Telugu Global
Arts & Literature

రిటైర్మెంట్ (కథానిక)

రిటైర్మెంట్ (కథానిక)
X

తెల్లవారింది!!

వాకింగ్ కి వెళ్లి వచ్చాను.శ్రీమతి మంచి కాఫీ అందించింది.కాఫీ కప్పు అందించి వెళ్ళిపోతున్న విద్యాధరితో " కొంచెం సేపు కూర్చో వచ్చు కదా!" అన్నాను.

" కూర్చుంటే పనులు ఏం కావాలి!" అంది." అవి ఎప్పుడూ ఉండేవే కదా!" అన్నాను కాఫీ రుచి ఆస్వాదిస్తూ..

" ఈ మాట అన్న మీరే ఆఫీస్ కి బయలుదేరే టప్పుడు " క్యారియర్ ఇంకా రెడీ కాలేదా? అంటారు" అన్నది విద్యాధరి చిన్నగా నవ్వుతూ.

" ఆ అవకాశం నీవు ఎప్పుడు నాకు ఇచ్చావు?అన్నీ ముందే సిధ్ధం చేసేస్తావు?" అన్నాను.

కాఫీ కప్పు అందుకుంటూ" మీరు పేపర్ చూస్తూ ఉండండి.ఇప్పుడే వచ్చేస్తాను" అని కిచెన్ లోకి వెళ్ళింది.

ఎప్పుడూ అవిశ్రాంతంగా పని చేసే నా భార్యను చూస్తుంటే నాకెప్పుడూ బాధగా ఉంటుంది. పెళ్లి అయిన కొత్తలో

ఎప్పుడూ ఏదో ఒకటి నాకు చేసి పెడుతూ ఉండేది.తరువాత పిల్లలు పుట్టారు.వాళ్ళ తిండి తిప్పలు...స్కూల్ కి పంపడం...

చదివించడం ...ఇలా అస్సలు విశ్రాంతి అనేది ఉండేది కాదు. నేను సాయం చేయబోతే " చేస్తున్న ఆఫీస్ పని చాలు..ఇంటి పనుల జోలికి రావద్దు" అనేది. తన ప్రేమ నాకెప్పుడూ బాధను మిగిల్చేది. తనకేం చేయ లేక పోతున్నాను అన్నదే ఆ బాధ.

పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.చదువులు...ఉద్యోగాలు..పెళ్ళిళ్ళు... అన్నీ అయ్యాయి.అబ్బాయి కి ముంబై లో ఉద్యోగం .పెళ్లి చేసేసాం.కూతురు...అల్లుడు చెన్నైలో స్థిర పడి పోయారు.

అయినా విద్యాధరి అవిశ్రాంతంగా శ్రమిస్తునే ఉంటుంది. చెప్పినా వినకుండా మనం ఇద్దరమే కదా అని పని మనిషిని మాన్పించేసింది. వద్దన్నా వినకుండా నాకు ఆరోగ్యానికి కొన్ని..రుచికి కొన్ని వంటలు చేసి పెడుతుంది. ఆమె ప్రేమకు నేను సదా ఫిదా అవుతుంటాను.

నేను రిటైర్మెంట్ కి దగ్గర పడ్డాను.రిటైర్ అయ్యాక ఆమె వద్దన్నా వినకుండా పనిలో సహాయ పడాలని నిశ్చయించుకున్నాను.

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.

ఆరోజు నా పదవి విరమణ రోజు .మా ఆఫీస్ స్టాఫ్ నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ సభకు నాతోపాటు నా శ్రీమతి ని కూడా ఆహ్వానించారు. తను కూడా సంతోషంగా ఆ ఫంక్షన్ కి వచ్చింది.

సభాసదులు అందరూ నాతో పాటు శ్రీమతికి కూడా అభినందనలు తెలియ బరిచారు. నేను ఆఫీస్ విధులు సక్రమంగా నిర్వహించడం లో ఆమె సహకారం ఎంతో ఉన్నదన్నది ఆ అభినందన సారాంశం.ఆ తరువాత నా రిటైర్మెంట్ జీవితం ఉల్లాసంగా..ఉత్సాహంగా కొనసాగాలని అందరూ కోరుకున్నారు. అది విన్నవిద్యాధరి మౌనంగా నవ్వుకుంది.అది చూసిన నేను " మా గృహిణులకు రిటైర్మెంట్ అనేది లేదు కదా!" అని నవ్వుకున్నట్లు భావించాను.

అది నిజం. గృహిణులది రిటైర్మెంట్ అనేది లేని జీవితం.అయితే వాళ్ళు అలా భావించరు.అయినవాళ్లకు చేయడంలో ఆనందం వెదుక్కుంటారు.

మమ్మల్ని ఇద్దరినీ ఘనంగా సత్కరించి విలువైన కానుకలతో కారులో ఇంటికి సాగనంపారు.

తెల్లవారింది.

విద్యాధరి నిద్ర లేచేసరికి నేను కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచాను.తను లేవగానే

తనకు ఒక కప్పు కాఫీ ఇచ్చి నేనో కప్పు అందుకున్నాను. విద్యాధరి కాఫీ కప్పు అందుకుంటూ "ఏమిటిది? కొత్తగా?" అన్నది." నేను రిటైర్

అయిపోయాను.ఇక నీకు సాయంగా ఉంటాను. ఇంతకాలం ఎంతో కష్ట పడ్డావు!" అన్నాను.

అందుకు విద్యాధరి చిన్నగా నవ్వి " మీరు చేస్తానన్నా నేను చేయిస్తానా?" అంది.

" అదే ఇప్పటివరకూ సమస్య.ఇక నీవు మారాలి!" అన్నాను." నాకు ఆరోగ్యం బాగోనప్పుడు ఇంటి పనులు చేద్దురు గాని! అప్పటి వరకు ఇలాంటి పనులు చేయకండి!

అది నాకు బాధను మిగులుస్తుంది" అని కిచెన్ లోకి నడిచింది విద్యాధరి.చిన్నగా నిట్టూర్చాను.ఇదినేను ముందు ఊహించిందే! అందుకు బదులుగా ఏం చేయాలో సిధ్ధం చేసుకునే ఉన్నాను.

వారం రోజుల తరువాత ఒక రోజు బయటకు వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక పాపను ఇంటికి తీసుకు వచ్చాను.ఆ పాప వయసు పదేళ్లు.పేరు వల్లిక.

ఆ అమ్మాయిని చూడగానే నా భార్య" ఎవరీ అమ్మాయి.చక్కగా ఉంది!" అని దగ్గరకు తీసుకుంది. నేను సోఫాలో తీరుబడిగా కూర్చుని చెప్పాను." ఈ అమ్మాయి పేరు వల్లిక.

మా ఆఫీస్ లో పని చేసే అటెండర్ మనవరాలు.ఈ మధ్య కరోనా వచ్చి ఇంటిల్లిపాదీ చనిపోయారు.బంధువులు ఎవరూ దగ్గరకు తీయలేదు.

ఆఫీస్ లో ఈ అమ్మాయి విషయం చర్చకు వచ్చినప్పుడు నేను మన ఇంటిలో ఉంటుందని చెప్పాను.ఇంతవరకూ ఎవరి పంచనో ఉంది.ఇప్పుడే వెళ్లి తీసుకు వచ్చాను" అని చెప్పాను.

" మంచి పని చేశారు.కాకపోతే ముందుగా నాకో మాట చెప్పిఉండవలసింది"అంది విద్యాధరి." చెప్తే ఏం చేసేదానివి?" అన్నాను.

"కాస్త ముందుగానే సంతోషించే దాన్ని" అన్నది.

" నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు.ఇక మీదట వల్లిక నీకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది" అన్నాను. " మిమ్మల్ని పనులు చేయ

వద్దు అన్నానని మీ పంతం ఇలా తీర్చు కుంటున్నారా?" అని నవ్వింది విద్యాధరి.

బెరుకు బెరుకుగా ఉన్న వల్లికతో, విద్యాధరి" ఏం భయం లేదు.నీకు మేం ఉన్నాం. సంతోషంగా ఉండు"అన్నది.

ఒక అనాధకు కాస్తంత గూడు కల్పించినందుకు నాకు సంతోషం అనిపించింది.

ఆ తరువాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రెండు వారాల పాటు ఆఫీస్ కి వెళ్ళవలసి వచ్చింది.ఒకరోజు, ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాను.

అలసటతో వచ్చిన నన్ను ఎప్పటిలానే విద్యాధరి మంచి కాఫీతో పలకరించింది. " కాఫీ నీవు తెచ్చావేం?వల్లికకు పనులు అలవాటు చేయి" అన్నాను.

" వల్లిక లేదు" అని చెప్పింది విద్యాధరి.

"ఎక్కడికి వెళ్లింది?" అని అడిగాను." తను వెళ్ళలేదు.నేనే పంపించి వచ్చాను" అంది.

నా మనసు చివుక్కుమంది.ఆదరించినట్లు ఆదరించి నేను లేని సమయంలో ఆ అమ్మాయిని పంపేయడం నాకు నచ్చలేదు. అయినా విద్యాధరి వైపుఅపనమ్మకంగా చూస్తూ " ఎందుకిలా చేశావు విద్యా!" అన్నాను.

" మీరు ఆ పిల్లను తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు.

నేనా ఆ పిల్లనుపంపి మీకు సర్ప్రైజ్ ఇచ్చాను" అంది.నా వదనం వివర్ణం అయింది.

"నాతో ఒక మాట చెప్పి ఉండవలసింది" అన్నాను." వల్లికను ఇక్కడకు తెచ్చేటప్పుడు

మీరు నాకు చెప్పారా?" అంది.నా భార్య నుంచి అటువంటిది నేను ఊహించలేదు.మౌనం

వహించాను.మనసులో తెలియని బాధ.ఒక పసి దానికి ఆశలు కల్పించి వంచించాను అనిపించింది.

నేను ఖాళీ చేసిన కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టాను. విద్యాధరి నా వంకే చూస్తున్నది.

అంతలో కాలిగ్ బెల్ మోగింది. విద్యాధరి వెళ్లి తలుపు తీసింది.ఎదురుగా స్కూల్ యూనిఫాం లో వల్లిక.నాకు ఏం జరిగిందో బోధ పడింది.వల్లిక స్కూల్ బ్యాగ్ తో లోనికి వచ్చి నాతో" అంకుల్!ఆంటీ నన్ను కాన్వెంట్ లో చేర్పించారు" అని చెప్పింది.ఆ అమ్మాయి కళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి.నేను విద్యాధరి వంక సంతోషంగా చూసాను.

అప్పుడు విద్యాధరి " నా సుఖం కోసం వల్లిక భవిష్యత్ పాడు చేయడం నాకు సమంజసంగా తోచలేదు.అందుకే కాన్వెంట్ లో

చేర్పించాను.చదువుకుంటూ కూడా నాకు సాయం చేయవచ్చు" అంది చిరు నవ్వుతో.నాకు నా భార్యలో మా అమ్మ కనిపించింది.

సృష్టిలో స్త్రీని మించిన కరుణా మూర్తి ఎవరు ఉంటారు!!

- ఎన్. శివ నాగేశ్వరరావు

First Published:  21 Sept 2023 3:08 PM GMT
Next Story