Telugu Global
Arts & Literature

అన్నయ్య చలవ

అన్నయ్య చలవ
X

నాకు ఇద్దరు అన్నయ్యలు,

ఇద్దరు తమ్ముళ్ళు.

పెద్దన్నయ్య MSc స్టాటిస్టిక్స్ చిన్నన్నయ్య MSc బోటనీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశారు. ఇద్దరూ, వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్ లో కావ్యాలు రాయగలరు. అంత మేధా సంపత్తి ఉంది వాళ్ళకి.

చదువులు 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. చిన్నప్పుడు మా అమ్మ డెలివరీకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మా ఇంట్లో అన్ని పనులూ మా అన్నయ్యలు చూసుకునేవారు అచ్చం మా అమ్మ చేసినట్లే. మాకు జడలు అల్లటం దగ్గర్నించి.

మా అన్నయ్యలకి కార్తీక పౌర్ణమి రోజున రాఖీ కట్టటం అన్న ఆనవాయితీ ఇప్పటి వరకూ ఎప్పుడూ మేము తప్పలేదు. మాకు ఎల్ల వేళలా రక్షణగానే ఉన్నారు ఇప్పటి దాకా, అమ్మా నాన్నల సంస్కారాల వలన.

1982 లో అసిస్టెంట్ ఇంజనీరుగా నాకు ఉద్యోగం వచ్చింది. చిన్న వయసు, అమాయకత్వం, బెరుకు ఉండేవి నాకు. సరే, మా డెప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీరు గారు కొంచెం కటువుగా మాట్లాడేవారు. నాకు ఇంట్లో ఎప్పుడూ అలాంటి వాతావరణం తెలియదు. బెదిరి పోయే దాన్ని.

ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి ఏడుపు మొదలెట్టాను. మా అన్నయ్యలు ఖంగారు పడ్డారు. ఏమ్మా అంటే, నేను ఉద్యోగం చెయ్యను. నాకేం బాలేదు మా సార్ నేను బాధ పడేలా మాట్లాడుతున్నారు. అమ్మా నాన్నా కూడా ఎన్నడూ అలా మాట్లాడలేదు. ప్రతి పనికీ, ఏదో ఒక వంక పెడుతున్నారు అన్నాను ఏడుస్తూనే.

మా చిన్నన్నయ్యది ఉడుకు రక్తం. నేను చూసుకుంటా. రేపు వస్తా మాట్లాడుతాను అన్నాడు. నాకింకా భయమేసింది. ఏం గొడవో అని. అప్పుడు, మా పెద్దన్నయ్య నన్ను అలా కూర్చోమని చెప్పి, చూడు తల్లీ మీ సార్, ఆఫీస్ పని బాగా చేస్తారా అన్నాడు. నేను, చాలా బాగా చేస్తారు అన్నాను.

అప్పుడు చెప్పాడు, నీకు ఉద్యోగం కొత్త. నేర్చుకునే స్థాయి నీదిప్పుడు. ఏమైనా, ఒకటికి రెండుసార్లు చూసుకుని నీ నోట్ ఫైల్స్, డ్రాఫ్ట్ లెటర్స్ సబ్మిట్ చెయ్యి. ఎప్పుడూ కూడా, ఉద్యోగంలో ఈ రోజే చేరినట్లుగా పని చెయ్యి. ఆఫీసులలో ఎవరి వత్తిడులు వాళ్ళకుంటాయి. ఆలస్యం చేయకుండా, పనులు పూర్తి చేసుకో. మీ సార్ కి ఇంకో సారు, ఆ పైన ఇంకొకరు. ఈ హయర్ ఆర్కీలో ఒక్కోరు ఒక్కోలా పని తీసుకుంటారు. నీ పని చాలా చక్కగా చేశాకా కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడు చూద్దాం.. అని.

నాకు మా అన్నయ్య బోధ తారక మంత్రంలా పని చేసింది. సర్వీసు పూర్తయి, ఎక్జిక్యూటివ్ ఇంజనీరుగా రిటైర్ అయ్యాను.

ఎప్పుడూ, నాతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళని కించపరచలేదు. నా పై అధికారులకి కూడా మంచి పేరు వచ్చేలా పని చేశాను. ఇదంతా, మా పెద్దన్నయ్య చలవ.

-శారదా దామోదర్

వనస్థలిపురం

(హైదరాబాద్)

First Published:  31 Aug 2023 10:47 PM IST
Next Story