Telugu Global
Arts & Literature

మానవత్వమే చిరునామా…!

మానవత్వమే చిరునామా…!
X

మానవత్వమే చిరునామా…! 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తోంది..

జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి..

ప్రజలందరినీ ఇళ్లలోనే ఉండి ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోమని హెచ్చరించాయి.

దాంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. అవసరం మేరకే బయటకు వస్తున్నారు..

నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుక్కోవడానికి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటకు వచ్చి వెంటనే మరల వెనక్కి వచ్చేస్తున్నారు.

ఇళ్లలో వుండే చిన్నారులు , వృద్ధులు చాలా జాగ్రత్తగా వుంటున్నారు..

ఎందుకంటే వృద్దులకు, చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.. అందువలన వారికి అందరికన్నా ముందుగా వ్యాధి ప్రబలే అవకాశం ఉంది..

కాబట్టే కుటుంబ సభ్యులు వారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటున్నారు..

వారికి ఏ చిన్న అనారోగ్యం కనబడినా వెంటనే తగిన మందులు వాడుతూ తగ్గిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు..

వర్ధనమ్మ కు ఎనభై సంవత్సరాలు..ఆ కుటుంబం అంతటికీ పెద్ద దిక్కుగా వుంటూ అందరి బాధ్యత లూ మోసింది..పిల్లల్ని కనీ , పెంచి ప్రయోజకుల్ని చేసింది. వారి పిల్లల సంరక్షణ బాధ్యత నూ తీసుకుని వారికి చదువులు చెప్పించి, పెళ్లిళ్లు అవీ చేయించింది.

ఇప్పుడు వృద్ధాప్యంలో శరీరం సహకరించక వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ కాలం నెట్టుకొస్తోంది..ఆమెకు ఎప్పుడో గానీ అనారోగ్యం వుండదు. ఇప్పుడు కూడా ..అంటే కరోనా కాలంలో కూడా ఆమె ధైర్యంగా వుంటూ అందరికీ అన్ని జాగ్రత్తలు చెబుతోంది..

" వంద సంవత్సరాల కొకసారి ఇలాంటి ఉపద్రవం వస్తుందటరా పిల్లలూ..!నా చిన్నప్పుడు అదేదో ఫ్లూ జ్వరమట..అది వచ్చి చాలా మందిని పొట్టన పెట్టుకుంది అని

చెప్పుకునేవారు.. నాలుగు వందల సంవత్సరాల క్రిందట ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని కోట్ల మంది జనం చచ్చిపోయారట.. తర్వాత వంద సంవత్సరాల కి కలరా..ఇలా వంద సంవత్సరాల కి ఒక తెలియని జబ్బు ఒక్కొక్కటిగా వచ్చి జనాభాను తగ్గిస్తుందట..

ఇప్పుడు కరోనా మహమ్మారి..! ఇది జనాల్ని ఎలా భయ భ్రాoతులను చేస్తోందో మనం చూస్తూనేవున్నాం..

ఎక్కడో చైనాలో పుట్టిందట.. కంటికి కనబడని క్రిమి. ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా ప్రపంచం అంతా వ్యాపించేసింది.. ఈ మాయదారి రోగం..! ధనవంతులనీ లేదు,పేదవాళ్ళనీ లేదు. దేశ ప్రధానులనీ లేదు, రాచరికపు కుటుంబాలనీ లేదు..అందరికీ ఒకే విధంగా వ్యాపిస్తోంది.. అందరినీ ఒకే విధంగా బాధిస్తోంది..!

జనం ప్రాణాలు మింగేస్తోంది..

అందుకని మీరంతా జాగ్రత్తగా వుండాలిరా భడవలూ..!

ఎవరికి వుందో తెలీదు.. ఎవరికి లేదో అసలు తెలీదు.. పధ్నాలుగు రోజుల వరకూ అది ఒంట్లో ఉన్న విషయమే నిర్ధారణ చేయలేమంట.. మాయదారి జబ్బు..!

జబ్బు ఉన్నవాళ్లు కూడా తమకు లేదనుకుని జనంతో కలిసి తిరిగేస్తుంటారు..అప్పుడు మిగిలిన వారికి కూడా సోకుతుంది.. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా..!అందరూ మాస్కులు ధరించండి.. అదేదో సానిటైజర్ అట దానితో చేతులు శుభ్రం చేసుకోవాలి తరచూ.. వ్యక్తిగత దూరాన్నీ, పరిశుభ్రత ను పాటించాలి.. దగ్గు,జలుబు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. మందులు వేసుకోవాలి ..తెలిసిందా..? "

అంటూ అందరినీ ఉద్దేశించి చెప్పింది ఆమె..

" తెలిసింది లే వే బామ్మా..! కానీ మా అందరికన్నా నువ్వే జాగ్రత్తగా ఉండాలి ..! "

" ఏం .? ఎందుకని ? "

" ఎందుకంటే, మీవంటి ముసలి వాళ్ళకే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది .అటువంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులకు , పిల్లలకే ఇది త్వరగా

అంటుకుంటుంది.. అందుకని నువ్వే మా అందరికన్నా జాగ్రత్తలు పాటించాలి.. తెలిసిందా..?"

" నాకేంటి రా ? కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నదాన్ని..! వస్తే రానీరా..!చక్కగా పోతాను..

కానీ మీరంతా చిన్నవాళ్ళు. ఎంతో భవిష్యత్ ఉన్నవాళ్లు.. ఎన్నో చూడవలసిన వాళ్ళు.. మీకేమీ కాకూడదనే నా బెంగ అంతా..!అందుకే మీరంతా జాగ్రత్త అని చెబుతున్నాను. "

'"అలా అనకే బామ్మా..! నువ్వే కదా ఈ కుటుంబానికి పెద్దదిక్కు.. నువ్వు పోతే మాకు దిక్కెవరు..? "

అన్నారంతా ఆందోళన గా..!

ఇన్ని జాగ్రత్తలు చెప్పిన వర్ధనమ్మ కు హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది.. జ్వరం, దగ్గుతో పాటు వూపిరి తీసుకోవడం కష్టమైపోయింది..

అందరూ భయపడ్డారు.. లాక్డౌన్ నుండీ బయటకే పోని బామ్మగారికి కరోనా ఎలా వస్తుంది? కానీ చూస్తుంటే లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి..ఆ క్షణం నుండీ ఆమెకు దూరంగా మసలసాగేరు ఇంట్లోని వారంతా..ఆమె అనారోగ్యం బయటికి తెలిస్తే తమ అందరినీ వెలి వేస్తారని భావించి మౌనంగా ఉండిపోయారు..

ఆమె దగ్గరికి ఎవరూ వెళ్లలేదు.. ఆమె కూడా ఎవరినీ దగ్గరకు రమ్మనలేదు.. వారి భయం చూసి..

ఆమెకు సరైన వైద్యం అందకపోవడంతో ఆ రాత్రి కే ఆమె కన్నుమూసింది..

ఆమె కరోనా వల్లనే చనిపోయిందన్న అనుమానంతో చనిపోయినా ఆమెను సమీపించడానికి ఎవరికీ మనస్కరించలేదు.. కనీసం తల దగ్గర దీపం పెట్టలేదు..

ఎలాగో తెల్లారింది.. ఆమె చనిపోయిన విషయం ఆ వీధిలోని అందరికీ తెలిసిపోయింది..

కారణం ఏదైనా కరోనా సమయంలో చనిపోయింది కాబట్టి ఎవరూ పరామర్శించలేదు..ఎవరూ దగ్గరికి రాలేదు.. ఆమెను శ్మశానానికి ఎలా తీసికెళ్లి దహనం చేయాలా అని ఆలోచించి మునిసిపాలిటీ వారికి ఫోన్ చేస్తే వాళ్లు కూడా బిజీ గా ఉండటం వలన రాలేమని చెప్పేశారు..

ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో దిక్కులు చూస్తుండిపోయారు కుటుంబ సభ్యులు..

వారింటికి కొంచెం దూరంలో ఒక మసీదు ఉంది. ఆ మసీదు చుట్టుపక్కల కొన్ని ముస్లిం కుటుంబాలు నివసిస్తూ వున్నాయి.. చుట్టుపక్కల ఎవరికైనా కష్టం వస్తే వెంటనే వెళ్లి ఏదో ఒక సహాయం చేస్తుంటారు..

బామ్మగారు అటువైపు వెళ్లినపుడల్లా ఆ మసీదు ను సమీపించే సరికి ఒకసారి కళ్ళు మూసుకుని నమస్కరించుకుంటుంది.. అందుకని బామ్మగారు ఆ ముస్లిం సోదరులకు తెలుసు..

బామ్మ గారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఓ పది మంది మాస్కులు తొడుక్కుని వచ్చేశారు బామ్మ గారింటికి."అన్య మతం వాళ్ళు ఇంటికొచ్చారేమిటా "అని ఆశ్చర్య పోయారు కుటుంబ సభ్యులు..

శవాన్ని పెట్టుకుని దూరంగా నిలబడివున్నారు .. సీను అర్థమైపోయింది వాళ్ళకి..

శవదహన కార్యక్రమానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వాళ్లే రెండు కర్రలు తీసుకుని వచ్చి శవ వాహకాన్ని తయారు చేసి ఆమెను దానిపై పడుకోబెట్టి మోసుకుపోయారు శ్మశానానికి..

దాని వెనకాల దూరంగా నలుగురు ఇంటి సభ్యులు వచ్చి స్మశానవాటికలో జరగవలసిన తతంగాన్ని జరిపించారు..

శవదహనం అయిపోయింది.. ఇంటికొచ్చేశారు.కుటుంబ సభ్యులు వారికి థాంక్స్ చెబుతుంటే వాళ్ళు అన్నారు..

" మాకు థాంక్స్ ఎందుకు భాయ్..? బామ్మా జీ మా మసీదు వైపు వస్తుంటారు.. మా అందరికీ తెలుసు.. మా అల్లాకి నమస్కారం చేసుకుంటారు.. ఆ అల్లాయే ఈ కార్యక్రమం జరిపించాడు భాయ్..

ఇలాంటి పరిస్థితి లోకూడా ఆలోచిస్తారేంటి భాయ్..?బామ్మగారు మీ అందరికీ పెద్ద దిక్కు. వారిని సక్రమంగా పంపించడం మన అందరి జరూర్ కర్తవ్యం..

ఇలాంటి సమయంలో కులం, మతం జాన్తా నై.. మనమంతా భాయ్.. భాయ్.. మనమంతా మనుషులం..మేము అల్లా సేవికులం..కులం,మతం మాకేమీ లేదు..మానవత్వమే మా మతం.. అందరికీ సహాయపడటమే మా అభిమతం.. కరోనా సమయమైనా మరొకటైనా మన సొంత మనుషుల్ చనిపోతే అలా పత్తర్ లాగా ఉండరాదు భాయ్..మన పని మనం చెయ్యాలి.. ఆపై అంతా అల్లా దయ..అంతా ఆయనే చూసుకుంటాడ్.. మనకేమీ అన్యాయం జరగద్.. ఫికర్ మత్ కరో భాయ్..! వెళ్లి వస్తాం..! " అంటూ వెళ్లిపోయారు..

సిగ్గుతో తలదించుకున్నారు కుటుంబసభ్యులు..

రక్త సబంధీకులమైన మనం బామ్మను దూరంగా పెడితే ఏ సంబంధమూ లేని ఈ అన్య మతస్థులు ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా అన్నీ జరిపించారు.. ఏది నిజమైన మానవత్వం..? అని ప్రశ్నించుకున్నారు..

ఈ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేది నిజమైన మానవత్వమే అని అప్పుడర్ధమైంది వాళ్ళకి.. మనసులోనే వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు..

- జి .రంగబాబు (అనకాపల్లి)

First Published:  9 Dec 2022 12:43 PM IST
Next Story