Telugu Global
Arts & Literature

పుస్తకం సృష్టించిన యుద్ధం

పుస్తకం సృష్టించిన యుద్ధం
X

1862 నవంబర్ నెల ఆఖరులో ఓ రోజు అబ్రహాం లింకన్ తన అధికార నివాసం శ్వేత సౌధం లోకి సాదా సీదాగా,పిట్టలా కనిపించే ఓ మధ్య వయస్కురాలిని స్వాగతిస్తూ "ఓహ్ ! నువ్వేనా ఇంత పెద్ద యుద్ధానికి నాందీ ప్రస్తావన చేశావ్ ?" అంటూ ఉద్వేగంగా పలకరించాడు.

ఆ పిట్టలాంటి మనిషే "అంకల్ టామ్స్ కేబిన్" రాసిన హారియట్ బిషర్ స్తొవే. అప్పటి అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగడానికి పదేళ్ళ ముందే ( అంటే 1850s కి ముందు )ఈ పుస్తకం వెలుగులోకి వచ్చి అబ్రహం లింకన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఇతోధికంగా దోహదం చేసింది. బానిసత్వాన్ని రూపుమాపడానికి పనికొచ్చిన ఏకైక ఆయుధంగా ఈ పుస్తకాన్ని సమకాలిక రాజకీయ వేత్తలు, చరిత్రకారులు వేనోళ్ల కొనియాడారు.

కనెక్టికట్ లో పుట్టి,పెరిగి హారియట్ పద్దెనిమిది ఏళ్ల పాటు సిన్సినాటి లో ఉంటూ ఆ వూళ్ళో బానిసత్వానికి వ్యతిరేకంగా చేసే ఆందోళనలు చూసింది. తమ యాజమానుల చెర నుంచి తప్పించుకు పారిపోయే బానిసలకు సాయం చేసింది. వాళ్ళ కన్నీటి కథలు వింది. తదనంతరం భర్త కాల్విన్ స్తోవేతో మైనే కి మారింది. అక్కడ కూడా బానిసత్వం నించి తప్పించు కోవడం అసాధ్యమైన పరిస్థితులే నెలకొని ఉండేవి. పేపర్ల నిండా అవే వార్తలు. బానిసత్వానికి వ్యతిరేకంగా చేసే నినాదాలు,ఉపన్యాసాలతో సెనేట్ హాల్ దద్ధరిల్లి పోయేది. అప్పటికే రెవరండ్ హెన్రీ వార్డ్ బిశర్ గా పేరుపడ్డ ఆమె అన్న పల్పిట్ నించి పిచ్చిగా బానిసలను వేలం వేస్తూ ఉండేవాడు.

భర్త వేన్నీళ్ళకు చన్నీళ్లుగా హారియట్ చిన్న చిన్న కథలు ఇబ్బడి ముబ్బడిగా రాస్తుండేది. ఆవిడ భక్తి ప్రపత్తులు తనకు తెలిసిన బానిసత్వపు పైశాచికాన్ని ప్రపంచం కళ్ళ ముందు బొమ్మ కట్టాలని కొట్టు మిట్టాడుతూ ఉండేవి. కానీ,రాజకీయంతో పెనవేసుకున్న సమస్య మీద రాయాలంటే ఓ జీవితకాలం ప్రయత్నించాల్సి వచ్చేటట్టు ఉంది ఆమెకి.

ఈలోగా "నీలాగా రాయగలిగే సత్తా ఉంటే బానిసత్వం ఎంత శాపగ్రస్తమో ఈ దేశానికి తెలిసే టట్టు రాసి ఉండేదాన్ని"అంటూ హారియట్ వదిన రాసిన ఉత్తరం ఆమె పట్ల చెకుముకి లాగ పనిచేసింది.

హారియట్ చాలా సేపు ఆ ఉత్తరం చదువుతూ ఉండడం పిల్లలకి జ్ఞాపకం ఉంది. గుప్పిట్లో ఉత్తరం నలిగి పోతుం డగా "నేను ఏదో ఒకటి తప్పకుండా రాస్తాను" అనుకుంది.


అలా ఓ రోజు హారియట్ తన రాత బల్ల ముందు కూర్చొని మొదలు పెట్టింది: "ఫిబ్రవరి నెల ఓ చల్లటి సాయంకాలం pa----, కెంటకి లో ఓ చక్కటి భోజన శాలలో ఇద్దరే ఇద్దరు పెద్ద మనుషులు వైన్ తాగుతూ కూర్చున్నారు ".

వెంట్రుక వాసి ఇంకు చారిక ఒక దీర్ఘ యాత్ర ప్రారంభించింది. ఇది ఎంత దూరం సాగుతుందో హారియట్ కి తెలియక పోయినా ఆ యాత్ర గెట్టిస్బర్గ్,అప్పోంటాక్స్ లో ముగిసింది. తన "అంకల్

టామ్స్ కేబిన్ " ఎంతటి ఊహాతీత పరిణామాలకు దారి తీస్తుందో హారియట్ ముందుగా ఊహించలేకపోయింది. తన కథ శాంతి సందేశం ఇస్తుంది అనుకుంది హారియట్.

అంకల్ టామ్ ని కొరడాతో కొట్టినట్టు రాసిన దృశ్యం కొన్ని వారాల ముందుగానే అనుకొన్నది; నిజంగా ఆవిడకి చర్చిలో సామూహిక ప్రార్థన జరుగుతుండగా కనిపించిన దృశ్యం. ఆవిడ అక్కడే ఉన్నట్టు, ఆ ఘటన తన కట్టె దుట జరుగుతున్నట్టు ,ఒక తెల్ల రౌడీ ఒక ముసలి బానిసను అతడు చనిపోయేవరకూ కొట్టినట్టు కనిపించింది. కళ్ళలో నీరు కుక్కుకుంటూ ఇంటికి చేరుకుంది హారియట్. ఏదో మత్తులో ఉన్నట్టు పడక గది కి వెళ్ళి తను చూసిన దృశ్యాన్ని చూసింది చూసినట్టు రాసి పెట్టింది. పిల్లలకి చదివి వినిపిస్తే వాళ్ళు వెక్కెక్కి ఏడ్చారు. భర్త అయితే "హైటి! ఈ దృశ్యం క్లైమాక్స్ గా నువ్వు ఒక కథ రాయాలి. ప్రభువు అదే కోరుకుంటున్నాడు" అన్నాడు.




హారియట్ తన కథని మూడు నాలుగు ఎపిసోడ్స్ లో ముగించాలని మొదలుపెట్టి దాన్ని వాషింగ్టన్ నించి వెలువడే నేషనల్ ఎరా ఎడిటర్ బైలీకిస్తే అతడు దాన్ని చదవకుండానే మూడు వందల డాలర్లకు తీసేసుకున్నాడు. పాపం హారియట్ ! ఆ మూడు నాలుగు ఎపిసోడ్స్ అల్లా కథని ఓ కొలిక్కి తెచ్చేసరికి నలభై అయ్యాయి కానీ, బైలీ హారియట్ పారితోషికాన్ని ఒక్క డాలర్ కూడా పెంచలేదు. 5th జూన్ 1851 లో నేషనల్ ఏరా లో కథ మొదటి భాగం అచ్చయ్యి ఓ మొత్తం యువ తరాన్ని విప్లవ పంథాలో ఫిరంగుల ముందుకు నడిపించింది. వాళ్ళలో ఒకడు ఫ్రెడ్ , హారియట్ కొడుకు. తన జీవిత అనుభవాలను రంగరించి హారియట్ ఈ కథ మలిచింది. తన స్కూల్మేట్ కి కెంటకీ లో ఉన్న ప్లాంటేషన్ కథకి పాదుకొల్పింది. కథకి అనుగుణంగా అంకల్ టామ్ అక్కడ ఒక నీగ్రో బానిస అయి ఉండాలి.

నీగ్రో బోధకుడు,సామాజిక కార్యకర్త ఐన రెవరెండ్ జోషయ హెన్సన్ కథలో అంకల్ టామ్. యువకుడిగా ఉన్నప్పుడు

హెన్సన్ ని అతడి పశువు లాంటి యజమాని కొరడా తో కొట్టడం వలన శాశ్వతంగా వికలాంగుడు అయ్యాడు. ప్లాంటేషన్ ఓవర్సియర్ పాత్ర న్యూ ఆర్లియన్స్ పడవలో వెళుతుండగా ఒక మొరటు వ్యక్తి రూపంలో తారసపడింది .అతడి పిడికిలి మద్ది చెట్టు కణుపు లా బండగా ఉంది. దాన్ని హారియట్ కి చూపిస్తూ నీగ్రో బానిసలను కొట్టి కొట్టి ఇది ఇలా బండగా తయారయ్యింది అంటూ ఓ వెకిలి నవ్వు నవ్వాడు . ఈ పాత్రలోకి హారియట్ తన అన్నయ్య చార్లెస్ ని దింపింది. పేరు సైమన్ లెగ్రీ. హారియట్ పాఠాలు చెప్పే సిన్సినాటి సండే స్కూల్ లో అల్లరి పిల్ల సెలస్టి టాప్సీగా మారింది.

ఊరూ పేరూ లేని పత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు ఈ కథ దేశమంతటా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ప్రతి కుటుంబం లోనూ బానిసత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక సభ్యుడు ఏరా పత్రికకి చందాదారుడుగా ఉండేవాడు. అతని పేపరు పూర్తిగా చిరిగి పోయేంతవరకూ చేతులు మారుతూ ఉండేది. కథలో ఒక కొత్త పాత్ర చిత్రిస్తే ఒక కొత్త ఘటన వర్ణిస్తే పాఠకులు ఉగ్వేగంతో ఊగిపోయేవారు.

హారియట్ రాస్తూ పోతోవుంటే ముగింపు కనుచూపు మేరలో కనిపించకుండా, కథ తరువాతి ఎపిసోడ్ హారియట్ ఎక్కడికి వెళితే అక్కడికి ఆమెను వెంబడిస్తూ ఉండేది.

జాన్ పీ జ్యోయెట్ బోస్టన్ లో ఒక చిన్న పబ్లిషింగ్ సంస్థ కి అధిపతి. అంకల్ టామ్స్ కేబిన్ సీరియల్ని ఓ చిన్న పుస్తకంగా తేవడానికి ఒప్పుకున్నాడు. కథని ఇలా పొడిగిస్తూ పోతే సీరియల్ రెండు పుస్తకాలు పట్టేట్టు ఉంది. హారియట్ అంతగా ప్రజాదరణ లేని విషయం మీద రాస్తుంది. సీరియల్ ని ముగించమని అతను హారియట్ ని వేడుకొనేవాడు. రెండు పుస్తకాల ప్రచురణ అతనికి లాభసాటి బేరం కాకపోవచ్చు. అతని భయం అతనిది.


హారియట్ నిస్త్రాణం గా సీరియల్ ముగించడానికి సిద్ధమైంది. ఏరా పత్రికలో ప్రజాభిప్రాయ సేకరణ అచ్చయింది. పాఠకులు అందరూ ఒక్కపెట్టున బల్ల గుద్దినట్టు "ససేమిరా వల్ల కాద"న్నారు.హారియట్ రా.... స్తూ... పోయింది.

అంకల్ టామ్ మోకాళ్ళ మీద ఊగుతూ ఆడుకొనే లిటిల్ ఈవా ఇంటి యజమాని కూతురు. క్రిస్మస్ పర్వదినాన వెలువడిన సీరియల్ భాగం లో ఈవా మరణించినట్టు అచ్చయింది. ఇలా రాసేక కలిగిన అలసట వల్ల హారియట్ ఏకంగా నలభై గంటలు నిద్ర పోయింది. "కథలో నాటకీయత కోసం దేవకన్య లాంటి ఈవా చనిపోయినట్టు రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయ్?" అంటూ పాఠకులు బాధాతప్త హృదయాలతో హారియట్ కి అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశారు. కానీ, దీనితో హారియట్ కి ముందుకు పోయే మార్గం సుగమం అయింది. అంకల్ టామ్ మరణాన్ని చిత్రిస్తూ కథని ఓ మంచి మలుపు తిప్పి ముగించడమే తరువాయి.

( రచయిత్రి ఇల్లు )

ఆ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రకాశక సంస్థ యజమాని జ్యోయేట్ తన అంతంతమాత్రం పెట్టుబడిని తగ్గించుకోవడానికి పుస్తక ప్రచురణ కయ్యే ఖర్చులో సగం తను, సగం స్తోవే దంపతులు పెట్టుకొని,లాభాలు చెరి సగం పంచుకొనేట్టు ఓ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ మన వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అంచేత భర్త కాల్విన్ ఆ ప్రస్తావనకు ఒప్పుకోకుండా అమ్మకాల్లో పది శాతం ఇస్తే సరిపోతుంది అన్నాడు. ఈ ఒప్పందానికి హారియట్ కూడా "నేనో మంచి సిల్క్ డ్రెస్ కొనుక్కుంటా"అని మురుస్తో ఒప్పేసుకుంది.

ఎలాంటి ముందస్తు ప్రచారార్భాటం లేకండా అంకల్ టామ్స్ కేబిన్ నవల మొదటి ముద్రణ ఆరు వేల ప్రతులు వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయాయి. వారం లోగా జ్యోయెట్ మూడు పవర్ ప్రెస్లు 24×6, ఓ వందమంది బైండర్లు, కాగితం సప్లై చెయ్యడానికి మూడు పేపర్ మిల్లులు పనిలో పెట్టాడు. నాలుగు నెలల రాయల్టీగా హారియట్ 10,300 డాలర్లు అందుకొంది. ప్రథమ వార్షికోత్సవం నాటికి నవల మూడు లక్షల ఐదు వేల కాపీలు అమ్ముడు పోయాయి,డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఒక డజను విదేశాల్లో గ్రంథ చౌర్యం జరిగింది. ఓ డజను భాషల్లో తర్జుమా అయింది. యూరప్ లో అణగారిన ప్రజలు తమ గుండెలకు హత్తుకున్నారు. లండన్,న్యూ యార్క్,బోస్టన్ లో నవలని నాటకంగా ప్రదర్శించారు. అమెరికా లో అంకల్ టామ్,ఈవా పాటలు పాడారు. రోడ్ ఐలాండ్ లో అంకల్ టామ్,ఈవా కార్డ్ గేమ్ తయారు చేశారు.

అంకల్ టామ్స్ కేబిన్ నవల అమెరికాలో సామాజికంగా,వ్యాపార పరంగా, ఆర్థికంగా చాలా మార్పులు తెచ్చింది. ఉత్తర అమెరికా కంటే దక్షిణ అమెరికా వాళ్ళు బానిసల పట్ల ఉదారంగా ఉండేవారని ఓ అధ్యయనం చెప్తుంది. దక్షిణ అమెరికా పత్తి వ్యాపారం లో ఉత్తర అమెరికా ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడి పెట్టింది. అక్కడ పత్తి పొలాలు బానిసత్వం మీద ఎక్కువ ఆధార పడి ఉంటుంది. అంచేత న్యూయార్క్ జర్నల్ ఆఫ్ కామర్స్ మొట్ట మొదటి సారిగా ఈ నవలకి వ్యతిరేకంగా కత్తి కట్టింది. దాంతో రెండు ప్రాంతాల్లోనూ వార్తా పత్రికల్లో వాద - వివాదాలు మొదలయ్యాయి.

ఇంతవరకు ఒక వివాదాత్మక నవలగా అమెరికా రెండు ప్రాంతాల్లోనూ విరివిగా చెలామణీ అవుతున్న అంకల్ టామ్స్ కేబిన్ కి దక్షిణ అమెరికా లో హఠాత్తుగా అణచివేత మొదలైంది. ఇంట్లో నవల ఉండడం ప్రమాదకరంగా పరిణమించింది. దక్షిణ అమెరికా లో తల్లులు హారియట్ ని మంత్రగత్తెగా చూపించి పిల్లలని భయపెట్టడం మొదలు పెట్టారు. "నిన్ను చంపేస్తామని,బానిసల తిరుగుబాటును రెచ్చగొట్టిన దానా" అంటూ ఆకాశ రామన్న ఉత్తరాలు రావడం మొదలైంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెంటిలోనూ ప్రజలు ఇది కేవలం నవల కాదు,అమెరికా పునాదులలో వత్తి వెలిగించి అమర్చిన బాంబ్ అని గుర్తించారు.

" బానిసత్వ నిర్మూలన ఏ ఒక వ్యక్తి వలన సాధ్యం కాదు,సాధ్యమయ్యేది కాదు. ఇది సామూహిక ప్రయత్నాల వల్ల సాధ్యం అయింది ... కానీ, అన్నిటికంటే ఎక్కువ,బలమైన ప్రభావం చూపించింది ఖచ్చితంగా అంకల్ టామ్స్ కేబిన్" అని నలభై ఏళ్ల తరువాత చరిత్రలో ఈ నవల స్థానాన్ని కిర్క్ మన్రో అనే అమెరికా విమర్శకుడు విశ్లేషించాడు.

ఆంగ్ల మూలం:

(రీడర్స్ డైజెస్ట్ ప్రచురణ సంకలన గ్రంథంనుండి )

హర్ బుక్ బ్రూడ్ ఎ వార్

రచయిత :

ఫారెస్ట్ విల్సన్

తెనుగు సేత :

గణేశ్ రామ్

(రాజమండ్రి)

First Published:  11 Oct 2023 6:33 PM IST
Next Story