ఓ పరిచయం : మా నిషాద మో 'నిషాదం'
'మో' కవిత్వం అర్థం కాదనే అభియోగం కొత్తదేమీకాదు. వేగుంట మోహనప్రసాద్ కుదించుకుని 'మో' అవడం
వల్ల ఏ'మో', పూర్తిని పూర్తిగా ఇవ్వకుండా, పరిమిత దేహపు |
జన్మనుండే పరిపూర్ణత అందుకోవాలన్న స్పృహ కలిగిస్తాడు!
ఏదీ అప్పనంగా రాదు. 'అధాటున' కూడా రాదు. అభ్యాసం
చేయనిదే, కవిత్వ నామ ధ్యాన మగ్నం కానిదే, అసలు మూలాధారం నుండి ఎగువకు ప్రయాణించేది ఎలా?
మెలకువగా వుండాలంటే పాఠకుడిని అలా వుంచగలగాలి.
నిద్రపోయేవాడిని మేల్కొల్పగలం కానీ, నిద్రపోతున్నట్లు నటించే వాడిని మేల్కొల్పడం కష్టం. 'వెళ్ళిరావాలొక
సారి' అని కవి అంటున్నాడంటే సమీపగతంలోకో, సుదూరగతంలోకో, ఒక ఆదిమసుషుప్తావస్థలోకో కూడాను!
'మో'లో - ఇంటీరియర్ మోనోలాగ్ వుంటుంది.అర్ధ బదలాయింపును
దబాయించి చేసే మెటఫర్స్,
రూపకాలు కవికి అనుకూలంగా వున్నంత పరిచితంగా,పాఠకుడికి వుండకపోవడమే'ఎడమ'కు కారణం.
భారతీయాంగ్ల కవి కాకుండా వొట్టి
తెలుగుకవిగా మిగిలినవాడు - తన ఆంగ్ల విస్తృత అధ్యయనా పాటవాన్నీ, తద్వారా ఏర్పడిన తన కొత్త ఆలోచనాలోచనాల్ని, లోకాన్నీ, వలగా పరుస్తాడు. అది 'నిషాదుడు' చేసే పనే! అయితే ఇంతకుముందు ఎనిమిది పుస్తకాలను వెలయించి వలవేసిన కవి, 'మో'గా ఈ నిషాదంలో వలను బంధనం వలె కాక, సామూహికంగా
పుచ్చుకు ఎగిరిపోగల తెలివిని పాఠక పక్షులకు తానే అందిస్తున్నాడు. ఇది తొమ్మిదోపుస్తకం అనే నవరంధ్రం. '
మహాప్రవేశ ద్వారం' అనుకుంటారో, ఓ స్వప్న 'శూన్యకాంతి రంధ్రం' అనుకుంటారో మీ ఇష్టం! చదువుకుంటే చదువుకున్నంత!
నిర్ణయాత్మక 'మో'ది క్లోజ్డ్ ఎండింగ్ రచన. అందువల్లపాఠకుడి ఆలోచనాశక్తికి ఎక్కువ శ్రమనిస్తుంది. కానీ 'శ్రమయేవ జయతే' అన్నట్లు ఆ శ్రమ శక్తి ఫలాలు మాత్రంఅత్యంత మధురంగా ఉంటాయి. అది నిజం!
కవిత్వం 'భాషకి భాష యొక్క భాష' అంటాడు 'మో'.నిజానికి 'మానిషాద' నుండి, మో 'నిషాదం' వరకూ - 'వేదన
లోనే పుట్టెను వేదమ్ములు నాదమ్ములు' అని సినారె అన్నట్లు, ఇప్పటి మో 'నిషాదం' క్రమంగా అర్ధమయ్యే ఏడ్పుగా పరిణమించడం ఒక ఊరట!
సంగీత సప్తస్వరాలలో ఏడవది నిషాదం. దానికి ఉండే
రెండేసి భేదాలూ, అందులోని సామాజిక గజ ఘీంకారం ఇప్పుడు 'నేను' 'ఆకవి' నంటూ - 'ఒక కానుక’గా, 'శబ్ద
స్పర్శ'ని 'దిద్దుకోవాలి మళ్ళీ' అని గ్రహించి,'కవుల భూగోళం' పై నుండి 'ఏ పాపం' తెలియకనే చిగిర్చిన 'రెండు ఉన్మాదాలు' 'శాంతంగా'చూస్తూ, 'సరదాగా' 'ఇంట్లోంచి ఒంట్లోకి' 'ఇక
పునర్నిర్మాణం' చేస్తున్నాడు. కావ్య సృష్టిని మీటుతున్నాడు.
హృదయం ఒక దానిమ్మకాయ
ఎన్నాళ్ళని వొలుస్తావు దాన్ని
నీ గోళ్లు పండకుండా మోహంలోంచి వ్యామోహం లోంచి ఏదన్నా ఉందా అసలేదీ లేదాని కనుక్కొందా మనుకునేవాడే కవి”
'నా నృషిః కురుతే కావ్యం' అనేది నిజ మైతే, కవి యతిలోంచి కవితా సృష్టి నియతిని అందిపుచ్చుకునే - అభ్యసనానికి, 'నిషాదం' ఒక చుట్టూ విస్తరింపజేసుకోదగిన గాఢ 'వల్మీకం'.
వేగుంట మోహనప్రసాద్
చేతిరాత
- సుధామ