ఆధునిక వచనకవిత్వంలో వస్తు- శైలి - శిల్ప నిర్మాణ పద్ధతులు: ఆవిష్కరణలు
భావం.
" కవనీయం కావ్యం (వర్ణింపదగినది కావ్యం) " అంటూ 'అభినవగుప్తుడు' ప్రవచించాడు.
" దర్శనాత్ వర్లోచ్చాద రూడే లోక కవిశ్రుతి: " అని మరో శ్లోకం వ్యాఖ్యాన రూపంలో వినిపిస్తుంది.
కానీ.. మన ప్రాచీన గ్రంథాల్లో,ప్రబంధాల్లో,పద్యాల్లో,కావ్యాల్లో,గేయ కవితల్లో ఈ వర్ణనే అధికం.అది అప్పటి శైలి.ఆ నిర్మాణరీతి అలాంటిది.
ఉదాహరణకు మనుచరిత్ర,ఆభిజ్ఞాన శాకుంతలం,పాండురంగ మహత్యం వంటి పద్యకావ్యాల్లోనూ.. చెల్లీ చంద్రమ్మ,ఉద్యమం నెలబాలుడు లాంటి గేయ కవిత్వంలోనూ ఈ తరహా వర్ణన వ్యక్తమవుతుంది.
1850 మొదలుకొని నేటిదాకా వస్తున్న కవిత్వాన్ని ఆధునిక కవిత్వంగా భావించవచ్చు.
కందుకూరి,గురజాడ,రాయప్రోలు తదితరులతో ఆధునిక కవిత్వ దశ ప్రారంభమైంది.దీనికి ఆద్యుడు 'వ్యవహారిక భాషోద్యమానికి' శ్రీకారం చుట్టిన గిడుగు రామమూర్తి పంతులుగారు.సరళమైన జన సామాన్య భాషలో కవిత్వం రాయాల్సి వచ్చింది.పండితుల - పామరుల భాషకు భిన్నంగా.. మధ్యస్తంగా విద్యావంతులు వాడే భాషను కవిత్వానికి ప్రామాణిక భాషగా మలిచారు. ఇందులో అనుప్రాసలు,అంత్యప్రాసలు చాలానే కనిపిస్తాయి.పదబంధాల్లో మార్పులు వచ్చాయి.
ఛందస్సు,అలంకారాలు రూపుదిద్దుకున్నాయి.వీటిలో విశ్వజనీన స్పృహ ఎక్కువ.
వైయక్తికమైన అంశాన్ని కూడా 'విశ్వమానవ దృష్టి'తో అధ్యయనం చెయ్యడం పరిపాటి.కనుకనే " విశ్వ: శ్రేయ: కావ్యం " అని ఒక నిర్వచనం పుట్టింది.'ప్రపంచ శ్రేయస్సును కాంక్షించేదే కావ్యం' అని దీని అర్థం.
కానీ.. వర్తమాన తరంలో ఇది వర్తించదు.స్పష్టంగా,సరళంగా,వచనశైలిలో రాసే కవితల్లో.. అక్కడక్కడా భావచిత్రాలతో,ప్రతీకలతో చెప్పడం కనిపిస్తుంది.ఈ భావచిత్రాన్ని (Image - Not an Art) పదచిత్రం, మాటల్తో గీసిన బొమ్మ అని కూడా అంటారు.ప్రతీక(Symbol) అంటే గుర్తు.ఈ చిహ్నాలతో పోల్చి చెప్పడం ఒక పద్ధతి. ఉదాహరణకు: 'కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె' ఒక మంచి ప్రతీక.కవిత్వంలో వివిధ పదచిత్రాల పరస్పర సంబంధం వలన కావ్యానికి అర్థవంతమైన భావన లభిస్తుంది.కొన్నిసార్లు సూటిగా చెప్పడం వలన వాక్యాల్లో కవిత్వం లోపిస్తుంది.సినారే మాటల్లో చెప్పాలంటే.. " కప్పితే కవిత్వం - విప్పితే విమర్శ " అంటారు.ఈ వ్యాఖ్యలోని మర్మ రహస్యాన్ని,
వ్యత్యాసాన్ని,నిశిత పరిశీలనతో అధ్యయనం చేస్తే.. కవిత్వానికి - విమర్శలోని లోచూపు దృష్టికి తేడాస్పష్టమవుతుంది.
సాధారణ వచనానికీ,కవిత్వంతో కప్పి చెప్పిన సరళ వాక్యంలోని నిర్మాణశైలికి మధ్య సారూప్యత గోచరిస్తుంది.కవితా వాక్యాల్లోని విశ్లేషణాత్మక, విమర్శనాత్మక కోణాల్ని బహుముఖ పార్శ్వాల్లోంచి తడిమి చూస్తూ.. వాటి మధ్య అనుసంధానాన్ని.. ఈ అవినాభావసంబంధంలో తొంగి చూసే నిగూఢమైన అంతర్లయని.. విషయ రచనలోని మార్మిక దృష్టిని.. అది వ్యక్తీకరించే తీరుతెన్నుల్ని.. తప్పొప్పుల విశ్లేషణలో దాగిన సామర్ధ్యస్థాయిని.. సమతూక లక్షణాల ఒడుపుని.. భావగర్భితంగా చర్చించే విషయాల సముదాయ నేపధ్యాన్ని.. కాచి ఒడబోస్తే మిగిలిన సారాంశ చిక్కదన కొలమానమే ఈ విమర్శ.ఈ తేడాలను బుద్ధి పూర్వకంగా అధ్యయనం చేసి.. ఆకళింపు చేసుకున్నాకనే.. ఆధునిక వచన కవిత్వ రచనకు శ్రీకారం చుట్టాలి.
-మానాపురం రాజా చంద్రశేఖర్