Telugu Global
Arts & Literature

భానుడు మిమ్ము బ్రోచుతన్!

భానుడు మిమ్ము బ్రోచుతన్!
X

బిందువు ఆదిశక్తి; పరివేష్టిత ఆవరణంబు లెన్నియేన్

బిందువులో జనించి తుది బిందువు లోన లయించు; యోగమా

బిందువు జేర్చు సాధనము; విస్మృతి మాయ; దొలంగ మాయ ఆ

బిందువు జేరు జ్ఞాన మిడు వేద్యుడు, భానుడు మిమ్ము బ్రోచుతన్!

సత్యము, సుందరమ్ము, శివ శంకర మయ్యదె జీవితమ్ము; ఔ

చిత్య మెఱింగి ఆస్వదన జేయ రసాత్మకమై స్రవించు; సౌ

హిత్య వికాస విస్తృతిని యెల్లలు దాటి గమించు; చేతనో

పాత్యయ భూతి నందునను భవ్యుడు, భానుడు మిమ్ము బ్రోచుతన్!

బోరన "లోన" సుప్తమగు బుద్ధిని జాగృతి చేయు శక్తి; "ఓం

కారము" యొక్క సారము, ప్రకాశిత శక్తియు, పూతమౌ సహ

స్రారము నందు "నిందుకళ" లాలిత శక్తి; "ఉమా" యనంగ, భ

వ్యారుణ దీప్తమౌ నభము నందదె, భానుడు మిమ్ము బ్రోచుతన్!

చెట్టును తీగ అల్లుకొని చిక్కగ పూవులు పూసె; దానితో

చెట్టుకు అందమున్ బెరిగె; చెట్టును తీగ పరస్పరమ్ము న

ప్పట్టున వృద్ధి చెందుచవి పాంథుల కాశ్రయ మిచ్చె; జీవితం

బట్టుల సాగ ధర్మమను నాప్తుడు భానుడు మిమ్ము బ్రోచుతన్!

నాణ్యము గల్గు జీవనము నవ్య పథంబును స్వాగతించు; నై

పుణ్యము బెంచ నెంచు; ననుభూతుల పంచును; గౌరవించు ప్రావీణ్యము జ్ఞానమున్ గలుగు విజ్ఞుల; నార్తుల నాదరించు; లా

వణ్యము తానయౌ ననుచు బల్కెడు భానుడు మిమ్ము బ్రోచుతన్!

-పాలకుర్తి రామమూర్తి

First Published:  25 April 2023 12:38 PM IST
Next Story