పూజార్హమైన మట్టి గణపతి
పురాణేతిహాసాల్లో మట్టి గణపతి ప్రస్తావన ఉందా?
గణేశ పురాణంలో వినాయక చవితి విధానం చాలా విశేషంగా చెప్పారు. అదేవిధంగా ముద్గల పురాణంలో మనం అనుకునే కేవలం భాద్రపద శుద్ధ చవితి మాత్రమే కాకుండా మొత్తం సంవత్సరం అంతా వచ్చే 24 చవితులు ఎలా చేయాలో, ఒక్కొక్క చవితికి ఒక్కొక్క పేరు, పద్ధతి అన్నీ తెలియజేశారు.
అంతేకాదు !గణపతి మూర్తిని కేవలం మట్టితోనే కాకుండా ఉత్తమమైన ధాతువులతో, రత్నాలతో చేసి ఎలా ఆరాధించవచ్చోపద్ధతి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా శిలతో, సువర్ణము, రజతము ఇత్యాది ఉత్తమ ధాతువులతో చేసే పద్ధతి, రత్నాలతో గణపతిని చేసే పద్ధతి ఉన్నది.
కుజ గ్రహ సంబంధమైన ప్రవాళ గణపతి అంటే పగడంతో చేసే గణపతిని ఆరాధించడం ఇలాంటివి రకరకాల పద్ధతులు మనకి పురాణాలు, ఆగమశాస్త్రాలూ చెప్తున్నాయి.
విశేషించి అనేక రకాల గణపతి వ్రతాలున్నాయి. చవితి వ్రతాలే కాకుండా చతుర్దశి వ్రతాలు, మంగళవార వ్రతాలు, శుక్రవార వ్రతాలు చెప్పబడుతున్నాయి. అంటే స్వామికి చవితితో పాటు చతుర్దశి, వారాలలో మంగళవారం, శుక్రవారం ప్రధానంగా చెప్పబడుతున్నాయి.
గాణాపత్య సాంప్రదయంలో ఇన్నిరకాల పద్ధతులున్నా ప్రతివారూ చేసేది అందరికీ బాగా తెలిసింది భాద్రపదశుద్ధ చవితి. ఈనాడు గణపతి పూజని మట్టితో చేసి ఆరాధించడమే విశేషంగా అన్ని గ్రంథాలూ వివరిస్తున్నాయి. గణేశ పురాణంలో విశేషించి చెప్తున్నది
‘భాద్రేమాసే సితేపక్షే చతుర్థ్యాం భక్తిమాన్నరః!
కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం!!”
భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితినాడు మట్టితో చేసిన నాలుగు చేతులతో ఉన్న గణపతి మూర్తిని పూజించాలి.
మూర్తి ఎలా ఉండాలో కూడా శాస్త్రంలో చెప్పారు. అంతేకానీ ఆకర్షణల కోసమో, వికారాల కోసమో, క్రొత్త క్రొత్త మూర్తులను తయారుచేసి ఎన్నెన్నో చేతులు పెట్టేసి, క్రొత్త క్రొత్త రంగులు పూసి కాకుండా మట్టితో గణపతిని నాలుగు చేతుల వాడినే చేయాలి. అది కూడా అథర్వశీర్షోపనిషత్తులో చెప్పిన ప్రకారమే పాశము, అంకుశము, వరద, అభయ హస్తములతో ఉండాలి. ఒక్కొక్క సారి వరద అభయ హస్తముల బదులుగా ఒక హస్తంలో లడ్డుకాన్ని, మోదకాన్నో పెట్టడం కూడా కనబడుతుంది. అదేవిధంగా అభయ హస్తం పట్టిన చేతిలోనే ఒక భిన్న దంతాన్ని ఉంచడం కనబడుతుంది. ఇవి శాస్త్రం నిర్దేశించిన మూర్తులు.
అశాస్త్రీయంగా మూర్తులు చేయరాదు.నూతనత్వం పేరుతోనో, అందరినీ ఆకర్షించడానికో క్రొత్త క్రొత్త వింత రూపాలు చేయకుండా మట్టితో కూడిన గణపతినే చేయాలి అనేవిధానం స్పష్టంగా గణేశపురాణం చెప్తోంది.
అదేవిధంగా గణపతి ఆరాధనా సంబంధమైనటువంటి ఆగమ శాస్త్రాలలో, మంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతున్నది.
మరొక విశేషమైన అంశం హిమవంతుని ద్వారా ఉపదేశాన్ని పొంది సాక్షాత్తు గౌరీదేవి శ్రావణశుద్ధ చతుర్థి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు మట్టితో చేసిన గణపతిని ఆరాధిస్తూ మాసవ్రతం చేసింది అని స్పష్టంగా పురాణం చెప్తున్నది. కనుక పార్థివ గణపతే ప్రధాన అంశం.
శివునికి కూడా లింగారాధనలో పార్థివ లింగార్చన చెప్పబడుతున్నది. అంటే అన్ని ధాతువుల కంటే అన్నిరకాల రత్నాల కంటే మట్టితో చేసిన దానికే ఎక్కువ ప్రాధాన్యం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నది మట్టితో, మనకు ఉన్నది మట్టి, మట్టిమీద ఆధారపడ్డ జీవితాలు మనవి. అందుకే మట్టిలో పరమాత్మని దర్శించేటటువంటి ఒకానొక అద్భుతమైన తత్త్వ దర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక మట్టితో గణపతిని చేయాలన్నదే మనకు పురాణాది శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అందుకే ‘భాద్రేమాసే సితేపక్షే’ అని చెప్పడంలో భాద్రపద మాసంలో వచ్చే ఈ చవితి మాత్రం మట్టితో చేసిన గణపతినే ఆరాధించాలి అని శాస్త్రం నిర్దేశిస్తున్నది.
- వాట్సప్ సంచారి