మూతబడ్డ బడి (కవిత)
అక్కడ ఇంతకు మునుపో స్వర్గముండేది.
కొందరు దేవతలక్కడ
రంగురంగుల సీతాకోకచిలుకలై ఆడేవాళ్లు, పాడేవాళ్లు
ఏవేవో చదివే వాళ్ళు.
వాళ్లిప్పుడక్కడ లేరు.
వాళ్ళ ఆనవాళ్ళున్నాయక్కడ.
వాళ్ల కోసం రాసిన వర్ణమాల,
గోడల మీద నీతి సూక్తులు,
పగుళ్ళు బారిన నల్లబల్లలు,
రంగు వెలిసిన
విషణ్ణవదనపు గోడలు,
తోడు లేక మనస్సులా
విరిగిన బెంచీలు,
చిలుం పట్టిన తాళంకప్పలు
ఇంకా ఎన్నెన్నో.
గదులుగా చీలిన
బడి గుండెల నిండా
దుఃఖపు నిశ్శబ్దాన్ని నింపారెవరో!?
పిల్లలు పాదరక్షలు విడిచే చోటిది
ముళ్ళ పొదలు.
పిల్లలు మధ్యాహ్న భోజనం చేసే చోటిది
కుక్కలకు స్థావరం.
తలుపులూడిన గదులు
కోతుల విహార కేంద్రాలు.
అయినా
ఎవరో చేతబడి చేసినట్టున్నారు బడికి.
లేకుంటే!
ఎట్లాంటి బడి!
అమ్మ ఒడి లాంటి బడి.
దేశ భవిష్యత్తుకు
పునాదిలాంటి బడి.
నిన్నటిదాకా ఒక్కో సంఖ్య తగ్గుతూ,
ఒక్కో అవయవమూ
నిష్క్రియాత్మకమైనట్లు,
టీచర్ల పూడుకు పోయిన మాటల్లాగా
మరణశయ్యపై మూల్గేది.
నిజానికెవరో
ఒక్కో సంఖ్యనూ చెరిపేశారు.
చివరికికేమీ మిగల్లేదని మూసేశారు.
ముప్పాతికమంది పిల్లలూ
మూడు బజార్ల దగ్గర
పచ్చ రంగు బస్సెక్కి పోతుంటే
ఉన్నొక్క సారు
గుండెలవిసేలా ఏడ్చాడు.
ఆయన ఏడ్పును
వగలన్నారు కొందరు.
నువ్వొక్కడివి
మాత్రమేంచెప్తావని ఓదార్చారు ఇంకొందరు.
అలా అతడు స్థానభ్రష్టుడయ్యాక,
ఇదిగో ఇక్కడో కంటకవనం మొలిచింది.
గుండె ఉన్నోడెవడైనా
ఆ దారిన వెళ్లొద్దు!
ముల్లై గుండెల్ని గుచ్చుకుంటాయి జ్ఞాపకాలు!!
-రాజేశ్వరరావు లేదాళ్ళ
(లక్షెట్టిపేట)