉంటుందా? మరి అలాంటప్పుడు స్వీట్లు అన్ని నేనే తినేస్తాను మీ కియ్యను .సరే పెట్టేసుకోండి ప్రీ వెడ్డింగ్ లు ఫుడ్డింగులు"
అనేసరికి దిమ్మ
తిరిగిపోయింది ప్రకాశానికి .
ఆ దెబ్బతో పెళ్లి సంబంధాలు చూడడమే మానేశాడు. చివరికి ఈ ఒక్క సంబంధం చూడమని మళ్లీ ఇంక అడగమని పెళ్లిళ్ల పేరయ్య తల్లి కూడా బతిమిలాడిన తర్వాత "ఇదే లాస్ట్ !దీని తర్వాత నన్ను బలవంత పెట్టదు సరేనా"!
"సరే !సరే! "ఒప్పుకున్నందుకు సంతోషంతో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు .
అమ్మాయి పేరు సుజాత చూడ చక్కగా ఉంది ఆమెను చూడగానే ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి అడగొద్దనుకున్నాడు అడిగితే ఇంకేం వినాలి వస్తుందోనని. అదిగాక ఆ అమ్మాయి మొదటి చూపులోనే బాగా నచ్చేసింది .ఇంతకు ముందు చూసిన సంబంధాల కంటే కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్టు అనిపించింది ప్రకాశానికి .వెంటనే మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు.
ప్రకాశంసుజాతలు విడిగా ఏమైనా మాట్లాడుకుంటారా అని మధ్యవర్తి అడిగాడు "ఏం అవసరం లేదండి"అని అన్నాడు ప్రకాశం
కొద్దిసేపటికి సుజాత లేచి "ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు "అంది అందరూ ఆశ్చర్యపోయారు
"ఎందుకమ్మా !ఇంతమంచి సంబంధం కాదంటున్నావ్ "తల్లిదండ్రులు అక్కడున్న వారి బంధుమిత్రులు అడగడం మొదలెట్టారు
అందరి మాటలు విన్నాక సుజాత ఇలా చెప్పింది
"అసలు ఈయన గారికి ఈ రోజుల్లో జరిగే ట్రెండ్ గురించి తెలుసా! మహానుభావుడు ఏదో పాతకాలం చాంధసుడి లాగా ఉన్నాడు"
" అంటే ఏంటి నీ ఉద్దేశం "అని అడిగాడు తండ్రి .
ప్రకాశం నివ్వెరపోయాడు
" ఇంత పెద్ద ఉద్యోగం వెలగ బెడుతున్న ఈ మనిషి ఏమైనా అడుగుతాడేమోనని ఆధునికంగా ఆలోచిస్తాడని అప్పటి నుంచి ఎదురుచూస్తున్నాను. ఏమండీ! ప్రకాశం గారు !మీకు తెలుసా !ఈ రోజుల్లో పెళ్లిలో జరిగే ట్రెండ్ ఏంటో ?పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుందనీ ,దానివల్ల వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని .అది ఎక్కడెక్కడ ఎలా జరుపుకోవాలి ,ఎన్ని రోజులు జరుపుకోవాలని ఏమి ప్లాన్ చెపుతారోనని ఎదురు చూశాను .ఇలాంటి మొద్దురాచిప్పను ఎవరు చేసుకుంటారమ్మా !" అని అనేసరికి ప్రకాశం ఒక్కసారి "హుర్రే"!అని అరిచాడు
తర్వాత కథ మీకు తెలిసిందే కదా! కాకపోతే సెన్సార్ చేసిన సీన్లు మాత్రం లేవు.
రూపాకృష్ణ