సందుక (కథ)
రూపమ్మ గారు ఇంటికి ఎవరూ వచ్చేవారు లేకపోయినా, మధ్య మధ్యలో దుమ్ము దులిపి, ఇంటి నిండా ఉన్న చెక్కపెట్టెలు (సందుక), ఇనుప పెట్టెలు, తోలు సూట్కేసులు, అల్యూమినియం పిల్లల స్కూలు పెట్టెలు ఇలా వరుస క్రమంగా, ఖాళీగా ఉన్న వాటిని దులపడం, మళ్లీ సర్ది పెట్టడం చేస్తూ ఉంటుంది... అలా వృధా కాలక్షేపం చేస్తున్న రూపమ్మగారు ఇంట్లోకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నది.
ఇవాళ పొయ్యిలో పిల్లి లేచేటట్టు లేదు, దేవుని గంట మోగేటట్టు లేదు! ఒక్కళ్ళకు నోట్లోకి వేళ్ళు పోయేటట్టు లేదు! ఎలా వెళ్తాయి? వేళ్ళునోట్లోకి? కుటుంబ పెద్ద బాధ్యత తీసుకుంటే వెళ్ళేవి!
పెద్ద చెక్క సందుగ మూత తీసింది. వితంతు మొహంలాగే బోసిగా కనపడింది. అత్తగారున్నప్పటి జ్ఞాపకాల లోనికి వెళ్ళిపోయింది రూపమ్మ...
ఉగాది పండగ వస్తే ఊరంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.. వారివారి వంశాచారంగానూ, ఆర్ధిక వనరుల ఆధారంగానూ ( ప్రతీకుటుంబంలోనూ ఆడామగా కష్టించి పనిచేసి అంతో ఇంతో సంపాదించుకుంటారు) కనుక ఏ ఇబ్బందీ వారికుండదు... మా ఇంట్లోనే పండగ అంటే పదిరోజుల ముందు నుండి అప్పుకోసం వేట! ఉద్దెర సామాను కోసం కిరాణా దుకాణo ముందు పడిగాపులు, వాయిదా బట్టల వాడికోసం ఎదురుచూపు, ఆఖరికి ఉగాది పచ్చడి చేయడానికి కొత్త మట్టి ముంత కోసం కుమ్మరి గట్టయ్య ఇంటికి ఎన్నో సార్లు తిరిగితే కానీ విసుక్కుంటూ ఒక ముంత ఇచ్చేవాడు... తరువాత ఆ పద్ధతి మానేసి ఇంట్లో ఉన్న గిన్నెలలో పచ్చడి చేయడం మొదలుపెట్టారు మా అత్తయ్య.
పేదింటి ఉగాది పచ్చడి పిలిచి పెడతానన్నా... జుఱ్ఱేవారెవరు? కనుక? అందుకే ఏదో మమ అనిపించేసే వాళ్ళం ... ఒకోసారి నాపై నాకే కోపమొచ్చేది... “ఇదేనా తల్లిగా రేపటి తరానికి సంస్కృతీసంప్రదాయం అందించేది? ఇలాగేనా? “అని...
అనాసక్తత వంటబట్టించుకున్న పిల్లలు పండగనాటికీ- మామూలు రోజుకీ అట్టే స్పందించక ...ఊళ్ళోనూ.. ఇంట్లోనూ జరిగే యాంత్రిక తంతుగా మాత్రమే చూసేవారు... పెద్దగా ఉత్కంఠ గా ఎదురుచూపులేమీ లేకుండానే అతి సాధారణంగా తెల్లవారేది...
అమ్మ ఎంత ఉత్సాహంగా ఈ పండగ ఆచరించేదో? బంతిపూల దండలతోనూ, మామిడి తోరణాలతోనూ, దర్వాజాలు, పందిళ్ళు కళకళలాడేవి. పచ్చని చానిపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులతో వాకిళ్ళు కంటికి ఆనందం కలిగించేవి. పంచాంగ శ్రవణాలతో, కవిసమ్మేళనాలతో కోవెల ప్రాంగణమంతా హోరెత్తేది... ఆడామగా; పిల్లా పాపా అందరూ కోవెలకు వెళ్ళి దైవదర్శనం చేసుకొని కొత్త ఆశలతో ఇల్లు చేరేవారు... ఏదీ ఆ ఆధ్యాత్మికత? ఏవీ ఆ సందడి? అన్నిటికీ ధనమే మూలమా? అని ఆలోచిస్తూ ఆ సందుకల మధ్య తిరగడం అలవాటైంది రూపమ్మకు...
ఏ పండగ వచ్చినా ఇంటి నిండా బంధువులు, ఆడబిడ్డలు, వాళ్ల పిల్లలు ఎంత సందడి సందడిగా ఉండేది? అత్తగారు మడిగట్టుకొని వంట చేస్తూ... ఘడియకొకసారి తనను పిలిచి, "పెద్ద చెక్క సందుకలో గోదావరి తప్యాల పెద్దది ఉన్నది తీసుకొనిరా! తవ్వెడు పప్పు ఉడికే కంచుకాసండి తీసుకురా! బుడమకాయలో, మామిడి ఒరుగులో వేసి పప్పు వండితే ఒక పూటకు సరిపోతుంది."
"ఔనూ! రూపమ్మా! ఉట్టి మీద జర్మన్ సిల్వర్ చెంబులో వేరుశెనగ నూనె పెద్ద డబ్బాలో నుంచి వంపుకొని తీసుకురా! పదిలం! పారబోస్తివా? బోలెడు ధర! నూనె సిద్దె నాకు ఇచ్చి, చల్ల- పాలు పెట్టే గూట్లో ముంతలో మంచి నెయ్యి నిన్న కరగ పెట్టినాను! అంట్లు కాకుండా నేతి పావులో వేసుకుని తీసుకొనిరా! అన్నం, పప్పుకాగానే దేవుడికి నైవేద్యం పెడతాను... "
"ఒసేయ్! రూపమ్మా!
ఆ చేతితో అట్లాగే నాలుగు వడియాలు, అప్పడాలు కొడపొయ్యి మీద గోలించవే! అమ్మమ్మగారికి ఆరాధన చేయడం అయిపోతే మడిబట్టతో ఉన్నప్పుడే పచ్చళ్ల అఱ్ఱలో పెద్ద జాడీలో నుంచి ఆవకాయ చిన్న రాచిప్పలోకి తీసి ఇవ్వమని చెప్పు! లేకపోతే మడి బట్టవిడిచాను! పచ్చడి తీయడం పనికి రాదంటుంది. ఈ ముసలమ్మ చాదస్తంతో
వేగలేక చస్తున్నాను. "అత్తగారి పనుల పురమాయింపు దండకం రోజంతా ముగియనే ముగియదు! అందరూ భోజనాలు చేసి పడమటి మనసాల చేరే దాకా ఏదో ఒకటి పని గుర్తొస్తూనే ఉంటుంది. ఆమెకు తగ్గట్టు మడి ఆచారాలతో వారి అత్తగారూ, నోరుమెదపని రూపమ్మ వెరసి మూడు తరాల కోడళ్లతో ఆ ఇల్లు కళకళలాడేది... ఆ రోజులు మళ్ళీ వస్తాయా?
ఆనాడు మాత్రం మగవారు ఏదైనా ఉద్యోగం వెలగబెట్టారా? ఏమన్నానా? అదీ లేదు. పట్వారి గుమస్తా గిరి, పహాణీలు రాయడమే! ఎటొచ్చీ నమ్మకస్తుడైన వ్యవసాయం చేయించే సేరిదారు(పెద్ద జీతగాడు) అతని కింద భయభక్తులతో పనిచేసే జీతగాళ్లు ఉండి, కొంత పంట నిజాయితీగా ఇల్లు చేరేది.
రానురాను వారి నిజాయితీలో స్వార్ధంతో కలుషితం కావడం, వర్షాలు లేక, పంటలు పండక, అప్పులు తెచ్చి వ్యవసాయం చేయడం, పంట పండక తెచ్చిన అప్పులు తీర్చడానికి కానీ, ఇల్లు గడవడానికి గాని, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయటానికి గానీ పంట పొలాలు అమ్మక తప్పలేదు... వందల ఎకరాలు పదుల ఎకరాల్లోకి మారడం, భూములన్నీ హుష్ కాకి అయిపోవడం ఇందులో ఎవరి పాత్రాలేదు నిందించడానికి... ఎందుకంటే పాలకుల నిర్లక్ష్యం, వ్యవసాయానికి ఆసరాగా నిలబడలేదు. వర్షాభావ పరిస్థితులు, పొలం పనులు సొంతంగా ఆడా మగా కలిసి చేసేవారికి పంట సంవత్సరమంతా బొటాబొటీగా సరిపోయేది... ఇక నౌకర్ల మీద, కూలీల మీద ఆధారపడిన వ్యవసాయం అంతే సంగతులు... ఒక్కడు సంపాదిస్తే పదిమంది ఇంటిల్లిపాది కూర్చొని తినడం, ఒక్కొక్కరింట్లో ఆ సంపాదనా లేని కుటుంబాలే ఎక్కువ... అదనపు ఆదాయం లేని సంసారాలన్నీ ఇలాగే కష్ట పడ్డాయి... అలవాటైన జీవితవిధానం మార్చుకోక పోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా ఆదాయాన్ని వెతుక్కోకపోవడంతో కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి.
పరిస్థితుల ప్రభావం తప్ప, మారుతున్న కాలంతో పాటు, ఇంటి ఆదాయం పెరగకున్నా ఖర్చులు మాత్రం రెండింతలు నాలుగింతలై ఎకరాలన్నీ కరిగిపోయాయి.... మిగిలిన ఆ కొంచెం భూమి ఒక సంవత్సరం పంట పండుతుంది ఒక సంవత్సరం ఎండి పోతుంది.
ఉస్సురని నిట్టూరుస్తూ రూపమ్మ పడక గదిలోకి వచ్చింది. పెద్ద పందిరి మంచం. నల్ల మద్దిచెక్కతో చేశారేమో? నల్లగా నిగనిగలాడుతూ చెక్కడాలు మెరిసిపోతున్నాయి. దోమతెర వేసే కర్రలతో, తల వైపున మేలు రకపు బెల్జియం అద్దం, మెత్తలు (తలగడలు) వేసుకొని ఒరిగే సౌకర్యం ఉన్న పెద్ద నగిషీలతో చెక్క, తలగడ కింద విలువైన వస్తువులు, డబ్బులు దాచుకొనే సొరుగులు, బూరుగు దూది పరుపుతో ఒకప్పటి వైభవం ఆ పందిరి మంచం తెలుపుతున్నది. కానీ దానిపై పరిచిన చిరుగుల చెద్దరు మాత్రం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నది.
పందిరి మంచం పైన వారగా కూర్చుని, అటు చూస్తే ఇనుప సందుకల దొంతర కనపడింది. మళ్లీ గతంలోకి పరుగుతీసింది రూపమ్మ మనసు.
ఏ పండగ వచ్చినా భువనేశ్వరం (దేవుని మందిరం) చక్కగా దులిపి సాలగ్రామాలకు అభిషేకాలు చేసి, దేవుని అఱ్ఱలో సగభాగం వెండి కుంభకోణం చెంబులు, మరచెంబులూ, దాన్లో వెండి గ్లాసులు, వెండి దోసకాయ చెంబులు, అర్ఘ్య పాద్య ఆచమనం కోసం వాడే స్థపన పాత్రలూ, మగవారు సంధ్యావందనం చేసుకొనే పంచ పాత్రలూ, ఉద్ధరణెలూ, మంగళ హారతి పళ్యాలూ, పెద్దపెద్ద దీపపు చెమ్మెలు, కుందులు, వెండి కుంకుమ కాయ భరిణలు, దీపాలు వెలిగించేందుకు ఇప్ప నూనె పోసే కొమ్ము చెంబులు, అత్తరు పన్నీరు బుడ్లు, నక్షత్ర హారతులు, మడి నీళ్లు పెట్టే బుంగ బిందెలతో తళతళలాడుతూ వెలిగిపోయేది ఆ అఱ్ఱ.
సగం వెండి సామాను భర్త పేకాట వ్యసనాలకు, నాటకాల వ్యసనాలను తీర్చుకోవడానికి పెద్ద పెద్ద వెండి కంచాలు, ఫలహారం ప్లేట్లకు కాళ్లు వచ్చి, వడ్డీ వ్యాపారి ఇంటికి (గిరివి) కుదువ గునగున పరుగు పెట్టాయి. కక్కుర్తి రాయుడు షావుకారు కూడా ఇదే అదను అని యాభైయ్యో! నూరో చేతులో కుక్కి వెండి సామాను నొక్కేసాడు. వద్దంటే వినే రకమా? తన మొగడు? అతని తల్లీ- నేను నెత్తి నోరు బాదుకున్నా వినకనే పాయె! అలా వెండి సామాన్లు దాచే "సందుక" లన్నీ ఖాళీ అయిపోయే!
జమాబంది సందుకను చూసి రూపమ్మకు నవ్వొచ్చింది! ఆ సందుక నిండా ఖాస్రా పహాణీలు; సేత్వారీ, చేస్లా పహణీలు, ఫైసల్ పట్టీలు ఇలా రకరకాల కాగితాల దొంతరలు, కట్టలు కట్టి సందుక నిండా ఉన్నాయి.
కానీ ఈ ఊర్లో ఒక్క దోసెడు పొలం ఎక్కడా లేదు... ఈ రికార్డులు... స్టాంపు పేపర్లు ఎవరివో? పాపం... మళ్లీ కావాలంటే వీటిని నకలు సంపాదించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో? ఎన్నోసార్లు ఈ సందుకా- సరంజామా అంతా తీసుకొని పొమ్మని పట్వారీలకు, సర్పంచులకు చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు... మధ్య మధ్య ఈ జమాబందీ సందుకలు... అటుపక్క ఇటుపక్క జరిపి దుమ్ము దులపడం ఒక పనిగా మిగిలింది. ఏం చేస్తాను? దేనికి ఎంత రుణమో అంతా తీర్చుకోవాల్సిందే కదా? అంటూ దులుపుతూ... దులుపుతూ.... బంకులకేసి నడిచింది. అక్కడ పెద్దపెద్ద ఇత్తడితో చేసిన పూల డిజైన్ తో (బొడ్డెలు) ఒక పేద్ద ఇనుప సందుక...
దానిలో గుర్రపు జీను దాని కళ్ళకు కట్టే గంతలు, బగ్గీకి అలంకరించే పట్టుకుచ్చులూ, గణగణమనే గంటలు, బగ్గీలో వేసే చిన్నపాటి కాశ్మీర్ తివాచీ ,నొగలకు కింద కట్టే లాంతర్లు, చెర్నాకోలాలు, గుర్రపు నాడాలు ఇంకా ఏవేవో సామానులు దాని నిండా ఉన్నాయి. ఆ పెట్టె కదలలేనట్టే... ఆ గుర్రపు బగ్గీ ఎక్కడికి కదలదు. ఆ సామాన్లను వాడే అవకాశమే లేదు. రూపమ్మ లోపల గదుల్లో పడి ఉన్నట్లే ఆమె మనసులోని ఆలోచనలు కార్యరూపం దాల్చక అలాగే పడివుంటాయి. ఈ ప్రయాణపు ఇనుప సందుక కదలిక మెదలక ఈ బంకుల్లోనే పడి ఉంటుంది.
ఒక పెద్ద నిట్టూర్పు విడిచి పక్కగదిలోకి వెళ్ళింది రూపమ్మ. అక్కడ సూట్ కేసులు అని పిలిచే తోలు సందుకలున్నాయి. అయ్యో! రామా! వీటిని చూస్తే పుట్టెడు దుఃఖం వస్తుంది... మామగారు పురాణ కాలక్షేపాలకి వెళ్ళినప్పుడు, హార్మోనియం వాయించినందుకూ, అడపాదడపా కోవెల ఉత్సవాలకు గాత్ర కచేరికి సహకార వాయిద్యకుడుగా వెళ్ళినప్పుడు, ఏ సందర్భమైనా ఓ శాలువా కప్పే వారు... ఎన్నోసార్లు అత్తగారు అన్నారు... ఈ మండ కరువు, విపరీతమైన ఎండలు, వాన చినుకు లేదు, చెట్టూచేమ లేదు... మార్గశిర మాసంలో చిరు చలి తప్ప మిగతా పదుకొండు నెలలు మండే ఎండలే కదా? చెమటలు పోయడమేనాయె! ఈ శాలువాలు ఎందుకు కప్పుతారో? వాడుకునేందుకు పనికేరావు. వీటి బదులు ఏ పంచెనో? తువ్వాలో కప్పినా బాగుండేది. కొద్ది రోజులైనా అందరికీ ఉపయోగపడేవి.
కార్తీకమాసంలో ఏ పేద బ్రాహ్మణుడో వస్తే... ఒక్క రూపాయి, ఈ సందుకలోని శాలువా తీసి ఇవ్వడమే... లేకపోతే ఏ బాలెంతరాలో వస్తే పాత చీరతో పాటు ఒక శాలువా ఇచ్చేది...ఇలాగే రెండో ,మూడో సూట్ కేసులు ఖాళీ అయ్యాయి... తప్ప ఇంటి కంటూ ఒక్కటీ ఉపయోగపడలేదని ఉస్సురని నిట్టూర్చింది.
ఆ పక్కనే నగలు పెట్టుకునే ఇత్తడి కాయ (జువ్వెలరీ బాక్స్) ఒక సందుక నుండి తొంగి చూస్తున్నట్లు కనపడుతున్నది. అది ఎప్పుడూ రహస్య అరలలో దాక్కొని ఉండేది... అందుకేనేమో పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు బయటకు కనపడుతున్నది.
అత్తయ్యకు నాకు దాదాపు ఒకే తీరు ఏడు వారాల సొమ్ములు ఉండేవి... కొద్దిగా డిజైన్ తేడా అంతే...
కంఠే, కాసులపేరు, వడ్డాణం, బాజు బందీలు, చంద్రహారం, సూర్యహారం, బంతిపూల గొలుసుకు ఎర్రరాళ్ల పతకం తనకూ; తెల్లరాళ్ళ పతకం అత్తయ్యకు చేయించారు. కంఠహారం, ముత్యాల కంఠి, నాగరం, జడ కుప్పెలు, బిచిడి పిన్నులు రాళ్ల వి, నాలుగు జతల గాజులు, సింహం మూతి కడియాలు, రాళ్ల గాజులు, పులిసేరు కడియాలు, ముక్కెరలు, బులాకీలు, ముత్యాల కమ్మలు ఇలా ఎన్నో ఉండేవి...
ఇక కాళ్లకు కూడా నాలుగు రకాల వెండి సొమ్ములు ఉండేవి. సాలం కడియాలు, పాంజేబులు, తోడాలు, కడియాలు, పట్టా గొలుసులు... పిల్లెండ్లు... బతుకమ్మ పండుగ నాడు అత్తయ్య నేను ఇద్దరం తయారయి మామయ్య బొజ్జకు చల్ల అద్ది, బతకమ్మలను పట్టుకొని బయటికి వస్తే అందరి చూపులూ మా మీదే ఉండేవి.
కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అనే సామెత మా ఇంట్లో చక్కగా రుజువైంది. మా సొమ్ములుకు ఒక్కటొక్కటే కుదువ పెట్టుకొనే (గిరివి) శాల శకుంతల ఇంటికి అలవాటు చొప్పున నడుస్తూ వెళ్ళాయి. ఇప్పుడు ఆ సొమ్ము ల బాపతు మరకలు
( ఒంటి మీద మచ్చలు) ఎంత రుద్ది స్నానం చేసినా పోక పాత జ్ఞాపకాలను తవ్వే గడ్డపారలయ్యాయి.
చెవులకు బరువైన బంగారు గున్నాలు పెట్టుకుంటే నేమో? ఆ బరువుకు చెవి రంధ్రాలు సాగి, దిద్దులు లేని మా మొహాలు బోసిగా వికారంగా కనపడుతున్నాయి.
జానెడు వెడల్పుతో; జానెడు పొడవుతో; మూడు వేళ్ళ మందంతో ఒక చిన్న ఇనుప పెట్టె (సందుక) దానికి చిన్న గొలుసు, దానికి తాళం ఉండేది దాన్ని తీసుకొని హైదరాబాద్ కు వెళ్లి, మావతన్ సర్కార్ కు అప్పజెప్పినందుకు, ఆ జమీన్ తీసుకొని, నష్టపరిహారంగా నవాబు చెక్కులు ఇచ్చే వాడు. ఆ చెక్కులను బ్యాంకులో వేసి వచ్చిన డబ్బును ఈ చిన్న ఇనుప సందుకలో పెట్టి తాళం వేసి, దాన్ని మరో సందుకలో పెట్టి తెచ్చేవారు. రాగానే ఆ రూపాయల సందుక దేవుని అఱ్ఱలో పెట్టి, తరువాత మామ గారి గదిలో రహస్య సొరుగులో దాచేవారు.. అది ఎక్కడ ఉంటుందో మాకు ఎవరికీ తెలవదు.
రూపమ్మ ఇటు తిరిగేసరికి రాతి వెండి చిన్న సందుకలు కనబడ్డాయి. మగపిల్లలు బడికి పుస్తకాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు... ఇంటి నుంచి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అత్తయ్య పిల్లలు వాడుకున్న టైలు, బెల్టులు, బ్యాడ్జీలు, సాక్స్ లూ , క్లాస్ లీడర్ బ్యాడ్జీలు అన్ని అందులో పెట్టిందేమో అది చూడగానే పిల్లలు గుర్తుకొచ్చారు.
తండ్రి పిల్లలను ఏ మాత్రం పట్టించుకోకుండా నాటకాలు, పేకాట వ్యసనంతో ఎప్పుడూ వేరే ఊర్లు తిరుగుతుండడంతో ఇద్దరు మగ పిల్లలకు చదువులు రాక, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేక, చిన్న చిన్న పనులు ఉన్న ఊళ్లో చేయడానికి నామోషితో తాలూకా పట్టణానికి బతుకుదెరువు కోసం వెళ్ళారు. ఒకడేమో మాంసం కొట్టు నడిపే మస్తానయ్య దగ్గర జీతానికి కుదిరాడట... వాడు ఇంటింటికీ మాంసం పోగులు సరఫరా చేస్తాడట... ఆ మాట విని నాపేగులు నోట్లోకి... నా గుండెల్లో ఉన్న ప్రాణం గుప్పెట్లోకి వచ్చింది. నేను మాత్రం ఏం చేయను? వాళ్లనుకన్నాను కానీ వాళ్ల తలరాతలను కన్నానా?
పసుపుపచ్చని రంగులో మెరిసిపోయే వాడు.... ఆ తోళ్ళు మోసి మోసి, కడిగి కడిగి కఱ్ఱెగ కాకి వలె అయిండట! మొన్న అంగడికి ఒక ఆమె వచ్చి నాతో చెప్తే ఏడవడం తప్ప ఏమి చేతకాని నేను రాత్రులు నిద్ర కరువు చేసుకున్నాను....
చిన్న వాడేమో మెకానిక్ గా సైకిల్ షాప్ లో పని చేస్తున్నాడట. వాడు కూడా ఆ డీజిల్ ఆయిల్ లో మునిగి -తేలి అమావాస్య చంద్రుడు వలె ఉన్నాడని చెప్తే నా మెదడు స్తంభించి పోయింది.ఇద్దరు అన్నలు చదవక పోవడంతో... చెల్లెలికి కూడా చదువు రానేలేదు... ఎంతసేపు అది "పుస్తకాల సందుక గోడవవతల (గోడ అవతల) పారేయ్! బజ్జు కుందాం! అని ఏడ్చి గోల పెట్టేది.. ఆ గోల పర్యవసానమేమో ఆ పిల్లకూ చదువు రాలేదు.. కానీ దాని నాయనమ్మ నాలుగు ఎకరాలు కరిగించి, మనవరాలిని ఒక మానవ రూపానికి కట్టబెడితే... మృగం వలె ముప్పొద్దులా తిని మూడు వేళలా గొడ్డును బాదినట్టు బాది ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడు. దాని బాధ లేవో అదే పడుతున్నది.
అత్తగారు తన ఎరుకతో రెండు ఝాములకో... మూడు ఝాములకో కడుపులో ముద్ద పడేలా ఎలానో ఇల్లు సవరించేది... అత్తగారు... అత్తత్తగారు మరణించారు. ఇక ఇప్పుడు అప్పు కాదు కదా! బిచ్చం కూడా ఎవరు వేయరు. చేతికంది వస్తారు అనుకున్న పిల్లలు కాకుండా పోయారు.
ఇల్లు సంరక్షణ లేక ఓ పక్క కూలిపోతూ.... ఒక పక్క వర్షం పడితే ఇల్లు ...వీధి ఒక తీరుగానే కురిసి, తడిసి నానా ఇబ్బందులు పడుతున్న రూపమ్మ అన్న పనిమీద ఏదో ఊరు వెడుతూ దారిలో చెల్లెలును చూద్దామని వస్తే ఇదీ పరిస్థితి. పోనీ తన ఇంటికి తీసుకుని పోదామంటే భార్య పరమ గయ్యాళి... సహకరించదు సరికదా! నాలుగు రోజులలో రూపమ్మ ఆత్మహత్య చేసుకునేలా చేయగల దిట్ట... అందుకే తనకు తెలిసిన వృద్ధాశ్రమానికి ఫోన్ చేసి, రూపమ్మ పరిస్థితి చెప్పి మీకు పనిలో సాయపడుతుంది కానీ, పైసా ఇచ్చుకోలేని స్థితిలో ఉందని చెప్పాడు. అక్కడ మనిషి అవసరం ఉండటంతో సరే రమ్మని అన్నారు.
చివరకు రూపమ్మ తనపెళ్లిలో తల్లిగారు సారేగా ఇచ్చిన" సందుక" లో రెండు చీరలు రవికలు వేసుకొని, బయలుదేరింది.ఎన్నెన్నో సందుకలలో ఎంతో సంపద చూసిన రూపమ్మ సొట్లు బోయిన సందుకతో చివరి మజిలీకి వెడుతూ.... ఆలోచిస్తున్నది... ఇది విధిరాతనా? చేతి గీతనా? స్వయంకృతాపరాధమా? అనుకొని చిన్నగా నవ్వుకుంటూ ఏదేమైతేనేం? బాధలోనే సుఖాన్ని వెతుక్కొని రాటుతేలాను....
గమ్మత్తుగా గ్రామ పంచాయతీ వారి రేడియోలో నుండి ఒక పాట వినిపిస్తున్నది... నవ్వొచ్చింది నా పరిస్థితికి తగినట్లుగా ఉంది పాట...
" బాధే సౌఖ్యమనే భావన రానీయవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందం మోయ్ !బ్రహ్మానందం మోయ్ !"
నా బతుకే ఓ మాయ! తాను ఎవరికీ కనబడకుండా చీర కొంగును తల చుట్టూ వేసుకొని భారంగా బయలుదేరింది రూపమ్మ! కానీ మూడు, నాలుగు తరాలతో అనుబంధం ముడిపడి ఉన్న ఆ సందుకలు మాత్రం మూగగా రోదిస్తూ ఆ యా అర్రలలో మూలాన పడి ఉన్నాయి.
తనకు చిన్నప్పుడు ఎన్నెన్ని ఆదర్శాలండేవి ? బడిలో పంతులుగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. "సమాజం తనకేమిచ్చిందని ఆలోచించకుండా...తాను సమాజానికే మిచ్చానని ఆలోచించాలనే"* మాట చెవిలో గింగురు మనేది...కానీ తాను మొదటినుండీ తండ్రిమీద, భర్త మీద ఆధారపడిన తాను పరిస్థితుల వల్ల ఏమీ చేయలేక పోయాను... చివరకు నేనే ఒకరికి భారంగా తయారయ్యానే అని మధనపడుతూ వీధిమలుపు తిరుగుతున్నప్పుడే ఎదురుగా తన చిన్న నాటి స్నేహితురాలు గోపమ్మ ఎదురై "రూపమ్మా! ఎక్కడకో వెళుతున్నావు? " అని అడిగింది.
జరిగిన విషయమంతా చెప్పి తన అన్న వృద్ధాశ్రమం వారితో మాట్లాడి అక్కడకు పంపిస్తున్నాడనీ, ఇక శేష జీవితం అక్కడనే గడుపుతాననీ " అనగానే... నీకు ఎన్నో ఆదర్శాలుండేవి కదా! అవేవీ గుర్తురాలేదా ఇలా వెళ్ళిపోతు న్నావనగానే.....
" ఎందుకు గుర్తులేదు? కానీ నేను అశక్తురాలిని! ఏంచేయగలను? " అంటే "మన సంకల్పం మంచిదైతే... చిత్తశుద్ధితో సేవ చేయాలనుకుంటే దారి దానంతటదే దొరుకుతుంది... నాతో రా! నాకు ఎలాగూ పిల్లలు లేరు. నీకూ సరైన సహకారం అందక పిల్లలను సరిగ్గా పెంచలేకపోయావు... ఈ అనాధలను పెంచి ఆ లోటు పూడ్చుకుందాం. ఇద్దరం కలసి ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లులవుదాము... వారి కష్టసుఖాలలో పాలు పంచుకుందాం! ఎవరి ఆసరాలేని వారికి ఆసరాగా నిలిచి, సమాజానికి చీడపురుగులుగా మారకుండా చూద్దాం! మనం మొదలు పెడితే మనవెంట ఎంతోమంది నడుస్తారు...మన సమాజ సేవా నడక ప్రారంభమే కష్టం కాని మొదలంటూ పెడితే పరుగు లంకించుకుంటుంది "అంటూ... సొట్టు పడిన రూపమ్మ సందుకు అందుకొని తన ఇంటివైపు నడక సాగించింది.. గోపమ్మ!
-రంగరాజు పద్మజ