చిట్టి తండ్రి
“చంకలో పిల్ల వాడు.
చల్లనైన పిల్లవాడు,
నవ్వులొలికే పిల్లవాడు,
నమ్మరాని పిల్లవాడు,
వాడెవడే ,వాడెవడే గోపమ్మా!
వాడేనే కృష్ణమ్మా! ...
కాళ్ళకు గజ్జెలు చూడండి
మొల్లో గంటలు చూడండి,
మెళ్ళో హారము చూడండి,
తల్లో పింఛము చూడండి ...”
అని చింతా దీక్షితులు గారి " లక్క పిడతలు "లోని గేయాన్ని పాడుతూ, బాబును తయారు చేస్తోంది ప్రభ.
చక్కని చిన్న పట్టు పంచెను కట్టింది. అచ్చంగా కృష్ణుడిలా ముద్దొస్తున్న బాబును ఎత్తుకుని ,కూతుర్ని "అనితా! వచ్చి, చూడు, అలాగే వీడికి మంచి ఫొటో తియ్యి. అప్పుడే భారత దేశం లో నా స్నేహితురాళ్ళందరూ, వాళ్ళ మనుమలను చక్కగా కృష్ణునిలా, రాధలా తయారు చేసి , పూజ కూడా అయిందంటూ, సందేశాలతో పాటు, చిత్రాలను కూడా పంపించారు, నేను కూడా పంపాలి. వచ్చి, దేవుడికి హారతి ఇచ్చి,
వీడియో కూడా తీయి "అంది.
అమ్మ పిలుపు విని కిందకు వచ్చిన అనిత, అచ్చు, చిన్ని కృష్ణునిలా ముద్దొస్తున్న కొడుకును చూసి ,
ప్రకాశ్ ను కూడా పిలిచింది.
ఆనందంగా బాబును చూసుకుని మురిసిపోతూ. పూజను ముగించి, అనేక భంగిమలలో చిత్రాలు తీసారు.
అమ్మ వచ్చినప్పటి నుంచి, ఇంటిని నందనం గా తీర్చి దిద్దింది.
బాబుకు రక రకాల బొమ్మలెన్నో ఉన్నా, ప్రత్యేకించి, తాటాకు బుట్టలో అమర్చిన లక్క పిడతలను తెప్పించింది,
బాబుకు ఇవన్నీ ఎందుకమ్మా అని
అనిత అన్న మాటకు........
"ఈ బొమ్మలన్నీ వాడికి చూపించాలే, చూడు,ఈ తిరగలి, ఈ దంచే రోలును, బావిలో నీళ్ళు తోడుతున్న బొమ్మ మునుపటి జ్ఞాపకాలనెన్నింటినో తెస్తోంది ....
ఈ వీణ, కుంకుమ భరణి
ఎంత బాగున్నాయో,
ఇదిగో, ఈ పల్లె ఇంట్లో అరుగు మీద కూచున్న పెద్ద మనిషినీ, బండి మీద రైతునీ,....... మునుపు ఏటి కొప్పాక వీటికి ప్రసిద్ధి. ఇప్పుడు సంగా రెడ్డిలో కూడా తయారుచేస్తున్నారు;. చేత్తో తయారు చేసిన ఈ బొమ్మలను వీడికి చూపించాలి, ఆడించాలి; ......."
అమ్మ అప్పుడే నా బంగారానికి అనేక సంగతులను చెప్పాలని. ఆశ పడుతోంది ..అనుకుంటూ
ఈవారం లో ప్రపంచ జానపద దినోత్సవం కూడానట. ..
అమ్మకు చెప్పింది అనిత.
అమ్మ ఎక్కడున్నా సరే. తనవెంట, జానపదాన్నీ, సంప్రదాయాన్నీ తీసుకొచ్చి, తర తరాల ఆత్మీయతల అంటు మొక్కల్ని నాటి వెళ్తుంది.
బెంగళూరు నగరానికి దగ్గరలో ఉన్న " జానపద లోక" ను సందర్శించినప్పుడల్లా , తాము నగరం లో ఉన్నామనే సంగతినే విస్మరించే వారు. పల్లె జన జీవితాన్నీ, కళలనూ. గృహోపకరణాలనూ, శ్రమ జీవితాన్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ, ప్రతిబింబించే అపురూపమైన స్థలం అది. అక్కడ భోజన శాలలో ఆహారం రుచి, తలచుకుంటే నోరూరి పోతుంది.
ఇక తెలుగు వారి జానప కళా సంపద అఖండమైనదని, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇప్పుడు చలనచిత్రాలన్నింటిలోనూ, జానపద గీతాలను ఒక్కటైనా ఉంచి, జనులకు, తర తరాల జన జీవన మాధుర్యాన్ని పంచు తున్నారు,
"అనితా, "కృష్ణ శతకం" లోనిది ఒక పద్యం చదివి హారతినియ్యి" గుర్తుచేసింది ప్రభ
"దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకునెపుడు
దండము కృష్ణా! "
అని అనిత చక్కగా చదివిన శ్లోకం తో "చిట్టి తండ్రి" ని చంక నెత్తుకుని హారతినిచ్చారు అందరూ.
-రాజేశ్వరి. దివాకర్ల
(వర్జీనియా , అమెరికా)