అంతా ఒంటరితనం
పెళ్ళిళ్ళు జరుగుతాయి కలుపుకోవాలంటూ సంబంధాలు
పట్టింపులు - పొరపొచ్చాలు పెట్టించేస్తాయి వేరు కాపురాలు....
అంతా ఒంటరితనం
కలుపుగోలు, కష్టజీవి,
నిజాయితీపరులు అంటూ వినే ముఖస్తుతులు
అతిగాళ్ళు, చాదస్తం,
పే...ద్ద సత్యహరిశ్చంద్రులు అనే
కననివీపుస్తుతులు...
అంతా ఒంటరితనం
హింస,అశ్లీలం కనిపించేవి
వెళ్ళినపుడు మాత్రమే
సినిమాహాలు
నిత్యం మనతోనే
ఉంటున్నాయవి నేడు
మోస్తూ మొబైలు....
అంతా ఒంటరితనం
కలిసి- మెలిసి
అభివృద్ధి సాధిద్దామంటూ ఆహ్వానాలు
అందు వ్యక్తిగత గుర్తింపుకు ప్రాకులాటలు....
అంతా ఒంటరితనం
మొక్కలను నాటండి -
చెట్లను కాపాడండి -నినాదాలు
రియల్ ఎస్టేట్ల పోటీలలో
పంట పొలాల పెరికివేతలు....
అంతా ఒంటరితనం
జనాల్ని ఉద్ధరించడానికి
పుడతాయి కొత్త పార్టీలు
పదవుల కోసం పాతవాటిలో
అవుతాయి విలీనాలు....
అంతా ఒంటరితనం
ప్రజాస్వామ్యం కల్పిస్తుంది
అందరికీ సమాన హక్కులు
ఆచరణలో దేశాన్ని
నడిపించేది మాత్రం
గుత్తాధిపత్యాలు....
అంతా ఒంటరితనం
మైత్రి ఒప్పందాలు అంటూ
దేశాల మధ్య సంతకాలు
అగ్ర రాజ్యాల పేరుకై
రసాయన బాంబుల దాడులు....
అంతా ఒంటరితనం
భావాలు పంచుకుందామని సంఘాలుగా కలిసిన ఆదిమానవులు
ఆధునికం అనుకొని ఒంటరిగా బతికేస్తున్న సంఘజీవులు....
అంతా ఒంటరితనం
పేరుకే మాత్రమే సంఘజీవులం
అంతా ఒంటరితనం ..!
- మాధవి మేళ్లచెరువు
( గుంటూరు)