Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    పుస్తక దర్శని…ఉన్నది ఉన్నట్టు

    By Telugu GlobalAugust 18, 2023Updated:March 30, 202511 Mins Read
    పుస్తక దర్శని...ఉన్నది ఉన్నట్టు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఒక పత్రికాధిపతి గురించి

    బ్లాక్ అండ్ వైట్ కథనం

    గోవిందరాజు చక్రధర్ రాసిన ‘రామాజీరావు, ఉన్నది ఉన్నట్టు’ అనే పుస్తకం ముఖచిత్రాన్ని ఆమధ్య ఫేస్ బుక్ లో చూసి, బహుశా రామోజీరావు జీవితచరిత్ర అయుంటుందనుకున్నాను.

    ఇది రామోజీరావుకు మాత్రమే సంబంధించినదన్న భావన పుస్తకం పేరు కలిగిస్తున్నా, నిజానికి ఆయనకు మాత్రమే చెందిన పుస్తకం కాదు. ఇది దాదాపు అర్థశతాబ్దపు ఈనాడు, అందులో పనిచేసిన ఉద్యోగుల చరిత్ర; వాళ్ళల్లో ఎంతోమంది ఏళ్ల తరబడి ఎదుర్కొన్న దినదినగండాలూ, పడిన అభద్రతాభావనా, భవిష్యత్ భయాలు, దిగుళ్లు, కన్నీళ్ళ గురించిన చరిత్ర. అంతేకాదు, ఇతర మీడియా సంస్థల్లో పనిచేసిన, చేస్తున్నవారు కూడా తమ బతుకు ప్రతిబింబాన్ని-ఉన్నది ఉన్నట్టుగా కాకపోయినా, కొంత తేడాతో- చూసుకోగల పుస్తదర్పణం ఇది. ఈనాడు అంటే రామోజీరావే కనుక ఎవరి గురించి రాసినా అది ఇద్దరి చరిత్రా అవుతుంది.

    నిజానికి చక్రధర్ రచన చరిత్రను మించి ఒక కరుణరసాత్మకవిషాదగాథగా, ఒక నవలగా చదివిస్తుంది, అడుగడుగునా గుండె బరువెక్కిస్తుంది, అక్షరక్షరాన మనసు కలచివేస్తుంది, చేతగాని కోపం బుసకొడుతుంది.

    చరిత్రస్వభావం కలిగిన ఏ రచనలోనైనా నిష్పాక్షిత, తటస్థదృష్టి తప్పనిసరిగా ఉండవలసిందే. అప్పుడే దానిని చరిత్ర అంటాం. చక్రధర్ ఆ రెంటినీ ప్రదర్శించారు కనుకనే ఈ పుస్తకాన్ని చరిత్రగా చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.

                                                            ***

    ‘ఈనాడు’ పుట్టుక తెలుగువార్తాపత్రికారంగంలో ఒక సంచలనం, ఒక స్ఫూర్తి, ఒక వరవడి; ఒక్క కోణంలో కాదు, అనేక కోణాలలో! 1974లోనే అనుకుంటాను, రాజమండ్రిలో నేను ఈనాడును మొదటిసారి చూసిన సందర్భం ఇప్పటికీ నా జ్ఞాపకాలలో పచ్చిగానూ, పచ్చగానూ ఉంది. అందులోని భాష అంతవరకూ నాకు తెలిసిన పత్రికాభాషకు భిన్నంగా కొత్తగా, మత్తుగా ఉండి మరోప్రపంచం వాకిట నిలబెట్టింది. పత్రికాభాష ఇలా కూడా ఉండవచ్చునా అనుకుంటూ థ్రిల్ అయిపోయాను. ఆ భాషను అలా మలచిన చేతులు వైజాగ్ ఎడిషన్ సంపాదకులుగా ఉన్న ఏబీకే ప్రసాద్ వీ, ఉపసంపాదకులవే అనడంలో సందేహం లేదు. అయితే పత్రిక యజమానిగా రామోజీరావు అభిరుచీ, దార్శనికతా కూడా దానివెనుక ఉంటాయన్నదీ అంతే నిస్సందేహం. అచిరకాలంలోనే హైదరాబాద్ ఎడిషన్, ఆ తర్వాత విజయవాడ ఎడిషన్ మొదలై సర్క్యులేషన్ శరవేగంతో పెరిగిపోవడం వెనుకా; అప్పటికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రప్రభను దాటిపోవడం వెనుకా యజమానిగా రామోజీరావు కార్యదక్షత, వ్యూహ కుశలత, వ్యాపారనైపుణ్యం, అలుపెరుగని పరిశ్రమా అంతే నిర్వివాదాలు.

    రామోజీరావుకు చెందిన ఈ సానుకూల, ఉజ్వల పార్శ్వాన్ని చక్రధర్ ఈ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగానే చిత్రించారు. రామోజీరావు ఈనాడు ప్రారంభించడం కాకతాళీయమే కావచ్చు, ప్రారంభించిన తర్వాత మాత్రం దానిని చాలా సీరియస్ గా తీసుకున్నారు, పూర్తి సమయం దానికే ఇచ్చారు; పూర్వరంగంలో వి. హనుమంతరావు, పొత్తూరి వెంకకటేశ్వరరావు వంటి సీనియర్ పాత్రికేయులతో రోజుల తరబడి చర్చలు జరిపారు. తాను యజమానిగా కాక, వారి కుటుంబశ్రేయస్సును కాంక్షించే మిత్రునిగా వ్యవహరించి వారి మనసు గెలుచుకున్నారు.

    క్రమంగా రాంభట్ల కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ లాంటి సీనియర్ పాత్రికేయ, పండిత ప్రముఖులను కూడా సంస్థలోకి తీసుకున్నారు. ఇతర పత్రికలకు భిన్నంగా పత్రికను ఎలా తీర్చిదిద్దవచ్చునన్న ఆలోచన అహర్నిశలూ చేశారు, ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలను క్షణం ఆలస్యం చేయకుండా అమలులోకి తెచ్చారు. వాటిని సాకారం చేయగల సిబ్బందిని ఎంచుకోవడంలో ఎంతో నేర్పు చూపించారు. పత్రిక కంటెంట్ లో కొత్తదనం తెచ్చే ప్రయత్నంలో సంపాదకబృందంలో పూర్తిస్థాయిలో భాగస్వామి అయ్యారు. రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రూపు అలా ఏర్పడింది. సొంతంగా శిక్షణ ఇచ్చి సిబ్బందిని తయారు చేసుకోడానికి జర్నలిజం కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా టాబ్లాయిడ్లు తెచ్చి స్థానిక వార్తలకు ఎన్నడూ లేనంత చోటు ఇచ్చారు. ఇలాంటి అనేక ప్రారంభాలు ఇతర పత్రికలకు వరవడి అయ్యాయి.

    రోజూ పత్రికను మొదటి పేజీనుంచి చివరి పేజీవరకూ క్షుణ్ణంగా చదివేవారు, లోపాలను గుర్తించేవారు, సూచనలు చేసేవారు. ఉపసంపాదకుల బుజాల మీద చేతులు వేసి నడిచారు. మాలోని మనిషే, మా మనిషే అనిపింపచేశారు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన తాడి ప్రకాష్ తదితరుల అనుభవాల దృష్ట్యా చూస్తే, రామోజీరావులో నిస్సందేహంగా ఒక ఎడిటర్ ఉన్నాడు. ఏది వార్తో, ఏది వార్త కాదో; ఏ వార్త ఎక్కడ, ఎంత ఉండాలో నిర్ణయించడమే మౌలికంగా ఎడిటింగ్ అంటే. ప్రాచీనసంస్కృత ఆలంకారికుడు క్షేమేంద్రుడు దానినే ఔచిత్యం అన్నాడు. వార్తలకు సంబంధించిన ఆ ఔచిత్యస్పృహ రామోజీరావులో ఉంది. ఆవిధంగా తన పత్రికకు ప్రధానసంపాదకు డనిపించుకునే ప్రాథమిక అర్హత ఆయనకు ఉందని ఈ పుస్తకం ద్వారా కూడా అర్థమవుతుంది.

    ***

    అయితే ఆయన ప్రధానంగా యజమానే కానీ, పాత్రికేయుడు కాదు. ఏళ్ల తరబడి డెస్క్ లో కూర్చుని, వార్తలను అనువదించి, అనువదింపజేసి, ఎడిట్ చేసి, పేజీలు పెట్టించిన; లేదా వార్తలను రిపోర్ట్ చేసిన, రాయడం తెలిసిన వర్కింగ్ జర్నలిస్టు కాదు.

    ఆ పనుల్లో శిక్షణ, అనుభవం పొందినవారు, వాటికే అంకితమైనవారు, అందులోనే నలిగినవారు వేరే ఉన్నారు. వారికి ఆ పనులు తప్ప ఇంకేమీ తెలియవు, అక్కర్లేదు కూడా. అంతేకాదు, పత్రికారంగం మిగతారంగాల కంటే భిన్నమైనది. ఏవో విలువల కోసం, ఏవో ఆదర్శాలకోసం ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మొదట్లో అలాంటివి లేకపోయినా ఈ రంగంలోకి వచ్చాక అవి అలవడేవారూ ఉంటారు. భారతరాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యం, వాక్స్వాతంత్ర్యం లాంటి ప్రాథమికహక్కులు వగైరాలతో నేరుగా ముడిపడిన రంగం కనుక సిబ్బందిలో ఆ స్పృహ, ఆ చైతన్యం సహజంగానే పెంపొందుతాయి. సంస్థలో వాటికి అనుగుణమైన వాతావరణం లోపించినప్పుడు వృత్తికి, వాస్తవానికి మధ్య తలెత్తే వైరుధ్యం క్రమంగా ఊడలు దన్నుకుని అసంతృప్తికి, అభద్రతకు దారితీస్తుంది.

    రామోజీరావు ఈనాడుతోనే ఎంతగా మమేకమైనా, ఈనాడు నిర్వహణలోనే ఆత్మానందం పొందినా ఆయనకు వేరే వ్యాపారాలు, వేరే ఆసక్తులు, వేరే జీవితమూ ఉన్నాయి. అలాంటి వ్యక్తి తన పత్రికకు తనను చీఫ్ ఎడిటర్ గా పేర్కొనడం ఆయనకూ, సిబ్బందికీ మధ్య కలతలకు తొలి బీజం అయిందా అన్న భావన చక్రధర్ పుస్తకం ద్వారా కలుగుతుంది. పత్రికాజీవితం తప్ప ఇంకో జీవితం లేని వ్యక్తికి దక్కాల్సిన ఆ స్థానాన్ని యజమానిగా తను లాక్కున్నట్టయింది. “రాయడం రాని రామోజీరావుకు సంపాదకుడిగా పద్మవిభూషణ్” ఇచ్చా”రని ఈ పుస్తకరచయితకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎ.బి.కె. ప్రసాద్ నిష్ఠురంగా అంటారు.

    వర్కింగ్ జర్నలిస్టుగా అనుభవం ఉన్న వ్యక్తికి దక్కాల్సిన సంపాదకపదవిని యజమానే తీసుకోవడం ఒక విచిత్ర, విలక్షణ, విపరీతపరిస్థితికి దారితీసిందా అనిపిస్తుంది. ముగ్గురు, నలుగురిని ఎడిటర్లుగా తీసుకున్నారు కానీ వారి పాత్ర తెరవెనుకకే పరిమితమైంది. పత్రికావిధానరూపకల్పనలో వారికి అధికారికమైన పాత్ర లోపించింది. అంతవరకు తెలుగు పత్రికారంగానికి బాగా పరిచితమైన మోడల్ ఒకటి ఉంది. అది, రామ్ నాథ్ గోయెంకా యాజమాన్యంలోని ఆంధ్రప్రభ-ఇండియన్ ఎక్స్ ప్రెస్ మోడల్. అందులో యజమాని, సంపాదకుడు వేర్వేరుగానే ఉన్నారు తప్ప యజమానే సంపాదకుడు కాలేదు. ఎడిటోరియల్ కంటెంట్ కు సంబంధించినంతవరకూ సంపాదకుడిదే పూర్తి నిర్ణయాధికారం. ఆవిధంగా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఆ క్రమంలో పత్రికకు ఒక వ్యక్తిత్వాన్ని సంతరించే స్వేచ్చా, వెసులుబాటు సంపాదకుడికి లభించాయి. పత్రికావిధానంలో యజమాని జోక్యం చేసుకుంటున్నారా అన్న అనుమానం అణుమాత్రం కలిగినా సంపాదకుడు రాజీనామాకు సిద్ధపడిన ఘట్టాలు, అప్పుడు యజమాని వెనక్కి తగ్గి సముదాయించిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రభ దిన, వారపత్రికలు రెండింటికీ సంపాదకులుగా ఉన్న పొత్తూరి వెంకటేశ్వరరావే రెండుసార్లు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. రామ్ నాథ్ గోయెంకా అనంతరకాలంలో యజమానితో ఏర్పడిన వైరుధ్యం కారణంగానే జి. శ్రీరామమూర్తి ఆంధ్రప్రభ సంపాదకపదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు.

    అయితే, రామ్ నాథ్ గోయెంకా పాటించిన మోడల్ కూడా ప్రమాదరహితం కాదు. యాజమాన్యం దూరంగా ఉన్న పరిస్థితిలో ఎడిటర్లు, మేనేజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పత్రికను భ్రష్టుపట్టించిన ఉదాహరణలున్నాయి. కానీ ఇందులో ఒక వెసులుబాటు ఉంది. ప్రమాదాన్ని ఆలస్యంగానైనా పసిగట్టి ఎడిటర్లను, మేనేజర్లను తొలగించే అవకాశం యాజమాన్యానికి ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా యాజమాన్యాన్ని తొలగించే అవకాశం ఎడిటర్లకు, మేనేజర్లకు ఉండదు.

    పత్రిక కంటెంట్ ను సంపాదకుడి నిర్ణయానికి విడిచిపెట్టకుండా తనే నిర్దేశించడం రామోజీరావు వైజాగ్ లో ఈనాడును ప్రారంభించిన దశనుంచే మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. సంపాదకీయం లేకుండా పత్రిక తేవాలన్న నిర్ణయం వాటిలో ఒకటి. అది సంపాదకుడిగా ఉన్న ఎ.బి.కె. ప్రసాద్ ను సంప్రదించి, ఆయన ఆమోదంతో జరిగిన నిర్ణయం కాదని చక్రధర్ పుస్తకంద్వారా అర్థమవుతుంది. “ఎడిట్ పేజీ ఉన్నా ఆరునెలలవరకూ సంపాదకీయం మాత్రం ఉండేది కాదు. నేను ఏం రాస్తానో నన్న భయంతో నన్ను రాయనివ్వకుండా నిరుత్సాహపరిచేవారు” అంటారు ఏబీకే. ఆయనే ఇంకా ఇలా అంటారు:

    “సమకాలీనవిషయాలపై పత్రిక అభిప్రాయమేమిటో తెలుసుకునేందుకు ఎడిటోరియల్ ను ప్రవేశపెట్టాలని పాఠకులనుంచి పెద్దసంఖ్యలో ఉత్తరాలు రావడం మొదలైంది. ఈ విషయాన్ని రామోజీ దృష్టికి తెచ్చాను.

    “నువ్వు ఎడిటోరియల్ రాయి. నేను సంతకం పెడతాను”, అని అన్నారు రామోజీరావు.

    “అటువంటి అలవాటు లేదు, ఆ పని చేయలేను’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. ఆరునెలల తర్వాత రామోజీ సంతకం లేకుండానే సంపాదకీయాలు రాయడం మొదలు పెట్టాను”.

    సంపాదకీయం లేకుండా చేయడమంటే సంపాదకుడికి, అతని గొంతుకు గుర్తింపు లేకుండా చేయడమే. సంపాదకీయంతోనే సంపాదకుడు ఎటువంటివారో, పత్రిక ఎటువంటి విధానాన్ని అనుసరిస్తోందో తెలుస్తుంది. ఒక వ్యక్తి అభిప్రాయాలు అతనికి ఒక వ్యక్తిత్వాన్ని ఎలా కల్పిస్తాయో, సంపాదకీయరూపంలో ప్రకటించే అభిప్రాయాలు పత్రికకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాయి. సంపాదకీయమూ, సంపాదకుని ముద్రా లేని పత్రిక కేవలం వార్తల కూర్పు మాత్రమే అవుతుంది. మొదట్లో సంపాదకీయం వద్దనుకున్న రామోజీరావు తర్వాత సంపాదకీయాన్ని ప్రవేశపెట్టారు.

    ప్రత్యేకంగా ఒకరిని సంపాదకుడిగా నియమించకపోవడం యజమాని సర్వంసహాధిపత్యానికి దారితీసి మరిన్ని విపరీతాలకు, విలక్షణపరిస్థితులకు దారి తీసిందన్న భావన ఈ పుస్తకం అడుగడుగునా కలిగిస్తుంది. ఉదాహరణకు, పత్రికకు  సంపాదకుడు అనే ఒక వ్యక్తి విడిగా ఉండి ఉంటే ‘కింగ్ మేకర్’ శీర్షికతో ఈ పుస్తకంలో భాగమైన అయిదవ అధ్యాయం ఉండేదా, ఉన్నా ఏ రూపంలో ఉండేదన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈనాడు పత్రిక తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ పార్టీతో దాదాపు ప్రత్యక్షంగా ఎలా మమేకమైందో ఈ అధ్యాయం వివరిస్తుంది:

    “చైతన్యరథంపై ఎన్టీఆర్ దూసుకువెడుతుంటే తెరవెనుక ఈనాడు అన్నిరకాల అండదండల నిచ్చింది. ఎన్టీఆర్ కోసం ఉపన్యాసాలు సిద్ధం చేయించి అందజేసింది. చైతన్యరథం ఒక జిల్లానుంచి మరో జిల్లాలోకి ప్రవేశిస్తుంటే ఈనాడు ప్రతినిధి చైతన్యరథంలో ఎన్టీఆర్ ను కలిసి ఆ జిల్లాకు సంబంధించిన స్థితిగతులను, సమస్యలను సమగ్రంగా వివరిస్తూ నోట్ అందజేసేవారు. ఎన్నికల సర్వే అని చెప్పకపోయినా ప్రజాభిప్రాయసేకరణ పేరిట తన విలేకరుల యంత్రాంగం ద్వారా సమాచారాన్ని సేకరించింది ఈనాడు. ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయో మదింపు చేసి అభ్యర్థుల జాబితాను రూపొందించింది. బేగంపేట చికోటి గార్డెన్ లోని రామోజీ నివాసంలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగింది.”

    యజమానే సంపాదకుడు కాకుండా పాత్రికేయనేపథ్యం ఉన్న వ్యక్తే సంపాదకుడిగా ఉండి ఉంటే; యాజమాన్యం పత్రికను, సిబ్బందిని ఇలా ఒక పార్టీ అవసరాలకు బాహాటంగా వాడుకుంటున్నప్పుడు ఆరోవేలే అయ్యేవాడు. మరి వ్యక్తిత్వాన్ని, వృత్తిత్వాన్ని చంపుకుని ఆరోవేలుగా ఉండడానికి ఆనాడు ఎంతమంది సంసిద్ధులయ్యేవారు?!

    యజమానే సంపాదకుడు కావడం విలువలనే కాదు, నిర్వచనాలను కూడా తిరగరాసింది. మాటకు, చేతకు మధ్య విపరీత అంతరాన్ని బొమ్మ కట్టింది. ఉదాహరణకు, పత్రికలకు ఉండవలసింది ‘పాఠకు’ల పట్ల బాధ్యతే కానీ ‘ప్రజ’లపట్ల బాధ్యత కాదు. పత్రికల సందర్భంలో ఈ రెండు మాటల మధ్య ఉన్న సూక్ష్మభేదాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వార్తలరూపంలో నికార్సైన నిజాలు చెప్పడం; సంపాదకీయాలు, వ్యాసాలరూపంలో రాష్ట్ర, దేశ, ప్రపంచగమనాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడడం పత్రిక కొని చదివే పాఠకుల పట్ల పత్రికల బాధ్యత. ఏదో ఒక పార్టీకి కరపత్రంగా వ్యవహరిస్తే అది ఆ పార్టీ క్యాడర్ కు పనికొస్తుంది కానీ, సాధారణపాఠకులకు కాదు.

    కానీ విచిత్రంగా రామోజీరావు తన పత్రిక బాధ్యత పాఠకులపట్ల అనరు; ప్రజలపట్ల అంటారు. ఉదాహరణకు, 1985 జూన్ 30న ఇండియా టుడే ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ, ఎన్టీఆర్ కు మద్దతిచ్చే విషయంలో మీ వైఖరిని ఎందుకు మార్చుకున్నారని అడిగినప్పుడు,“ఆంధ్రప్రదేశ్ లో రాజకీయవ్యవస్థను ప్రక్షాళన చేస్తారనే ఎన్టీఆర్ కు మద్దతు ఇచ్చాం. ఇందుకు భిన్నంగా  ఇందిరాగాంధీని ఏ నిరంకుశ, ఒంటెత్తుపోకడల కారణంగా వ్యతిరేకించానో అదే బాటలో ఎన్టీఆర్ కూడా నడుస్తున్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించగలిగినా బాధ్యత అప్పగించడానికి సిద్ధంగా లేరు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. నా ఆబ్లిగేషన్ ఆయనతో కాదు, ప్రతి ఉదయం నా పత్రిక చదివే ప్రజల పట్ల ఆబ్లిగేషన్ ఉంది” అని రామోజీరావు అంటారు. ఇంకో సందర్భంలో, “ప్రజాప్రయోజనం ముందు, రాష్ట్రప్రయోజనం ముందు వ్యక్తుల ప్రయోజనం తక్కువ. ఈ రెండింటికీ మధ్య తేడా వస్తే నా ప్రాధాన్యం ఎల్లప్పుడూ ప్రజలవైపే” నంటారు.

    మాటి మాటికీ ‘ప్రజలు’, లేదా ‘నా ప్రజలు’ అనడం రాజకీయనాయకుల పరిభాష. ఆయనే చీఫ్ ఎడిటర్, ఆయనే యజమాని అవడంతో ఈ రెండు మాటల మధ్య తేడాను ఆయన దృష్టికి తెచ్చే సాహసం ఎవరూ చేసి ఉండరు. అలాగే, వివిధ సందర్భాల్లో ఆయన సంతకంతో వచ్చిన సంపాదకీయాలు రాసినవారు కూడా కేవలం ఆయనను మెప్పించడమే లక్ష్యంగా పదాడంబరాన్ని దట్టించినట్టు కనిపిస్తుంది. వాటిల్లోని రాతకు, వాస్తవానికి మధ్య విపరీత అంతరం వెక్కిరిస్తూ ఉంటుంది. చక్రధర్ ఈ పుస్తకంలో అలాంటి ఉటంకింపులను ఏరి కోరి పొందుపరచడం కనిపిస్తుంది. రాతలో శిక్షణ పొందిన, రాతతో పెరిగిన, నలిగిన పాత్రికేయుడు పదప్రయోగంలో ఇలాంటి ‘స్వేచ్ఛ’ తీసుకోలేడు; అతని శిక్షణ అందుకు అనుమతించదు.

    ‘రాయడం’ గురించిన రామోజీరావు ఫిలాసఫీని చక్రధర్ ఇలా వివరిస్తారు: “మనం ఇతరుల చేత రాయించి వాటిలోని మంచి చెడులను బేరీజు వేయాలే కానీ మనమే రాస్తూ కూచోకూడదు. అది సమర్థవంతమైన యాజమాన్యలక్షణం కాదు”. తన రెండవ కుమారుడు సుమన్ కు ఆయన చేసిన హితబోధ ఇది. తను రాయకుండా, ఇతరుల చేత రాయిస్తూ, వారిని అదుపాజ్ఞలలో ఉంచుకుంటూ, తను కోరినట్టు వారిచేత రాయించుకోవడమే యాజమాన్య లక్షణమన్న రామోజీరావు నమ్మకమే బృహత్ స్థాయిలో పత్రిక సిబ్బందికీ-ఆయనకూ మధ్యా; సూక్ష్మస్థాయిలో ఆయన రెండవ కుమారుడికీ-ఆయనకూ మధ్యా సమస్యలను, కలతలను సృష్టించినట్టు అనిపిస్తుంది. ఆయన సంపాదకులుగా నియమించినవారితో సహా అనేకమంది సీనియర్ జర్నలిస్టులు ఒక్కొక్కరే అనతికాలంలోనే తప్పుకోవడానికి ఈ ఫిలాసఫీయే కారణమైందేమోననిపిస్తుంది.

    ***

    రామోజీరావు చక్కని మనస్తత్వవిశ్లేషణాంశంగా ఈ పుస్తకంలో కనిపిస్తారు. ఆయన ఎదుటివారి కష్టాలకు కరిగి కన్నీరు పెట్టగలరు. తను యజమాని నన్న భేషజానికి పోకుండా సహచరుల ఇంటి శుభకార్యాలను కూడా తన ఇంటి కార్యాలుగా భావించి సహకరించగలరు; వారికి కష్టమొస్తే తనున్నానని భరోసా ఇవ్వగలరు. దివిసీమ ఉప్పెనతో బతుకులు కకావికలైన జనాల బాధామయగాథలను రాసి తను వినిపిస్తుంటే రామోజీరావు కళ్ళు అశ్రుసిక్తమయ్యాయని  ప్రముఖరచయిత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ అంటారు. అలాగే, తన కుమార్తె పెళ్లికి రిసెప్షన్ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని డెకరేషన్ మొదలు భోజనం ఏర్పాట్లవరకు ప్రతి పనినీ దగ్గరుండి చూసుకున్నారని న్యూస్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసిన ఎస్. ఆర్. రామానుజన్ చెబుతారు. తను స్కూటర్ మీంచి పడి కాలర్ బోన్ విరిగి ఆసుపత్రి పాలైతే, సతీసమేతంగా ఆసుపత్రికి వచ్చి చూసి తన దిండు కింద పర్సు ఉంచిన వైనాన్ని పొత్తూరి వెంకటేశ్వరరావు చెబుతారు.

    అదే సమయంలో, ఏ తప్పూ లేకపోయినా, చిన్న తప్పే అయినా, ఎంత చిన్న ఉద్యోగినైనా సరే, ఏ మాత్రం కనికరం లేకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడి, ఒక పథకం ప్రకారం వారిని బయటికి పంపినట్టుగా ఈ పుస్తకంలో ఎత్తిచూపిన ఉదంతాలు, యజమానిలో పైన చెప్పిన ఉదాహరణలకు పూర్తిగా భిన్నమైన పార్శ్వాన్ని చూపించి దిగ్భ్రమ కలిగిస్తాయి. బాధితులు ఎదుర్కొన్న జీవనసంక్షోభాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎడిటోరియల్ మీటింగ్ లో సూచనలు, సలహాలు ఇవ్వండని యజమాని స్వయంగా అడిగినప్పుడు, కుర్చీలు సరిపోవడం లేదని, మంచినీళ్ళకూ సమస్యగా ఉందనీ చెప్పడం, ఒక ఉద్యోగి చేసిన పెద్ద నేరం. అతనికి పొగ బెట్టి పంపించడానికి వేసిన పథకానికి కలిసిరాకపోవడం ఇంకొక డెస్క్ ఇంచార్జి చేసిన పెద్ద తప్పు. కేవలం టెన్త్ మాత్రమే చదివిన వేరొక చిరుద్యోగిని రాసి రంపాన పెట్టిన తీరు, అతని వీరోచితపోరాటం యాజమాన్యం స్థాయిని పూర్తిగా నేలబారుకు దింపి చూపించిన ఇంకొక విషాదాధ్యాయం.

    ‘పన్నెండేళ్ళ నరకం’ అనే శీర్షికతో చక్రధర్ తన ఈనాడు జీవితానుభవాన్ని రాసుకున్నారు. సహజంగానే ఏ ప్రైవేట్ సంస్థలోనైనా ఉద్యోగభద్రత ఉండదు. అభద్రతకు తోడు పాత్రికేయజీవితంలో పని ఒత్తిడులు, షిఫ్టు డ్యూటీలు, వాటిలో భాగంగా నైట్ డ్యూటీలు, అవి తెచ్చే శారీరక, మానసిక ఆరోగ్యసమస్యల వంటి అదనపు సమస్యలు కూడా ఉంటాయి. చిన్న పొరపాటుకు కూడా పెద్దశిక్ష వేసే సంస్థలో అభద్రతాభావం మరింతగా జడలు విరబోసుకుని నిత్యజీవితాన్ని భయగ్రస్తం చేస్తుంది. తెలియకుండా ఎక్కడ ఏం తప్పు జరుగుతుందో, ఏ క్షణాన ఉద్వాసన ఉత్తర్వు వస్తుందో నన్న బెదురు నీడలా వెన్నాడుతూ ఉంటుంది. యజమానినుంచి పిలుపు వస్తే చాలు, కాళ్ళ కింద నేల కంపించిపోయినట్టు అనిపించే అనేక సందర్భాలను, అనేకుల ఉదంతాలను చక్రధర్ ఈ పుస్తకంలో దండగుచ్చారు. ‘రిజైన్ చేస్తా’ నని ఉద్యోగితోనే అనిపించి సాగనంపడం యజమాని ‘నేర్పు’గా ఆయన పేర్కొంటారు. యజమాని గదినుంచి బయటికి రావడానికి ముందే ఆ ఉద్యోగి అకౌంట్ సెటిలై పోయి ఉంటుంది.

    అంచెలంచెలలో ఉండే వేగుల వ్యవస్థ ఉద్యోగుల ప్రతి కదలికనూ దుర్భిణితో చూస్తుందని, ఏ ఇద్దరి మధ్యా ఏ రహస్యసంభాషణకూ ఎలాంటి అవకాశమూ ఉండదని, గోడలకు చెవులుంటాయన్న నానుడి ఇంతగా నిజమవడం ఇంకెక్కడా చూడమన్న అభిప్రాయాన్ని ఈ పుస్తకం చదివితే కలిగిస్తుంది. ఉద్యోగుల భౌతిక, మానసిక భద్రతకు అన్నివిధాలా భరోసా కల్పించి తద్వారా యజమానిగా తను భద్రత పొందాలని రామోజీరావు అనుకోలేదనీ; ఉద్యోగులనుంచి తను అభద్రతను ఊహించుకుంటూ తద్వారా వారిని అభద్రతలో ఉంచారని అనిపిస్తుంది. ‘క్రమశిక్షణ’ శ్రుతిమించి ‘క్రమశిక్ష’గా మారినట్టు స్పష్టమవుతుంది.

    వేజ్ బోర్డులు సిఫార్సు చేసిన వేతనాలను ఇవ్వకపోవడంతో ప్రారంభించి ఇటీవలి కరోనాను పురస్కరించుకుని ఉద్యోగులను తొలగించడంవరకూ- ఏ ఘట్టంలోనూ యజమాన్యం ఉద్యోగుల శ్రేయస్సును పట్టించుకోలేదని ఈ పుస్తకరచయిత అంటారు.

    రామోజీరావు చిత్రణ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇలా ఉంటుంది:

    “జీవితం ప్రారంభదశలో ఉన్న వాళ్ళని తీసుకుని వారిని తీర్చిదిద్దుకోవడం దీర్ఘకాలంలో సంస్థకు ప్రయోజనకరమని నేను నమ్ముతాను. సిబ్బంది నియామకంలో కూడా సకల జాగ్రత్తలు తీసుకుంటాను. ఇది సొంతసంస్థ అన్న భావన కలిగించడానికి ప్రయత్నిస్తాను. సిబ్బందితో నిరంతరం సంబంధాలు కలిగి వారిని కర్తవ్యోన్ముఖుల్ని చేయడం నా ఆచరణ విధానం. అన్నింటికీ మించి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం ఈ వర్క్ కల్చర్ కు దోహదపడింది”

                                                             ***

    372 పేజీల పుస్తకంలో నేనిక్కడ స్పృశించినవి చాలా కొన్ని అంశాలు మాత్రమే. ఇంకా అనేకానేక విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఒక పత్రికాధిపతి మీద ఇలాంటి పుస్తకం తెలుగులో ఇదే మొదటిది. రామోజీరావుజీవితంలోని ఒకటిరెండు మిస్సింగ్ లింక్ లను తడిమి, ప్రశ్నలు రేకెత్తించడంలో రచయిత అనితరమైన సాహసాన్ని చాటారు. స్వానుభవానికి ఎంతో విషయసేకరణను జోడించి ఎందరినో ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకం వెలువరించారు.

    మొదటే చెప్పినట్టు ఇది కొంతవరకు రామోజీరావు వ్యక్తిగత, కుటుంబగత, వ్యాపారగత చరిత్రే కాక; ఈనాడు చరిత్ర కూడా. ఈనాడుతో సహా పత్రికలూ, ఎలక్ట్రానిక్ మీడియా ఎంతోమంది వ్యక్తుల జీవితాలలోని చీకటి-వెలుగులు రెండింటి మీదా ఫోకస్ చేస్తూనే ఉంటాయి. అదే పనిని చక్రధర్ ఈ పుస్తకరూపంలో చేశారు; అంతే తేడా. ఇప్పుడు కాకపోతే రేపైనా ఎవరో ఒకరు ఈ చరిత్రను ఇలా నమోదు చేస్తారు. చక్రధర్ ఇప్పుడే చేశారు, అంతే తేడా.

    అయితే, ఈ పుస్తకం నాణేనికి ఒక వైపు మాత్రమే; ఒక ఈనాడు మాజీ ఉద్యోగి వెర్షన్ మాత్రమే. దీనికి అవతలి వెర్షన్ కూడా ఉంటుంది. ఆ వెర్షన్ ను ముందుకు తేవడానికి ఎవరైనా పూనుకుంటారో లేదో తెలియదు. మౌనమూ, ఉపేక్షా దీనికి సరైన సమాధానం కాబోవు. మోడల్ తేడాను పక్కన ఉంచితే, ఒక పత్రికాసామ్రాజ్యనిర్మాణంలో రామోజీరావు రామ్ నాథ్ గోయెంకాకు తెలుగు ప్రతిరూపం. పత్రికారంగంలో ఆయన జైత్రయాత్ర తప్పకుండా అక్షరబద్ధమై చరిత్రగా మిగులుతుంది. అది పత్రికాస్వభావానికి అనుగుణంగా ఇలా బ్లాక్ అండ్ వైట్ చిత్రం కావడమూ సహజమే.

    ఈ పుస్తకం ఖరీదు 300/- ; గోవిందరాజు చక్రధర్ మొబైల్ నెం: 9849870250.

     -కల్లూరి భాస్కరం

    Books Kalluri Bhaskaram
    Previous Articleఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు!
    Next Article హవాయి నుంచి కెనడా దిశగా కార్చిచ్చు..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.