Telugu Global
Arts & Literature

సెల్లు బతుకు

సెల్లు బతుకు
X

సెల్లే పన్నీరు చల్లుతుందా

మన అందరి బతుకుల

ఇల్లే బందీయై పోతుందా

అది చూసిన గడియల

కూసుని కూసుని తిమ్మిరు లొచ్చెను

చూసి చూసి రెండు కండ్లు నొచ్చెను

పెద్ద మెదడికా మొద్దుబారినది

సక్కని సేతుల సడుగులిరిగినవి

చూపుడు వేళ్ళకు తీపులెక్కువాయే ఈ సెల్లులతోనీ

శ్రమసౌందర్యం చెదలు పట్టి పాయే ఆ పల్లెల్లోనా/సె/

నడుములన్ని గూనంటిపోయినవి

మెడలు వంకరా టింకరయ్యినవి

సృజనాత్మకతా ఎండిపోయినది

భావుకతా సుత బావురుమన్నది

లాపు టాపు చాల సేపు నడుస్తుందో తెలిసీన దొరలది

బాపూ బక్క జీవుల డొక్క లెండి పాయే ఈ దేశంలోన

కడుపు నిండ మాట్లాడిన మాటలు

కరువైపోయెను బరువైపోయెను

ఎవరికి వారే యమునా తీరే

సెల్లులతో దిల్ చెరువైపోయెను

గోటీలాడిన చేతుల తోటీ గోరాతిగోరంగా

తల్లీ సెల్లులు పట్టే చేటుకాలమొచ్చే పల్లెలగూడా

పుస్తకాలనే పఠనాసక్తితొ

పట్టిన చేతులు పుచ్చిపోయెరా

మస్తకాలలో సాంకేతికత

పురుగుమందులా రెచ్చిపోయెరా

ఆర్టీజ్ లాంగ్ లైఫీజ్ షార్టూ ఏనాడో చెప్పిరి

సెల్లులు నిల్లా తెలుసుకోర బిడ్డా

ఈ నానుడి గొప్పది

కీళ్ల నొప్పులూ ఎక్కువైతయీ

కాళ్ళు రిల్లలూ పట్టిపోతయీ

సాఫ్ట్ వేరులూ చదివిన పిల్లలు

అయ్యో పట్నం పోయిర

ఏమి ఖర్మలూ

హాయిగ అరుగుల మీదా కూసోనీ ఆడీన ఆటలు

నయ్నా మల్లెపుడైనా చూస్తామో లేదో ఆ మంచొద్దులు

రాముని భుజాన విల్లు మాయమూ

బాణం పోయెను సెల్లు నిలిచెను

కృష్ణుని చేతిలొ వెన్న గాయబూ

ఫ్లూటు పోయెను స్మార్టు కుదిరెను

సెల్లు సిలువకూ క్రీస్తులమయ్యామా అతి కిరాతకంగా

టెక్నాలజీ దోస్తులమయ్యామా అకటా దయనీయంగా

ప్రైవేటైజేషన్ వేట లోపటా

వేటు పడినదీ ఫ్రై ఐ పోతిమి

గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ల

బలై పోతిమి ఆహుతి ఐతిమి

స్థానిక సంస్కృతి స్థానిక భాషలతో పోరాట పటిమతో

వ్యాపార సంస్కృతిని పాతర వేద్దామూ ఓ తండ్రుల్లార

సద్వినియోగం చేస్తే సెల్లూ

తల్లి వంటిదీ చెల్లి వంటిదీ

దుర్వినియోగ పరిస్తె బాబూ

నిను దున్నిపోతదీ దునుమాడుతదీ

వస్తుసంస్కృతికి బానిస కావొద్దూ మనిషేనాటికి

మానవమూల్యాల్

మణి మాణిక్యాలూ ఈ నరజాతికి

- నలిమెల భాస్కర్

First Published:  6 Jan 2023 5:49 PM IST
Next Story