కవిత్వమంటే..!
కవిత్వం
కొన్ని నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది
విస్తరించిన చూపు
కొన్ని ఊహలతో తడిసి తడిసి
గుండెచాటు దృశ్యంగా నిలిచిపోతుంది
మాటకు రెక్కలొస్తే
పదాలు పరుగులు అందుకొని
భావనామయ స్రవంతిలో మునిగి తేలుతాయి
ఎక్కడి అడుగులు
అక్కడే గప్ చిప్!
కనిపించని దూరాల్ని
కనుచూపు మేరలోకి విస్తరించి
కవిత్వం చెయ్యడమే దృశ్యం
సుదీర్ఘ శ్వాసలో నిట్టూర్చినప్పుడల్లా
ఒక కొత్త పదచిత్రం మెరిసి
కలం నడక వేగాన్ని పెంచుతుంది
శబ్దంలేని ఈ నిశ్శబ్దంలో
ఎన్ని నిర్జీవ క్షణాలు
అక్షరాలుగా ఊపిరి పోసుకొని
కవిత్వానికి ప్రాణప్రతిష్ఠ చేశాయో!
ముట్టుకొని చూస్తే
భావ స్పందనలు
పట్టుకొని కలవరిస్తే
పట్టుతప్పి జారిపోయే
అనుభూతుల పరవళ్ళు
ఏవీ
నన్ను నన్నుగా నిలబడనీయవు
దారిపొడుగునా సాగనంపి
నాతోపాటే
కవిత్వ ప్రయాణం చేస్తాయి
ముందు వెనుకలుగానో
వెనుక చూపులతోనో
గతం వర్తమానంలోంచి..
వర్తమానం భవిష్యతులోకి..
బరువెక్కిన ఆలోచనలతో
మనసు తేలికపడే వేళ
ఎన్నెన్ని ఉక్కపోతలు
గాఢానుభవాలుగా
ఊపిరి పోసుకుంటాయో?
కవిగా మేల్కొంటే తప్ప
ఈ కవిత్వ వేడి చల్లారదు
దేనికైనా
ఒక సందర్భం కావాలి
లేదంటే ఎప్పటికీ
ఒక జడ పదార్ధంగానే మిగిలిపోతాం!
-మానాపురం రాజా చంద్రశేఖర్