Telugu Global
Arts & Literature

గొంతులో ముల్లు

గొంతులో ముల్లు
X

సుందరమ్మ అసూర్యం పశ్య!

పుట్టిన దగ్గర్నుంచి అల్లారుముద్దుగా పెరగటంచేత ఆమెకు సమస్య అనే పదానికి అర్థం తెలీదు..

అలాటి సుందరమ్మ గొప్ప చిక్కుల్లో పడింది. అంతావిని ఇదోచిక్కా అనకండి, చిక్కంటే చిక్కే!

సుందరమ్మ పూర్వీకులు విజయనగరం రాజుల కొలువులో పనిచేసేవారు. తండ్రి మునిసిపాలిటీలో యు.డి.సి.గా పనిచేసాడు. నలుగురు అన్నదమ్ములు తరువాత అపురూపంగా పుట్టింది.

ముచ్చటగా ఉంటుంది. కూతురుకి చిన్నప్పట్నించి తండ్రి అమరాంధ్రాలు చెప్పించాడు. స్కూలు ఫైనల్ తరువాత సంస్కృత కళాశాలలో భాషాప్రవీణలో చేర్పించాడు. ప్రిలిమినరీ పొసెయింది.

మూడవ సంవత్సరంలోకొచ్చింది. అదిగో అప్పుడు కలిశాడు సుందరమ్మని పద్మనాభరావు.

కాలేజీకి ఏదో పనిమీదొచ్చాడు,

అతని గురువుగారు సాంబశివరావుని కలిసాడు.

సాంబశివ రావు గారు పద్మనాభాన్ని యోగక్షేమాలడిగి, పెళ్ళేప్పుడు?

పప్పన్నం ఎప్పుడు తినిపిస్తావు? అన్నారు.

" మీ ఆశీర్వచనాల్లేకుండానా? అంటుండగా, 'సుందరమ్మ చేతినిండా పుస్తకాలు గుండెలకాన్చుకుని వెళ్తూ సాంబశివరావు గారికి నమస్కారం చేసింది.

"ఏమ్మా! నాన్న కనిపించట్లేదీ మధ్య "అన్నారు.

"పనులెక్కువవుతూన్నాయండీ!".

"మీ వాళ్లేరా ! భోగరాజు వాళ్లు వీడు నాస్టూడెంటే నమ్మా, ప్రస్తుతం ఎల్. కోటలో పనిచేస్తున్నాడు.రెల్లివలస పాణంగిపల్లి వారు, భాషాప్రవీణ, విద్యా ప్రవీణ చేసి ట్రైనింగయ్యాడు. తెలుగు పండిట్ గా చేస్తున్నాడు. మంచి కుర్రాడు .తండ్రి కొక్కడే కొడుకు అని పరిచయం చేస్తుంటే సిగ్గుతో తలదించు

కొని "వస్తానండీ, "అని కదలబోతూంటే" నాన్న నోసారి కలమమను "అన్నారు. "అలాగేనండి "అనిమాష్టారితో పాటు పద్మనాభరావుకీ తలవంచి ముందుకు కదిలింది. అలా కళ్లలో పడిన ఆ రూపంగురువుగారి దయవల్ల తన ఇంట్లో పడింది. పుట్టినింటికి వన్నెతెచ్చింది.

భాషా ప్రవీణ ఫస్టుక్లాసులోపాసయింది. కానీ అత్తవారింట్లో మనింటి కోడలుకి ఉద్యోగావసరం ఏమొచ్చింది? అనటంతో సరేనంది. పదేళ్ల తరువాత ఓ ఆడపిల్ల పుట్టింది .డాక్టర్లు మరిసంతానానికి కుదరదు అన్నారు. పుత్రసంతానం లేదని వ్యధచెందక కూతుర్ని చక్కగా పెంచింది. పద్మనాభరావు దానధర్మాలు బాగా చేసేవాడు. చుట్టాలకీ, బంధువులకీ ,స్నేహితులకూ సాయపడేవాడు, ఎన్నడూ కాదనలేదు సుందరి.

మావగారు విజయనగరం అయ్యన్నపేట దగ్గరలో ఓ పదిహేను సెంట్లు జాగా రాసిచ్చాడు. ఆ జాగాఅమ్మేసి అప్పటికి టౌనుకి కొంచెం దూరంగా తోటపాలెం దగ్గరి జాగాకొని, మంచి ఇల్లు కట్టుకొని

చుట్టూ మొక్కలు, తోట, పెంచుకుని కొన్నాళ్లుకు కాలం చేసాడు. కూతుర్ని బాగా చదివించిసుందరమ్మ కూతుర్ని బ్యాంకు ఎంప్లాయికిచ్చి పెళ్లి చేసింది. సుందరమ్మకి శాఖా పట్టింపులెక్కువ,

పిల్ల బాగుందని అంతకంటే మంచి సంబంధాలొచ్చినా, పినతల్లి తెచ్చిన దామరాజు వారబ్బాయికిచ్చి

పెళ్లి చేసింది. కూతురు ఉద్యోగం చేయనంది. ఈ లోగా విజయనగరం జిల్లా, అవటం బాగా అభివృద్ది చెందటం, తోటపాలెం నిండా అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా లేవటం జరిగింది. అల్లుడు అత్తగారి నొప్పించి ఇంటితో కలిపి జాగాని ఓ బిల్డరుకిచ్చి కొంత క్యాషు, రెండు టూ బెడ్ రూమ్సు పోర్టన్ కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

సుందరమ్మకు మడెక్కువ నిప్పులు కడుగుతుంది..ఒక పోర్షన్లో సుందరమ్మ ఉంటూ, రెండో పోర్షన్లో కూతుర్ని ఉంచింది. ఇది కధ!

ఇంతవరకూ బాగుంది.

ఇక్కడే కధ మలుపు తిరుగుతోంది సుందరమ్మ మనవరాలు అమెరికాలో డాక్టరు చదువుతోంది. చదువు పూర్తి కావస్తోంది. తనుండగానే మనవరాలికి పెళ్లి చేయమని కూతురిని

తొందరపెడుతోంది.

ఈలోగా అల్లునికి ప్రమోషన్ మీద బొంబాయి బదిలీ అయింది. అక్కడ కధ మొదలయింది!అల్లుడు ఇంటిని అద్దెకివ్వమన్నాడు. అపార్టమెంట్ గేటుకి టులెట్ బోర్డు తగిలించి వెళ్లాడు. ఓవ్వో! 'రోజుకి పది మంది వచ్చి పడుతున్నారు. తోటపాలెంలో లేని అద్దె

ఇస్తామంటున్నారు.

కారణం ఆఇంటికి కప్-బోర్డ్సు, ఎ.సి., ఫ్యాన్స్, ఆక్వాగార్డు, మొజాయిక్ ఫ్లోరింగు అన్నీ ఉన్నాయి. దీనికి తోడు

తోటపాలెంలో అపార్టుమెంటుకి నీటి ఎద్దడిలేదు. రోడ్లు బాగుంటాయి. కావలసిన సౌకర్యాలన్నీ దగ్గర

బస్టాండు, హోటళ్లు హాస్పటిల్స్ అన్నీ దగ్గర!

అయితేశాఖాహారులకీ, తత్రాపి బ్రాహ్మలు, అందునా ఆరువేల నియోగులైతే అద్దె ఎంతచ్చినా పరవాలేదన్నది. సుందరమ్మ పట్టుదల,

ఈ పట్టుదల వల్ల సంవత్సరం ఖాళీగా ఉండిపోయింది. "మేం గవర

కోవట్లమండీ, శాఖాహారులం" అని "మేం పట్టుశాలీలమండీ శాఖాహారుల"మని ఎవరొచ్చినా ఆమె ససేమిరా అంది. చివరికో ఆలోచనవచ్చి బ్రాహ్మలకు మాత్రమే అని బోర్డు పెట్టించమంది. పినతల్లి కొడుకుకొంపలు మునుగుతాయి. అలా పెట్టించకూడదని అడ్డుకున్నాడు.

ఎలాగైతేనేం?

ఒకాయన నిలువునామాలతో వచ్చాడు.

"మీరెవరు " అడిగింది

"తిరుమల పెద్దింటి వారిమి,

శ్రీ వై ష్ణవులము వెంకటేశ్వర కోవెల ప్రధానార్చకులం "

"శ్రీభాష్యం అప్పలాచార్యులు మీరెరుగుదురా?"

"ఆఁ మాకు వరసకు పెద్దనాన్నగారు వారి బంధువులు మాకు తెలుసును శరకోపాలాచార్యులు, ఎస్వీఎస్ గారూ మా గురువులు. ఇలా కొనసాగిన సంభాషణ వాళ్లని దగ్గర చేసింది.

అద్దెకు దిగారు. కొన్నాళ్లు బాగానే ఉండీ. ఓ రోజు పనసపొట్టు కూరచేసి, వాళ్ల వాళ్లకివ్వబోతే ఆవిడ,సున్నితంగా మాకు

ఆచారాలెక్కువండీ, మేం ఎక్కడా, ఎవరి వంట తినం ఏమనుకోకండి అని తిప్పి కొట్టింది సుందరమ్మ తోక తొక్కిన త్రాచయింది. "మాకంటా మీకు మడేక్కువా? అంది. అక్కణ్ణుంచి సంబంధాలు తెగాయి.

అసలు శ్రీవైష్ణవులు బ్రాహ్మల క్రిందికేరారు, శాఖలన్నింటిలోది పెద్దలు మావాళ్లే అంది .అప్పుడక్కడే ఉన్నవాళ్ల స్నేహితుడు గంటి సోమేశం వేద పండితుడు శాఖలన్నింటిలో మాశాఖేగొప్పది .మేం రాజ పురోహితులం .అందరూ మాకాళ్లు కడగాల్సిందే "అన్నాడు.

" మరి చెప్పకండి అందుకే కన్యాశుల్కంలో గురజాడ మిమ్మల్ని దూది ఏకేసినట్టు ఏకీసాడు." అంది సుందరమ్మ, సోమేశం ఏంతక్కువ తిన్నాడా? సుందరమ్మని తెలిసినవాడు కావటం చేత "మరి చెప్పకమ్మా!సాక్షాత్తూ మీ వాడైన మీ సూరకవే మిమ్మల్ని పనికి మాలిన పాణంపల్లి వారు! అన్నాడు.

శ్రీ వైష్ణపావడ కిసుక్కున నవ్వింది.

కురుపాండవ సంగ్రామానికి ద్రౌపది నవ్వేకారణం అయినట్టు వాళ్లలో అగ్గిచెలరేగటానికి అవిడ

నవ్వేకారణం అయింది. ఇంకేముంది? క్షణాల్లో వాళ్లని ఇల్లు ఖాళీచేసి పొమ్మంది.వాళ్లూపోయారు!

మనుషులను తిట్టినా పరవాలేదు కాని కులాన్ని తిడితే

తెలుగువాడూరుకుంటాడా?

ఆరుమాసాలెవరికీ అద్దెకివ్వలేదు.

ఇల్లు పాడవుతుందని దెబ్బలాడి పిన్నికొడుకు ఒకర్ని తెచ్చాడు.

"మనవాళ్లే !యల్.ఐ.సి.లో ఎకౌంటెట్

వాళ్లావిడ విజయవాడ రైల్వేలో పనిచేస్తోంది, పిల్లలక్కడే చదువుకుంటున్నారు. తండ్రి లేడు, తల్లితమ్ముడు దగ్గర ఉంటుంది. ఎప్పుడో వస్తే వస్తుంది. కుర్రాడు మంచి వాడు, గుడిపాటి వారబ్బాయి"అన్నాడు.

"ఓహో మరేం ! "అంది అద్దెకూడా చెప్పకుండా కుర్రాడి రొట్టివిరిగి నేతిలో పడింది. కాఫీలూ,,టీలూ, వంటలూ, పిండి వంటలూ, అన్నీ సుందరమ్మే సరఫరా చేసింది. సొంత పిల్లాడిలా చూసుకుంది.ఆ అబ్బాయికూడా పిన్ని గారితో "మీలాంటి అన్నపూర్ణ గారింట్లో నేను అద్దెకు దిగటం పురాకృతసుకృతం "అన్నాడు. ఆమె ఉబ్బింది హార్లిక్స్ కలిపిచ్చింది.

సాఫీగా పోతే కథ కాదు

సుందరమ్మ కొచ్చిన చిక్కు ఇక్కడే!

ఒక రోజు సుందరమ్మ పెసరట్ల కూరచేసిఎదురింటబ్బాయికివ్వటానికి తలుపు తట్టింది. రెండు

సార్లు కాలింగ్ బెల్లు కొడితే తలుపు తెరుచుకుంది. కొప్పు ముడిపెట్టుకుని, చెవులకు, ముక్కుకు మాత్రం

పల్లె టూరు దాన్లా అభరణాలు, జాకెట్టు లేకుండా చీరతో తలుపు తెరిచి "ఎవులూ"అంది .త్రుల్లిపడింది

సుందరమ్మ.

"ఎవరు నువ్వు"

"నా ఇంటికొచ్చి నన్నెవులంటావు నువ్వవెరూ?"

"నాదే ఈ ఇల్లు ఆ అబ్బాయేడి? ''

"నేడు ఇంతకీ నీ కేటి కావాల?"

" ఇదిగో ఆ అబ్బాయికీ కూర ఇష్టం అని తెచ్చాను, పెసరట్ల కూర ! ఇంతకీ

నువ్వవెరు? "

"నాను ఆడి తల్లిని"

" అదేంటి? మీరు బ్రాహ్మలు కారా? "

"..సీ ! మీం నాయుడోర్లం అయినా మీ బేపనోల్ల కూరలు మాం తినం- నాను సికిన్ సేత్తున్నాను. "

"ఏంటి? మీరు కాపులా ? మీకుర్రాడు నియోగి బ్రాహ్మన్లని చెప్పాడు" అన్న సుందరమ్మకి చెవట్లు పోసాయి,

వాళ్లబ్బాయి వచ్చాడు, నిలదీసింది సుందరమ్మ .

విషయమంతా చెప్పాడు -కుర్రాడు వాళ్ల నాన్న గుడిపాటి వారే భార్య చనిపోగా, ఈమె కావలసి వచ్చి సొంతం చేసుకున్నారు. ఆమెకుపుట్టిన సంతానం ఈ అబ్బాయి,సుందరమ్మ క్షణం ఆగలేదు ఇల్లు ఖాళీ చేసేయిమంది! దెబ్బతిన్న

పులిలా అయింది. ఆవేశాన్ని అణచుకోలేక పోతోంది. మంచం మీద పడిపోయింది!

గోరుచుట్టు మీద రోకటి పోటు!

సుందరమ్మ కూతుర్నించిఫోను!

" ఏంటమ్మా ఇప్పుడు చేశావు?

"ఏంటి అంత ఆయాసపడు తున్నావ్?."

సుందరమ్మ విషయం చెప్పింది. విషయం అడిగింది కూతుర్ని,

"శుభవార్త. మీ మనవరాలికి సంబంధం కుదిరింది. వచ్చే నెల అమెరికాలో పెళ్లి .వెళ్తున్నాం.టైం లేదు. వచ్చాక వివరాలు చెప్తాను."

"అదేంటే! ఒక్కగానొక్క మనరాలికి నేను లేకుoడానా?"

"తప్పలేదు"

"మనవాళ్లేనా ? "

" ఆ !మనవాళ్లే"

"ఏ శాఖ"

"తెలుగువాళ్లే !గుంటూరు. పెద్దస్థితి పరులు .అబ్బాయి డాక్టరు, అమ్మాయి ప్రేమించింది.దానిష్టంకాదనలేం కదా!

" అది కాదే! మన బ్రా... బ్రా... (హ్మలేనా) గొంతుకెండిపోతుంది. సుందరమ్మకి గొంతు తడారిపోతుంది సవరించుకుని అడుగుదామనుకుంటే కూతురు ఫోన్ కట్ చేసింది!

(కధ కేవలం కల్పితం)

-పి.వి.బి.శ్రీరామమూర్తి

First Published:  17 May 2023 2:04 PM IST
Next Story