వెనక్కి నడుస్తూ..(కవిత)
ఆశల మేడలు కడుతూ
స్వర్గానికి నిచ్చెనలు వేస్తూ
చల్లని ప్రకృతిని పాడు చేస్తూ
పచ్చటి బతుకులో నిప్పులు పోసుకుంటూ
హైరానా పడిపోతున్నాడు
సహజ బతుకును మరచి
కృత్రిమ పూలదండలు మోస్తూ
అంబారీపై ఊరేగుతున్నాడు
వెనక్కి నడుస్తూ
దూరం తగ్గలేదంటూ వాపోతున్నాడు
బతుకు బండిని
ఉరుకులు పరుగులు పెట్టిస్తూ
ఆసుపత్రి అత్యవసర విభాగంలో
జీవచ్ఛవంలా బతికీడిస్తున్నాడు
బతుకు పుస్తకంలో
నాలుగు మంచి మాటలు
మన గురించి ఉండేలా
జీవించాలనే విషయాన్ని మరుస్తున్నాడు
బతుకు పూల తోటలో
సుగంధ పరిమళాలను వెదజల్లేలా
జీవన యానం కొనసాగించలేక
బతుకుపై విరక్తిని ప్రదర్శిస్తున్నాడు
ఎడారి పూలు
రాతి పగుళ్ళులోని పచ్చటి మొక్కలు
జీవిత సత్యాన్ని కళ్ళకు కట్టినా
అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు
మృత్యువుతో పోరాడి
బతుకువరాన్ని పొందినా
తప్పుల ఊబిలో అడుగులేస్తూ
కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు
మబ్బుల ఆకాశంలో
వేకువ సూర్యుడు ఉదయించి
వెలుగులు ప్రసరింపజేసినా
కాడెను లాగిలేక చతికలపడతున్నాడు
పసిపాపల కేరింతలు
తాత గారి బోసినవ్వులు
బతుకు చిత్రాన్ని చూపిస్తున్నా
మోయలేని బరువును నెత్తినెత్తుకుంటూ
స్వార్ధపు కూపంలో మునిగిపోతున్నాడు
బతుకు మంత్రాన్ని నిత్యం జపిస్తే
సత్యపు దారిని చూపిస్తూ
చల్లని వెలుగునిస్తూ
జీవన సమరంలో విజయానందిస్తుంది
-పిల్లి హజరత్తయ్య
(సింగరాయకొండ ప్రకాశం జిల్లా )