పండితపుత్రుని పదనిసలు
మహాపండితుడు...ద గ్రేట్ విరూపాక్షం గారి ఏకైక సుపుత్రుడు.. ఆనందరావు... అతని ఇంటి పేరు మాత్రం... 'అనుమానాల' !
ఆనందరావుని అతని యొక్క పేరుతో ఎవ్వరూ పిలవరు..'అనుమానాలరావు'...అన్న పేరుతోనే పిలుస్తారు.. అలా పిలిపించుకోవడం కూడా అతనికి ఇష్టమే. తండ్రి విరూపాక్షం శత సహస్రా వధాని అయినా... కొడుకు అనుమానాలరావు మాత్రం ఈ సృష్టినే పరిశోధించాలి.. అని నిర్ణయిం చుకున్న.. ఆ పండితుని సుపుత్రుడు!
ఒకరోజు అతను.. ఈ నేల తల్లి నాలుగు దిక్కుల విధివిధానాల విషయం ఏమిటో పూర్తిగా తెలుసు కోవాలని.... బయలుదేరాడు.
గుట్టలు కొండలు పెద్దపర్వతాలు..వాగులు ఏరులు సెలయేరులు... దాటి మొత్తానికి నాలుగు దిక్కుల రూపాలు ..కాపురం ఉండే మనోహరమైన కూడలి ప్లేస్ కు చేరాడు.
ముందుగా తూర్పురావు ఇంటిని సమీపించాడు.. తూర్పురావు అతడిని సగౌరవంగా ఆహ్వానించి
'మానవులలో ఇంతటి దూరం రాగలిగినవారు మీరు ఒక్కరే కనిపించారు '.. అంటూ సింహాసనం లాంటి కుర్చీవేసి.. లోపలినుండి.. కూల్ వాటర్ వెండిగ్లాసు తో తెచ్చి అందిస్తూ...
'అయ్యా మీయొక్క రాకకు కారణం ?''.. అంటూ ప్రశ్నించాడు.
'' నీ గౌరవాలు ఏమీ అక్కర్లేదు కానీ..నేను వచ్చింది ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉందామని..అభ్యంతరమా' ప్రశ్నించాడు అనుమానాలరావు.
'' అది మీ ఇష్టం స్వామి.. తగిన ఏర్పాట్లు కోసం నా హెల్ప్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందిస్వామి
''ప్రత్యక్షదైవం''.. కూడా మీకు తోడుగా ఉంటారు. అలాగని ఇతరచోట్ల ఉండడని నా ఉద్దేశ్యం కాదు.
మారు ఆలోచించవద్దు.. మీరు ఇల్లు కట్టడం ఈ రోజే మొదలు పెట్టుకోండి.
మరొక విషయం నేను ఇంటికి పెద్ద వాడిని.ఇక్కడ పడమర ఉత్తర దక్షిణ రావులు..అందరూ నా బ్రదర్స్.. నాకు శత్రువులు ఎవరూ లేరు. మీరు ఎక్కడ కట్టుకున్నా నా సపోర్టు ఎప్పుడూ మీకు ఉంటుంది!'' అంటూ వినయంగా చెప్పాడు.. తూర్పురావు.
'' సరే..నువ్వు ముందు చెప్పిన''... ఆదైవం గురించి నాకు తెలుసు కానీ...ఆ విషయం ఓ పక్కన పెట్టు. ఇప్పుడు నేనొకసారి ఇక్కడ బయట వాతావరణం ఎలా ఉందో చూసివస్తాను.తర్వాత మాట్లాడుదాం''
అంటూ...బయటకొచ్చి.. కొంచెం దూరంగా ఉన్న దక్షిణరావు ఇంటికి వెళ్ళాడు.
విషయం తెలుసుకున్న దక్షిణరావు
''మీరంతా తూర్పురావు తూర్పురావు.. అంటారు డామిట్ ..అతనో పెద్ద పోటుగాడా?..ఇక్కడే ఇల్లు కట్టుకో.. కావాలంటే పెట్టుబడి తక్కువ ఇంట్రెస్ట్ లో లోనుగా నేనే ఇస్తాను'. అన్నాడు.
అనుమానాలరావు సంతోషించి నీ అభిమానం మరిచిపోలేను. ఒక గంటలో వచ్చి మాట్లాడతాను ఉండు''....అంటూ బయటకు వచ్చాడు.
మరి కాస్త దూరంలో ఉన్న పడమరరావు ఇంటికి వెళ్ళాడు..
'' నువ్వు ఏమీ చెప్పక్కర్లేదు.. విషయం తెలుసు. నాకన్నా ముందు తూర్పురావుగాడు తను ఉంటు న్న ఆ తూర్పు ప్రాంతాన్ని ఆక్రమిoచేశాడు..దాంతో గతిలేక నేను వేరే ఆప్షన్ లేక అతని వెనగ్గా ఉండి పోవలసివచ్చింది.. లేకుంటే.. ఈ ప్రాంతంలో నేనే పెద్దతోపుగాడిని.. అన్నమాట! అలా మోసం జరి గింది నాకు...సరే ఆ విషయం నేను తేల్చుకుంటా ను..కానీ నువ్వు ఇక్కడే ఇల్లు కట్టుకో ..కానీ ఒక చిన్న కండిషన్ ..అది ఏమిటంటే.. నువ్వు తూర్పు రావుతో మాట్లాడడానికి వీలులేదు.. అలా ఒప్పు కుంటే నేనే నీకు ఉచితంగా ఇల్లు కట్టి ఇస్తాను''..
అంటూ లోబరుచు విధానంలో చెప్పాడు పడమరరావు.
ఇదేదో బాగుంది అనుకుంటూ అక్కడ తాత్కాలిక సెలవు తీసుకుని ఇంకొంచెం ముందుకి వచ్చాడు అనుమానాలరావు.
లాస్ట్ ఇల్లు అయిన ఉత్తరరావు ఇంటికి వెళ్ళాడు..
ముందుగానే అంతా గ్రహించిన ఉత్తరరావు...
'' య్యో..అనుమానాలరావు... ఆ వెంకటేశ్వర స్వామి కి అప్పు ఇచ్చిన కుబేరుడు నీతో మాట్లా డుతుoడాడు అనుకో... ఆ తూర్పురావుని పట్టిం చుకోమాకు.. అతనులేకుంటే సృష్టి ఆగిపోతుందా అంట.. దేశం గొడ్డుపోతుందా అంట? ..మాకూ ఉన్నాయి అతనికన్నా పెద్దకొమ్ములు..అంతా మీ పిచ్చిభ్రమలు,పిచ్చినమ్మకాలు....సరే..ఇక ఆ దక్షిణరావు, పడమరరావు.. పనికిరాని డమ్మీలు.. ఇదిగో నేను మాట ఇస్తుండా.. నీకు ఉచితంగా ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా... నీ ఇనపపెట్టి నిండా కుబేరుడుతో మాట్లాడి గోల్డ్ దిమ్మలు పెట్టిం చే ఏర్పాటుచేస్తాను. నా ఉత్తరదిశనే ఇల్లు కట్టుకో శంకుస్థాపన ముహూర్తం పెట్టించేదా?''... అంటూ కంగారు పెట్టాడు.
ఉత్తరరావు చెప్పిన మాటలతో అనుమానాలరావు కి ఎక్కడలేని బలం వచ్చేసింది.. కానీ..అందరూ తూర్పురావుతూర్పురావు అని ఎందుకుఅంటారు?
అన్న విషయం పూర్తిగా అర్థం కాలేదు అతనికి.
'ఇతరులు తనకు ఇస్తానన్న పెద్దమొత్తం కన్నా ఇంకా పెద్దమొత్తం తూర్పురావు తనకు ఇవ్వగలి గితే... అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. లేదంటే మిగి లిన విషయం అప్పుడు ఆలోచన చేయొచ్చు.
ఒకసారి తూర్పురావుని భయపెట్టి... బెదిరించి మాట్లాడితే...?'....
అన్న నిర్ణయానికి వచ్చేసాడు అనుమానాలరావు.
ఉత్తరరావుకి.. 'అర్ధగంటలో వచ్చి ఏ విషయం చెప్తా'.. అంటూ సెలవు తీసుకుని... ముందుగా వెళ్లిన తూర్పురావు ఇంటికి మళ్ళీ వెళ్ళాడు.
అక్కడున్న సింహాసనం లాంటి కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు.. కాళ్లు ఊపుతూ.. అనుమానాల రావు.
'' ఇదిగో..తూర్పురావు కాస్త అమృతంలాంటి చల్లని పానీయం ఏదైనా ఉంటే పట్టుకురా...''..అంటూ ఆర్డర్ వేశాడు. తూర్పురావు వినయంగా తెచ్చి ఇచ్చాడు.. అప్పుడు సమయం ఇంచుమించు ఉదయం 6 గంటలు కావస్తుంది.
''తెల్లవారుజామున ముందుగా నీ ఇంటికి వచ్చి ఆశ పెట్టానని మళ్ళీవచ్చా..నావి చిన్న చిన్న కండి షన్స్ చెప్తాను..నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వు.
ఎందుకంటే నీ కన్నా పెద్ద ఆఫర్లు బయట వాళ్లు ఇస్తున్నారు. అవి వదిలి పెట్టుకొని ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి నేను మూర్ఖుడిని కాదు కదా.
అందుచేత పూర్తి లిటిగేషన్ పాయింట్లు అన్ని అగ్రిమెంట్ రాసుకుందాం.. నువ్వు సంతకం పెట్టు.. తేడా వస్తే మాత్రం నేను ఎవరిని వదిలి పెట్టను.. మొండిఘటం కన్నా మొండివాడిని అర్థమైందా..
చూడు.. ఈ విషయంలో నీ తరపు ఎవరైనా పెద్ద లు ఉంటే తీసి తెచ్చుకో.. అగ్రిమెంట్ అన్నాక పగడ్బందీగా ఉంటుంది మరి.''
అంటూ తన కండిషన్స్ చెప్పటం ఆరంభించాడు అనుమానాలరావు.
తన బ్యాగ్ లోంచి స్టాంపు అంటించిన అగ్రిమెంట్ పేపర్లు.. వేలిముద్ర బాక్స్.. పైకి తీసి ఏదోరాయడం ప్రారంభించాడు..అనుమానాలరావు.. తూర్పు రావు ఏం చెప్పాలో తెలియక నోరెళ్లపెట్టాడు....
కానీ ఇంతలో...
అప్పుడే.. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు... తూర్పుకనుమల నుండి అలా అలా ప్రకాశిస్తూ
పైపైకి రావడం... ఆ కిరణాలు తాకగానే సృష్టితో చలగాటం ఆడుతున్న అనుమానాలరావు భస్మం గా మారిపోవడం...ఒక క్షణంలో జరిగిపోయాయి!.
-నల్లబాటి రాఘవేంద్రరావు