శరణాగతి
శరణాగతి భగవంతుని పట్ల రెండు విధాలుగా ఉంటుంది.
నేను భగవంతుడి వాడను, భగవంతుడు నావాడు అనేవి.
అప్పుడు శరీరం పట్ల, ప్రాణం పట్ల, మనసు పట్ల నాది అనే భావం ఉండదు...
శరణాగతుడైన భక్తుడు తన కోసం చేసుకునేదేదీ ఉండదు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు
‘మామేకం శరణం వ్రజ’
అని అంటాడు.
అంటే వేరు వేరు భావాలు మనసులో ప్రవేశించనీయక నన్ను శరణు కోరండని భగంతుడే మనకు స్వయంగా చెప్పాడు.
అప్పుడు భగవంతుడు శరణాగతి అన్న వారి బాగోగులు తానే స్వయంగా చూసు కుంటాడు.
కౌరవ సభలోకి ద్రౌపదిని, దుశ్శాసనుడు ఈడ్చుకు వచ్చాడు, ద్రౌపది తన శక్తి కొద్దీ పెనుగులాడింది.
తనలో శక్తి ఉడిగిన స్థితిలో ఇక తనకు శ్రీకృష్ణుడే శరణ్యం అని భావించింది...
‘అన్నా.. నా ప్రయత్నాలు ఏవీ ఫలించటం లేదు.... మీరే శరణ్యం, అన్యధా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ’ అని ప్రార్థించగానే ద్రౌపది మాన సంరక్షణ బాధ్యత పూర్తిగా శ్రీకృష్ణుడే స్వీకరించాడు
దుశ్శాసనుడు చీరెలు లాగి లాగి అలసిపోయాడు. చీరెలు గుట్టలు గుట్టలుగా ఏర్పడ్డాయి, కాని ద్రౌపదికి ఎటువంటి అవమానం జరగలేదు, అదీ శరణాగతి ప్రభావం అంటే...
విభీషణుడు అధర్మం వైపు ఉండలేక, తన సోదరుడి చేత అవమానానికి గురై, మూర్తీభవించిన ధర్మ స్వరూపమైన రాముని శరణు వేడాడు.
అయితే అతను ఏదో దురుద్దేశంతో తమ వద్దకు వచ్చాడని, శరణు వేడినట్లు నటిస్తున్నాడని అనుమానించారు రామునితో ఉన్న పరివారం.
అయితే రాముడు వారిని వారించి ‘కపట జీవి, దుష్టుడు నేరుగా
నా సముఖానికి రాలేడు.
నిర్మల హృదయుడు మాత్రమే నన్ను వేడగలడు’ అని అన్నాడు.
విభీషణుని శరణాగతికి ముగ్దుడైన రాముడు, నిన్ను లంకా పట్టణానికి రాజుగా పట్టాభిషిక్తుని చేస్తానని వరం ఇచ్చాడు, విభీషణునిలోని సమదర్శత శరణాగతికి కారణమయింది.
మరో విషయంపరిశీలిద్దాము,
ఒక పర్యాయం రాముడు, సీత ఉద్యానవనంలో అసీనులై ఉండగా, హనుమంతుడు వారిని సేవిస్తూ ఉన్నాడు...
అక్కడ ఎంతో అందంగా ఉన్న చెట్టును వారు చూశారు, అందునా దానికి ఒక తీగ అల్లుకుని మరింత శోభాయమానంగా కనిపిస్తోంది...
'ఈ లత వల్లనే వృక్షానికి శోభ వచ్చిందని 'రాముడు అన్నాడు.
'వృక్షమనేదే లేకుంటే తీగకు విలువ ఏముందని 'సీతాదేవి పలికింది.
వెంటనే హనుమను చూసి వృక్షమే గొప్పది కదా అని ప్రశ్నించింది సీతాదేవి.
అప్ఫుడు హనుమంతుడు ‘క్షమించమ్మా, నాకు వేరే విధంగా అనిపి స్తోంది అన్నాడు...
'నాకు చెట్టు నీడ, దానిని అల్లుకుని ఉన్న తీగె, పూల సువాసన రెండూ దేనికవే సాటి, ఆ రెండూ నాకు బాగుంటాయ’ని చెప్పాడు...
దీనిలో మర్మగర్భంగా హనుమంతుని భావం ఏమంటే, మీ సీతారాముల నీడలో నాకు బాగుంటుంది అని...
ఏ ఒక్కరి చరణములను శరణు పొందినా తృప్తి పాక్షికమే, మీ ఇద్దరి శరణు పొందితేనే సౌఖ్యం అని.
ప్రకృతి, పురుషుల పట్ల శరణాగతి కలిగి ఉండటం సర్వోత్తమం.
భగవంతుని శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు.
ఎందుకంటే మనసు, బుద్ధి అన్నీ ఆయనకే ఆర్పిస్తాడు.
నిర్భయంగా ఉంటాడు.
మృత్యువుకు భయపడడు. భగవంతుని చరణాలు వీడడు.
అతనికి శోకమనేది తెలియదు, జరిపించేది భగవంతుడు కనుక ఫలితం నాది కాదు భగవంతునిదే అని భావించడం వల్ల శోకమనేది దరి చేరదు.
భగవంతుని శరణు వేడడం వల్ల మనలో గూడు కట్టుకుని ఉన్న సంశయాలన్ని పటాపంచలవుతాయి.
ముక్తి అనే భావన ఒకటే మిగిలిపోతుంది.
సందేహాలు దూరమవుతాయి. శరణాగతుడైన భక్తుడు
ఎప్పుడూ పరీక్షలకు గురవడు.
భగవంతునికి తనను తాను దత్తం చేసు కున్న తరువాత
భక్తుణ్ని పరీక్షించేందుకు వారి వద్ద తమకంటూ ఏమీ ఉండదు.
కనుక ముముక్షువు అయినవాడు శరణాగతి భక్తినే ఆశ్రయిస్తాడు...
కూర్పు :- పులివర్తి కృష్ణమూర్తి