ప్రేమిస్తే (చిన్న కథ )
చాలా రోజల తర్వాత కలుసుకున్నారు స్నేహితురాళ్లు ఇద్దరూ. కల్పన వచ్చి నందుకు సరోజ చాలా సంతోషించింది. "కోడలు కనపడటం లేదు, పుట్టింటికి వెళ్లిందా.పనులన్నీ నీవే చేసుకుంటున్నావు " అంది కల్పన.
" లేదు తను ఉద్యోగానికి వెళుతుంది . అయినా మా ఇంట్లో ఏం పని ఉంటుంది " అంది.
" అయినా మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి గాని కోడలిని ఉద్యోగాలు చేయిస్తే మన నెత్తి కెక్కుతారు . అందులో నీవు అమాయకురాలివి" అంది కల్పన.
నవ్వి ఊరుకుంది సరోజ.
సాయంత్రం కోడలు శిల్ప వచ్చేసరికి వంట సిద్ధము చేసి కొడుకు, కోడలుకు వేడి వేడి కాఫీ అందించింది.
ఇదంతా చూస్తుంటే కల్పనకు స్నేహితురాలి మీద కోపం జాలి రెండూ కలిగాయి.
ఆ రెండో రోజు బాత్రూంలో కాలు జారి పడింది. పని మనిషి ఫోన్ చేసి చెప్పగానే ఉరుకు పరుగుల మీద వచ్చి హడావుడిగా వచ్చి హాస్పిటల్ కు తీసికొని వెళ్లి అన్ని పరీక్షలు చేయించి ఇంటికి వచ్చాక అంతా బాగుందని డాక్టర్ చెప్పిన కూడా శిల్ప ఆఫీస్ కు రెండు రోజులు సెలవు పెట్టి సరోజను కన్న కూతురు లా కంటికి రెప్పలా చూసుకోవడం తో కల్పనకు నోట మాట రాలేదు.ప్రేమిస్తే ఇంత ప్రేమ దొరుకుతుందా...
కోడలి మీద దెబ్బ లాడి వచ్చిన కల్పన సరోజతో వెళ్లొస్తానంది. తన కంటికున్న అహపు పొర తొలగడంతో .
అదే చిరునవ్వు తో సాగనంపింది సరోజ....!!
Md.అఫ్సర వలీషా
(ద్వారపూడి,తూ.గో .జి)