Telugu Global
Arts & Literature

తెలంగాణ జాతికి రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి

గ్రామగ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తాం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

తెలంగాణ జాతికి రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి
X

బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఉపసంహరించుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి నిర్వహించిన ''తెలంగాణ అస్తిత్వంపై దాడి - చర్చ'' రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. సెక్రటేరియట్‌లో రేవంత్‌ రెడ్డి స్థాపించిన విగ్రహానికి కాంగ్రెస్‌ మాతగా నామకరణం చేస్తూ రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌ లో తీర్మానం చేశామన్నారు. తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రేవంత్‌ కు తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టే రూపం మార్చారని తెలిపారు. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను చూస్తే మన సమాజాన్ని చూసుకున్నట్టు ఉట్టుందని అన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది.., అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందని బతుకమ్మ సందేశం ఇస్తుందన్నారు. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే ఈ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు.




తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని.. అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ఎక్కడా లేడన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరిచి, తెలంగాణను ఆగం చేయాలని రేవంత్‌ రెడ్డి కుట్రలు చేశాడన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు. తాము ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని తేల్చిచెప్పారు. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామన్నారు. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి ఇచ్చే ప్రయత్నం చేస్తామని, తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రం మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇకముందూ కొనసాగిస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

First Published:  14 Dec 2024 3:42 PM IST
Next Story