రెక్కలు మొలుస్తాయట ఆశలకు…..
పగ్గాలు వేయాలి మరి,
పట్టి లాగాలంటే..
పరుగులు తీయకూడదు,
సన్నటి వెలుగు కనబడిందని….
చీల్చుకొని వెళ్లాలి చిమ్మచీకట్లను..
సాహస కృత్యమై సాగాలి
అగాధాల వెంట..
అందుకోవాలి అవకాశాల ఆసరాలను..
నింపుతూ పోవాలి
కాల పరీక్షల కాగితాలను..
ఎవరూ ఒప్పకోరు కానీ,…..
ఆకాశానికి అమాంతంగా ఎగరలేకపోవడం
పచ్చి నిజమంత నిజం…..
అసలు విజయం,
అడుగులో అడుగు కదిపినప్పుడే….
మెట్టు మెట్టుకీ ఆశ, నిరాశాల ఊగులాట…
తాకట్టు పెట్టాల్సి ఉంటుంది
అభిమానాన్ని కూడా అప్పుడప్పుడూ…..
మామూలే తలవంపులు, విదిలింపులూను..
ప్రశంసల ప్రవాహాలు ఒకపక్క,
విమర్శల విలాపాలు మరోపక్క,
అందరికీ నచ్చక పోవడం సహజం
కొందరే ఒప్పుకోవడం ఇంకా సహజం
చూసే మనసును బట్టే
భావన కూడా..
అందుకే……
తావు ఉండకూడదు,
పట్టింపులకు, పట్టుదలలకు
వేస్తున్న అడుగుల ఆలోచనలను
ఎంచుకున్న మార్గమే నిర్దేశిస్తుంది…
విజయమే గమ్యమవుతుంది
ఆశయం మంచిదైతే ……..
అనుకున్నవన్నీ
చెంతకు చేరుతాయి
వ్యక్తిత్వాన్ని కోల్పోనంతవరకే….!!!!
– అరుణ ధూళిపాళ