ప్రముఖ రచయిత బుర్రా లక్ష్మీనారాయణ కన్నుమూత
ప్రముఖ రచయిత, కవి బుర్రా లక్ష్మీనారాయణ శుక్రవారం (07 ఏప్రిల్ 2023) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేటలోని తన నివాసంలో మరణించారు.
ప్రముఖ రచయిత, కవి బుర్రా లక్ష్మీనారాయణ శుక్రవారం (07 ఏప్రిల్ 2023) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేటలోని తన నివాసంలో మరణించారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడుతున్నారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1955లో జన్మించారు. డిగ్రీ వరకు చదివారు. 1977లో ఈనాడు దినపత్రికలో టెలిప్రింటర్ ఆపరేటర్‌గా చేరి కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత కొన్నాళ్ళకు హైదరాబాద్ వచ్చారు. యు.ఎన్.ఐ. వార్తాసంస్థలో చేరి, సుదీర్ఘకాలం పాటు పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. తెలుగు, ఆంగ్లభాషలలో మంచి పట్టు ఉన్న రచయిత బుర్రా లక్ష్మీనారాయణ. ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని విస్తృతంగా చదువుకున్నారు. కథా, కవితా ప్రక్రియల్లో కృషిచేశారు. దాదాపు వందకుపైగా కథలు రచించారు. కలచాలనమ్, నాలుగు పుంజీలు, మట్టిఅరుగు, దేహనది, ఫాలచుక్కలు, ద్వాదశి శీర్షికలతో ఆరు కథల సంపుటాలు వెలువరించారు. కవిత్వంలోనూ ప్రయోగాలు చేశారు. ‘సెంద్రి తలపులు-ఎన్నెల మొగ్గలు’ శీర్షికన కూనలమ్మ పదాల తరహాలో రాసిన చిన్న కవితలతో ఓ పుస్తకం తీసుకొచ్చారు. అలాగే ‘ఇదీవరస’ శీర్షికన ఒక వచన కవితా సంపుటి ప్రచురించారు.
కథకునిగా ప్రసిద్ధి చెందిన బుర్రా లక్ష్మీనారాయణ సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు బుర్రా సుబ్రహ్మణ్యం సోదరుడు. మధ్యతరగతి కుటుంబాల్లోని వైరుధ్యాలను లక్ష్మీనారాయణ ప్రధానంగా చిత్రించారు. మనుషుల అంతరంగ ప్రపంచాల్లోని కల్లోలాలను ఇతివృత్తాలుగా తీసుకొని కథలు రచించారు. మానవ స్వభావంలోని వైచిత్రిని, భిన్న ప్రవృత్తులను తన కథలలో చర్చకు పెట్టారు. పాఠకుల్లో హృదయ సంస్కారానికి తోడ్పడాలన్న లక్ష్యంతో కథారచన చేసిన బుర్రా లక్ష్మీనారాయణకు చాసో, వడ్డెర చండీదాస్, కె.ఎన్.వై. పతంజలి, దాట్ల నారాయణమూర్తి రాజు ఇష్టమైన రచయితలు.
బుర్రా లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణం పట్ల ప్రముఖ రచయితలు, సహోదరీ, సహోదరులు,మిత్రులు బుర్రా శ్రీనివాస్, బుర్రా మోహనకృష్ణ, వల్లి, జయంతి నాగేశ్వరరావు, పి.వి. రాధాకృష్ణ, నరసింహమూర్తి, కె.వి.ఎస్. వర్మ, కె.పి.అశోక్‌కుమార్, ఎం.నారాయణశర్మ, రూప్‌కుమార్ డబ్బీకార్, ఏనుగు నరసింహారెడ్డి, తాటికొండాల నరసింహారావు, పాలపిట్ట గుడిపాటి, సి.ఎస్.రాంబాబు, అరసం తెలంగాణ శాఖ ఉపాధ్యక్షులు రాపోలు సుదర్శన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేని లక్ష్మీనారాయణకు ఇంటి ఓనరు బాబు మియా ఇతోధిక సహాయ సహకారాలు అందించారు.