Telugu Global
Arts & Literature

నీలిరంగు వెండిజరీచీర (కథ)

నీలిరంగు వెండిజరీచీర (కథ)
X

మహాలక్ష్మమ్మ తన గదిలో నల్లకావడిపెట్టెకు రెండు తాళంకప్పలు వేసి గట్టిగా లాగి మరీ చూసుకుంది.

వరండాలోకి వచ్చేసరికి కొడుకు మహదానందరావు రూపాయినోట్లు లెక్కపెట్టుకుంటూ...

''అమ్మా.. నీకో మాట చెప్పాలే..''... అన్నాడు నసుగుతూ.

'' నా నీలిరంగు వెండిజరీచీర ఊసెత్తితే మాత్రం మర్యా దగా ఉండదురా ఇంకేదన్నా మాట్లాడరా'' అంది.

'' దాని గురించేనే. ఇప్పుడు రేటు బాగుంది అయిదా

రు వేలు రావచ్చు. దానిని నల్లకావడిపెట్టెలో పెట్టి ఎన్నాళ్ళు దాస్తావు? నువ్వెలాగూ కొట్టుకోవడం లేదు దాన్ని అమ్మేయవచ్చు కదా.'' అన్నాడు కొంచెం విసుగ్గా.

'' ఛీ నోర్ముయ్ వెధవా నేను దాన్ని అమ్మనని నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా..'' అంటూ గట్టిగా అరిచింది.

ఈ తతంగం ఆ ఇంట్లో ఆరున్నొక్క ఏళ్లుగా జరుగు తూనే ఉంది. అయినా ఒక కొలిక్కి రాలేదు అంటే అది మహాలక్ష్మమ్మ తప్పు కాదు. తన పేరున ఉన్న పంట చెక్క రెండెకరాలు కాకుండా తనకు ఏదైనా ప్రీతిపాత్ర మైన అతి విలువైనది ఉంది అంటే అది ఈ ఒక్క 'నీలిరంగు వెండిజరీ చీర '.. మాత్రమే!

***

ఆ సాయంత్రం మహాలక్ష్మమ్మ కబురు పెట్టగా పక్క వూరులోనే ఉన్న ఆమె తమ్ముడు..చెంచురాముడు మోపెడ్ మీద వచ్చాడు.

''ఒరేయ్ తమ్ముడు..మా బడుద్దాయిగాడు నా చేత ఆ వెండిజరీచీర అమ్మిoచాలని ప్లాన్ వేస్తున్నాడు.సరే..

నేను వాడనప్పుడు అది ఎందుకు..అమ్మిపాడేద్దాం.

కానీ అసలు విషయం అదికాదురా. ఈ వెండిజరీచీర ముందు గా అమ్మిoచేసి ఆ డబ్బులు నా నల్లకావడిపెట్టె లో దాచుకోమని నాకే ఇచ్చేసి ఆ తర్వాత తర్వాత...

నా పేరు మీద ఉన్న ఆ 2 ఎకరాల పంటచెక్క మాయ మాటలు చెప్పి అమ్మిoచేసి డబ్బులు దొబ్బేయాలని చూస్తున్నాడాబడుద్దాయి. నేనుమాత్రం చచ్చేదాకా నా ఆస్తి వదిలిపెట్టను. ఆ వెండిజరీ చీర కూడా వదిలి పెట్ట ను. చేతిలో నాకు ఆ మాత్రం బలం లేకపోతే పట్టు లేక పోతే ఈ వెధవ నన్ను కడదాకా చూస్తా డoటావా'?''

చిర్రుబుర్రుగా ముఖం పెట్టి అంది మహాలక్ష్మమ్మ.

''వాడు అంత దుర్మార్గుడు కాదు . నువ్వు కంగారు

పడకు. వాడు వెండిజరీ చీర ఉపయోగం లేదు కనుక అమ్మేద్దాం అంటున్నాడు కానీ ఆ పంట పొలం మాట ఎత్తడం లేదు కదా. '' అన్నాడు చెంచురాముడు.

'' నువ్వలాగ అనకు... డబ్బు కావాలంటే తలతాకట్టు పెట్టుకోమను. లేదంటే గోదాట్లో దూకమను. మేనల్లు డిని వెనకేసుకుని వస్తావేంటిరా సన్నాసి. తల్లిని..వాడి ప్లాన్ నాకు తెలుసా నీకు తెలుసా?

కొడుకులున్న ఎంతోమంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడి అడుక్కుతింటున్నారు. కొంతమంది ఉరిపోసు కొని చచ్చిపోతున్నారు. టీవీలో చూస్తున్నాం కదా. అదంతా అబద్ధం కాదు కదా. నెల రోజుల క్రితం అయి తే... రాజవరం లో ఒక కొడుకు 85 ఏళ్ల తనతల్లిని పింఛను డబ్బుల కోసం నేల మీద పడగొట్టి కాళ్లతో తన్ని కర్రతో బాదీబాదీ ప్రాణం పోయేలా చేసాడు. అది కూడా చూసాం కదా..వారం క్రితం..మన పక్క శ్రీరామ్న గర్లో ఒక కొడుకు... 80 ఏళ్ల తన ముసలి తండ్రి ని వంద రూపాయల కోసం మెడకు టవల్ చుట్టి చంపే శాడు. ఇవన్నీ అబద్ధాలేనా.. కట్టుకథలేనా... ఆ పంట చెక్క నా పేరును ఉంది కనుక సరిపోయింది లేకుంటే నా బతుకూ అంతే. ఇలా బయటపడేవి రెండు అయి తే బయటపడనివి వంద ఉంటాయి.ఆ గొడవలన్నీ నేను పట్టించుకోవడం లేదు. నా ఉద్దేశం నాది. ఇదిగో.. ఇదంతా కాదుకానీ వాడి బుర్రకు ఇంత పచ్చిగడ్డి పెట్టు.

తినకపోతే నాలుగు తగిలించు. మేనమామవు నీకు ఆ అధికారం ఉంటుంది. నా జోలికి రావద్దని చెప్పరా.'' తమ్ముడికి ఖరాఖండిగా చెప్పింది మహాలక్ష్మ మ్మ.

'' డైరెక్టుగా అడిగితే బాగుండదు. వీలు చూసుకొని

అడుగుతాలే.'' ...అంటూ నెమ్మదిగా జారుకున్నాడు... తమ్ముడు చెంచురాముడు.

. '*

పదిహేను రోజుల తర్వాత.. ఊరిపెద్దమనిషి మహాబలే శ్వరయ్యగారు...హూoదాగా కూర్చున్నారు తన మండువాలోగిలి సింహద్వార గుమ్మం బయట అరుగుమీద..

అదే ఆ వూరికి రచ్చబండలాంటి ప్రదేశం. ఓ చిన్న పాటి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ రచ్చబండనే అందరూ ఆశ్రయిస్తారు. ఎవరెవరో వస్తూ తమ సమస్యలు చెబు తూ ఆ పెద్దాయన చెప్పింది విని వెళ్ళి పోతున్నారు.

మహాదానందరావు ఓపక్క చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు ... పిలిచాడు మహాబలేశ్వరయ్య.

'' ఏరా ఆనందం.. మీ అమ్మ నీ మీద ఫిర్యాదు చేసిం దిరా. దాని చేత పంటచెక్క అమ్మించేయాలని ప్లాన్ చేస్తున్నావట..?''.. ప్రశ్నించాడు.

'' అదేంకాదు దొరగారు.. అది అలా అనుమానం పడు తుంది.. నేను ఆ పనికిరాని వెండిజరీచీర అమ్మెయ్య మన్నానంతే ''..అన్నాడు వినయంగా మహదానంద రావు.

'' అలా కాదు కానీ ఆ పంటచెక్కె అమ్మేస్తే వచ్చే డబ్బు ఏం చేస్తావు?''

'' పెద్ద వ్యాపారం చేస్తానండి.''

'' నష్టం వస్తే..''

'' మీకు తెలియందేముంది .. అది దేవుని దయ కదా... అయినా మా అమ్మ ఇంత వయస్సు వచ్చాక ఏం చేసుకుంటుదండి ఆ పంటచెక్క''.. అన్నాడు..పళ్ళు ఇకిలించి చూస్తూ మహదానంద రావు.

'' నీ కన్నా ముందే ఇక్కడకు వచ్చింది రా మీ అమ్మ

మా ఇంట్లో ఉంది పిలుస్తానుండు.. ఆ విషయం మీ అమ్మనే అడుగు'' ...అని మహాబలేశ్వరయ్య గారు అంటుండగానే ఆయన ఇంటి సింహద్వారం తలుపు వెనుక నుండి వచ్చింది ముందుకి మహాలక్ష్మమ్మ.

''ఇదిగో మహాబలం... పక్కనుండి అంతా వింటున్నాను నువ్వు ఆడు కలిసి నాచేత ఎలా గోలా ఒప్పించి ఆ పంటచెక్క అమ్మించేయాలని ప్లాను వేస్తూన్నట్టుఉంది. ఆడికి నాలుగు చీవాట్లు పెట్టాల్సింది పోయి ఈ సాగ దీయడం ఏమిటి అంట?.. ఇదిగో నా పంటచెక్క జోలి

కి వస్తే ఊరుకునేది లేదు. ఏం చేయాలో అది చేస్తానని చెప్పు. చాలా దూరం నడిచి నీ ఇంటికి వచ్చాను.నాకు నీరసంగా ఉంది ముందు రిక్షా కట్టించి నన్ను ఇంటికి పంపించమని చెప్పు.'' చాలా కోపంగా అంటూ దూరం గా వెళ్లి రావిచెట్టు కింద మూతి ముడుచుకుని నిల బడింది మహాలక్ష్మమ్మ .

****

మరో పది రోజుల తర్వాత...పోలీస్ స్టేషన్ లో చెక్కబల్ల మీద కూర్చుంది మహాలక్ష్మమ్మ.ఆమె ఎవరి చేతనో వ్రాయించి తెచ్చి ఇచ్చిన కంప్లైంట్ చదివి వెంటనే మహ దానందరావు ని కబురుపెట్టాడు ఎస్ ఐ సర్వేశ్వరరావు.

'' ఏరా.. మీ అమ్మని ఆవిడ పేరు మీద ఉన్న ఆ రెండె కరాల పంటచెక్క అమ్మేయమని ఒత్తిడి తెస్తున్నావట నిజమేనా?''.. అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన మహదానందరావు ని ఎస్ ఐ.

''లేదు..ఎస్ఐ గారు..నాకు ఆ ఉద్దేశం ఏ కోశాన లేదు. 12 ఏళ్ల నుండి ఆవిడ నల్లకావడిపెట్టెలో ఉపయోగం లేకుండా ఉన్న ఆ వెండిజరీచీర అమ్మేయమని అడుగు తున్నానoతే.. ఊర్లో ఎవరినైనా అడగండి నేను ఆవిడ పంటచెక్క గురించి అసలు ఎవరి దగ్గర మాట్లాడలేదు.''

చేతులు కట్టుకుని నిలబడే వినయంగా చెప్పాడు మహదానందరావు.

'' ఏమయ్యా ఎస్ ఐ.. నువ్వు ఆడు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు.. నాలుగు కూకలు వేసి ఆడిచేత నా పంట చెక్క జోలికి రానని.. నన్ను బెదిరించనని కాగితం ముక్క రాయించి సంతకం పెట్టించు.అంతేగాని.. ఈ నాన్చుడు బేరాలు పెట్టకు..'' అన్నది మహాలక్ష్మమ్మ తలపోటు వ్యవహారంగా.

'' అదికాదు మహాలక్ష్మమ్మగారు వాడు నాకు దోస్తు అవ్వచ్చు కానీ చట్టం చట్టమే కదా. మీ అబ్బాయి అసలు తను మీ పంటచెక్క ఊసు ఎక్కడ ఎత్తడం

లేదు అని, తనకు ఏమీ తెలియదు అంటున్నాడు కదా...'' అన్నాడు ఎస్ ఐ కొంచెం ఆలోచిస్తున్నట్లుగా.

వెంటనే మహాలక్ష్మమ్మ తాచుపాము లాగా పైకి లేచి కొడుకు వైపు తిరిగి..

'' ఏరా బడుద్దాయి నా పంటచెక్క రెండెకరాలు నాకు తెలియకుండా నువ్వు ఆ కిరాణా వ్యాపారి రంగరాజుకి అమ్ముతానని చెప్పలేదూ..ఆఖరికి 4 రోజుల క్రితం ఆ ధాన్యం వ్యాపారం చేసే శేషగిరికి బేరం పెట్టి ఖాయం చేసుకున్నావు కదా.'' అన్నది గర్జిస్తూన్నట్లు.

'' శేషగిరా.. ఆడెవడు.. నిజంగా నాకు తెలియదు ఎస్ఐ గారు..'' అన్నాడు భయపడుతూ మహదా నందరావు.

ఎస్సై విచిత్రంగా చూస్తున్నాడు.

మహాలక్ష్మమ్మ పోలీస్ స్టేషన్లో చిందులేసినట్టు హడావిడి చేసి....

'' నీకు ఏమీ తెలియదురా పాపం. నువ్వు పాలసీసాతో పాలపీక చీకుతూ పాలు తాగే పిల్లోడివి. బొత్తి గా అమా యకుడివి'' అంటూ బయట ఓ మూలన కూర్చోబెట్టిన శేషగిరి ని లోపలికి పిలిచింది.

శేషగిరి లోపలకు వచ్చి మహదానందరావు తనకు ఆ రెండు ఎకరాల పొలము అమ్మ చూపించాడని,బేరం కూడా ఖాయమయిందని ఈరోజు బయానా ఇచ్చి అగ్రిమెంటు రాసుకోవడానికి అనుకున్నామని చెప్తూ..

సంవత్సరం నుండి ఊర్లో ఈ వ్యవహారం జరుగుతోంది అని చాలా వివరంగా వివరాలన్నీ చెప్పేశాడు..

'' అవేవో సరదాగా అనుకున్న మాటలు సార్... నిజం కాదు''... అంటూ మహదానందరావు... కిమ్మనకుండా చేతులు కట్టుకుని తలకిందగా దించుకొని నిలబడి వుండిపోయాడు... వెకిలిగా నవ్వుతూ.

ఎస్సై తనలో తాను నవ్వుకుంటూ...''సర్లే .. రేపోమాపో బాల్చీ తన్నేసే దానిలా ఉన్నావ్... కూడా పట్టుకుపో తావా నువ్వు ఆ రెండెకరాలు''... అన్నాడు మహాలక్ష్మ మ్మ వైపు చిరునవ్వు నవ్వినట్టు చూస్తూ...

''ఇదో .. ఎస్సై... ఎవరు ఎప్పుడు చస్తారో ఎవరికి తెలుసు.. చచ్చేదాకా నా ధైర్యం నాకు ఉండాల.ఏ నిద్ర మత్తులోనో నేను పడుకున్నప్పుడు ఆ బడుద్దాయి గాడు నా దగ్గరకొచ్చి...

''అమ్మా.. రేషన్ కార్డు పోయింది..ఈ కాగితాల మీద సంతకం పెట్టు మళ్లీ కొత్త రేషన్ కార్డు ఇస్తారట.''''అని దస్తావేజులు మీద సంతకాలు పెట్టించుకుని నా పంట చెక్క కాస్త అమ్మేస్తే మీరంతా ఏంచేస్తారు? నన్ను మీరం దరూ కలసి ఆధారం లేని దాన్ని చేసి పడేస్తారా. అలా కుదరదంటే కుదరదు. అందరి ముసలాళ్లలాగా కాదు నేను కాస్తంత మొండిదాన్ని. వాడిచేత కాయితం రాయించి నాకు ఇస్తావా లేదా?...''అంటూ బలవంత పెట్టినట్టుగా అడిగింది మహాలక్ష్మమ్మ.

ఎస్ ఐ వైట్ పేపర్ మీద ఏదో రాసి చదివి వినిపించి మహదానందరావు చేత సంతకం పెట్టించి ఆమెకు అందించాడు.

మహాలక్ష్మమ్మ పేపర్ వైపు కాసేపు చూసి

''ఎస్సై...నువ్వు రాసిన దాంట్లో నాకు బలం అంతగా కనిపించడం లేదు.. ఎందుకైనా మంచిదని ఇదిగో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ప్లీడరు గారి చేత ఈ బడుద్దాయి నా పంటచెక్క జోలికి రాకుండా కాగితం రాయించాను. వాడిని చదువుకొమ్మని దీనిమీద సంత కం పెట్టించు.... లేకపోతే నీకన్నా పెద్దోళ్ళు దగ్గరికి వెళ్తాను...'' అని గోలగోల చేసినట్లుగా మాట్లాడింది మహాలక్ష్మమ్మ.

ఎస్సై చేసేది లేక ఆవిడ చెప్పినట్లే చేసి..

''ఇది సివిల్ మేటరు...మీరు మీరు కూర్చొని మాట్లాడు కుని సర్దుబాటు చేసుకోండయ్యా. అయినా ఆ ముసలా విడ ఒప్పుకొని తనకుతానుగా అమ్మేయాలిగానీనువ్వు మభ్యపెట్టి ఒప్పించ కూడదురా.. '' అంటూ మహాదా నందరావు తో చెప్పి అందరినీ పంపించేశాడు ఎస్సై సర్వేశ్వ రరావు.

సంతకం పెట్టించుకున్న కాగితం పట్టుకుని తను కూడా వెనుతిరిగింది మహాలక్ష్మమ్మ..

*.

ఆ తర్వాత...

తన కొడుకు మహాదానందరావు ప్రవర్తనలో ఏదో చిన్నపాటి తేడా ప్రవేశించినట్టు కనిపెట్టింది మహా లక్ష్మమ్మ..అలా అలా నెమ్మదిగా నెల గడిచింది... ఆలోచించి ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది ఆమె...

రెండు రోజులు గడిచాక...

ఆ రోజు గురువారం ఉదయం 9 గంటలయ్యింది.

వీధిలో కారు ఆగడం అందులోంచి లాయరు సుగు ణాకరరావు ఏవో పేపర్లు పట్టుకొని కిందకి దిగడం చూశాడు మహదానందరావు.

సుగుణాకరరావు లోపలికి వచ్చి...

'' ఏమయ్యా మహదానందం బాగున్నావా..?'' అంటూ తనే అక్కడున్న ఇనపకుర్చీ మీద కూర్చున్నాడు. మహ దానందరావు భార్య మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.

''నాకు కోర్టుకు టైం అవుతుంది..వచ్చిన విషయం ఏమిటంటే.. మీ అమ్మగారు ఇకనుండి నీ దగ్గర ఉండ టానికి ఇష్టపడటం లేదయ్యా. ఆ వెండిజరీ చీర.. ఆ రెండుఎకరాల పంటపొలం.. అమ్మదట.

రెండు రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది. 90 సంవత్సరాలు పైబడ్డ ఈ వయసులో ఎందుకమ్మా ఇది... ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో సర్దుకుపోవచ్చు కదా అంటూ నేను చెప్పాల్సిందంతా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చాను.మహాలక్ష్మమ్మగారు ఒప్పుకో లేదయ్యా. నేను కాదంటే సిటీ వెళ్లి వేరే లాయర్ ను పెట్టుకుంటాను అన్నది. ఏం చేయను మీరంతా నాకు తెలిసిన వాళ్ళు కదా అందుకని నేనే ఒప్పుకుని రావ లసి వచ్చింది. ''అంటూ తన చేతిలోని పేపర్లు మడత విప్పాడు.

మహదానందరావు..అతనిభార్య అతని చిన్నపిల్లలు ఇద్దరూ దూరంగా ఉండి కళ్ళు ఆర్పకుండా చూస్తూ న్నారు...

మహాలక్ష్మమ్మ తన గదిలో నుండి వచ్చి తన గది గుమ్మం దగ్గరే నిలబడింది.. మౌనంగా.

'' మహదానందం..అంతా చదవాలంటే చాలా ఉంది. విషయం చెప్తా విను మీ అమ్మగారు తన రెండు ఎక రాల పంట పొలంలో ఒక ఎకరం తను ఇకముందు ఉండబోయే...' శాంతి నివాస్ ' .. అదే మన ఊరి చివర నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కదా.. ఆ వృద్ధ ఆశ్రమానికి పూర్తిహక్కులు రాసేసిందయ్య.

మిగిలిన ఎకరం ఆమె అనంతరం మాత్రమే నీకు చెందేటట్లు రాయించారు నాచేత. టూకీగా ఇదీ విష యం. అదిగో.. మీ అమ్మగారు అంతా వింటున్నారు కదా..వీలు చూసుకుని నీకు ఈ దస్తావేజులు ఒక

కాపీ పంపిస్తాలే.

ఈరోజే ఆవిడ వృద్ధాశ్రమంలో చేరిపోయేలా నా చేత ఏర్పాట్లన్నీ చేయించారు.. అదిగో బయట మన ఆటో సత్తిబాబు కూడా వచ్చి రెడీగాఉన్నాడు మీ అమ్మగారి ని అక్కడకు తీసుకెళ్లడానికి....నేను మీ అమ్మగారు తో పాటు..' శాంతి నివాస్ ' వృద్ధ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జాయిన్ చేసే ఏర్పాట్లు అన్నీ చూసి వస్తాను.. మీ ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్లి చూసి వస్తూ ఉండొచ్చు.''

అంటూ లాయర్ సుగుణాకరరావు చెప్తూ ఉండగానే ఆటో సత్తిబాబు వచ్చి.. మహాలక్ష్మమ్మ అందించిన మూడు బ్యాగులు ఆటోలో పెట్టాడు.

మహదానందరావు అతనిభార్య దీనంగా ముఖాలు పెట్టి ఆపెద్దావిడవైపు చూస్తూ ఉండిపోయారు

మహాలక్ష్మమ్మ మాత్రం కాస్త చిరుకోపంతోనే వాళ్ళ వైపు చూసి బయటకు వెళ్లి ఆటోలో కూర్చుంది.

****

సంవత్సరం గడిచింది...

మహదానందరావు భార్యపిల్లలతో తల్లిని చూడడానికి రెండుసార్లు వెళ్లి వచ్చాడు.

డిసెంబర్ నెల.. చలి ఎక్కువగా ఉంది. ఒక రోజు ఉదయం మహాదానందరావు కి వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది. అతని తల్లి ప్రాణం విడిచింది...అని.

అదే సమయంలో తను కూడా ఫోన్ కాల్ అందుకున్న లాయర్ సుగుణాకరరావు వెంటనే మహదానందరావు ఇంటికి వచ్చి వాళ్ళందరిని తన కారులో కూర్చో బెట్టు కొని... అందరూ కలిసి శాంతినికేతన్ వృద్ధా శ్రమానికి చేరుకున్నారు.

విషయం తెలిసిన మహదానందరావు మేనమామ చెంచురాముడు మిగిలిన బంధువులు..మరో వ్యాన్ మీద అక్కడికి చేరుకున్నారు.

మరో కారు మీద ఊరి పెద్ద మహాబలేశ్వరయ్య గారు.. ఎస్సై సర్వేశ్వరరావు కూడా అక్కడికి ఆ సమయానికి వచ్చారు.

అందరూ కలిసి జరగవలసిన కార్యక్రమం అక్కడే జరిపించారు.

మహదానందరావుని సముదాయించి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు.

లాయర్ సుగుణాకరరావు ..మహదానందరావు ఫ్యామి లీ తో టాక్సీ మీద తిరిగి ఇంటికి బయలు దేరుతూ...

''ఇదిగోనయ్యా మహదానందం.. మిగిలిన ఒక ఎకరం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు..'..అంటూ అందిం చాడు.

వెంటనే కాగితం ప్యాకింగ్ కవర్ లో పెట్టిన చీరను కూడా అందిస్తూ...

''ఇది మీ అమ్మగారి..నీలిరంగు వెండిజరీచీర.దీనిని ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా అమ్ముకో వచ్చు..''

అని చెప్పి.. చీర అతని ఒడిలో పెట్టి టాక్సీ డ్రైవ్ చేస్తూ పది నిమిషాలలో మహదానందరావు ఇంటికి చేరారు అంతా.

మహాదానందరావుభార్య.. పిల్లలు టాక్సీ దిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. చివరగా దిగిన మహదానందరావు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న లాయర్ గారి దగ్గరకు వచ్చి....

'' లాయర్ గారు ఈ ఎకరం పంటచెక్క నాకు వద్దండీ... ఇన్నాళ్ళు మా అమ్మ ఉన్న ఆ వృద్ధ ఆశ్రమానికే హక్కు లు చెందేలా తిరిగి రాయించే ఏర్పాటు చేయండి..''

అంటూ బొంగురుస్వరం తో చెప్పి దస్తావేజు కాగితాలు ఇచ్చేశాడు.

'' మా అమ్మ కట్టిన చీర... ఇది నాకు చాలు..''

మొదటిసారిగా గట్టిగా ఏడుస్తూ చలించిపోతూ అన్నాడు మహదానందంరావు.

టాక్సీలో కూర్చున్నoతసేపు గుండెలకు వదలకుండా హత్తుకొని ఉంచిన..ఆ కాగితం కవర్లో పెట్టిన...అతని కన్నీటితో తడిచి ముద్దయిన...ఆ నీలిరంగు వెండిజరీ చీర చూశాడు వెనుకకు తిరిగిన లాయర్ సుగుణా కరరావు. వెంటనే టాక్సీ దిగి..

'' మహదానందం... మీ అమ్మగారు నిజంగా చచ్చి పోలే దయ్యా. ఈ చీర రూపంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూసుకుంటే అప్పుడే కనిపిస్తారు.అదే ఆవిడ కోరిక కూడా. ఇదే పని ఆవిడ బ్రతికుండగా చేసి ఉన్నట్లయితే ఆవిడ మరో ఐదు సంవత్సరాలు బ్రతికుండేది. సరే ఇప్పుడైనా మంచి నిర్ణయం తీసుకున్నావు.లక్షల విలు వైన నీ పంటచెక్కను వదిలి అమ్మ జ్ఞాపకంగా ఈ పాత చీరనే నువ్వు ఉంచుకోవాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో అప్పుడే నీ తల్లి నీ కళ్ళల్లోకి గుండెల్లోకి వచ్చి చేరిపోయింది. ఇప్పుడు నువ్వు నీ తల్లిని ప్రతి నిమిషం చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కూడా.'. అంటూ.... మనస్ఫూర్తిగా ఓదార్చాడు.

మహదానందం ఇప్పుడు అమ్మ జ్ఞాపకాల మహదా నందంలో మునిగిపోయాడు.

- నల్లబాటి రాఘవేంద్రరావు

First Published:  20 July 2023 8:25 PM IST
Next Story