మంచి పద్యంతో కాసేపు! తిరుపతి వేంకట కవుల నాటకీయత!
చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి, గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
ఈ పద్యం గురించి తెలియని తెలుగువాళ్ళు అరుదే కదా! ఇది అందరికీ సులువుగానే అర్థం అవుతుంది కూడానూ! అదే దీని గొప్పతనం. ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగు పద్యానికొక కొత్త ఊపిరినిచ్చి, ప్రజలమధ్యకి తీసుకెళ్ళినవాళ్ళు తిరుపతివెంకట కవులు. అవధానాల సాముగారడీలతో ఆగిపోక, గొప్ప నాటకాలూ మంచి కావ్యాలు రాసి కవులనిపించుకున్నారు.
ముఖ్యంగా తెలుగు పద్యంలో
నాటకీయతనీ, సంభాషణలో కాకువునీ, వ్యవహార భాషనీ ప్రదర్శించే తీరులో తిక్కనంతభ ప్రజ్ఞని కనబరిచారు. అందుకే వాళ్ళ పాండవోద్యోగ విజయాలు అంత ప్రజాదరణ పొందాయి!
ఈ పద్యమే అందుకు మంచి ఉదాహరణ. పద్యం ప్రారంభించటంతోనే, "చెల్లియొ చెల్లకో" అనడంలో మామూలుగా సంభాషించుకునే తీరు (అయిందేదో అయింది అన్నట్టుగా) మనసుకు హత్తుకుంటుంది. సంధి చేస్తే నీ పిల్లలూ పాపలూ ప్రజలూ చక్కగా ఉంటారు అని చెప్పడంలోనే యుద్ధం చేస్తే వాళ్ళందరూ నాశనమౌతారని అన్యాపదేశంగా చెప్పడంలోని గడుసుతనం చూడండి! "ఎల్లి" అంటే రేపు అని అర్థం. "ఎల్లుండి"లో(రేపు తర్వాతి రోజు) ఉన్న ఎల్లి ఇదే.
అలతి పదాలతో, సంభాషణా శైలిలో, నాటకీయత ఉట్టిపడే అందమైన పద్యం!
కూర్పు :వింజమూరి వెంకట అప్పారావు