దోపిడీ (కథ)
"తరతరాల నుంచి ఈ బూర్జువాల దాష్టీకాలకి అంతు లేకుండా పోతోంది. తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ కి అందరూ జేజేలు పలుకుతారు. కాని ఆ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలను ఎవరన్నా పట్టించుకున్నారా? వారు చిందించిన స్వేదానికి విలువ కట్టారా? ఈ దోపిడీ విధానాన్ని అంతం చెయ్యాలి."
"అదేమిటి, ఆ కూలీలకి ఇవ్వవలసిన రోజు కూలీ ఇచ్చే ఉంటారుగా?"
"దానితో సరిపోతుందా? రైతు ఆరుగాలాలు శ్రమ పడి పంటలు పండిస్తాడు. చివరన భూకామందు వచ్చి పంట ఎగరేసుకు పోతాడు."
"అదేమిటి? ఆ భూమిలో వ్యవసాయం చెయ్యడానికి పెట్టుబడి ఆయనది. రైతుకి ఇవ్వవలసిన వాటా ఇస్తున్నాడుగా?"
"అతడి చేతిలో డబ్బు ఉంది కనుక ఇతరుల శ్రమతో అతడు రాజ భోగాలను అనుభవిస్తున్నాడు. ఆ డబ్బు కూడా అతడికి ఎక్కడ నుండి వస్త్తోంది? శ్రమజీవులని దోచుకోవడం వల్లనేగా?"
"అంటే నువ్వనేదేమిటి?"
"దున్నేవాడిదే భూమి."
"దున్నుతున్నది ఎవరు? రైతు ఒక్కడే మొత్తం శ్రమ పడటల్లేదుగా? కూలీలను పెట్టి నాట్లు వేయిస్తున్నాడు. ఎడ్ల చేత దున్నిస్తున్నాడు? మరి దున్నేవాడిదే భూమి అని ఆ పొలం రైతుకి కట్టబెట్టేయాలా? లేక ఆ ఎడ్లకు ఇవ్వాలా?"
"నువ్వు అడ్డగోలుగా వాదిస్తున్నావు."
"నాది అడ్డగోలు వాదనా? నువ్వు బజారుకి వెళ్ళావు. ఒక చొక్కాగుడ్డ కొనుక్కుని కుట్టడానికి టైలరుకి ఇచ్చావు. మరి శ్రమ అంతా ఆ టైలరుది కదా? అతడి శ్రమ ఫలితమైన చొక్కాని తొడుక్కోవడానికి నీకేమి అధికారం ఉంది?"
"నువ్వు చెవికి మోకాలుకి ముడి వేస్తున్నావు. కాస్త కామన్ సెన్సు ఉపయోగించు. అప్పుడు నా వాదనలో న్యాయముందని నువ్వే అంగీకరిస్తావు."
"అవునేమోలే. వాళ్ళ శ్రమని సరిగా అర్థం చేసుకోకుండా నేను మూర్ఖంగా వాదిస్తున్నాను. నువ్వు చెప్పిందే నిజం. దున్నే వాడిదే భూమి. ఇకనుంచి నేను కూడా నీతో కలిసి కూలీలకు వారికి అందవలసినవి అందడానికి పోరాటం సాగిస్తాను."
"అమ్మయ్య. నా వాదనలో న్యాయముందని ఇన్నాళ్ళకి నువ్వు గ్రహించావు."
"అవును, ఇన్నాళ్ళూ నేను భ్రమలో ఉన్నాను.
"చాలా సంతోషం. రా, నాతో గొంతు కలుపు. నాతో కలిసి అడుగెయ్యి."
"ఇంక్విలాబ్ జిందాబాద్. దా, మనం పోరాటం మొదలు పెడదాం. ఇప్పుడే నేను ఒక కట్టడం చూసాను. శ్రమ పడి, రాళ్ళెత్తి ఒక కూలీ కట్టిన ఆ కట్టడంలో మరొకడు నివసిస్తూ కులుకుతున్నాడు. అతడిని ఖాళీ చేయించి ఆ కట్టడంలో ఆ కూలీ నివసించేలా చేద్దాం."
"పద. ఇంక్విలాబ్ జిందాబాద్."
"ఇంక్విలాబ్ జిందాబాద్. పద."
---------------------------
"ఇదేమిటి? శ్మశానానికి తీసుకు వచ్చావు?"
"అవును. చూడు. ఒక కూలీ కష్టపడి నిర్మించిన సమాధిలో మరొకడు కులుకుతూ నిద్రిస్తున్నాడు. వాడిని ఖాళీ చేయించి ఆ కూలీని అందులో పడుకోబెట్టు."
-పెయ్యేటి రంగారావు