Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    భోజనప్రియత్వం

    By Telugu GlobalJuly 14, 20233 Mins Read
    భోజనప్రియత్వం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

    ‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!…’ వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి.

    వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. ‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు.

    సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది.

    చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. ‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.

    మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం.

    ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది! తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు.

    ‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు.

    విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.

    వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది.

    పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. ‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

    ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు.

    ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా…’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని మన ఆనందం!

    సౌజన్యం: కె వి యస్ సుబ్బారావు

    Bhojanapriyatvam Telugu Kathalu
    Previous Articleవివిధ కవుల…సప్తపదులు
    Next Article శ్లోకమాధురి…కొత్తపాతలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.