కొన్ని సమయాలు (కవిత)
రాలిన పూరేకుల్లో
గడిచిపోయిన జీవితం
జారిన కన్నీళ్ళలో
ఛిద్రమైన కలలు
అలలు లేని సాగరుని కలతలా
నావికాని క్షణాలలో
ధ్వంసమైన జ్ఞాపకాలు
ఎంతో అనుకున్న జీవితం
అంతులేని చింతనను మిగిల్చి తప్పించుకున్న తీరు
ఎండమావి కనిపించని ఎడారే
కాలచక్రం
ఎంతో దూరం నడిపిస్తుంది
ఏది చేరువయేది
దేన్ని దూరం చేసేది
తెలియని భ్రమల అడుగులలో..
ఏ దారి ఏ మలుపులో మూసుకుపోయేది
మది అసలే ఊహించదు
ఆగక జారే కన్నీటికి కూడా
ఎక్కడ నిలపాలో తెలుసు..
తెలియని దిగుళ్ళకు
గూడు అనవసరమని
ఎన్నటికీ అర్థం కాదు..
ఎప్పటిలానే
నిదుర కనులను తాకక మునుపే
కల తీరాన్ని చేరిపోతుంది
చిట్లిపోయిన సాయంత్రాలను మోసుకు తిరిగే మనసుకు
నిట్టూర్పు తప్ప ఓదార్పు తోచదు
ఉపమానాలకందని
ఈ రాతలతో
నలిగిన కాగితంలా
రెపరెపలాడుతూ
మిగిలిన కాసిని ఘడియలు
క్షణాల్లోకి చేరిపోతూ..
ఐనా.. ఏమైనా..
ఎప్పటికప్పుడు రేపటి తీరమ్మీద మేల్కొనేందుకు ఆశలవర్ణం
చప్పుడు చేస్తూ
నడిచి వస్తూనే ఉంటుంది
దిగులు పొరలను చీలుస్తూ గుబులుగా..
-మొదలిపద్మ