Telugu Global
Arts & Literature

వింతలే వింతలు

వింతలే వింతలు
X

తొలి పలుకు : ఈ వ్యాసం వ్రాయడంలో నా అంతరంగం ఎవరినీ కించపరచాలని కాదు. జరుగుతున్న అవాంఛనీయ ఘటనలు వీలైనంత ఎక్కువమందికి తెలిస్తే, వాటిలో చెడుని చూసి, నలుగురూ బాగుపడి, అందరూ మెచ్చుకొనే సమాజం నెలకొంటుంది అన్న ఆశ మాత్రమే.

కనుక, నన్ను తప్పుగా అర్ధం చేసుకోవొద్దని వినమ్రంగా అంజలి ఘటించి వేడుకుంటున్నాను.

భూ ప్రపంచంలో ‘ఏడు వింతలున్నాయి’ అని చిన్నప్పటినుంచి విని పెరిగిన నాకు, ఆ ఘోష ఉత్తిదే అని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఎందుకంటే, ప్రస్తుతం ఇంకా ఎన్నో వింతలు కనబడుతున్నాయి. నాకు కనిపించని ఇంకా ఎన్నో వింతలు ఉండి ఉండవచ్చు కూడా.

నా కంటికి కనిపించినవరకూ ఒక్కొక్కటీ ఇక్కడ పేర్చుకో వెళ్తున్నాను.

1. ప్రస్తుతం అన్నీ ‘ఆర్గానిక్’ మయం. ఆ పేరు ముందుకో వెనక్కో పెడితే చాలు - అవి సమకూర్చి సరఫరా చేసే వాళ్ళు అవి కావాలన్న జనం ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. సామాన్యులు ఆ పేరుతో ఉన్నవి కొనడానికి సాహసించలేరు. ఎందుకంటే, వాటి ధరలు అంత ఎత్తున ఎగురుతూ ఉంటాయి. ఈ పిచ్చి ఎంతగా ముదురుతున్నదంటే, బహుశా ఒక ఏడాదిలో ‘ఆర్గానిక్ పెళ్ళికొడుకు’ మరియు ‘ఆర్గానిక్ పెళ్లికూతురు’ మాత్రమే దొరుకుతారు. మరో ఏడాదికి బహుశా 'ఆర్గానిక్ పిల్లలు' మాత్రమే పుట్టే అవకాశం మెండుగా కనిపిస్తున్నది. ఒకటి మాత్రం ఎప్పటికీ నిజం. ఎన్ని సంవత్సరాలైనా ఎంతమంది ఎన్నిచోట్ల వెతికినా ‘ఆర్గానిక్ మామగారు’ దొరుకుతారేమో కానీ, ‘ఆర్గానిక్ అత్తగారు’ మాత్రం దొరకరు. ఎందుకంటే, 'అత్తగారు' అన్న పదానికి అర్ధం వ్యక్తిత్వం గా మారి అందరినీ తన నటనతో మెప్పించి చిరస్థాయిగా నిలిచిపోయిన కీ.శే. సూర్యాకాంతం గారు పేటెంట్ హక్కులు తీసుకున్నారు కదా.

2. పర్యాటకం పెంపొందించాలని రాష్ట్రాలు ప్రయత్నాలు చేయడం సమంజసమే. కానీ, కొన్ని రాష్ట్రాలు ఆ పేరుతో చెరసాలలో ఒక రోజు ఖైదీగా గడపాలనుకునే మనిషికి, ‘ఇంత’ అని వసూలుచేసి, అలా గడపడానికి వచ్చినవారికి నిజమైన ఖైదీలాంటి భావన రావాలని - ఖైదీలు వేసుకొనే బట్టలు, ఖైదీలు తిండికోసం పట్టుకొనే బొచ్చెలు, త్రాగడానికి ఉపయోగించే పాత్రలు కూడా ఇస్తూ వారిని తృప్తి పరుస్తున్నారు. అలా గడపడానికి పోటీ మీద జనం ఎగబడుతూ ఆ రాష్ట్రాల పర్యాటక అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు కూడా.

3. చలికాలం వస్తే, ఎవరేనా ఉన్ని బట్టలు వేసుకొని చలిగాలి నుంచి ఉపశమనం పొందుతారు. కానీ, కొందరు యువత ఉన్ని బట్టలు ధరించకుండా నడుముకి చుట్టుకుంటున్నారు. అలా, చలిగాలి నుంచి ఎలా కాపాడుకుంటున్నారో వారికే తెలియాలి.

4. మునుపు పెళ్ళిళ్ళకి పేరంటాళ్ళకు ఆడవారు గోరింటాకు పెట్టుకొని ఎవరి అరచేతిలో ‘చందమామ’ చక్కగా పండింది అని చూసుకునేవారు. కానీ, ఇప్పుడు 'మెహందీ' అన్న పేరుతో నేటి మహిళామణులు మోచేయి మీద నుంచి వేలి కోసల వరకూ 'ఫాషన్' అన్న ముసుగులో పిచ్చి ఆకారాలతో, చూడడానికి జుగుప్స వచ్చేటట్టుగా తయారై, అదే గొప్ప అని అనుకుంటున్నారు. ఇంకా కొందమంది, మెహందీ పెట్టించుకుంటే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి, పచ్చబొట్లు వివిధ రకాలైన ఆకృతులతో పెట్టించుకుని చూడడానికి మరీ రోతగా తయారవుతున్నారు.

5. శిరోజాలంకరణ ఆడవారి అందానికి వన్నె తెస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇప్పుడు కొందరు కోరి కొన్ని శిరోజాలు వారి కంట్లోనూ వదనం మీదా వాలి ఉండేటట్టుగా చేసుకుంటున్నారు. ఇంకా కొందరైతే, ఒక కన్ను కప్పబడేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముప్పాతిక జనానికి, పొడుగాటి మాట దేముడెరుగు, అసలు జట అన్నదే ఉండదు. ఉండేదల్లా భుజాలవరకూ లేదా ఇంకొంచెం పైకి ఉన్న కురులు. ఇంకొంతమందైతే, ఓ మాదిరి సవరంతో ఒక భుజం లేదా రెండు భుజాల మీంచి ముందు వేపు వెళ్ళాడుతున్నట్టు వేసుకుంటారు. ఈ అలంకరణలతో అందం కంటే అందవిహీనమే నా కంటికి గోచరిస్తుంది. బహుశా నా దృష్టి లోపమేమో.

6. మునుపు కొంతమంది ఎండలో తిరగవలసి వచ్చినప్పుడు ఒక విధమైన ‘హాట్’ - ముందుకు కొంచెం ఏటవాలుగా రెండు మూడు అంగుళాల మేర ఉండి పెట్టుకుందికి తీసుకుందికి చేత్తో పట్టుకొనే వీలున్నట్టుగా ఉండేది - పెట్టుకునేవారు. ఆ ఏర్పాటుతో సూర్యకిరణాలు కంట్లో పడకుండా కూడా సౌలభ్యం ఉండేది. రాను రానూ ఆ హాట్ పెట్టుకోవడమన్నది ఏవిధమైన పోకడగా మారిందంటే - చేత్తో పట్టుకొనే భాగం ముందు వేపుకి బదులు తలకి వెనుక భాగంలో వచ్చేటట్టు ‘హాట్’ పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుని ఎంతో ఫాషన్ గా ఉన్నాము అని అనుకుంటున్నా, ఎంత అలగా జనంలా కనబడుతున్నారో వారికి అర్ధమవుతున్నదో లేదో. జనానికి కావలసినదేమిటంటే ఒకడెవడో అలా పెట్టుకున్నాడు, కాబట్టి మనం కూడా గొర్రెలమంద లాగ అలా పెట్టేసుకోవాలి. బహుశా, అలా తొలుతగా పెట్టుకున్నవాడు ఆ ‘హాట్’ కి ముందు వేపు వచ్చిన చిరుగుని కనిపించకుండా దాచుకుందికి అలా పెట్టుకున్నాడేమో. కానీ, జనం - ‘EVERY ODD IS A FASHION’ - అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

7. వేలకి వేలు ఖర్చుపెట్టి (తగలేసి) ‘BROKEN JEANS’ అన్న పేరుతో చిరుగుల బట్టలు ముష్టివారు కంటే కనిష్టంగా పోటీ మీద పోటీగా ధరిస్తున్నారు. ఆ చిరుగులు ముందువైపు తొడలు, వెనుక వేపు పిరుదులు కూడా బాహాటంగా కనబడేటట్టు - అదే ఫాషన్ అని - ధరిస్తూ నిసిగ్గుగా రోడ్ల మీద జన సమూహంలో తిరగడమే కాక, పార్టీలకు కూడా వెళుతున్నారు. ఈ విషయంలో ఆడవారు మగవారి కంటే ఏమీ తక్కువ తినలేదు. కటి మీదకి వేసుకునే దుస్తులకి కూడా అలా చిరుగులు ఉండడం భరించలేని దుస్థితి.

-3

8. తండాలలో ఉండే ఆడవారు పాపం వేరుగా రవిక కోసం ఖర్చుపెట్టేటంత డబ్బులులేక ఒక తానులాంటి బట్ట శరీరానికి చుట్టుకొని భుజం మీదుగా ముడివేసుకుని తమ మానం భద్రంగా కాపాడుకుంటున్నారు. చాలా ఏళ్ల క్రితం నగరాలలో పట్టణాలలో నివసించే నాగరిక జనం తండా జనాన్ని చూసి ముఖ్యంగా వారి వస్త్రధారణ పట్ల జాలి బదులు అపహాస్యం చేస్తూ ఉండేవారు.

సుమారు నాలుగైదు ఏళ్ళు పైబడి, నగరాలలో పట్టణాలలో నివసించి నాగరికులమని చెప్పుకొనే ఆడవారు ఫాషన్ పేరుతో తండా ఆడవారు కట్టుకునే విధానంలో చీర అన్న ముసుగులో ఒక తాను చుట్టుకుంటున్నారు. అయితే తేడా ఎక్కడుందంటే, తండా జనానికి మానం కాపాడుకోవాలన్న తాపత్రయముంది. కానీ, నాగరికులమని భేషజానికి పోయే నగర పట్టణ జనానికి ఆ పట్టింపు లేశమాత్రమైనా లేదు. ఎంత నగ్నంగా కనబడేటట్టుగా వ్యవహరిస్తే అంత నాగరికులమన్నట్టుగా భావిస్తున్నారు.

ఇది కాక, సినీమాల్లో నటించే నటీమణులు సినిమాల్లోనే కాక బయట కూడా కటి క్రింద భాగంలో ఉండే బట్టని రెండు భాగాలుగా చేసి ఒక భాగం వేళ్ళాడుతూ తొడలు చూపించుకుంటూ హొయలు పోతున్నారు. ఇంకొంతమంది వక్ష భాగం ఎంత ఎక్కువ నగ్నంగా చూపించుకుంటే అంత నాగరికులమనే అపోహతో భద్రంగా దాచుకోవలసిన వారి నగ్న సౌందర్యాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు.

శోచనీయమైన విషయమేమంటే - ఆ సినీ జనాన్ని చూసి కొంతమంది సాధారణ స్త్రీలు కూడా ఆ విధమైన వస్త్రధారణ చేసుకుంటున్నారు.

ఈ నాగరిక మహిళామణులు తెలిసే మోసపోతున్నారో తెలియకనో, నాకైతే తెలియదు. ఆ విధమైన దుస్తులు తయారుచేసి అమ్ముకొనే వ్యాపారస్తుల ఆస్తులు పెరుగటమేకాక, ఆ దుస్తులు ధరించే ఆడవారి నగ్న సౌందర్యం కనిపించే శరీరభాగాలు రోజు రోజుకి పెరుగుతూ, ఆడది దాచిపెట్టుకోవలసిన శరీరభాగాలని కప్పి ఉంచే బట్ట మాత్రం కుంచించుకుపోతోంది.

ఈ విధమైన వస్త్ర ధారణవలన మనం ఎదుగుతున్నామా దిగజారుతున్నామా అన్న సందేహం కలుగుతుంది.

ఆ విధంగా, ఎవరికీ వారే అంగడిబొమ్మగా నిలబడుతూ అదే నాగరికత అనుకునే భ్రమలో ఉంటున్నారు. ఆడవారిని ఆ విధంగా అంగడిబొమ్మగా నిలబెట్టే ‘ఫాషన్ డిజైనర్స్’ ని, ఆ వస్త్రాలు విక్రయించే వ్యాపారులని ‘తార్పుడు మనుషులు’ అంటే తప్పు లేదనిపిస్తోంది.

బహుశా వేశ్య వాటికలలో శరీరం అమ్ముకుందికి నిలబడే వెలయాలు కూడా తన నగ్నత్వాన్ని బాహాటంగా ఏమాత్రం ప్రదర్శించదు. కానీ, సమాజం ఆ వెలయాలిని తప్పుగా చూస్తూ, ఈ నాగరిక జనాన్ని గొప్పగా

చూస్తుంది. అంతేకాదు, వెలయాలికి సహకరించే ‘తార్పుడు మనిషి’ ని ఈ సమాజం ఛీత్కరించుకుంటూ, నాగరిక నారిని నగ్నంగా నిలబెట్టే ‘ఫాషన్ డిజైనర్స్’కి బ్రహ్మరధం పట్టి బిరుదులు ఇచ్చి సత్కారాలు చేస్తుంది.

9. కొందరు మగవారు ఇప్పడు నూతనంగా వారికి కావలసిన విధంగానో లేక 'ఫ్యాషన్ డిజైనర్' చెప్పిన విధంగానో చీరని కట్టుకుంటున్నారు లేదా చుట్టుకుంటున్నారు. అదేవిధంగా కొందరు ఆడవారు ధోతీ లేదా లుంగీ కట్టుకుంటున్నారు. మొత్తాన, ఆడ మగ 'నలుగురు నను చూసి నగియిన నాకేమి?' అన్నట్టు వస్త్రధారణ చేస్తున్నారు.

10. నాగరికులం సభ్య సమాజానికి ప్రతీకలం అనుకునే కొంతమంది పెళ్ళికి దూరంగా ఉంటూ, వారికి నచ్చిన వారితో 'డేటింగ్' పేరుతో నచ్చినంత కాలం విచ్చల విడిగా కాముక ఉద్దేశంతో తిరగడం ప్రస్తుతం సమాజానికి పట్టిన పెద్ద చీడ పురుగు. అంతేకాక, ఆ ఇద్దరి మధ్యన అభిప్రాయభేదాలొస్తే, విడిపోయి మరొక నచ్చిన వ్యక్తితో మరి కొంత కాలం 'డేటింగ్' అంటూ తిరుగుతున్నారు. ఈ తిరుగుళ్ళకి వ్యభిచారానికి ఏమేనా తేడా ఉందా ? ఇలాంటి తిరుగుళ్ళకి జనం వెనుకడుగు వేయకపోవడానికి కారణం - ప్రస్తుతం గర్భనిరోధకానికి ఎన్నో మందులు సదుపాయాలూ బజారులో దొరుకుతున్నాయి. పైగా అలా తిరగడం వలన గర్భం వస్తే ఎటువంటి అభ్యంతరమైన ఆలోచన లేకుండా గర్భవిచ్ఛిత్తు చేసుకోవచ్చు అని అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్యన తీర్పు కూడా ఇచ్చేరు. ఈవిధమైన ప్రగతి చూస్తుంటే ఆనందం కంటే ఆందోళనే అధికంగా ఉంది.

11. మా చిన్నప్పుడేకాదు, ఒక రెండు సంవత్సరాలు క్రితంవరకూ - గర్భిణీ స్త్రీలని అనవసరంగా వేరేవారి కంటపడకుండా ఇంట్లోని పెద్దవారు కాపాడుతూ వచ్చేవారు. ఎందుకంటే, ఎవరి దృష్టి ఏ విధంగా ఉంటుందో అన్న భయం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీ యొక్క ఎత్తుగా పొంగి ఉన్న 'పొట్ట' భాగం ఎటువంటి పరిస్థితులలోనూ ఎవరి కంటా పడనిచ్చేవారు కాదు. గర్భిణీ స్త్రీకి జరిగే సీమంతం కార్యక్రమంలో ఇంట్లోనివారు తప్ప పర పురుషుల ప్రవేశం నిషిద్ధంగా చూసేవారు.కానీ, నేటి నటీమణులు గర్భం ధరిస్తే – వారియొక్క ఎత్తుగా పొంగి ఉన్న 'పొట్ట' - అదీ ఎటువంటి ఆచ్చాదన లేకుండా - ఫోటో తీసుకొని సామాజిక మాధ్యమాలలో వార్తా పత్రికలలో గొప్పగా చూపించుకుంటున్నారు. అంతేకాక, ఆ పొట్ట భాగాన్ని వారి భర్త, స్నేహితులు ఆప్యాయంగా స్పర్శిస్తున్న ఫోటోలు కూడా ప్రచురిస్తున్నారు/ ప్రదర్శిస్తున్నారు.

ఇవనీ చూస్తుంటే - ఏమిటి ఈ వింత పోకడలు అని వికారం వేస్తోంది.

నా మనసులోకి వచ్చిన పై ఆలోచనలు మీతో ఎందుకు పంచుకున్నానో ఈ వ్యాసం ప్రారంభంలోనే తెలిపేను.

మరి, మీరు ఏ విధంగా స్పందిస్తారో..

మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు

First Published:  10 Jun 2023 7:43 PM IST
Next Story