రేపటి చూపు (కథ)
అక్కా ! అంటూ రత్నం తలుపు బాదుతున్నాడు. సునీతకు మెలకువ వచ్చింది. చేయి చాచి ప్రక్కనున్న సెల్ ఫోన్ అందుకుని టైం చూసింది. ఉదయం నాలుగున్నర అవబోతున్నది. అలవాటు ప్రకారం తలత్రిప్పి ప్రక్కకు చూసింది.
భర్త జయరాం పక్క ఖాళీగా ఉంది. నిన్నరాత్రి ఆటో తీసుకుని 'నైట్ సవారీ'లకు వెళ్ళినట్లు గుర్తుకు వచ్చింది.
తన మీద కాలు చేయి వేసి, గాఢంగా నిద్రపోతున్నది 5 ఏళ్ళ కూతురు జ్యోతి. చేతిని నెమ్మదిగా తొలగించి చీర సర్దుకుని కూర్చుంది.
మళ్ళీ తలుపు మరింత గట్టిగా బాదుతోన్న చప్పుడు. "అక్కా తలుపు తీయి" అంటున్నాడు రత్నం. వాడి గొంతులో ఏదోఆదుర్దా, భయం ధ్వనిస్తోంది.
'ఇంతరాత్రి వీడెందుకు తలుపు బాదుతోన్నాడు? నర్సమ్మ పిన్నికి ఏం కాలేదు కదా !' అనుకుంది. బద్ధకంగా ఆవులిస్తూ స్విచ్చు వెదికి లైటు వేసింది. తలుపు అలా తెరుచుకుందో లేదో,
అదాటున లోపలికి దూసుకువచ్చాడు రత్నం.
నిద్రలేమితో ముఖం వాడిపోయి ఉంది.
'అక్కా !'అంటూ ఎగపోస్తున్నాడు. శ్వాస బరువుగా తీసుకుంటున్న రత్నం గొంతులోంచి మాట పెగలటం లేదు.
కూజాలోంచి గ్లాసులోకి నీరు వంపి వాడి చేతి కందిస్తూ, 'ముందు నీళ్ళు త్రాగు' అంది.
ఆమె గొంతులో నిద్ర మత్తు ఇంకా పోలేదు. 'ఇంతరాత్రి, ఇదేంటి వీడి వాలకం 'అనుకుంది సునీత. ఆమె మనస్సేదో కీడును శంకి స్తోంది.
గ్లాసెత్తి గటగటా నీళ్ళు త్రాగి షర్టు కొసతో మూతి తుడుచుకున్నాడు.
కాస్త సేద దీరినట్లవుపించగానే, 'ఇప్పుడు చెప్పు' అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది.
"అక్కా!... బావకు.. ఆక్సిడెంటు... కొంచెం సీరియస్... "ముప్పిరిగొన్న ఉద్వేగంతో, ఆయాసంతో రత్నం నోటివెంట మాటలు
సరిగా రావటం లేదు.
ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది సునీతకు. కాళ్ళ క్రింది నేల కృంగిపోతోంటే నిలబడటానికి కూడాసత్తువ లేక అలానే నేలమీద కూలబడిపోయింది.
భర్త జయరాంకు ఆక్సిడెంటు.. ఎప్పుడు?... ఎలా ?... ఇప్పుడెలా వున్నాడు? మరెన్నో ప్రశ్నలు సునీతను అతలాకుతలం చేస్తున్నాయి. గొంతు తడారి మాటలు పెగలటం లేదు.
ఆమె మనసు చదివిన వాడిలా రత్నం చెప్పుకుపోతున్నాడు.
"సెకండ్ షో తర్వాత ఎవరో ఇద్దరు చార్మినార్ కు బావ ఆటో మాట్లాడుకున్నారు. నయాపూల్ దాటీ దాటకముందే, కత్తితో
అటాక్ చేయబోయారు. అపాయం పసిగట్టిన బావ ఆటోను ప్రక్కకు ఆపి, అరుస్తూ పరిగెత్తాడు. అప్పటికే బావ వీపు, ఎడమభుజంపైన రెండు కత్తిపోట్లు పడ్డాయి.
గస్తీ తిరుగుతోన్న పోలీసులు ఇది గమనించి అటాక్ చేసినవారిని వెంబడించారు. నిందితులు దొరకలేదు. బాధతో విలవిలలాడుతోన్న జయరాం బావను ఉస్మానియాలో చేర్పించారు.
ఆటో యూనియన్ లీడర్ కామేశం చెబితే, వెంటనే హాస్పిటల్ కు పరుగెత్తాను. బావను ఆపరేషన్ థియేటర్ కు అప్పటికే
తీసుకెళ్ళారు. బయట సిస్టర్ ను అడిగితే, బయటకు తెచ్చేదాకా ఏమీ చెప్పలేము అన్నారట థియేటర్ లోపల ఉన్న డాక్టర్లు".
సునీతకు జయరాం పరిస్థితి అర్థం అయింది. ఆమె చెంపల మీదుగా కన్నీరు ధారాపాతంగా కారుతున్నది.
నిస్సహాయంగా నేలమీద కూలబడిపోయిన సునీత మస్తిష్కంలో లక్ష ప్రశ్నలు. ఏవో సముదాయింపులు.
అయినా కలుగని ఊరట ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
శూన్యం ఆవహించిన సునీత మెదడు మొద్దుబారిపోయింది. 'జయరాంకు ఏమీ కాకూడదు భగవాన్' మనసులోనే వేయిదేవుళ్ళకు మ్రొక్కుకుంది.
తండ్రి రామస్వామి మాటలు సునీత మెదడులో గింగురుమన్నాయి.
"నాకు తెలుసు. సమాజసేవ, సమానత్వం అంటూ వెర్రివాగుడు వాగే మీ ఆయన ఏనాడో ఓనాడు ఏదో ఓ కేసులోఇరుక్కుంటాడు. నిన్ను అనాథను చేసి నడిరోడ్డు మీద వదిలేస్తాడు. అప్పుడు గానీ , నీకు నీ తండ్రి విలువ తెలుస్తుంది".
సునీత మనసులో గతం అంతా సినిమారీళ్ళలా వెనక్కితిరుగుతున్నది.
ఆటోలు అద్దెకు ఇచ్చే రామస్వామికి సునీత ఒక్కగానొక్క కూతురు. ఎదురుచూస్తూ, చూస్తూ కనబడిన దేవుళ్ళకల్లా మ్రొక్కితే
కలిగిన సంతానం. సునీతను అల్లారుముద్దుగా నేలమీద కాలు ఆననీయకుండా రామస్వామి దంపతులు పెంచారు.
రామస్వామికి సునీత అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె పుట్టాకే ఆయన దశ మారింది. అద్దెకు తీసుకుని ఆటో నడిపించేరామస్వామి మొట్టమొదటి ఆటోను స్వంతం చేసుకున్నది సునీత భూమ్మీద పడిన్నాడే!
నింబోలి అడ్డా దగ్గరి మురికివాడలో ఇరవయి సింగిల్ రూమ్ షెడ్ల మధ్య నిటారుగా కనిపించే రెండంతస్థుల మేడ రామస్వామిదే!అందివచ్చిన అవకాశాలను జారిపోనీయకుండా ఒడిసిపట్టుకుని, సునీతకు కాలేజీ వెళ్ళే వయస్సు వచ్చేసరికి ఆరు ఆటోల
స్వంతదారుడయ్యాడు రామస్వామి. రోజువారీ వడ్డీ చెల్లించే ప్రాతిపాదికన లక్షల రూపాయలు రొటేట్ చేస్తాడు. ఎదుటివాడిఅవసరాలు గమనించి సాయం చేస్తూనే లాభం పొందే వ్యక్తి రామస్వామి. అవకాశాలు తమంతట తామే తలుపు తట్టపనీ,ఒక్కోసారి అవసరాలు కల్పించి లాభం పొందే రకం. రావాల్సిన అణా, అర్ధాణా కూడా గోళ్ళూడగొట్టి వసూలు చేసుకునేనిక్కచ్చి మనిషి రామస్వామి.
రోజువారీ అద్దెకు ఆటో తీసుకునే
జయరాం ఆటోలో అప్పుడప్పుడు సునీత కాలేజీకి వెళ్లేది. ఒక్కోసారి రామస్వామి ఆదేశాలమేరకు జయరాం సునీతను కాలేజీలోంచి ఇంటికి చేర్చేవాడు. డబ్బులడగని జయరాం మొహమాటం రామస్వామికి బాగానచ్చింది. పైపెచ్చూ, జయరాం సాధుస్వభావి, వయసు వచ్చిన ఆడిపిల్లలను ఏ ప్రలోభాలకు గురిచేయని మెతక మనిషి.
జయరాం మంచితనం, మనిషికి ఇచ్చే విలువ ఒకవేపు, తండ్రి అవకాశవాదం డబ్బుకు ఇచ్చే విలువ మరోవేపు, పోల్చి
చూసుకునే సునీతలో ఆమెకు తెలియకుండానే ఆమె మనసులో జయరాం పాదుకుపోయాడు.
క్రొత్తలో ఆటపట్టించాలన్న చిలిపితనం, రానురాను సునీతలో ఆకర్షణగా, ఆరాధనగా మారిపోయింది.
వయసులో సహజంగా పొడచూపే ఉత్సుకత సునీతకు జయరాం వెంటపడేలా చేసింది.
అయినా జయరాం ఎన్నడూ హద్దులు మీరలేదు. ఆయన ఆటోలో ప్రయాణిస్తోన్నపుడు సునీత వెనకనుండి చొరవగాఆయన భుజం మీద చేతులు వేసేది.
"వద్దు" అంటూ సున్నితంగా మందలించేవాడు జయరాం.
"ఏం?" అని కొంటెగా సునీత అడిగితే-
"ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి సునీతా! సువ్విచ్చే చనువుతో నీ చేయిపట్టుకుని నిన్ను క్రిందకు లాగలేను. నాకంటే
ధనవంతుడు అదృష్టవంతుడు ఎవరో నీకై పుట్టే ఉంటాడు. మీ నాన్న ఆయనకే నిన్నిచ్చి పెళ్ళిచేస్తాడు. "మన ప్రేమనుఅంగీకరించడు?" జయరాం జవాబు.
"అలా ఎందుకు అంతరాలు ఊహించుకుంటావ్ జయరాం. ఒకప్పుడు మా నాన్న కూడా మీలాంటివాడే కదా !" సునీత
ప్రశ్న.
"అదే విచిత్రం సునీతా! మీ నాన్నలాంటి వారు క్రింద ఉన్నంతసేపూ, పైకి ఎగబ్రాకాలని ఆరాటపడతారు. తీరా పైకి
ఎగబ్రాకాక సాయం చేసిన చేతిని విసిరికొడతారు. దూరం ఉంచుతారు. ఒక్కోసారి ద్వేషిస్తారు కూడా! తనచుట్టూ ఉన్నవాళ్ళెవరూ తనను మించి పోగూడదన్న స్వార్థం మీ నాన్నది."
"అదే నువ్వయితే, నీకున్నదంతా ప్రక్కవాళ్ళకు పంచి పెట్టేవాడివా?" సునీత ప్రశ్న.
"లేదు సునీతా! అలా చేయమని నేను ఎప్పుడూ, ఎవరినీ కోరను. ఎదుటివాడి కష్టాల్లోంచి లాభం పొందాలనే ఆలోచన
మానుకుని చేతనైనంత సాయం చేయమంటాను" జయరాం జవాబు.
నమ్మిన సిద్ధాంతాలను త్రికరణశుద్ధిగా ఆచరించే జయరాం పట్లసునీతకు రానురాను ఇష్టం పెరిగింది. ఒక్కోసారి కాలేజీ నుండినేరుగా ఇంటికి కాకుండా, టాంకుబండ్ పైన గాని, ఇందిరా పార్కులోనో గడపుదామని జయరాంను బలవంతం చేసేది.
వీళ్ళ సాన్నిహిత్యాన్ని గమనించి రామస్వామి సునీతను మందలించేవాడు. “చూడు సునీతా! నేను దరిద్రంలో పుట్టి స్వశక్తితో
పైకెదిగినవాడిని. డబ్బు విలువ నాకు బాగా తెలుసు. నా కూతురు ఆరంతస్థుల మేడలో కాపురం చెయ్యాలి. మురికివాడల్లో తాటాకు కొంపల్లో కాదు" రామస్వామి ఆక్షేపణ.
తండ్రి వ్యతిరేకత, ఆదర్శాల మీద అభిమానం సునీతలో పట్టుదలను పెంచాయి. ఎవరు ఎంత అభ్యంతరపెట్టినా చివరకు
సునీతదే పైచేయి అయింది. కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు నడిచి జయరాం చేయి పట్టుకుంది. ఆనాటినుండి రామస్వామి
సునీత ముఖం చూడలేదు. తన గడప తొక్కనివ్వలేదు.
జయరాం తన మంచి మనసుతో సునీతను అపురూపంగా చూసుకునేవాడు.
ఆదర్శాలు అన్నది ఎండమావు
ల్లాంటివని ఆమెకు తర్వాతి కాలంలో తెలిసివచ్చినా, ఆ దంపతులు తమ గమనం మార్చుకోలేదు.
జయరాంకు బంధువర్గం అంతగా లేదు. తల్లి గతించింది. మేనమామ ప్రాపున పెరిగాడు. రామస్వామి పట్టుదల గమనించి ఆ దంపతులను దూరంగా ఉంచేవాడు. 'నిన్ను దగ్గరకు తీసి, నా కూటిలో మట్టి పోసుకోలేనురా' అంటూఆవేదన చెందేవాడు,
రత్నంది జయరాం ప్రక్క ఇల్లు. తండ్రి గతించాడు. తల్లి నాలుగిళ్ళలో పాచి పని చేస్తుంది. రాత్రంతా ఆటో నడిపించి, పగలు కాలేజీలో చదువుతాడు. అవసరాలకు అప్పుడప్పుడు జయరాం ఆదుకునేవాడు. ఆ అభిమానంతో రత్నం సునీతను'అక్కా' అని పిలుస్తూ చిన్నచిన్న పనులు చేసి పెట్టేవాడు.
x X X
“అక్కా” అంటూ రత్నం కుదుపుతోంటే, మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది సునీత.
"రామస్వామి బాబాయిని కలుద్దాo అక్కా! నాకెందుకో భయంగా ఉంది".
క్షణంపాటు సునీత మనసు ఊగిసలాడింది.
అంతలోనే జయరాం తరచూ తనను ప్రోత్సహిస్తూ చెప్పే మాటలు ఆమె మనసులో మెదిలాయి.
"సునీతా! ఈలోకంలో బ్రతకటానికి కావల్సినవి ధైర్యం, ఆత్మస్థైర్యం. మహిళలు ఏ విషయంలోనూ మగవారికంటే తక్కువ
కాదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, కూతురిగా, మగవాడిలో శక్తి నింపేది మగువే! మాకు వెనక నుండి ప్రోత్సాహంఇస్తూంటే మేము ఎంతో సాధించగలం. భార్య ప్రోత్సాహం, సహకారం ఉంటే మగవాడు ఒంటి చేత్తో సముద్రాన్ని ఈదగటడు. నిప్పుల
గుండాల్ని అవలీలగా దాటగలడు. రోజంతా మేము పడ్డ కష్టమంతా మీ చిరునవ్వుతో, లాలనతో మాయమై వంద
ఏనుగుల బలం వస్తుంది. ఈ జీవితం నువ్వు కావాలని కోరుకున్నావు. కనుక పోరాటానికి సమాయత్తం చేసుకోవాలి. నేనుసాధించగలను అన్న ధైర్యంతో ముందుకు నడిస్తే హిమాలయాలే నీ పాదాల దగ్గరకు వస్తాయి. కష్టాలు వచ్చిన్నాడు ధైర్యంచిక్కబట్టుకోవాలి. బేరుమనకూడదు. మనకు ఎల్లవేళలా తోడు ఉండేది మన ధైర్యమే".
దృఢ నిశ్చయానికి వచ్చింది సునీత, కళ్ళు తుడుచుకుని లేచి అల్మయిరా అరల్లో రెండు మూడు చోట్ల వెదికింది. కొన్ని నోట్లు,కొంత చిల్లరా కలిసి ఐదువందలు అయ్యాయి. జయరాం సునీత పేరున తీసిన ఆటో డ్రైవింగ్ లైసెన్స్ చేతికి తగిలింది.
'ఆడపిల్లలకు ఆటో డ్రైవింగ్ ఏమిటి?" అని అంటున్నా వినకుండా సునీతకు ఆటో నడపటం నేర్పించాడు జయరాం.
డ్రైవింగ్ లైసెన్స్, క్యాషు, ఫోల్డర్ బ్యాగులో భద్రపరుచుకుంది. ప్రొద్దున్నే ఉతికి ఆరేసిన జయరాం యూనీఫాం వేసుకుంది.కాస్త వదులైంది. 'ఫరవాలేదు అనుకుంది' మూలన ఉన్న చెప్పుల -దుమ్ము తుడిచి కాళ్ళకు వేసుకుంది.
" రత్నం ! పిన్నిని వచ్చి జ్యోతికి సాయంగా ఇక్కడే పడుకోమను. మనం రామస్వామి బాబాయే కాదు; మరెవరి సాయానికి వెళ్ళటం లేదు. బావను ఇంకా వార్డులోకి తీసుకురాలేదనీ ,మనం వెళ్ళేదాకా తాను అక్కడే ఉంటానని కామేశం చెప్పాడు. బావ మళ్ళీ ఆటో నడిపించగలిగేంత వరకూ ఈ యూనీఫాం, బావ ఆటో నాతోనే ఉంటాయి".
స్థిరమైన గొంతుతో నిశ్చయంతో ఇంటి బయటకు నడుస్తోన్న సునీతను అనుసరించాడు రత్నం.
సూర్యుడు ఉదయించబోతున్నట్లుగా తూర్పు ఆకాశం ఎర్రబడుతున్నది. చీకట్లింకా పూర్తిగా విచ్చుకోలేదు. అయినా సునీత అడుగులు గమ్యంవేపు స్థిరంగా పడుతున్నాయి.
- కూర చిదంబరం