మాటల పాటల కడలి... సముద్రాల రాఘవాచార్య
తెలుగు సినీ రచనకు గ్రామర్ ను గ్లామర్ ను అందించి, కథ,పాటలు,మాటలు చిత్రానువాదాది అంశాలలో సరికొత్త దిశ ను చూపించి ,ప్రేక్షకలోకానికి సినిమాను అతిసన్నిహితం చేసి,"సినీ కవిత్రయం "లో తిక్కన వలె విస్తృతరచనచేసి 'సినీకవికులపతి "గా గౌరవం పొందిన, విశిష్ట విలక్షణ కవి.శ్రీమాన్.సముద్రాల రాఘవాచార్య.
1902 జులై19 వతేదీన గుంటూరు జిల్లా పెదపులివర్రు లో జన్మించిన సముద్రాల సంస్కృతాంధ్రాంగ్లాది సాహిత్యాలలోనే కాదు,ఉరుదూ భాషలలో పండితుడు. భాషాప్రవీణ పాసై, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. విద్యార్థి దశలోనే అవధానాలు చేసి,తిరుపతి వెంకటకవుల ప్రశంసలందుకొన్నారు. 1935-36లోకొసరాజు తోపాటు , కమ్మవారి చరిత్రపై పరిశోధన చేయాల్సిందిగా, జాగర్లమూడి కుప్పు స్వామి చౌదరి గారి అభ్యర్థనమేరకు చెన్నై వెళ్ళిన సముద్రాల "ప్రజామత"పత్రిక లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తు సినిమా ప్రకటనలు,సమీక్షలు రాసి గూడవల్లి రామబ్రహ్మం గారినాకట్టుకొన్నారు. 1937 లో "కనక్ తార" సినిమా ద్వారా పరిచయమైనారు.
అంతవరకు నాటకీయ పరిభాషలో వెలువడే సినిమా రచనకు స్వస్తి చెప్పి ఆబాలగోపాలాన్ని అలరించేలా రచన చేసి ,ట్రెండ్ సృష్టించాడు.
1937తదుపరి సముద్రాల వారి కలం అప్రతిహతంగా తుదిశ్వాస వరకు(1967)సాగి,పలు పౌరాణిక,చారిత్రక,సాంఘిక చిత్రాల విజయాలకు కారణభూతమైయ్యారు.
వందేమాతరం,యోగివేమన,భక్తపోతన, త్యాగయ్య, స్వర్గసీమ, దేవదాసు,విప్రనారాయణ,భూకైలాస్,సువర్ణసుందరి,దొంగరాముడు ,
అనార్కలి,భక్తప్రహ్లాద,
అమరశిల్పిజక్కన్న,నర్తనశాల,
లవకుశ ,శ్రీకృష్ణతులాభారం, బొబ్బిలియుధ్ధం,పాండవవనవాసం, మొదలైన పలు హిట్ చిత్రాలకూ సముద్రాలవారేరచయిత..!
రామాయణ,భారత,భాగవతాలకు సంబంధించిన ఇతివృత్తాలతో వెలువడిన సినిమాలకు రచన చేసింది సముద్రాల వారే.
1940-67మధ్యకాలంలో వెలువడిన చిత్రాలలో అధికశాతం సముద్రాలే రచనచేశారు. ఎ.ఎన్ ఆర్, ఎన్ టి ఆర్ , ఎస్ వి ఆర్ వంటి అగ్ర శ్రేణి నటులకు సంభాషణోచ్చారణలో శిక్షణ ఇచ్చి వారికి గురతుల్యుడైనారు. గాన గంధర్వుడు ఘంటసాల గారిని స్వర్గసీమ చిత్రం ద్వారా గాయకునిగా పరిచయం చేసింది సముద్రాలవారే. రేణుక,వాహిని, విజయా, ఎవిఎం ,భరణీ అంజలి కంబైన్స్ రాజరాజేశ్వరీ,వినోదా, మొదలగు ప్రతి ప్రఖ్యాత నిర్మాణసంస్థల ప్రారంభ చిత్రాలకు ఆ తదుపరి సినిమాలకు సముద్రాలవారే రచన చేయడం విశేషం.
"హాయి హాయిగా ఆమనిసాగే" " జీవితమేసఫలము" " నీలకంధరా దేవా" "అనురాగము విరిసేనా" "రారోయి మాఇంటికి మామ"" హిమగిరి సొగసులు" నిలువుమా నిలువుమా నీలవేణి, మొదలైన పాటలు కేవలం ఉదాహరణలే..
సముద్రాల వినాయక చవితి, బభ్రు వాహన,దీపావళి చిత్రాలకు దర్శకత్వం వహించారు. శాంతి,,దేవదాసు చిత్రాలకు సహనిర్మాత. ..ఆయన భక్త రఘునాథ్ చిత్రంలో కొన్ని శ్లోకాలు పాడారు కూడా..సినిమాల్లోకి రాకముందు అవధాన మంజరి, చార్మినార్ కావ్యాలను రాశారు.కాని అవి అలభ్యం.
సముద్రాల జూనియర్ వీరి తనయుడే. తండ్రి సాహిత్యవారసుడై పాండురంగమహత్యం మొ ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. హాస్య రచయిత అప్పలాచార్య వీరిమేనల్లుడు. మల్లాది వారు ఆప్త మిత్రులు.సముద్రాల పాటలన్ని చాలావరకు మల్లాదే రాశారంటారు.కానీ అది సరైంది కాదు.
సినీ రచనకు ఒరవడి తెచ్చిన సముద్రాల , పద్మనాభం గారి శ్రీరామకథ చిత్రానికి" రామకథ శ్రీరామకథ"( గానం- ఎస్.పి.బాలు) ను రాసి ,మరునాడు అందించాల్సిందని కొడుకుకు చెప్పి , మార్చ్ 16నిద్రలోనే తుదిశ్వాస వదిలారు..
సినిమా రచనకు భాష్యం చెప్పిన సీనియర్ సముద్రాల వారికి మరణానంతరం సైతం ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వ పురస్కారం అందకపోవడం తెలుగు వారి దురదృష్టం.ఆయన విగ్రహాన్ని మాత్రం ఫిల్మ్ నగర్ లో ఆయన మనుమరాలు శుభశ్రీ సొంత ఖర్చు తో ప్రతిష్ఠించడానికి ,నాటి వై.ఎస్.ఆర్ ప్రభుత్వం 2009 లో స్థలాన్ని చూపించి,సహకరించింది.
జయంతి తే రస సిధ్ధా కవీశ్వరః
డాక్టర్.వి.వి.రామారావు.(సంగీత &సాహిత్యాభిలాషి.)