నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ( కథ)
ఖమ్మంలో అది ఒక ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో అది పదవతరగతి. ఆ తరగతిలో మొత్తం పదిమంది విద్యార్థులు, పదిమంది విద్యార్థినులు ఉన్నారు. విద్యార్థుల పేర్లు రఘు, సూర్యం, రవి, చందు, రాజు, గోపి, శివ, మధు, రాము, గణి. విద్యార్థినుల పేర్లు సీత, రాజ్యం, లక్ష్మి, దుర్గ, మంగ, సరోజ, జానకి, దమయంతి, వాణి, ఉమ. వారు పంచరంగుల ఊహాలోకాలలో విహరించే వయసులో ఉన్నవారు. అందునా నేటి సినిమాలు, తెలుగు సీరియల్సు బాగా చూస్తున్నవారు కావడం మూలాన చదువు కన్నా ఎక్కువ ప్రేమకు..... ప్రేమంటే చాలా చిన్నమాట అవుతుందేమో, ఆదర్శప్రణయానికి అత్యంత విలువనిచ్చే నవలానాయకులు, నాయికలు. వారు 'ప్లేటోనిక్' ప్రేమికులు.
సంవత్సరం పూర్తి కావస్తోంది. ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టారు. ఆ విద్యార్థులందరికీ ఒకటే యావ. చదువు ఎలాగూ చదువుతున్నారు. పరీక్షలు కూడా బాగానే వ్రాయగలరు. కాని జీవితపు పరీక్షలో ఉత్తీర్ణులవాలిగా? ఇంక రెండు నెలలలో పరీక్షలు వచ్చేస్తాయి. తరువాత ఎవరికి ఎవరో! ఎవరెవరు ఏ యే తీరాలకు వెళిపోతారో! అందుకని ఈ లోపునే తమ మనసులోని మాటను తమ ప్రియురాళ్ళకు తెలియజెప్పేయాలి. తమ ప్రేమను ప్రకటించేసి, వారు కూడా ఇష్టపడితే వివాహాలు చేసేసుకోవాలి. మరి పెద్దల మాటా? ఫరవాలేదు, వాళ్ళని ఒప్పించవచ్చును. ఒకవేళ వారు ఒప్పుకోకపోయినా, ఇంట్లోంచి వెళిపోయి వివాహాలు చేసేసుకుని తీరతారు. ఇప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోతే తరువాత జీవితాంతం బాధపడవలసి వస్తుంది కదా! విద్యార్థినుల ఆలోచనలు కూడా అలాగే సాగుతున్నాయి.
చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. 'ఫిబ్రవరి 14వ తారీకున సరదాగా అందరం కూనవరం విహారయాత్రకు వెళదాము. అక్కడ రోజంతా సరదాగా గడిపి తిరిగి సాయంత్రం ఖమ్మం వచ్చేద్దాము. ఆ రోజు వేలంటీన్స్ డే కూడా కదా? అందుకని మన మనసులలో ఉన్న భావాలను అరమరికలు లేకుండా పంచుకుందాము.' అందరూ సరే అంటే సరే అనుకున్నారు.
వారి ఆలోచనలైతే బాగానే ఉన్నాయి కాని, పరిస్థితులు వారికి అనుకూలిస్తాయా? ఏమో, చూడాలి.
అందరూ ఇళ్లలో పులిహోర, దధ్యోజనం, చక్కెరపొంగలి చేయించుకుని పొట్లాలు కట్టుకుని ఫిబ్రవరి 14న కూనవరం విహారయాత్రకు బయలుదేరారు. పవిత్రమైన గోదావరీ తీరాన, చక్కటి తోటలో బసచేసారు. దట్టమైన చెట్లు. చల్లటిగాలి వీస్తోంది. అందరి మనసులూ ఆనందంలో తేలియాడసాగాయి. కాసేపు అంత్యాక్షరి ఆడుకున్నారు. కాసేపు ఆటలు ఆడుకున్నారు. కాసేపు పాటలు పాడుకున్నారు. అమ్మాయిలు పాడుతుంటే అబ్బాయిలు సరదాగా నృత్యాలు చేసారు. మధ్యాహ్నం కాగానే అందరూతెచ్చుకున్నఆహారపదార్థాలు తృప్తిగా భోంచేసారు. ఇక అప్పుడు అసలైన సమయం ఆసన్నమైంది.
విద్యార్థినాయకుడు రఘు అన్నాడు, 'మై డియర్ ఫ్రెండ్స్! మనం పైకి చెప్పుకోకపోయినా, మన మనసులలో ఏముందో అందరికీ తెలుసు. ఇవాళ పవిత్రమైన వేలంటీన్స్ డే. అందుకే ఈ రోజున మనమందరం ఈ విహారయాత్ర పేరుతో ఇక్కడ సమావేశమైనాము. ఈ రోజున మన మనసులలో ఉన్న భావాలను నిర్మొహమాటంగా వెలిబుచ్చుదాము. ఎందుకంటే , ఈ సమయం గడిచిపోతే, తిరిగి మనకు ఈ అవకాశం రాదు.'
ఉమ రఘుని ఎంతగానో ప్రేమిస్తోంది. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అందుకని అతడికేసి ఓరగా చూస్తూ అంది. 'అవును రఘూ! చాలా విలువైన మాటలు చెప్పావు. ఫ్రెండ్స్! నౌ ఆర్ నెవర్! అందుకని అందరం సిగ్గు విడిచి మన మనసులలో ఉన్న మాటలు బయటకు చెప్పేసుకుందాము. రఘూ! కార్యక్రమం మొదలు పెట్టింది నువ్వు కదా! అందువలన ముందు నీతోనే మొదలెడదాము. ముందు నువ్వు చెప్పు.'
రఘు మెలికలు తిరిగిపోతూ అన్నాడు, 'సీతా! ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది. అందుకని చెప్పేస్తున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.'
సీత బాధగా అంది, 'నన్ను క్షమించు రఘూ! నేను ఎప్పటినుంచో సూర్యాన్ని ప్రేమిస్తున్నాను. సూర్యం! నా ప్రేమను కాదనవు కదూ!'
సూర్యం బాధగా అన్నాడు, 'క్షమించు సీతా! నేను నా హృదయాన్ని రాజ్యానికి ఏనాడో అర్పించేసాను. రాజ్యం, మనిద్దరం పెళ్ళి చేసుకుందామా?'
రాజ్యం బాధగా అంది, 'నన్ను క్షమించు సూర్యం. నేను రవిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.'
రవి చటుక్కున అన్నాడు, 'తొందరపడకు రాజ్యం. నా మనసులో లక్ష్మికి చోటిచ్చాను. ఆమెను తప్ప మరెవరినీ నేను వివాహమాడలేను.'
లక్ష్మి తల దించుకుని అంది, 'ఎంతమాటన్నావు రవీ? నా మనసులో చందూకి తప్ప మరెవరికీ స్థానం లేదు.'
చందూ అరిచాడు, 'ఆగు లక్ష్మీ! తొందరపడకు. నేను పెళ్ళంటూ చేసుకుంటే దుర్గనే చేసుకుంటానని ఎప్పుడో నిర్ణయం చేసేసుకున్నాను.;
దుర్గ విషాదవదనంతో అంది, 'చందూ! అంత మాటనకు. నేను మనసారా రాజుని ప్రేమిస్తున్నాను. నువ్వు నామీద ఆశలు పెట్టుకోకు.'
రాజు అన్నాడు, 'అయ్యో పిచ్చి దుర్గా! నువ్వు చాలా పొరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు. నేను మంగని ఆరాధిస్తున్నాను.'
మంగ అంది, 'ఎంతమాటన్నావు రాజూ! నీమీద నాకెప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు, కలగదు. నా మనసులో ఉన్న ఒకే ఒక దైవం గోపీ. గోపీ, నన్ను తిరస్కరించవు కదూ?'
గోపీ బాధగా అన్నాడు, 'మంగా, మంగా, మంగా! నా మనసులో ఉన్నది తెలుసుకోకుండా చాలా తప్పు చేస్తున్నావు. నేను సరోజని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సరోజా! ఐ లవ్ యూ సరోజా!'
సరోజ బొంగురుపోయిన గొంతుతో అంది, 'లేదు గోపీ, అలా అనకు. నా నెయ్యము, నా సఖుడు, నా ప్రియుడు శివ. నేను అతడినే పెళ్ళి చేసుకుంటాను.'
శివ రుధ్ధకంఠంతో అన్నాడు, 'సరోజా! లాభం లేదు. నేను నిన్ను ప్రేమించటం లేదు. నేను జానకిని తప్ప మరెవరినీ నా సహధర్మచారిణిగా ఊహించుకోలేను.'
జానకి వేదన నిండిన స్వరంతో అంది, 'పిచ్చి శివా! నాకు ముందే తెలిసివుంటే నీలో ఆ ఆశలు కల్పించకుండా ఉండేదానిని కదా! నేను మధుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.'
మధు బాధగా అన్నాడు, 'జానకీ! నేనెప్పుడూ నీతో తప్పుగా ప్రవర్తించలేదే? ఎందుకు నామీద అలా ఆశలు పెంచుకున్నావు? నా మనసులో గూడుకట్టుకున్న నా ఊహాసుందరి దమయంతి. ఆమెను మాత్రమే నేను వివాహమాడతాను.'
దమయంతి అంది, 'ఎంతమాటన్నావు మధూ? నీకు అలా అనాలని ఎందుకనిపించింది? నేను ప్రేమిస్తున్నది రాముని. రామూ, రామూ! వింటున్నావా రామూ?'
'ఆఁ, వింటున్నాను దమయంతీ! నువ్వు నన్ను మర్చిపోయి తీరాలి. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నది వాణిని. నాది అమరమైన ప్రేమ.' అన్నాడు రామూ.
వాణి అంది, 'చాలా తప్పుగా మాట్లాడుతున్నావు రామూ! నా ప్రేమను పొందగల అర్హత కేవలం గణేశ్వర్రావుకే ఉంది. గణీ, ప్లీజ్! నన్ను కాదనకు.'
గణి అన్నాడు, 'అయ్యో వాణీ! అలా అమాయకంగా మాట్లాడకు. నేను నా హృదయాన్ని ఏనాడో ఉమకు అర్పించేసాను.'
ఉమ అంది, 'గణీ, ఈ జన్మలో నీకు ఆ అవకాశం లేదు. నా ప్రేమసామ్రాజ్యానికి అధిపతి కేవలం రఘు మాత్రమే.'
రఘు అన్నాడు, 'అయ్యో ఉమా! నేను మొట్టమొదటే నా మనసులో సీతకు చోటిచ్చేసానని చెప్పేసాను కదా?'
అందరి మొహాలు వాడిపోయాయి. అందరి హృదయాలు వెక్కి వెక్కి ఏడిచేస్తున్నాయి. అందరికీ వారి జీవితాలు వ్యర్థమైపోయాయన్న బాధ గుండెల్ని పిండి చేసేస్తోంది. అందరూ, ఎవరికి వారు, తమ మనసులలో, 'అయ్యో నా పవిత్రమైన ప్రేమ భగ్నమైపోయింది. ఇంక నేను జీవించడం అనవసరం. ఓ కాలమా! నన్ను నీలో కలిపేసుకో. నా ప్రేయసి/ప్రియుడి ప్రేమను పొందలేని నేనింక బ్రతకలేను.' అని రోదించేస్తున్నారు.
ఒక అరగంట గడిచింది. విద్యార్థినాయకుడు కనుక రఘు అందరికంటే కొంచెం ముందు తేరుకున్నాడు. అన్నాడు, 'ఫ్రెండ్స్! ఇవాళ మనందరికీ చాలా దుర్దినం. ఎంతో చక్కగా ముగుస్తుందనుకున్న ఈ రోజు మన జీవితాలలో ఎంతో విషాదాన్ని నింపేసింది. ఇట్స్ ఓ.కె. కాని ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మనం ఈ క్లిష్టసమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి?'
వాణి అంది, 'రఘూ! మన సమస్యలకి పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పు.'
రఘు అన్నాడు, 'ఇది అంత అర్రీబుర్రీగా తేలే వ్యవహారం కాదు. అందుకని ఈ సమావేశాన్ని అర్థంతరంగా ముగించేద్దాము. అందరం ఇళ్ళకు వెళ్ళి శాంతంగా, కూల్ గా, కామ్ గా ఆలోచించుకుందాము. ఏం చేస్తే బాగుంటుందో, ఏ నిర్ణయం తీసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో ఆలోచిద్దాము. మళ్ళీ కొద్దిరోజులాగి, తిరిగి కలుసుకుందాము. అప్పుడు అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వద్దాము. అంతవరకూ ఎవరూ ఏ అఘాయిత్యమూ తలపెట్టకూడదు సుమా?'
అందరూ అతడి సలహా బాగుందని అంటూ చప్పట్లు కొట్టారు.
అందరూ తిరుగుప్రయాణమయ్యారు. దారిలో ఒక వాగు వచ్చింది. ఆ వాగులో పిల్లలు ఆడుకుంటున్నారు. ఒడ్డున పెద్దలు కూర్చుని ఉన్నారు. చాలా తినుబండారాల బళ్ళు ఉన్నాయి. ఒక బండిలో మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. వాటిని చూడగానే విద్యార్థిసమూహానికి నోరూరింది. అక్కడ ఆగారు. బజ్జీలు తిని, టీ త్రాగారు. మంచి హుషారు వచ్చింది. కేరింతలు కొడుతూ వాగులోకి పరిగెత్తారు. చిన్నపిల్లల్లా గెంతుతూ, ఒకరి మీద మరొకరు నీళ్ళు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. ఒడ్డు నుంచి చాలామంది గట్టిగా అరుస్తున్నారు గాని ఆ అరుపులు వాళ్ళ చెవిని పడలేదు. ఎవరో ఒక రాయి విసిరారు. ఆ రాయి వాళ్లలో దమయంతికి తగిలింది. ఆమె బాధగా 'అమ్మా!' అని అరిచింది. అందరికీ కోపం వచ్చింది. ఎవరా ఆ రాయి విసిరిందని ఒడ్డు కేసి చూసారు. అందరూ ఆందోళనగా వెనక్కి వచ్చెయ్యండి, వరద ముంచుకొచ్చేస్తోంది అని అరుస్తున్నారు, సైగలు చేస్తున్నారు. అప్పుడు వారికి అర్థమయి వాగులోకి చూసారు. ఉధ్ధృతమైన వేగంతో వరదనీరు వాళ్ళని తరుముకుంటూ వచ్చేస్తోంది. అందరిలో ఆందోళన పెరిగిపోయింది. వారందరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని హడావిడిగా ఒడ్డుకు పరిగెత్తుతున్నారు. క్షణాల్లో నీటిప్రవాహం వారిని చుట్టుముట్టేసింది. అందరూ కొట్టుకుపోతున్నారు గాని ఒకళ్ళ చేతిని మరొకరు విడవలేదు. ముక్కుల్లోకి, నోళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి. అంతా అయిపోతోంది. మరికొద్ది క్షణాల్లో అందరూ చనిపోబోతున్నారు.
అప్పుడే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన రెస్క్యూ టీమ్ అక్కడకు వచ్చారు. క్షణాల్లో యుధ్ధప్రాతిపదికను చర్యలు తీసుకున్నారు. ఏ ఒక్కరూ కొట్టుకొని పోకుండా అందర్నీ ఒడ్డుకు చేర్చారు. ఐతే అప్పటికే కొందరు నీళ్ళు త్రాగేసి స్పృహలు కోల్పోయారు. ఆ టీమ్ వారు ప్రాథమిక చికిత్స చేసి వారందర్నీ రక్షించారు.
అందరూ తిరిగి బస్సులోకొచ్చి పడ్డారు. ఆ సంఘటన వారిని తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. మృత్యుముఖం నించి బయట పడడమంటే అది సామాన్యమైన అనుభవం కాదు. ఎవరూ ఒకరితో మరొకరు మాట్లాడుకునే పరిస్థితిలో కూడా లేరు. ఖమ్మం చేరుకుని ఎవరి ఇళ్ళకు వాళ్ళు మౌనంగా వెళిపోయారు.
మర్నాడు అందరూ పాఠశాలకు వెళ్ళారు. నిన్న జరిగిన సంఘటన గురించి ఎంతో భావోద్వేగంతో చర్చించుకుంటున్నారు. ఇంతలో ప్రథానోపాధ్యాయులైన కృష్ణశాస్త్రిగారు వారి తరగతి లోనికి విచ్చేసారు. అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. శాస్త్రిగారు అందర్నీ కూర్చోమని సైగ చేసి తన ప్రసంగం మొదలుపెట్టారు.
'నా ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా! మీరందరూ 'వేలంటైన్స్ డే'కు ప్రాధాన్యతనిస్తూ విహారయాత్రకు వెళ్ళడం, అక్కడ జరిగిన విషయాలు, తిరిగి మీరు వెనక్కి వస్తూండగా వాగులో మీకు ఎదురైన సంఘటన, ఇవన్నీ నాకు పూర్తిగా తెలిసాయి. ఇప్పుడు నేను ఒక ప్రధానోపాధ్యాయుడిగా కాక, మీ స్నేహితుడిగా, మీ ఈడువారిలో ఒకడిగా మీతో సంభాషిద్దామని వచ్చాను. అందుకని నన్ను అలాగే ట్రీట్ చెయ్యండి. ముందుగా నేను చెప్పదలుచుకున్నదేమిటీ అంటే, మనం జీవితంలో ఎన్నో కావాలని కోరుకుంటాము. ఎన్నిటినో ఆశిస్తాము. అవి మనకు లభ్యం కానపుడు నిరాశా నిస్పృహలతో క్రుంగిపోతాము. ఈ జీవితం నిస్సారమై పోయినది, వ్యర్థమైపోయినది అని ఆవేదన చెందుతాము. ఆ నిరాశా, నిస్పృహలలోంచి ఒక తెగింపు పుట్టుకువచ్చి, ఆత్మహత్య చేసుకుందామన్నంత ఆలోచన కూడా కలుగుతుంది. అవి మన జీవితాలలో మనకు ఎదురయ్యే అతి బలహీనమైన క్షణాలు. ఆ క్షణాలలో కొందరు తమ జీవితాలను ముగించుకుంటారు. కాని దానిద్వారా వారు ఏమి సాధించుకున్నారు? మానవజన్మ అన్నది భగవంతుడు మనకిచ్చిన అపూర్వమైన వరం. దానిని సద్వినియోగపరుచుకోకుండా పిరికివారిలా జీవితాన్నుంచి పారిపోవడమన్నది సరియైనదేనా? ఆ బలహీనమైన క్షణాలను మనం అధిగమించగలిగిన నాడు, మనం జీవితాలను సార్థకం చేసుకోగలుగుతాము. తరువాత భవిష్యత్తులో ఎంతో కృషి చేసి అత్యున్నత శిఖరాలకు చేరుకోగలుగుతాము. మృత్యువు ఎంత భయంకరమైనదో నిన్న మీ అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఆ క్షణాల్లో మీకు బ్రతుకు మీద ఆశ పుట్టుకువచ్చి, అయ్యో, భగవంతుడా! మమ్మల్ని ఈ ఆపదనించి గట్టెక్కించు, కాపాడు' అంటూ అందరూ ప్రార్థనలు చేసివుంటారు. ఆ అనుభవాన్ని ఒక పాఠంగా మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోండి. ఇక ప్రేమ గురించి. మనందరం ఒకే ఈడువాళ్ళముగా భావించండి అని మీతో చెప్పానుగా.
అందువలన నేను మీలో ఒకడిగా అయిపోయి, నా బిడియాన్ని వదులుకుని, నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి మీకు చెప్పేస్తున్నాను. ఇవి విని ఎవరూ దయచేసి నన్ను హేళన చెయ్యకండి. నాకు పథ్నాలుగేళ్ళ వయసు వచ్చినప్పటినుంచే నన్ను నేను పెద్దవాడిగా భావించేసుకోవడం మొదలు పెట్టాను. అంతేకాదు, అప్పుడే నేను ప్రేమలో పడ్డాను. అలాగే ప్రేమించబడాలని ఎంతో ఉవ్విళ్ళూరాను. అప్పుడు నేను మొదటిసారిగా మా ఇంట్లో పనిచేస్తున్న యాదమ్మ మీద మనసు పడ్డాను. ఆమె ఇల్లు ఊడుస్తుంటే తదేకంగా ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడిని. ఆమె చిరునవ్వు నవ్వుతే నాకు ఎంతో మనోహరంగా కనిపించేది. రాత్రిళ్ళు ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రరాని రాత్రులు గడిపేవాడిని. ఆమెని వివాహం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను. ఒకరోజు ఆమె అంట్లు తోముతుంటే ఎవరూ లేకుండా ఆమె దగ్గరకు వెళ్ళి, 'యాదమ్మా! ఐ లవ్ యూ.' అన్నాను. ఆమెకు ఆంగ్లం అర్థం కాక, 'ఏమంటున్నారు బాబూ?' అని అడిగింది. నేను తెలుగులో 'యాదమ్మా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనిద్దరం పెళ్ళి చేసుకుందామా?' అని అడిగాను. ఆమె ఫక్కున నవ్వేసింది. 'ఫో బాబూ! మీరూ, మీ పరాచికాలూను.' అంది. ఆమెకు ఎలా నచ్చచెప్పాలో నాకు అర్థం కాలేదు. తరవాత కొద్దిరోజుల్లోనే, ఇంకొంచెం జీతం ఎక్కువ వస్తోందని ఆశపడి, ఆమె మా ఇంట్లో పని మానేసి వేరొకరి ఇంట్లో పనికి కుదిరింది. అప్పుడు నేను భగ్నప్రేమికుడినై ఎంతో వేదనను అనుభవించాను. ఒక్కొక్కసారి చనిపోవాలని కూడా అనిపించేది. కాని ధైర్యం చాలలేదు. కొన్ని రోజులు గడిచాయి. నా మనసుకు తగిలిన గాయం కొద్దికొద్దిగా మానింది. నేను పదవతరగతిలోనికి వచ్చాను. అప్పుడు నాకు కుంతలతో పరిచయమైంది. ఆమె నేను లెక్కల ట్యూషనుకి వెళ్ళే మా లెక్కల మాస్టారి అమ్మాయి. నేను ఆమెని మనస్పూర్తిగా ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇంతలో మాకు పబ్లిక్ పరీక్షలు వచ్చాయి. తరువాత వేసంగి శలవులు వచ్చాయి. ఆ శలవులలో మా మేస్టారు ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేసారు. నేను చేతకానివాడిలా ఉండిపోయాను. ఆమె ఆనందంగా పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత మంజరి, శాలిని, మాలతి ఇలా ఎందరో నా జీవితంలో తారసపడ్డారు. ప్రతిసారి, ఒక్కొక్క అమ్మాయిని చూసి నేను ఆమెను అతి పవిత్రంగా ప్రేమించేస్తున్నానని అనిపించేది. ఈలోగా నాకు ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. నా తలిదండ్రులు ఒక సంప్రదాయమున్న కుటుంబంలోని అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు. ఆ సంబంధాన్ని ఖాయం చేసేసారు. వారు కట్నం కూడా ఆశించలేదు. నేను విరక్తిగా ఎవరైతే ఏమిలే, కనీసం, నా కన్నతలిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నానుగా అని ఆలోచించి, ఆమె మెడలో తాళి కట్టేసాను. కాని అప్పుడు నాకు అనుభవమయింది, నిజమైన ప్రేమంటే ఏమిటో, నిజంగా ప్రేమించబడడమంటే ఏమిటో. ఆమెని వివాహం చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. అంతేకాదు, అప్పటినుంచీ, మరొక స్త్రీ గురించిన ఆలోచనలేవీ నా మనసులోకి రాలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీరందరూ ఆ అడొలెసెంట్ ఏజ్ లో ఉన్నారు. నాకు కలిగిన అనుభవాలే ఇప్పుడు మీకు కలుగుతున్నాయి. ఐతే అప్పుడు నాకు ఇలా బోధించిన వారు ఎవరూ లేరు. నేను మీ స్నేహితుడిగా నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
అసలు నిజమైన ప్రేమంటే ఏమిటో తెలుసునా? అది ఇచ్చి పుచ్చుకునేది కాదు, మన అమ్మలు మనలను ప్రేమిస్తారే, అది నిజమైన ప్రేమ. తమ కడుపులు కట్టిపెట్టుకుని, మన కడుపులను తడిమి తడిమి మనకు నోట్లో ముద్దలుపెడతారే, అది ప్రేమ. మనకు ఒంట్లో బాగుండకపోతే, నిద్రాహారాలు మాని, మన మంచం పక్కనే కూర్చుని మనకు సేవలు చేస్తారే, అది ప్రేమ. మన నాన్నలు మనకోసం చెమటోడ్చి, శ్రమించి, నాలుగు రాళ్ళు సంపాదించి తెచ్చి, మనకు విద్యాబుధ్ధులు నేర్పించి, మనలను సమాజంలో ఒక స్థాయిలో నిలబెడతారే, అది నిజమైన ప్రేమ. ఇంటికి వెళ్ళగానే, చల్లటి మంచినీళ్ళిచ్చి,సేద దీర్చి,సేవలు చేసే సహధర్మచారిణి ఉంటుందే, ఆవిడది నిజమైన ప్రేమ. నా భార్య ఎప్పుడు నిద్ర లేస్తుందో నాకు తెలియదు. కాని నేను ఆరింటికి లేచి మొహం కడుక్కోగానే నాకు వెచ్చటి కాఫీ ఇస్తుంది. నేను స్కూలుకి బయలుదేరే వేళకి నాకు ఫలహారం వడ్డించి, నాకు లంచ్ బాక్స్ తయారుచేసి ఇస్తుందే ఆవిడది నిజమైన ప్రేమ. వివాహం కాగానే తన వాళ్ళందర్నీ వదులుకుని, నా కోసం కొత్త ఇంట్లోకి, కొత్తవారి మధ్యకి తెగించి వచ్చేసిందే, ఆ ఇల్లాలిది నిజమైన ప్రేమ. నా ఇష్టానిష్టాలను గమనించి తదనుగుణంగా నాకు పరిచర్యలు చేస్తోందే ఆవిడది నిజమైన ప్రేమ. వివాహం కాకముందు ఆవిడ ఎవరో నాకు తెలియదు. మేమిద్దరమూ ఏ పార్కుల చుట్టూను ప్రణయగీతాలు పాడుకుంటూ షికార్లు చెయ్యలేదు. పెళ్ళిచూపులలో కనీసం తల ఎత్తి నేను ఎలా ఉన్నానో అని కూడా ఆమె గమనించలేదు. కాని వివాహం కాగానే, కాపురానికి వచ్చిన క్షణం నుంచే నా ఆలనా పాలనా చూసుకుంటోందే ఆవిడది నిజమైన ప్రేమ. ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇంక ఎక్కువగా నేను మీకు బోధించాల్సింది ఏమీ లేదు. ప్రతి వ్యక్తి తన ప్రయారిటీలు ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి. ఒక విద్యార్థి ప్రయారిటీ బాగా చదువుకోవడం. అంతేగాని సమ్మెలు చేస్తూ చదువుకు ఎగనామం పెట్టడం కాదు. సంవత్సరమంతా కష్టపడి చదవడం. ఇంక రేపు పరీక్ష అనగా ఆ విద్యార్థి ప్రయారిటీ పూర్తిగా రిలాక్స్ ఐపోవడం. ఏ మాత్రం టెన్షన్ కి లోను కాకుండా కూల్ గా ఉండగలగడం. పరీక్షలకు నిబ్బరంగా అటెండ్ అయి చక్కగా పరీక్షలు వ్రాయడం. అలాగే మనకు అన్ని దశలలోను వేర్వేరుగా ప్రయారిటీలు ఉంటాయి. వాటిని మనం సరిగ్గా గమనించి, తదనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుంది. అప్పుడే మనం విజయాలను సాధించగలం. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. మీ అందరికీ ఎప్పుడూ మంచే జరగాలని, మీరు మీ జీవితాలలో అత్యున్నత స్థాయిలకు ఎదగాలని, మీ జీవితాలు సుఖంగా, సంతోషంగా గడవాలని మీ అందర్నీ ఆశీర్వదిస్తున్నాను. జై శ్రీరామ్!'
శాస్త్రిగారు ఉపన్యాసం ముగించిన ఒక్క పదిసెకండ్లు క్లాసురూములో నిశ్శబ్దం తాండవం చేసింది. తరువాత హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. అందరూ లేచి నిల్చుని భక్తిగా ఆయనకు నమస్కారాలు చేసారు.
ఆ విద్యార్థులందరికీ తమకు కలిగిన ప్రేమలు ఎటువంటివో, అసలు తమ ప్రయారిటీలు ఏమిటో బాగా తెలిసి వచ్చింది."
- పెయ్యేటి రంగారావు
(నార్త్ కెరొలినా USA)