Telugu Global
Arts & Literature

క్షణభంగురం

క్షణభంగురం
X

జీవితమంటే క్షణ భంగురమనీ

జీవితమంటే బుద్బుద ప్రాయమనీ తెలిసి కూడా

ఎందుకంత మమకారం?

మనమేమీ చిరంజీవులం

కాదని తెలియదా !

ప్రాణాల మీద తీపిచావనంటోoదా?

అనుభవించిన కష్టనష్టాలు చాలవా?

ఇంకా ఏవో సుఖ సౌఖ్యాలు కావాలా?

ఇంకా బ్రతకాలని ఎందుకంత తాపత్రయం ?

నీ వా సిద్ధాంతాన్ని నమ్మినా నమ్మకపోయినా

సృష్టికర్తకు తెలుసుగా

జీవితం క్షణభంగురమని

అందుకే తనధర్మం

తను నిర్వర్తి స్తున్నాడు

నిముషానికి

నాలుగు ప్రాణాలు తీసేస్తూ

నీకంటే..ఆలోచన

ఆ ప్రాణాలెలా పోతున్నాయా అని

కరోనా అవ్వచ్చు హార్టెటాక్ అవచ్చు

ఆకలి దప్పులవ్వచ్చు

కుటుంబ సమస్యలవచ్చు

ప్రేదు వైఫల్యం అవచ్చు... సంసారంలో కలతలవ్వచ్చు...

నిరుద్యోగ సమస్యలవచ్చు

మరేదైనా కారణమవ్వచ్చు

ఆ జగన్నాటక సూత్రధారికి

అవేమీ అక్కరలేదు....

భూమి భారం తగ్గించడానికి... సమతుల్యం చేయడానికి

అయన నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే!

పెరుగుతున్న జనాభా అరికట్టడం...

అంతే!

తుఫానవచ్చు...

కరువు కాటకాలవచ్చు...

హత్యలవచ్చు.. ఆత్మ హత్యలవచ్చు...

ప్రమాదాలవచ్చు

విపరీత పరిణామాలవచ్చు

అకాల మరణాలవచ్చు. కారణాలేమైనా కావచ్చు

ఆయన సిద్ధాంతం ప్రకారం జీవితమంటే క్షణ భంగురమే!

అందుకే నిముషానికి నాలుగు ప్రాణాలు హరిస్తుంటాడు.

క్రితంజన్మ పాపపుణ్యాల ప్రకారం

మళ్లా జన్మ ఎత్తడం - జన్మరాహిత్యం

అంతా క్షణ కాలంలో జరిగే

ఆ భగవంతుని లీలావినోదాలేగా !

- పోడూరి శ్రీనివాసరావు

First Published:  5 Feb 2023 9:41 PM IST
Next Story