Telugu Global
Arts & Literature

పర్సు వేది (కధ)

పర్సు వేది (కధ)
X

"సోజారాజకుమారీ ...

సోజా ..." హమ్ చేసుకుంటూ నడుస్తున్నాడు సౌమిత్రి. సైగల్ నాయుడూ, భుజాన బేగ్ తగిలించుకుని రమణా మాట్లాడుకుంటూ వస్తున్నారు. తేనంపేట నుండి శోభనాచల స్టూడియోకి వచ్చారు.

గేట్ లోంచి బైటికెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.హనుమంతరావు గారిని చూసి " నమస్తే గురువు గారూ" అన్నాడు సౌమిత్రి. చిన్న నవ్వు నవ్వి " నమస్తే" అంటూ బైటికెళ్ళి పోయారాయన. స్టూడియో మేనేజర్ చిన్నారావు ఎదురై " ఎక్కడికి" అడిగాడు. " గ్రూప్ సాంగ్ కోసం రికార్డింగ్ వుందని రమ్మన్నారు" చెప్పాడు సైగల్ నాయుడు.ఈలోపు తెలిసిన వాళ్ళెవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతూ " మీరు లోపలకెళ్ళండి.‌నేనిక్కడ సిగరెట్ కాల్చుకుంటాను" అన్నాడు నాయుడు.

మెయిన్ గేట్ దాటి లోపలికెళ్ళగానే ఎదురుగా పెంకుటిల్లు సెట్టు, దాని వెనుక బిల్డింగులూ వున్నాయి. లోపలంతా పెద్ద హాలు.అందులో అక్కడక్కడా చిన్న చిన్న సెట్లు వేసున్నాయి.వాటి దగ్గరగా ఒక పార్కు వుంది. ఒక చెక్క వంతెన, కింద సెలయేరూ వున్నాయి. పార్కు కోసం నాటిన మొక్కలు కొన్ని వాడిపోయున్నాయి.ఓ కుర్రాడు వాటి మీద నీళ్ళు చిలకరిస్తున్నాడు.కొందరు నేలంతా శుభ్రం చేస్తున్నారు. పెయింటర్లు బ్రష్షులతో వంతెనకు రంగులు వేస్తున్నారు. ఆర్టిస్టులు కర్టెన్ల మీద బొమ్మలు వేస్తున్నారు.

"డైరెక్టర్ గారొచ్చారు" అంటూ ఫ్లడ్ లైట్లను గుడ్డతో తుడుస్తున్న కుర్రాడొచ్చి ఆర్ట్ డైరెక్టర్ శర్మతో చెప్పాడు.

ఎల్.వి.ప్రసాద్ గారు స్టూడియోలోని గుడిసె సెట్ దగ్గరకొచ్చారు. చేతిలోని సాధనా వారి సంసారం అని హెడ్డింగున్న స్క్రిప్టు ఫైలును అసిస్టెంట్ డైరెక్టరుకిస్తూ" ఆర్టు డైరెక్టర్‌ గారెక్కడ." అన్నారు.

" సార్ ఇక్కడే వున్నానండి" దగ్గరికొస్తూ‌ ఆర్ట్ డైరెక్టర్ శర్మ.

'శర్మ గారూ.అటువేపు కలర్ కొంచెం డార్కు చేయండి.బాగా లైట్ అయిపోడం వల్ల ఏక్టర్స్ బ్రైటుగా కనపడ్డం లేదు" అన్నారు డైరెక్టర్ ఎల్.వి ప్రసాద్.

"సరే సార్" అన్నాడు శర్మ .

కొంచెం దూరంలో రేకు డబ్బాలో రంగు కలుపుతున్న

పెయింటర్ దగ్గరికెళ్ళి "సూర్రావు గారూ. ఈ బేగ్రౌండ్ గోడ కలర్ ఇంకా ముదర చేయండి." అని చెప్పాడు.

సౌమిత్రి, రమణా రికార్డింగ్ ధియేటర్ కి వెళ్తుండగా ఓ

ఫోర్డ్ కారులోపలికి వచ్చింది.చిరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో ఎన్.టి రామారావూ

సూటూ బూటుతో నీట్గా అక్కినేని నాగేశ్వరరావూ కార్లోంచి దిగారు. వాళ్ళ వెనుక మరో కార్లోంచి లక్ష్మీరాజ్యమూ , సావిత్రని కొత్తమ్మాయీ దిగారు.

ఆర్టిస్టులందరూ గుడిసె సెట్టు దగ్గరకొచ్చారు.ఎల్.వి.ప్రసాద్ షూటింగ్ చేయాల్సిన సీన్ వివరిస్తున్నారు.

రామారావు, నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం మరో చిన్న కుర్రాడు శ్రద్ధగా వింటున్నారు.

చెప్పడం పూర్తవగానే " ఓకే...చేద్దాం సార్" అన్నారు నాగేశ్వరరావు.

" ఇటుపై నా గతేమి లేదా" పాట ప్లే అవుతుంది.

"ఏక్షన్"

ఏక్టింగ్ మొదలైంది.ఏడుపు సీనులో లక్ష్మీరాజ్యం నటిస్తూ నటిస్తూ ఫకాల్న నవ్వడం. చాలా సార్లు టేకులు.ఇంక ప్రసాద్ గారికి చిర్రెత్తుకొచ్చింది." ఏంటమ్మా అలా నవ్వుతావు.సీనియర్ ఏక్టర్వి.ఎంత ఫిల్మ్ వేస్టవుతుందో తెలుసా" గట్టిగానే అన్నారు ప్రసాద్.

ఇదంతా చూస్తూ నెమ్మదిగా అక్కడ్నుంచి రికార్డింగ్ గురించి మాట్లాడి సౌమిత్రీ, రమణా బయటకొచ్చేసారు.

శోభనాచల స్టూడియో మెయిన్ బిల్డింగ్ మెట్ల మీద బనీనూ షరాయీ వేసుకుని ఓ నలభై ఏళ్ళాయన కూర్చున్నారు.సౌమిత్రి, రమణా అటే వస్తున్నారు."ఆయనే ఈ స్టూడియో ఓనర్ మీర్జాపురం రాజావారు " అన్నాడు సౌమిత్రి రమణతో.

ఇద్దరూ ఆయనకు నమస్కారం చేసారు. ఆయన నమస్కారం అన్నట్లు చిరునవ్వుతో తలూపారు.

సెలవు తీసుకుని మెట్లు దిగుతుండగా " అబ్బాయ్" అని పిలిచారు రాజావారు.

వెనక్కి తిరిగి ఆయన దగ్గరకొచ్చారిద్దరూ.

"అబ్బాయ్. ఏ వూరు మీది" అడిగారు రమణని.

"పిఠాపురమండి. మెడ్రాస్ చూసెల్దామని వచ్చానండి" అన్నాడు రమణ

" నా దగ్గరుండి పోతావా..సినీఫీల్డుకి పరిచయం చేస్తాను."

"అబ్బే..సినిమాల్లో పనిచేయడం నాకిష్టం లేదండి"

"సరే నీ ఇష్టం. మళ్ళీ ఓసారి ఆలోచించుకో.సినిమాల్లో చేద్దామనుకుంటే నా దగ్గరకొచ్చేయ్" అన్నారు రాజావారు.

మళ్ళీ నమస్కారం పెట్టి ఇద్దరూ మెట్లు దిగారు.

గేటు బయటకొచ్చాక సైగల్ నాయుడికి లోపల జరిగిందంతా చెప్పాడు సౌమిత్రి.

"అదేంటి రమణా అంత పనిచేసావు.సినిమాల్లో వేషాల కోసం రాజావారి దగ్గరికి రోజూ బోల్డంతమంది వస్తుంటే ఆయన వాళ్ళతో కనీసం మాట్లాడనే మాట్లాడరు.అలాటిది ఆయనే పిలిచి వుండమంటే కుదరదని చెప్పావా" నాయుడు రుద్రుడయ్యాడు.

"ఎన్.టీ. రామారావును సినిమాలకు పరిచయం చేసింది రాజావారే తెలుసా.గొల్లభామ, దక్షయజ్ఞం, కీలుగుర్రం లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఆయనే తీసారు. ఆయన తలుచుకుంటే నీ దశే మారిపోద్ది.ఇప్పటికైనా పర్లేదు. రాజావారి దగ్గరకెళ్ళి సినిమాల్లో చేస్తానని చెప్పు." అన్నాడు సౌమిత్రి.

"లేదు సౌమిత్రీ నాకు సినిమాల్లో పంజేసే ఇంట్రస్టు లేదు. మెడ్రాసు చూసి, కవి గారిని కలుసుకుని రేప్పొద్దున్నే పిఠాపురం వెళ్ళిపోతాను."

"సరే సరే పదండి వెళ్దాం " అన్నాడు సైగల్ నాయుడు.

ముగ్గురూ తేనంపేట నుండి మ్యూజియమ్మూ ,సెయింట్ జార్జ్ ఫోర్టు ముందునుండి నడిచి వెళ్తున్నారు. అందరిలోనూ నిశ్శబ్దం. కొంచెం మూడవుట్లో వున్నారు.

మూడ్ మార్చడం కోసం నాయుడు మొదలుపెట్టాడు " ఈ కోట వుంది చూసారూ .ఈస్టిండియా కంపెనీ వాళ్ళ టైంలో జార్జి ఫాక్స్ క్రాఫ్ట్ గవర్నరు. ఇక్కడ ఆఫీసు పెట్టాడు. అప్పట్నుంచీ సెయింట్ జార్జి ఫోర్ట్ అయ్యింది.అసలీ మెడ్రాస్ పేరెలా వచ్చిందో తెలుసా..‌" అని ఆపాడు.

"ఎలా వచ్చిందీ..." ఆత్రంగా అడిగాడు రమణ.

"ఆంటోనియో డి మెడియరాస్ అనే పోర్చుగీసు పెద్దాయన దగ్గర బిల్డింగ్ కొని థామస్ శాండర్స్ అనే గవర్నర్ ఆఫీసు మొదలెట్టాడు" అన్నాడు నాయుడు.

" చాల్ చాల్లేవోయ్‌ చెప్పావు గానీ అసలు చెన్నపట్టణం అనే పేరెలా వచ్చిందో తెల్సా. దామెర్ల చెన్నప్ప నాయుడు ఈ‌ ప్రాంతాన్ని పాలించడం వల్ల చెన్నపట్నం అనే పేరొచ్చింది " అన్నాడు సౌమిత్రి.

ఈ వాగ్వివాదాలు పూర్తయ్యేసరికి బీచ్ రోడ్డు దాటి చాలా దూరం విచ్చేసారు. అక్కడే వున్న సిటీ బస్టాప్ దగ్గర నిలబడ్డారు. బేగ్ భుజం మార్చుకుంటూ" సౌమిత్రీ నేను టి.నగరెళ్ళి కవిగారిని కలుసుకుని రేప్పొద్దున్నే పిఠాపురం బయల్దేరతాను" అన్నాడు రమణ.

" సరే నీ దగ్గర పర్సుందా జాగర్త" అన్నాడు సౌమిత్రి.

నాయుడు కూడా "పర్సు జాగర్త" అన్నాడు.

"ఉంది..వుంటే.." ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు.

" ఏమీ లేదులే..బస్సులో పడిపోతుందనీ ..అంతే జాగర్తగా వెళ్ళు."

"అలాగే" అంటుండగానే టి.నగరెళ్ళే సిటీ బస్సొచ్చింది.

ఇద్దరికీ వీడ్కోలు చెప్పి బస్సెక్కాడు రమణ.

సిటీ బస్ టి.నగర్ ,సాధూలాల్ స్ట్రీట్, విష్ణు శివ మందిరం దగ్గరాగింది‌.రమణ బస్సు దిగి జేబులో వున్న అడ్రస్ కాగితాన్ని చూసుకుని, దాని ప్రకారం కవిగారిల్లు చేరుకున్నాడు. ఖద్దరు బనీనూ,లుంగీతో వరండాలో కూర్చున్నారు భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

గేటు తీసి లోపలికి వెళ్లగానే " ఎవరు బాబూ మీరూ" అని అడిగారాయన.

" పిఠాపురం నుండి వచ్చానండి.కోటలో పనిచేసే సత్యం గారల్లుణ్నండి"అని రమణ అనగానే "రండి..రండి" అంటూ లోపలికి ఆహ్వానించారు.

లోపల్నుండి పదేళ్ళ అమ్మాయి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది.భుజానున్న బేగ్ ఓ పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నాడు రమణ.

"మావయ్య గారెలా వున్నారు" అడిగారు కృష్ణశాస్త్రి.

"బావున్నారండీ..మీకు నమస్కారం చెప్పమన్నారు" అన్నాడు

చిరునవ్వు నవ్వుతూ " మంచినీళ్ళు తీసుకోండి"అన్నారు కృష్ణశాస్త్రి.

మంచినీళ్ళు తాగి , గ్లాస్ పక్కన పెట్టి "నిన్న పొద్దున్న వచ్చానండీ.సౌమిత్రనీ మన పిఠాపురం వాడే తేనంపేటలో వున్నాడు.అతని దగ్గర దిగాను.ఊరంతా తిప్పి చూపించాడు." చెప్పాడు రమణ.

" ఓహో అలాగా" అన్నారు కృష్ణశాస్త్రి.

"మిమ్మల్ని చూడాలని ఎప్పట్నుండో అనుకుంటూ వున్నానండి ఇప్పటికి చూసాను"

"ఇంతకీ ఎన్ని రోజులుంటారేంటి"అనడిగారు కృష్ణశాస్త్రి.

ఇదేంటీ యింత పెద్దాయన.ఎదటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా ఇలా అన్నారేంటని మనసులో అనుకుంటూ " రేప్పొద్దున్న బయల్దేరతానండీ." ముభావంగా సమాధానమిచ్చాడు రమణ.

"ఓహో అలాగా. సరే గానీ ఎప్పుడు తిన్నారో ఏంటో..ముందు భోంచేయండి.తర్వాత మాట్లాడుకుందాం" అన్నారు.

లోపల్నుండి ఇంగువ కలిపిన పప్పూ గోంగూరా, దప్పలమూ,కాచిన నేతి వాసనా ఘుమ ఘుమలాడుతున్నాయి.

కృష్ణశాస్త్రిగారి శ్రీమతి బయటకు వచ్చి " బాబూ ఇంటి దగ్గర అందరూ క్షేమమేనా, పన్లో వుండి త్వరగా రాలేక పోయాను" అని పలకరించారు.

" బావున్నారమ్మా" అన్నాడు రమణ.

" భోజనానికి లేవండి బాబూ ." అన్నారావిడ.

కృష్ణశాస్త్రి, రమణా బట్టలు మార్చుకుని, అప్పటికే తుడిచిన నేలపై వేసిన చెక్కపీటల

మీద కూర్చున్నారు. ఆద్యంతాల భోజనంతో పాటు చక్కని తాంబూలం మరింత రుచిగా వుంది.

చంద్రంపాలెం నుండి ఎవరో ఒకాయన వచ్చాడు ఏభై ఏళ్ళుంటాయి. " బాబు గారూ ఈ ఏడాది పంట డబ్బండి" అంటూ తువ్వాలికి మూటగట్టిన రెండు వంద రూపాయల నోట్ల కట్టల్ని టీపాయ్ మీద పెట్టాడు. " అప్పారావ్ వుండు రేపెళ్దువు గాని" అన్నారు కృష్ణశాస్త్రి. " లేదు బాబూ మొక్కు తీర్చుకోడానికి తిరుపతివెల్తన్నాము.కుటుంబమంతా టేషన్లో వున్నారు. మరి సెలవిప్పించండి" అన్నాడు అప్పారావు." సరే డ్రైవర్ని పిలుస్తాను స్టేషను దగ్గర దింపితాడు"అన్నారు.

"వద్దు బాబు గారూ. టేషన్నుండి రానూపోనూ రిచ్చా మాట్లాడుకుని వచ్చానండి" అన్నాడు అప్పారావు.

"ఓసారి అందర్నీ తీసుకొచ్చేయాల్సింది.రెండు రోజు లుండి వెళ్దురు" నొచ్చుకుంటూ అన్నారాయన.

" ఈసారొచ్చినపుడు తప్పకుంటాము బాబూ" అంటూ నమస్కారం పెట్టి అప్పారావు వెళ్ళబోతుంటే ,అతని చేతిలో కొంత డబ్బు పెట్టి "జాగ్రత్తగా వెళ్ళి రండి" అన్నారు. వినయంగా తలూపి అప్పారావు వెళ్ళిపోయాడు.డబ్బు లోపల పెట్టి వచ్చారు.

కాసేపు ఊరి ముచ్చట్లు చెప్పుకున్నాక కృష్ణశాస్త్రి వరండాలోని సోఫాలో నడుం వాల్చారు.రమణ కూడా కుర్చీలోనే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.టైం చూసుకుంటే నాలుగయ్యింది. కాసేపటికి ఇందాకటి అమ్మాయి ప్లేట్లో వేడి వేడి పకోడీలూ, గ్లాసుతో కాఫీ పట్టుకొచ్చి టీపాయ్ మీద పెట్టి " ఇవి తీసుకోండి. మంచినీళ్ళు ఇక్కడ వున్నాయి " అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా అవన్నీ ఖాళీ చేసి చేతులు కడుక్కుంటుండగా కృష్ణశాస్త్రి గారు వచ్చి " అలా బైటికి వెళ్ళొద్దాము"అన్నారు.

"అలాగేనండీ" అన్నాడు రమణ.

డ్రైవర్ ని పిలిచి కార్ తీయమన్నారు. ఇద్దరూ కారెక్కారు.డ్రైవర్ కారును వాహినీ స్టూడియోకు తీసుకెళ్లాడు. కారు దిగి రమణతో కలిసి లోపలికి వెళ్ళారు కృష్ణశాస్త్రి.ఆఫీసు గదిలోకి వెళ్ళీ వెళ్ళగానే డైరెక్టర్ బి.ఎన్ రెడ్డి గారు " నమస్కారం గురువు గురూ . రండి రండి" అంటూ కుర్చీలోంచి లేచి నిలబడి ఆహ్వానించారు. టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఇద్దరూ కూర్చున్నారు.

"ఏం తీసుకుంటారు" అడిగారు.

"ఏమీ వద్దు రెడ్డి గారు" అన్నారు కృష్ణశాస్త్రి.

ఆఫీస్ బోయ్ కి ఏదో సైగ చేసారు రెడ్డి.ఐదు నిమిషాల్లో కాఫీలు తెచ్చాడు.

కాఫీలు తాగాక " మలీశ్వరి కధ ఎంతవరకూ వచ్చింది గురువు గారూ" అడిగారు రెడ్డి.

"దాదాపు అయిపోవచ్చిందండీ క్లైమాక్స్ అవుతుంది.ఓ నెల రోజుల్లో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.ఈ లోపు పూర్తయిపోతుంది." అన్నారు కృష్ణశాస్త్రి. చేతిలోని పాటలు రాసిన కాగితాలు ఆయనకి చూపించారు. "ఏం అద్భుతమైన సాహిత్యం గురూ గారూ.తెలుగు సినిమా బతికున్నంత కాలం ఈ పాటలు గుర్తుంటాయి.ఈ పాటలకు తగ్గ సంగీతం వుండాలి" అంటూ కృష్ణశాస్త్రి గారి చెయ్యి పట్టుకున్నారు.

"ఇంతకీ సంగీతం ఎవరిచేత చేయిద్దామో మీరే చెప్పండి గురూ గారూ"

" ఎవరేముందీ మన రాజేశ్వర్రావు గారైతే సరి. లేటెస్ట్ ఇనస్ట్రమెంట్స్ కూడా తెప్పిస్తున్నార్ట." ఈలోగా అరవంలో పాటలు రాసే కళ్యాణ సుందరం లోపలికి వచ్చారు. కృష్ణశాస్త్రి గారిని చూస్తూనే " వణక్కం మాస్టరూ " అని నమస్కారం చేసారు. కాసేపు మాట్లాడుకున్నాక వెళ్ళడానికి లేవబోతుంటే బి.ఎన్ రెడ్డి గారు రమణను చూస్తూ "ఎవరీ అబ్బాయీ" అనడిగారు.

" మా స్నేహితులబ్బాయి. పిఠాపురం నుండొచ్చారు." అన్నారు కృష్ణశాస్త్రి.

" ఓహో " అన్నారు రెడ్డి గారు.

ఇద్దరూ రెడ్డి గారి దగ్గర సెలవు తీసుకుని బయల్దేరారు.

స్టూడియో నుండి బైటికి వస్తూండగా చెట్టు కింద కూర్చుని బీడీ కాల్చుకుంటున్న డ్రైవర్ బీడీ విసిరేసి పరుగున వచ్చి కార్ వెనుక డోర్ తీసాడు.ఇద్దరూ ఎక్కి కూర్చున్నాక ఇంజిన్ స్టార్ట్ చేస్తూ " అయ్యా ఎక్కడికెళ్ళాలి" అన్నాడు.

"ఇంటికి పోదాం " అన్నారు కృష్ణశాస్త్రి.

కారు కొంచెం దూరమెళ్ళాక " ఏం బాబూ సినిమాలంటే ఇష్టం లేదా మీకూ మొన్న మీర్జాపురం రాజా వారు తన దగ్గర

ఉండిపొమ్మన్నార్ట."అడిగారు రమణని.

" ఆ విషయం మీకెలా తెల్సిందండీ" ఆశ్చర్యంగా అడిగాడు.

" అన్నీ అలా తెలుస్తుంటాయిలే కానీ , ఎందుకు వుండకుండా వచ్చేసారు" అడిగారు.

" నేను మెడ్రాసు వచ్చేటప్పుడు మా పెద్దమ్మ నా చేత సినిమాల్లోకి వెళ్ళనని ఒట్టేయించుకుందండి. పాడైపోతానని భయం. చిన్నప్పుడే అమ్మా నాన్నా పోతే ఆవిడే నన్ను పెంచిందండి. అందుకే ఆవిడకిచ్చిన మాటకు కట్టుబడున్నానండి" చెప్పాడు రమణ.

ఇంక ఆ విషయం పొడిగించడం రమణకు యిష్టం లేక "మీ పిల్లలు ఇక్కడ లేరాండీ" అన్నాడు.

" లేరు వాళ్లు వుద్యోగాల్లో వున్నారు"

" మీ ఇంట్లో వున్న పాప మీ మనవరాలాండి"

"కాదండీ . తనది పిఠాపురమే.అగ్రహారం.

నేను పిఠాపురంలోని హరిజన హాస్టల్లో వార్డెన్ గా పనిచేస్తున్నపుడు ఈ పాప వాళ్ళ తాత నా స్టూడెంట్. చిన్నపుడే తల్లిదండ్రులు పోయారు అందుకే నేను మా యింట్లో వుంచుకొని చదివిస్తున్నాను" అన్నారు.

" మరీ" అని ఇంకేదో అడుగుబోతుండగా కారు ఇంటికి చేరుకుంది. కారు దిగి లోపలికి. డ్రైవర్ కారును షెడ్డులో పెట్టి " సార్ నేను ఇంటికి పోతున్నానండీ" అన్నాడు.

"ఒక్క నిమిషం ఆగబ్బాయ్" అన్నారు కృష్ణశాస్త్రి గారి శ్రీమతి.

మడి బట్టలతో బైటికొచ్చి ఇత్తడి కారేజీ అతని చేతిలో పెట్టి " పట్టుకెళ్ళు పిల్లలు తింటారు " అన్నారు.నమస్కారం పెట్టి గేటు దగ్గరకు వేసి వెళ్ళిపోయాడు.ఇంటికి బయల్దేరుతుంటే రేపంటే రేపంటూ నాల్గురోజులాపేసారు కృష్ణశాస్త్రి.తెగించి వెళ్ళడానికి డబ్బులున్న పర్సు ఆయన దగ్గరుండి పోయింది.

ట్రైన్ టైమ్ అవుతుంది. బయల్దేరాలి. ఊళ్ళో బోల్డంత పనుంది‌.కానీ డబ్బు లేకుండా ఎలా వెళ్ళేది. . పాపం ఏం అవసరమొచ్చి అడిగారో. పర్సు ఇమ్మని అంత పెద్ద మనిషిని ఎలా అడిగేదీ.అయినా చంద్రంపాలెం అప్పారావు అంత డబ్బు ఇచ్చాడు కదా ' అనుకుని బయట దండె మీద ఆరేసిన బట్టలు బేగులో సర్దుకుని, కృష్ణశాస్త్రి గారితో " బయల్దేరతానండి. వచ్చి వారంరోజులై పోయింది. ఇంటి దగ్గర కంగారుపడ్తుంటారు "అన్నాడు రమణ. " సరే బాబూ వెళ్దురు గాని" అని చిన్నగా నవ్వుతూ అన్నారు.

లోపలి నుండి పర్సుతో పాటు కొత్త బట్టలు రమణకీ అతని భార్యకీ సంచిలో పెట్టి ఇచ్చారు. వారి భార్య పెద్ద చిన్న కుంకుమ భరిణ తెచ్చి " అమ్మాయి కివ్వండి బాబూ " అన్నారు. అలాగేనని రిక్షా కోసం బయటకు వెళ్ళబోతుంటే " డ్రైవర్ వస్తాడు కార్లో వెళ్ళండి " అన్నారు కృష్ణశాస్త్రి.

కారెక్కుతూ కృష్ణశాస్త్రి గారికీ , ఆయన శ్రీమతి గారికీ నమస్కారం పెట్టాడు రమణ. "జాగ్రత్తగా వెళ్ళి రండి. ఇంటికెళ్ళాక ఉత్తరం రాయండి. ఊళ్ళో అందరినీ అడిగానని చెప్పండి" అన్నారు. " అలాగేనండి " అన్నాడు రమణ. "ఆయన రైలు ఎక్కేవరకూ ఉండి రా" అని డ్రైవర్కి చెప్పారు కృష్ణశాస్త్రి. కారు బయల్దేరి

స్టేషను చేరుకుంది.డ్రైవర్ సామాన్లు పట్టుకుని స్టేషను లోపలికి వస్తుంటే " నువ్వెళ్ళు .నేను రైలెక్కుతానులే"అని డ్రైవర్ని పంపించేసాడు రమణ.

రైలు రావడానికి ఇంకా గంట టైముంది.సామాన్లు పక్కన పెట్టి బెంచీ మీద కూర్చుంటుండగా చంద్రంపాలెం అప్పారావు కనిపించాడు. " అప్పారావు గారూ" అని పలకరించాడు రమణ."లేదు బాబూ.. మీరూ.. మొన్న అయ్యగారింటి దగ్గర వున్నారు కదా" అని గుర్తుపట్టాడు అప్పారావు." అవును "

మీరు ఊరెళ్ళలేదా. అప్పుడే వెళ్ళి పోతాన్నారు"

" అలా అనాపోతే అయ్యగారొదల్రు బాబూ. ముందు దగ్గరున్న డబ్బులు తీసేసుకుంటారు. ఎంతకీ ఇవ్వరు.డబ్బుల్లేకుండా ఎక్కడికెల్తామని ఆరి ఆలోసన. మనుసులంటే అంత పేమా, అంత యిదీని అయ్యగారికి. అందుకే అబద్ధం చెప్పి వచ్చేసాను. ఇక్కడ చాలా పన్లున్నాయి.అయన్నీ చూసుకుని ఇదిగో ఇప్పుడు పిఠాపురం బయల్దేరాను."అన్నాడు అప్పారావు.

సౌమిత్రి పర్సు జాగర్తని ఎందుకన్నాడో ఇప్పుడర్ధమైంది రమణకి.

కృష్ణశాస్త్రి కవిత్వం ఇంత ప్రేమతో నిండివుందంటే కారణం ఆయన మనసు నిండా ప్రేమ వుండడమే కాబోలు ' అనుకుంటుండగా ప్లాట్‌ఫారమ్ మీదకు రైలు వచ్చింది.

- ర్యాలి ప్రసాద్

First Published:  20 Jan 2023 2:57 PM IST
Next Story