కలికి తోరణం
ధీరులు భర్తలు ఐదుగురున్నా
దీనతలో భ్రాతకు మొర పెట్టుకుంది ద్రౌపది.
అనితరమైనది భగిని విశ్వాసం
అపూర్వమైన బంధాని కది సాక్ష్యం.
చరిత్రలో రుక్సానా
తక్షశిల పురుషోత్తముని చేతికి,
మణి తోరాన్నొక్కటి కట్టి
నుదుటి రేఖల గీతను
సవరించు కొందట
ప్రపంచం అంచులను
తాకాలనుకున్న అలెగ్జాండరును
ఆపదనుండి దాటించిందట.
పోకిరీ కైనా సరే,
రాఖీ కడితే చాలు
మనసు చెమ్మగిలుతుంది
పొరలు తొలగిన కన్ను తెరచుకుంటుంది.
గుండె చెరువు గట్టు గండ శిల
కరగి కండ చెక్కెరల తీగ పాకం కడుతుంది.
భూమి దూరం ఎంతున్నా
నూలు పోగుల దారం
అనురాగాల సూత్రం అల్లుతుంది.
అన్యుడైనా సరే
అన్నదమ్ములకు వలె
ఆజన్మ స్నేహం
పుట్టు కొస్తుంది.
అక్క చెల్లెళ్ళు సర్దుకున్న థాలీ లో
రాఖీ వెన్నెల చందమామ తళుకు చూపుతుంది.
అగ్రజునికి అనుజునికి
నుదుట దిద్దిన తిలకం
వేయి హరివిల్లుల వర్ణాలను
అందిపుచ్చు కుంటుంది.
సోదరులిచ్చిన కానుక
బాలిక కొంగు బంగారమై సొబగు చూపుతుంది.
వరుస పేనిన దూది పింజెల పోగు,
రాఖీ తళ తళల కాంతులీనుతుంది.
స్వస కిచ్చే రక్షణల సంప్రదాయం
వేల్పు బోనాల మిన్నంటుతుంది.
అక్కకు చెల్లికి, చిన్నారికి, అగ్రజకు,
తొలగని ఆదరణల పుట్టినింటి
పాల కడలి పొంగు చూపుతుంది.
కలికి కట్టిన తోరణం
నడు రాతిరి ఒంటరిగా అతివ
నడచి రాగల దారికి సైదోడు కలడనే
తీర్మానం చేస్తుంది.
శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల
(వర్జీనియా USA)