కోడలా కోడలా ..కొడుకు పెళ్ళామా
ఊరికి ఉత్తరాన కాపురముండే రంగమ్మ రెండవ కొడుక్కి ఘనంగా పెండ్లి జరిగింది. రంగమ్మకి అందాల భరిణకోడలిగా దొరికిందని ఊరు ఊరంతా గుసగుసలాడింది. తనకివయసు పైబడిందనివంట పనులన్నీ కోడలకి అప్పజెప్పింది రంగమ్మ. రంగురంగు చీరలు కట్టి, ఘల్లు ఘల్లు గజ్జెలతో, ఇల్లంతా తిరిగే కోడలు పిల్ల వంటలు సరిగా వండడంలేదని రంగమ్మ మొగుడు రాఘవన్న నెత్తీ నోరూ బాదుకోసాగాడు.
రంగమ్మ మాత్రంమొగుడి మాటలను వినీవిననట్లు ఉండిపోయింది. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న భార్య పైన సందుదొరికినప్పుడల్లా కారాలూమిరియలూ నూరేవాడు. ఊర్లో వాళ్లకి ఎవరికైనా చెబుదామంటేమంచి సంబంధాలన్నీ రకరకాల వంకలు పెట్టికాదన్నారు. ఎర్రగా బుర్రగా ఉందని, సొత్తు బాగా ఇస్తారని ఆ అమ్మిని చేసుకున్నారు, మీకు జరగాల్సినశాస్తే జరిగిందని అంటారని ఆలోచన చేసినాడు.
పోనీ ధైర్యం చేసి 'కోడలా కోడలా, కొడుకుపెళ్ళామా, వంటలు మంచిగా వండరాదా'అని అడుగుదా మనుకున్నాడు. అయినా'ఎందుకొచ్చిన గొడవ, పెద్దింటి పిల్ల, ఒకటి మాటాడితే ఎక్కువ,రెండు మాట్లాడితే తక్కువ కదా' అని అనుకున్నాడు. 'కోపమొచ్చి వాళ్ళ అమ్మగారింటి వాళ్ళు పెండ్లికి పెట్టిం దంతా పెరుక్కుపోతే ఎలా' అని తేలు కుట్టిన దొంగలాగాగమ్మున ఉండి పోయాడు.
రుచీపచీ లేని కూరలు తిని నోరు చెడిపోయిందని ఒకరోజు కిష్టడి ఇంటికి వచ్చినాడు. ఇంటి ముందరి చింత చెట్టుకున్న లేత కాయలను కిష్టడి చేత కోయించినాడు. అమ్మ నారాయణమ్మను అడిగి ఉప్పు, పచ్చి మిరప కాయలుతీసుకుని రోకటిలో వేసి దంచి “ఆహా ఓహో” అంటూ తృప్తిగా తిన్నాడు. ఎవ్వరికీ చెప్పవద్దని చెప్పి తన తిండి కష్టాలు గుక్క తిప్పుకోకుండా చెప్పినాడు.
“ఈ రోజు ఉన్నట్లే రేపు ఉంటుందా, రోజులు మారకుండాఉంటాయా, అంతా మంచి జరుగుతుందిలే రాఘవన్నా”అని ధైర్యం మాటలు చెప్పి పంపింది నారాయణమ్మ.
“ఉందిలే మంచి కాలం ముందు ముందునా" అనిపాడుకుంటూ ఇంటికి బయలుదేరినాడు. పోతూ పోతూతనకు గుత్తి వంకాయ కూర ఇష్టమని తోటకాడి కెళ్ళి లేత వంకాయలు కోసుకుని ఘమఘమలాడే కూర చేయమని కోడలు పిల్లని కోరాడు. కూరలు చేయడం చేతకాని కోడలుపిల్ల వంకాయ కూరను చెడ గొట్టి పెట్టింది. నోట్లో పెట్టుకోలేక పోయినాడు మామ.
అయినా రంగమ్మ 'కూర భలే వండినావు కోడలు పిల్లా' అని పొగిడింది.రాఘవన్నకి కడుపు మండి పోయింది. కసికసిగా తిడుదామనుకున్నాడు కోడలు పిల్లని. అయినా 'కొత్త కోడలిని కూర్చోమన్నా తప్పే, లేచి నిలబడమన్నా తప్పే కదా' అని కక్కలేక మింగలేక గమ్మున ఉండి పోయాడు.
రెండు మూడు నెలలు రాఘవన్న కనిపించకపోయే సరికి 'తిండి సరిగా లేక పాపిట్టోడు ఏమైనాడో ఏమో' అని బాధపడింది నారాయణమ్మ. 'ఎంతైనా దూరపు బంధువుకదా, బంధువు అంటే భగవంతుడి ప్రతి రూపం కదా, వెళ్లి చూసి రావాలి' అని అనుకుంది. పుల్లంగా, కారంగా చింత చిగురు ఊరిమిండి (పచ్చడి) చేసుకుని కిష్టడిని తోడు చేసుకుని రాఘవన్న ఇంటికి వెళ్ళింది.
రాఘవన్న తిన్నెపైన కాలు మీద కాలేసుకుని రాజా లెక్కన కూర్చుని ఉన్నాడు. రాఘవన్నకి నారాయణమ్మ ముఖంలో ప్రశ్న మార్కు కనిపించింది. తెచ్చిన ఊరిమిండిని'వద్దువద్దు' అంటూనే తీసుకుని నాలిక పైన పెట్టుకుని "త్తాంత్తాం” అని చప్పరిస్తూ ఇలా చెప్పినాడు.
“ఒక రోజు మన ఊరి పక్కనున్న చెర్లోపల్లిలో తిరునాళ్ళు జరుగుతూ ఉంటే, కోడలు పిల్ల వాళ్ళ ఇంటాయనతో కలిసివెళ్ళింది. ఒంటరిగా దొరికన రంగమ్మతో, కోడలు పిల్లవంటలు చెత్తగా చేస్తున్నా పొగుడుతున్నావేమిటని నిలదీసినాను. అందుకామె “కూర్చుంటే లేయలేను, లేస్తే కూర్చోలేను....వంట బాగా లేదంటే చేయడం మానేస్తుంది.
పని అంతా నా నెత్తిన పడుతుంది. ఇంటి పనులు కళాని చేసే శక్తి, ఓపిక నాకు లేదు. కొత్త కదా, ఈ రోజు కాకపోతే రేపైనా నేర్చుకోదా అని తిట్టడం లేదు.
అయినా తిడితే ఏమి వస్తుంది, ఇంకా అలిగి కూర్చుంటుంది. మొండి కేస్తే మొగుడు మాత్రంఏమి చేస్తాడు అన్నట్లుగా తయారవుతుంది పరిస్థితి.ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
పొగిడితే పోయేదేమీ లేదు, తిడితే వచ్చేది ఏమీ లేదు, కొన్ని రోజులు ఓపిక పట్టండి. వంటలు బాగా లేకపోయినా భలే చేసినావు అని పొగుడుతాను. తన మనసుకు నొప్పి కలగకుండా ఉప్పు ఎక్కువ తక్కువలు, కారం సరిపోవడాలు నేర్పిస్తాను. చిన్నచిన్నగా వంటలన్నీ నేర్చుకుంటుంది, మన ఇద్దరం 'జ్యాంజ్యాం' అని తినే రోజులు వస్తాయి” అని నచ్చ చెప్పింది. ఏమీ తెలియదనుకున్ననా పెళ్ళానికి ఎంతో తెలుసన్న విషయం అర్థమ య్యింది ఆరోజు నాకు.
రంగమ్మ చెప్పినట్లే ఆరు నెలలకంతా కోడలు పిల్లరుచికరమైన వంటలు చేసేది నేర్చుకుంది. రోజుకోరకం వంట చేసి పెడుతున్న నా కోడలు వల్ల నాకు ప్రతి రోజూ తిండి తిరునాళ్లే !"
'తిడితే తిట్టు మిగులుతుంది, పొగిడితే పని జరుగుతుంది'
అని లౌక్యంగా రంగమ్మ తన కొత్త కోడలిని దారికి తెచ్చుకోవడం గుర్తించిన నారాయణమ్మ మురిసిపోయింది.
ఇంటి లోపల ఉన్న అందరినీ పలకరించి వస్తూ వుంటే కోడలు పిల్ల నాలుగు మసాలా వడలు కిష్టడి చేతికి ఇచ్చింది.
తిండికి తిమ్మరాజు, పనికి పోతు రాజు అయిన కిష్టడు జాలీగావడలు తింటూ అమ్మ వెనుకే ఇంటి దారి పట్టాడు.
- ఆర్ .సి .కృష్ణస్వామి రాజు