Telugu Global
Arts & Literature

వేకువనై నేనొస్తాను

వేకువనై నేనొస్తాను
X

చెలీ..

మందారాల అరుణిమనై..

తామరతూడుల సెలయేరునై

వేకువరెక్కల వెన్నెలనై...

వెలుగువాకిలిని చుట్టుకొని

వెన్నెలదారులు వెతుక్కొని..

తేనెలసోనలు కలలుగని

వెలుగు రేఖనై విచ్చుకొని...

వేకువనై నేనొస్తాను!!!

పున్నమివెన్నెల పూలదారుల...

పూచేపూవు కాచేనవ్వు

మనసున మీటి ఎడదను తాకి..

ఎన్నోతలపుల ఎదురుతెన్నులు

కాచే కన్నుల కలల బరువును..

వాలేరెప్పల సిగ్గుతనువును

వెలుగు రేఖనై విచ్చుకొని .

వేకువనై నేనొస్తాను!!!

కమ్మని పలుకుల కలికినవ్వులు.

రమ్మని పిలిచే కాలిమువ్వలు

వేకువసందిట వెలుగుదివ్వెలు..

ఝమ్మని పలికే సంగీతాలు

చల్లని వెన్నెల సాయంత్రాలు..

జాబిలి పలికే స్వాగతాలు

వెలుగు రేఖనై విచ్చుకొని..

వేకువనై నేనొస్తాను!!!!

- రెడ్డి పద్మావతి.

(పార్వతీపురం)

First Published:  12 Feb 2023 5:54 PM IST
Next Story