ఎట్లా చదవాలంటే...
నిద్రాభంగం కలక్కుండా
తలుపులు సున్నితంగా తెరిచినట్టు
చేతుల్లోకి తీసుకున్న పసిపిల్లాణ్ని
పరమ సుతారంగా పొదివి పుచ్చుకున్నట్టు
మెత్తని గడ్డిమీద పాదాలు ముద్రిస్తూ
పచ్చదనాన్ని గుండెల్లోకి పిండుకున్నట్టు
కొత్త చొక్కాను
ఆరోజే మడతలు విప్పుతున్నట్టు
జేబులో దాచుకున్న తాయిలాన్ని
కాస్తకాస్త కొరుక్కు తింటున్నట్టు
జారిపోతుందేమోనన్న భయంతో
మొలతాడు నిక్కరు మీదికి లాక్కుంటున్నట్టు
ప్రియురాలి కౌగిలింతలో సేద తీరుతున్నట్టు
అమ్మ పాదాలను ప్రేమగా తాకుతున్నట్టు
సైనికుడు మాటిమాటికీ వెనుదిరిగి
భార్యాపిల్లల్ని చూస్తూ యుద్ధభూమికి
వెళుతున్నట్టు
మునికాళ్లపై నుంచుని గోడ మీదగా
పక్కింట్లో గొడవను రహస్యంగా
చూస్తున్నట్టు
మనస్తీరాన ఊహల కెరటాలు
వెనక్కీ ముందుకీ ఉవ్వెత్తున
ఎగసి పడుతున్నట్టు
అదను చూసి పదును తెలిసి
నాగేటిచాళ్లలో విత్తనాలు వెదబెడుతున్నట్టు
నడక ముదిరి పరుగందుకున్నట్టు
గసపోత లోంచి నినాదాలు
ఉరుముతున్నట్టు
పీర్లపండక్కి ఒక్కూపుతో
నిప్పుల గుండంలో దూకినట్టు
మునిగిపోతున్న బంగారం కోసం
అమాంతం బావిలో దూకినట్టు
చెమట చెరువులో రొప్పు నిప్పును
ఆర్పకుంటున్నట్టు
విశ్రాంతిలో విహారాన్ని
కల గంటున్నట్టు
కవిత్వం అట్లా చదవాలి
కవిత్వాన్ని అట్లా కౌగిలించుకోవాలి
కవిత్వంలో అట్లా మునిగిపోవాలి
అక్షరాల్ని అట్లా హత్తుకోవాలి...
- ఎమ్వీ రామిరెడ్డి