ఒక తండ్రి గోడు
కోడలు కస్సుమంది.
కొడుకు బుస్సుమన్నాడు.
నా మది కలుక్కుమంది.
మనసు మ్లానమయింది.
గుండె పొరల్లోంచి దుఃఖం పొర్లుకొస్తుంది.
అవమానభారం తట్టుకోలేక.
తిరగబడుతుంది మనసు, ప్రశ్నిస్తుంది మనసు.
మనవాళ్ళే కదా, ఒక మాట అనగూడదా అంటే
వినడానికి 'ససేమిరా' మొరాయిస్తుంది.
ప్రతీ రోజూ, ప్రతీ క్షణమూ, ప్రతీ సందర్భమూ
ఈసడింపులను, అలక్ష్యాలను
భరించడమెందుకని ప్రశ్నిస్తుంది.
కొండల్ని పిండి చేసి హిల్స్ లో
నేను కట్టిన దివ్య భవనంలోనే
అంటరానివాడినయినందుకు ఆక్రోశిస్తుంది.
అష్టైశ్వర్యాలను ధార పోసామే
అడుక్కుతినడమెందుకని ఆగ్రహిస్తుంది.
కళ్ళల్లో వొత్తులేసుకుని కాపాడిన కళత్రం
కానరాని లోకాలకు పోయినందుకు
అనుక్షణం రోదిస్తుంది.
జరిగిన సంఘటన కళ్ళ ముందు మళ్ళీ కనిపిస్తుంది.
వృద్ధుణ్ణయ్యాను.
మతి గతి తప్పింది.
రోగాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోలేని మతి మరుపు.
కాయానికి భయం పోయింది.
మాట వినడం లేదు.
మాటిమాటికీ తూలిపడిపోతుంది.
పడబోతున్నానని తెలుస్తూనే ఉన్నా
నా మాట నా శరీరమే వినడం లేదు.
ఇక కొడుకు కోడలుదేం తప్పుంది.
బాత్రూం తలుపులు మూస్తే భయం.
గోడలు మింగేస్తాయని కంగారు.
ప్రాణం పోయినా ఫర్వాలేదు గానీ,
పట్టించుకోకుండా వొదిలేస్తే,
కుళ్ళిన నా శవం వాసన వాళ్ళకే యిబ్బంది కదా!
అందుకే తలుపులు మూయను.
అది కోడలు చూసింది.
'ఛీ, ఛీ' అని ఈసడించుకుంది.
ఫిర్యాదు అందుకున్న కొడుకు
పరుగున వచ్చి చీవాట్లు పెట్టాడు.
కోడలు కస్సుమంది.
కొడుకు బుస్సుమన్నాడు.
నాకు నవ్వొచ్చింది.
చిన్నప్పటి ముచ్చటొక్కటి గుర్తుకొచ్చింది.
నా కొడుకు బాత్రూం వెళ్ళాలంటే తల్లి పక్కనుండాలి.
నేను తలుపు తెరిచి పట్టుకోవాలి.
అంతులేని కథలు చెప్పాలి.
అప్పుడే వాడి కాలకృత్యం పూర్తయ్యేది.
ఇప్పుడు... హు...
ముసలి తండ్రి చేయి కొడుకు పట్టుకోనక్కర లేదు.
ఆ పని చేతికర్ర చేస్తుంది.
కథలు చెప్పే అవసరం లేదు.
కసురుకోకుంటే చాలు.
ఎంత మతి మరుపు రోగమొచ్చినా
కొడుకు కోడలు తిట్టిన తిట్లు
మాత్రం మరిచిపోలేక పోతున్నందుకు
నా మనసు నన్నే నిందిస్తుంది.
దూరతీరాలకేగిన ప్రియబాంధవిని చేరాలని
నా మనసు అల్లల్లాడుతుంది,
ఆరాట పడుతుంది.
-డాక్టర్ ప్రభాకర్ జైనీ