జీవితకాలం లేటు (కథ)
“వరదరాజులు ఇల్లు ఎక్కడో తెలుసా?”
“సరిగ్గా తెలియదు. లొకాలిటీ పేరు విన్నాను.”
“వరదరాజులు సంగతి విన్నావా?”
“విన్నాను. అదే... అడ్రస్ కనుక్కుంటే, వెళ్ళవచ్చు అని చూస్తున్నాను.”
“వరదరాజులు ఇంటికే బయల్దేరుతున్నా.”
“ఔనా, నేనూ వస్తాను. పది నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తా. కలిసే వెళ్దాం.”
ఫోన్ల మీద ఫోన్లు. కలగా పులగంగా ఫోన్లు. ఎవరెవరో ఇంకెవరెవరికో ఫోన్లు.
వరదరాజులు పనిచేస్తున్న ఆఫీస్ లో చిన్నా, పెద్దా అందరి నోటా ఈ ఉదయం వరదరాజులే!
ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ కాళ్ళు తొక్కుకుంటున్నారు.
లోకల్ టి వి లో పొద్దుటినుంచీ వార్తల్లో మారుమోగిపోతున్నాడు వరదరాజులు.
ఆ వార్తలు వింటూనే ఒకళ్లకొకళ్ళు ఫోన్లు చేసుకుంటున్నారు. వరదరాజులు విషయం ప్రస్తావించుకుంటున్నారు. అందరూ అతడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే, అతడి ఇంటి సరైన చిరునామా ఎవరికీ తెలియదు. అతడికే ఫోన్ చేసి అడగవచ్చు. కానీ, అకస్మాత్తుగా అతడు ఇప్పుడు ఎవరికీ అందని స్థాయికి చేరుకున్నాడు!
***
వరదరాజులు గత పదేళ్లుగా ఆ ఆఫీసులో పని చేస్తున్నాడు. ఉన్నత హోదాలో కాదు. అది ఒక చెప్పుకోదగ్గ హోదా అని కూడా చెప్పలేం. వరదరాజులికి తన హోదా మీద చిన్న చూపు లేదు. పై హోదాల మీద గౌరవం ఉంది. ఎప్పటికైనా గుమాస్తా హోదా అయినా అందుకోవాలన్న ఆశ ఉంది. అందుకు అంతో ఇంతో తన వంతు కృషి చేసుకుంటున్నాడు.
ఈ మధ్యే ఇంటర్ పాసై, ప్రైవేటుగా డిగ్రీ మొదలెట్టాడు.
వరదరాజులు నోట్లో నాలుక లేని మనిషి. అతడు గొంతు పెంచి మాట్లాడగా విన్నవారు లేరు. అయితే, ఆ ఆఫీసులో, ఆఫీసులో అన్నమాటేవిటి, అతడి చుట్టుపక్కల ఇళ్ళలో, ఇంకా అతడికి తెలిసిన ఎవరికైనా అతడు తలలో నాలుకే! అంతగా సహాయపడే మనస్తత్వం పుట్టుకతోనే తెచ్చుకున్నాడు.
వరదరాజులికి కోరికలు ఉంటాయా? ఉండవనే అనిపిస్తుంది. ఎందుకంటే, కోరికలు ఉన్నవాళ్లని ఆ కోరికలు తీర్చుకునే యావ అనునిత్యం సతమతం చేస్తూనే ఉంటుంది. అటువంటప్పుడు, సదా చిరునవ్వుతో ఉండటం సాధ్యమా?
కానీ, వరదరాజులు మొహం మీద చిరునవ్వు ఎప్పుడూ నర్తిస్తూ ఉంటుంది. ఎవరైనా ఓ మాట అన్నా, ఆఫీసులో ఏ
పై వాళ్ళో చీవాట్లు పెట్టే సందర్భం వచ్చినా, ఆఫీసన్నాక వస్తూనే ఉంటాయికదా, అతడు మౌనంగా భరించి, తన పొరబాటు ఏదైనా జరిగి ఉంటే, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. అటువంటిదేమీ లేక, నిష్కారణంగా మాట పడవలసి వచ్చిన సందర్భాలలో కూడా మౌనమే అతడి స్పందన! అటువంటి క్షణాలలో మాత్రమే, మబ్బు వెనుక మాయమైన చంద్రుడిలా, కొన్ని క్షణాలపాటు చిరునవ్వు అతడి ముఖం నుంచి మాయమై పోతూ ఉంటుంది.
ఆఫీసులో ఎవరింట్లో ఏ ఫంక్షన్ వచ్చినా, వాళ్ళకి వరదరాజులు గుర్తుకి వస్తాడు. అడిగిందే తడవుగా అతడు ఆ ఇంటిలో వాలిపోతాడు. ఫంక్షన్ పూర్తయ్యేదాకా, చిన్నా, పెద్దా ఏ పని చెబితే ఆ పని చక చక చక్కబెట్టేస్తాడు. అందుకే వరదరాజులు అందరికీ కావాలి.
అటువంటి ఫంక్షన్ సందర్భాలలో అతడిని అబ్బుర పరిచిన విషయం ఒకటే. ఆఫీసులో వివిధ హోదాలలో ఉండి, అంతరాలు పాటిస్తూ ప్రవర్తించే వాళ్ళంతా, సహోద్యోగి ఇంట్లో ఫంక్షన్ అనగానే అరమరికలు లేకుండా విచ్చేయటం, ఫంక్షన్ జరిగినంతసేపూ ఒకరితో ఒకరు సన్నిహితంగా చలోక్తులు విసురుకుంటూ మసులుకోవటం వరదరాజులికి ముచ్చటగా అనిపించేది. అటువంటి సందర్భాలలోనే అతడిలో ఓ ప్రశ్న ఉదయించింది,
‘నేను పిలిస్తే కూడా ఈ పెద్దలు అందరూ నా యింటికి వస్తారా? ఇంతలా నవ్వుతూ మాట్లాడతారా?’
ఆ ప్రశ్న చివరికి ఓ ఆవగింజంత కోరికగా మారి, అతడి మనసులో నలుసల్లే ప్రవేశించి, మేరువై తిష్ఠ వేసుకుంది.
‘తన ఇంట్లో తానూ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి. తరతమ బేధాలు లేకుండా ఆఫీసులో అందరూ తన ఇంటికి రావాలి.’
అది చిన్న కోరికే అయినా, అంత తేలికగా సాధ్యంకాని కోరిక అని అతడికి తెలుసు.
‘ఊరికే పిలిస్తే కాదు, వచ్చిన నలుగురికీ కుర్చీలు వేసి కూర్చోపెట్టేటంత స్థలం కూడా తన ఒంటిగది ఇంట్లో లేదు. అందరికీ కాఫీ ఫలహారాలైనా పెట్టగల స్తోమతు తనకి లేదు. మరి అందరినీ పిలిచి విందు చేయటం తనకి ఎలా సాధ్యం?’
‘ఎప్పటికైనా డిగ్రీ పూర్తయి, గుమాస్తా మెట్టు అయినా ఎక్కితే, ఇంకొంచెం పెద్ద ఇల్లు తీసుకుని, పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళికి అందరినీ పిలవ వచ్చు. అప్పుడే అది సాధ్యం. అందాకా తన కోరికని వాయిదా వేసుకోవటమే.’ అనుకునేవాడు.
***
నగరంలో నిర్మించిన శాతవాహనుల కాలం నాటి డ్రైనేజి వ్యవస్థ కుప్పలు తెప్పలుగా పెరిగిన నగర జనాభా అవసరాలకి అనుగుణంగా ఆధునికరించకపోవటంతో, చెంబెడు నీళ్ళు రోడ్డు మీద పోసినా, బిందెడు మడుగు ఏర్పడే పరిస్థితి సర్వ సాధారణమైపోయింది. నగర ప్రజలూ అందుకు అలవాటు పడిపోయారు. నగరం లో చెరువులనీ, కుంటలనీ కప్పేసి కట్టేసిన అపార్ట్ మెంట్లు, ప్రతి ఏడూ ఒక వాన పడగానే తమ నిజస్వరూపాన్ని బహిర్గత పరుస్తూ చెరువులుగా, వాగులుగా మారిపోతున్నా, ఆ రెండు మూడు నెలలూ తెప్పలేసుకు తిరిగి, వానలు వెనకబట్టగానే, ‘ఆల్ ఈజ్ వెల్’ అని పాడేసుకోవటానికి అలవాటు పడిపోయారు.
ఈ ఏడు వర్షాకాలం ప్రారంభమే తుఫాన్ తో మొదలయింది. ఆదివారం కురిసిన కుంభ వృష్ఠితో, చెరువుల్లా రూపాంతరం చెందే నగరం ఈసారి ఏకంగా నదిగా మారిపోయింది. నది నీళ్లయినా సముద్రంలోకి ప్రవహిస్తాయిగానీ, నగరపు నది ఉన్నచోటే, పెద్ద చెరువులా ఉండిపోయింది. వరదరాజులు ఉంటున్న మురికివాడని, నాలుగు వైపులనుంచీ వరదనీరు వలయంలా చుట్టేసింది. అకస్మాత్తుగా విరుచుకుపడ్డ ఆ విలయంలో, మురికివాడ జనం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయే ప్రాణ ప్రమాదంలో పడ్డారు. నిండు ప్రాణాలు నీటిలో పడి కొట్టుకుపోతుంటే, వరదరాజులు చూస్తూ ఊరుకోలేకపోయాడు. తన ప్రయాణం కాపాడుకుని పారిపోవటానికి అతడి మనసొప్పలేదు. తనకున్న కండబలానికి గుండె బలాన్ని కూడా జోడించి, కొట్టుకుపోతున్న నిస్సహాయులని ఒక్కొక్కరినే ఎత్తుకుని, ఎత్తున ఉన్న గట్టు మీదికి చేరవేయటం ప్రారంభించాడు.
రాత్రంతా కష్టపడి ఆ నీటి ఉద్ధృతిలో ఎదురీదుతూ, వీలైనంతమందిని గట్టుమీదకు చేరచిన వరదరాజులు తెలతెలవారే వేళకి సరికి చేతులూ, కాళ్ళూ చచ్చుబడిపోయి, సత్తువ కోల్పోయాడు. మరింక వరదనీటికి ఎదురీదలేక మునిగిపోయిన వరదరాజులు మృత దేహాన్ని అరకిలోమీటరు దూరం తరవాత ఒక ఒక చెట్టు కాండం అడ్డుకుని, ఒడ్డుకి తోసేసింది.
వరద భీభత్సాన్ని వీడియోలు తీస్తూ, వార్తా చిత్రాన్ని కవర్ చేస్తున్న టి వి విలేఖరులు ఈ దృశ్యాన్ని చూసి, స్తబ్ధులై పోయారు. వెంటనే వరదరాజులు సాహసాన్ని కథలు కథలుగా చూపించటం మొదలుపెట్టారు.
ఇప్పుడు వరదరాజు ఒంటిగది ముందు, చోటు విషయం పట్టించుకోకుండా గుమి గూడిన జనంలో వరదరాజులు ఆఫీసులోని పాతికమందీ ఉన్నారు! అతడికోసం అశ్రుతర్పణాలు వదులుతున్నారు. జీవితకాలం లేటుగానైనా కోరిక తీరిన సంతృప్తి గాబోలు, వరదరాజులు మొహంలో ఇప్పుడూ చెదరని చిరునవ్వు!
-పి.వి.ఆర్.శివకుమార్