ఎడమచెయ్యి
భో జరాజు కాలంలో భద్రమణి అనే ఒక గొప్ప పండితుడుండేవాడు. ఆయన ఒకసారిభోజ దర్శనార్ధం వచ్చాడు. రాజు ఆయనను ఆదరంతో పిలిపించి తన పక్కనే కూచోబెట్టుకున్నాడు.
అంతకుముందే కాళిదాసు రాజుకు కుడిపక్కన కూచుని ఉండటంచేత భద్రమణి రాజుగారి ఎడమచేతి పక్క కూచోవలిసి వచ్చింది.
ఇది చూసి భద్రమణి తాను కాళిదాసుకు తీసికట్టు అయిపోతున్నా ననుకున్నాడు.
కాళిదాసుకన్న తానే ఎక్కువ అని నిరూపించుకోవటానికిగాను ఆయన, ఎడమచెయ్యి కుడిచేతికంటే ఎక్కువైనదని అర్థంవచ్చేలాగ ఈ శ్లోకం చదవసాగాడు:
"గృహణా త్యేష రిపోశిర:
ప్రతిజవం కర్షత్య సౌవాజినం,
ధృత్వా చర్మధను: ప్రయాతి
సతతం సంగ్రామభూమావసి
దూతం చౌర్యo మదస్త్రియంచ శపథం జానాతి నాయం కరః—".
[ఎడమచెయ్యి ముందుగా శత్రువు శిరస్సు పట్టుకుంటుంది, ముందుకు దూకే గుర్రాలనువెనక్కు లాగుతుంది, బాణం వేసేముందు విల్లు పట్టు కుంటుంది. జూదం, దొంగతనం,
బలాత్కారం, శపథాలూ మొదలైనవి చెయ్యదు.]
అంతలోనే కాళిదాసు శ్లోకం యొక్క నాలుగోపాదం ఈవిధంగా పూర్తిచేశాడు:
"దానానుద్యతతాం విలోక్య విధినా శౌచాధికారీ కృతః"
[ కాని ఆ ఎడమచేతికి దానంచేసే అర్హత లేనందున బ్రహ్మ నీచమైన పనికి నియోగించాడు.]
ఆ మాట విని భద్రమణి సిగ్గుతో తల వంచుకున్నాడు.
- నృసింహదేవర ప్రేమలత