పాఠం (కథ)
ఆ రోజు ఉదయమే కొడుకు కోడలి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంటే ఏమిటో అది చూద్దాం అని వారి గది వైపు నడిచింది రాధిక .
ఇద్దరు ఏదో విషయమై వాదించుకుంటున్నారు . కోడలి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"ఏమిటర్రా ! ఏమి జరిగింది"
అంటూ లోనికెళ్లింది.
"నా నెక్లెస్ కనిపించలేదత్తయ్యా "అంటూ అల్మరా సొరుగులన్నీ వెదక సాగింది. స్నేహ .
"అంతటా చూశారా!. లాకర్ నుండి ఎప్పుడు తె చ్చారు ? "అంది రాధిక .
వాళ్ళ పెళ్లప్పుడు పెట్టింది . ఇప్పటి ధరలో దాదాపు లక్ష ఉంటుంది. నగల విషయం లో ఇంత అజాగ్రత్త ! చీవాట్లు వెయ్యాలనిపించింది రాధిక కి . అంతలో" రాధికా ! "అంటూ భర్త పిలవడంతో తమ గది వైపు నడిచింది.
"ఏమిటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఏదో వాదించుకుంటున్నారు . ఏమి జరిగిందట. అన్నాడు సారథి.
కోడలి నెక్లెస్ కనిపించలేదటండి . వెదకుతున్నారు
అయ్యో!అలాగా! అంతా వెదికారా !,దొరుకుతుం దిలే !. నిదానంగా! ఆ అమ్మాయికి ధైర్యం చెప్పు, వాడికి చెప్పు,అమ్మాయిని ఏమి అనవద్దని అన్నాడు సారథి.
: బాగుందండీ ! అంత అజాగ్రత్త అయితే ఎలా!ఆ అమ్మాయేమయినా చిన్నపిల్లనా! పోగొట్టుకున్నది చిన్న వస్తువా! మీరు మరీనూ ఓదార్చాలటా ! పిలిచి చీవాట్లు వేయడం పోయి ఆవేశం తో ఊగిపోసాగింది రాధిక.
రాధిక ఆవేశానికి నవ్వుకొని " రాధ ఇంకా నీ ఆవేశం తగ్గలేదా! గతం మరచి పొయ్యవా ! నీ కొడుకు చిన్నప్పుడు , నీవు ఎవరింటికో వెళ్ళినప్పుడు ,వాడి మురుగులు పోగొట్టుకొని పోతే మా అమ్మ కోప్పడితే నీవెంత బాధ పడ్డావు . మరచిపొయ్యవా . నాలుగు రోజులు ఆ విషయమే ఆలోచిస్తూ , అందరిమీద అలిగి కూర్చొన్నావు . ఆ రోజుని గుర్తుతెచ్చుకో అన్నాడు సారథి.
భర్త మాట వినగానే రాధిక మనసు గతం కేసి పరుగుతీసింది . పండక్కని పేరంటానికి ఎవరో పిలిస్తే , బాబుతో వెళ్ళింది . బయట పిల్లలతో ఆడుకుంటున్న బాబు చేతికున్న మురుగులు ఎవరో కాజేశారు. ఎంత వెదికినా దొరకలేదు . బాబుకేమి కాలేదు అని ఉపరి పీల్చుకొని ఇంటికి వచ్చిన రాధికను , విషయం తెలియగానే అత్తగారు మండిపడ్డారు .
అంత బిగుతుకున్న వాటిని ఎవరెత్తుకెళతారే ,అంత అజాగ్రత్తగా ఎలఉన్నావు. బంగారం లాంటి మురుగులు పోగొట్టుకొచ్చావు. మీ పుట్టింటి వాళ్ళనే చేయించమను అని అల్టిమేటమ్ ఇచ్చింది .
అంతవరకు ఏమి మాట్లాడని భర్త , అత్తయ్యకు సపోర్ట్ చేస్తూ ! "బాబు ఎక్కడున్నాడో కూడా చూడకుండా" , ఎలావున్నావు. కొంచమయిన జాగ్రత్తగా ఉండక్కరలేదా! అని తననే అనేసరికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.ఏలాగాయినా , వాటిని మీ వాళ్ళనే చేయించమను . అని భర్త కూడా అనేసరికి తెల్లబోయింది రాధిక.
తరువాత తామిద్దరే ఉన్నప్పుడు 'నా మాటలకు నీకు కోపం వచ్చిందా ," చూడూ ! మా అమ్మదగ్గర అలా అనకపోతే , ఆమె నోటికి తాళం పడేదెలా ! నీవు నేనన్న మాటలను పట్టించుకోవద్దు. ఓసీ పిచ్చిమోహమా ! మీ వాళ్ళను చేయించమని అడగటం దేనికి ,నేనే చేయిస్తాను . అని ఎన్నోరకాలుగా తనని సమాధానపరిచాడు.
ఆరోజు తాను పడ్డ వేదన చాలరోజులవరకు మరవలేక పోయింది తను . అత్తగారిమీద ఒకరకమయిన ద్వేషాన్ని పెంచుకుని , ఆమెకు దగ్గరకాలేకపోయింది . చివరికి ఆమె ఆరోగ్యం బాగాలేక మంచాన పడినప్పుడు కూడా,ఏదో మొక్కుబడిగా చేసిందికాని , మనస్ఫూర్తిగా సేవ చేయలేకపోయింది .
గతం గుర్తొచ్చిన రాధిక కి " ఆరోజు మా అమ్మ మాటలకి ఎంత బాధపడ్డావు. ఇప్పుడు నీవు ఆదేగా అన్నది ఎగతాళా ! ,లేదా రేపు ని కోడలు నీకు సేవ చేస్తుందా అన్న హెచ్చరికో అర్థం కాలేదు రాధికకి .
ఇప్పటికయినా , అసలు విషయం తెలుసుకోకుండా వాళ్ళపై అరవడం తగ్గించు. చదువుకొని , ఉద్యోగం చేస్తున్న కోడలు అంత అజాగ్రత్తగా ఎలా పోగొట్టుకుంటుంది అని అన్నట్టుగా అనిపించింది. వెంటనే కొడుకు గది కి వెళ్ళి
" ఏమ్మా ! అన్నీ చూశావా ! ఆవిషయం కొద్దిసేపు వదిలేయి . మరలా స్థిమితం గా మరోసారి చూద్దాం . దొరికితే దొరకని . దొరక్కపోతే పోతే పోయిందిలే . నీవు బాధ పడకు అని కోడలిని దగ్గరికి తీసుకొని ,సమాధాన పరచింది రాధిక .
స్నేహ ముఖం ప్రశ్చాత్తాపం తో నిండిపోయింది.
"పొరపాటు నాదే అత్తయ్యా" ! మొన్న ఆఫీస్ కోలీగ్ పెళ్ళికి వేసుకొని వెళ్ళాను. నెక్లెస్ చాలబాగుందని అందరూ మెచ్చుకున్నారు. ఇంటికి వచ్చేటప్పుడు , బ్యాగ్ లో పెడదాం అని చూసుకునేసరికి కనిపించలేదు . మరలా మ్యారేజ్ హాల్ కెళ్లాం . అంతటా చూశాం ,ఎక్కడా దొరకలేదు. సి సి కెమరా లో చూశాం !. ఏ విషయం మీకెలా చెప్పాలా ! మీరేలా రియాక్ట్ అవుతారో అని
భయపడుతున్నాను ." అంది స్నేహ . అంటున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"పోతే పోయిందిలే ! నీవు బాధపడకు. "అని దగ్గరికి తీసుకొని అనునయించ సాగింది రాధిక.
"మా అమ్మ కు చెప్పాను. నేను మరొకటి చేయిస్తానని చెప్పింది" అంది స్నేహ మరలా.
స్నేహ మాట వినగానే కోపంతో -" స్నేహా !చదువుకున్నావు! ఉద్యోగం చేస్తున్నావు! ఇంత మాత్రం తెలియకపోతే ఎలా !
పోయింది ని నెక్లెస్ , పోగొట్టుకొంది నీవు , మీ అమ్మ ఎందుకు చేయించాలి ?. మీ పొరపాటు కు వాళ్లేందుకు బాధపడాలి."
" ఏరా ! నీవు కూడా ఈ మాట విని ఊరుకున్నావా ! "
రాధిక మాటలు విని ఇద్దరూ తెల్లబోయి చూడసాగారు. ఆమెవైపు .
" ఏమిటి అలా తెల్లబోయి చూస్తున్నారు, ఒరే య్ ! మీ భార్య నెక్లెస్ పోతే మీ అత్తగారు చేయించడం ఏమిటి ?. ఏం ! నీకు నీ పెళ్ళానికి నెక్లెస్ చేయించే స్తోమత లేదా !. నీకు వీలుకాకపోతే చెప్పు , మీనాన్న గారితో చెప్పి చేయించమంటాను. "అంది .
"అ త్త య్యా ! నన్ను క్షమించండి , మీ మనసును అర్థం చేసుకోలేక పోయాను. నెక్లెస్ పోయిందన్న విషయాన్ని మీరేలా తీసుకొంటారో అని వారం రోజులుగా టెన్సన్ పడిపోయాను. "అంది స్నేహ.
" నిజమే నమ్మా! నీయంత విశాలంగా మేము ఎందుకు ఆలోచించలేదని ఇప్పుడు అనిపిస్తుంది."అన్నాడు
'పిచ్చి పిల్లలూ ! 'అని ఇద్దరినీ దగ్గరికి తీసుకొంది రాధిక.
"చాలా థాంక్స్ అత్తయ్యా !"అని అత్తయ్య చేతులు పట్టుకోంది స్నేహ. ఆమె కళ్ళల్లో ఆనందం కృతజ్ఞత తొంగిచూస్తున్నాయి.
రాధిక ను చూసి మెచ్చుకోలుగా నవ్వాడు సారథి.
ఓ క్షణం ఆలోచించకుండా ఉండివుంటే ఎంత తప్పు చేసేదాన్నో ! అనుకొంది రాధిక.
కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
(బెంగళూరు)