Telugu Global
Arts & Literature

కోరికలు... వరాలు..!

కోరికలు... వరాలు..!
X

పుత్రభిక్ష వరం....

ఆ పుత్రుడు ప్రయోజకుడు కావాలని చేసే ప్రార్థన కోరిక....

ప్రపంచంలో కోరికలు కోరే భక్తులే ఎక్కువ.

వరాలు అంత సులభంగా లభించవు.

ముందు అర్హత సంపాదించాలి.

అది తపస్సు లాంటిదై ఉండాలి...

తపస్సుకు అనేక పరీక్షలుంటాయి. ప్రలోభాల వలలు ఉంటాయి.

మనం ఏ రంగంలో

ఎలాంటి కృషి చేసినా

అది తపస్సుతో పోల్చదగినదై ఉండాలి.

విద్యార్థులు చదువును తపస్సుగా భావిస్తే.. ఆ కృషి తీవ్రత వేరు. అందుకు లభించే ఫలితాలు కూడా అమోఘంగా ఉంటాయి.

అవి వరాలంత ఘనంగా ఉంటాయి. అవి అత్యున్నత స్థాయిలో, అత్యధిక జీతంతో వరించే ఉద్యోగాలు కావచ్చు..

సాధారణ స్థాయిలో ఆకతాయిగా ఆడుతూ పాడుతూ చదివే విద్యార్థి అత్తెసరు మార్కులతో సరిపెట్టుకోక తప్పదు. వారికి దక్కే ఉద్యోగమూ అంతే...

ఉద్యోగులు తమ పనిలో అంకితభావంతో, సంస్థ అభివృద్ధినే లక్ష్యంగా ఏకదీక్షగా కృషి చేసినప్పుడు, అది యజమాని గుర్తింపు, మెప్పును పొందుతుంది. ఉద్యోగి పదోన్నతికది పునాది అవుతుంది.

క్రీడాకారుడు తన దేహశక్తిని ద్విగుణీకృతం చేసుకుంటూ, మెలకువలు మెరుగు పరచుకుంటూ చేసే నిత్య అభ్యాసం సత్ఫలితాలు నిస్తుంది.

సాధకుడు ఆడంబరాల జోలికి పోకుండా ఆత్మానుభవం కోసం తపిస్తే, ఆత్మజ్ఞాని అవుతాడు.

ఇలా అన్ని రంగాల్లో కృషి ఫలాలు కమనీయంగా ఉంటాయి.

రాయిలా పడి ఉండే సోమరికి ఎలాంటి ప్రగతీ లభించదు. రాయి కూడా తనకు తానుగా శిల్పంగా మారదు. ఉలిని నైపుణ్యంగా ఉపయోగించగల చేతులు కావాలి. ఆ చేతులు ఆ శిల మీద కదలాడాలి. అలాగే శరీరం మనసు, బుద్ధి అనే కరద్వయం కృషిలో నిమగ్నం కావాలి. అది తపోదీక్షలా ఉండాలి.

తపస్సు అనగానే కాషాయ వస్త్రాలతో, కారడవుల్లో ముక్కు మూసుకుని చేసేదిగా అనుకోనవసరం లేదు. తపస్సు మనసుకు సంబంధించింది. శరీరం కేవలం ఉపకరణం మాత్రమే. ఏ స్థితిలో ఉన్నా మనసు లక్ష్యం మీదనే లగ్నమై ఉండాలి.

మన లక్ష్యం ఉన్నతంగా, ఉదాత్తంగా ఉండాలి...

మనం సరిగ్గా గమనించం కానీ, కృషికి పూనుకొన్నాక మనలో నిద్రాణంగా ఉన్న అమోఘ శక్తులు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతాయి. శాస్త్రజ్ఞుల పరిశోధనలన్నీ దీర్ఘ తపస్సులే. ఫలితాలన్నీ అంతర్యామి వరాలే..!

ప్రాపంచిక పరిధుల్ని దాటి,

మనసు జ్ఞానభూమిలోకి ప్రవేశించగానే

అనేక అద్భుత సత్యాలు పలకరిస్తాయి.

అవి ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి. వాటిని శోధించడంలోనే ఆలస్యం జరిగింది.

ఇంకా ఎన్నో అద్భుత సత్యాలు ఆకాశంలోని నక్షత్రాల్లా, సంజీవనీ మూలికల్లాగా కాంతులీనుతూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన సంపదలు. ఎంతో తపనతో గానీ లభ్యం కావు. అసలు తపస్సు అంటేనే అనంతమైన తపన.

తపన పరమాత్మ కోసమే అయినప్పుడు ఆయన వరాలివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏమి కోరాలి...?ఆయన అనంతుడు. అన్నీ అనంత పరిమాణంలో ఉంటాయి. నచికేతుడు యమధర్మరాజును ‘ఆత్మజ్ఞానం’ వరంగా అడిగినప్పుడు, అనేక ప్రలోభాలతో మోహితుణ్ని చేయాలని ప్రయత్నిస్తాడు. చివరకు నచికేతుడే గెలుస్తాడు

కుంతీదేవి… శ్రీకృష్ణ పరమాత్ముడి మాయనుంచి రక్షణను, అనన్య భక్తిని వరంగా కోరుతుంది. ఇలాంటి వరాలు కోరేవారు ఎంతో ధన్యులు. ఈ వరాలు ఎంత గొప్పవో అర్థం చేసుకుంటే, మనం కూడా అవే కోరతాం. ఎందుకంటే, అవి కోరినాక ఇక కోరదగిన వరాలు ఏమీ ఉండవు.

(సౌజన్యం :పులివర్తి కృష్ణమూర్తి )

First Published:  22 Jun 2023 5:38 PM IST
Next Story