ఏరిన ముత్యాలు: వచన కవితా ప్రేమికులకు ఆరాధ్యుడు, మార్గదర్శి కుందుర్తి
(ఇవాళ అక్టోబర్ 25 కుందుర్తి 41 వ వర్థంతి )
‘నా ఊహలో వచన కవిత్వం అంటే ప్రజల కవిత్వం. నా కవిత్వానికి వ్యాకరణం ప్రజలు. అంటే వారు ప్రయోగించడం ద్వారా సాధువులైన శబ్దాలనే నేను ప్రయోగిస్తాను. నాకు నిఘంటువు ప్రజలు... ఒక్క మాటలో చెప్పాలంటే నా ఊహలో కవితకు శరీరం ప్రజల వ్యవహార భాష. ఆత్మ -వారి అభ్యున్నతి’’ అనీ,
‘పాతకాలం పద్యమయితే వర్తమానం వచన గేయం’ అనీ ప్రక్రియా పరమైన ప్రకటనతో సంచలనం సృష్టించి, ఈనాటి కవితా తత్వమంతా అభ్యుదయ కవితా తత్వమని బలంగా నమ్మి, ఆ నమ్మికకు మరింత బలం చేకూరుస్తూ వచన కవిత ప్రాచుర్యానికి అహరహం కృషి చేసినవాడు కుందుర్తి. అందుకే ఆయన దివాకర్ల వారి నోట ‘వచన కవితా పితామహుడు’గా గౌరవింపబడినాడు. సాహితీలోకం అవునన్నది. ఆ బిరుదు స్థిరమైనది.
‘నయాగరా’లో ‘మరో ప్రపంచపు మహదాశయమే మార్గదర్శి’గా కవిత్వారంభం చేసిన కుందుర్తి పరిణామానుశీలనం - తర్వాతి తర్వాతి రచనల్లో విశదంగానే పారదర్శకమైంది. వస్తుపరంగానే కాక, రూపపరంగా కూడా వచన కవితలో కావలసినదేమిటో కొత్తవారికి సూచించాడు. ‘వచనత్వాన్ని విరుచుకొని ప్రతి పంక్తినీ కవిత్వంగా భావింపజేయడానికి ఆధునిక వచన కవులు ఎన్ని మార్గాలు సృష్టించుకున్నారో’ ఆయన కరతలామలకం చేసుకున్నాడు. ఆ ధోరణిలో కవిత్వ ప్రస్థానం అవాంఛనీయమని తెలిపాడు. వచన కవితలో ‘సారళ్యం’ని ‘ఒక దేవతగా ఆరాధించాడు’! ఇది ఈనాటి చాలామంది కవులు సాధించుకోగలిగిన గుణ విశేషమే! అయితే,అలాగని, కుందుర్తి కవిత్వంలో రసహీనతని ఎన్నడూ ఆమోదించలేదు. ‘నిజానికి ఉక్తి వైచిత్రి లేకుండా కవిత్వమేలేదు’ అని నిజాయితీగా, నిష్కర్షగానే అన్నాడు. ‘కాని తన భావనాశక్తిని కవి దేనికోసం ఉపయోగిస్తున్నాడనేది ఈ యుగంలో ప్రధానాంశం’గా భావించాడు.
‘చెప్పదలచుకున్నది ఏదో కొంత ప్రతివాడికీ ఉంటుంది. కాని, చెప్పే తీరును చక్కగా సాధన చేసుకున్న వాడి మాటల్నే లోకం పూర్తిగా వింటుంది. ఇదే కవిత్వంలో శైలికి గల ప్రాధాన్యం’ అనీ, ‘... వచన గేయమైనా విశృంఖల విహారం చేయరాదనీ, దాని నడకలోనూ ఒక లయ, పంక్తిలో ఒక నిర్మాణ పద్ధతీ వుండాలనీ సారాంశం. ఈ పంక్తి నిర్మాణ పద్ధతులు ఆయా కవుల యిష్టానిష్టాలను బట్టి శతాధికంగా వుండవచ్చు. స్థూలంగా ఒక నియమం అనేది మాత్రం ఉండాలి’ అని స్పష్టమైన ‘కవితా రీతి’ని నిర్దేశించాడు.
ఉదాహరణకి ‘నేటి మన బతుకు పులిజూదం ఆట’ వంటి సమస్త కవిత్వ లక్షణాల సమాహారం వంటి అభివ్యక్తుల్ని ఎన్నిటినో మన ముందుంచాడు. అంతేగాక, ప్రయోగశీలిగా నిఖార్సయిన వచన కవితలో నాటికల్ని రాసి ‘నిజాన్ని నవంనవంగా’ పలికించిన దిట్ట కుందుర్తి. వచన కవిత కథాత్మక మార్గం అనుసరించాలనే మార్గదర్శనం చేసి శీలావీ నుండి శివారెడ్డి వరకు అనేక మంది కవులు దీర్ఘ కథాకావ్యాలు చేపట్టటాన్ని ప్రోత్సహించాడు. కవిత్వంలో అభ్యుదయ భావనకు జీవాన్నీ, జవాన్నీ ప్రోదిచేశాడు.
‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ కుందుర్తి, శీలావీల ‘బ్రెయిన్ ఛైల్డ్’. ప్రతిష్ఠాత్మకమైన పురస్కార సంస్థగా, వచన కవులకు మంచి వేదికగా - అది ఈనాటికీ అద్భుతంగా నిర్మాణాత్మక కార్యక్రమంతో నిర్వహింపబడుతోంది. ఆ బాధ్యతని స్వీకరించిన శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ వాట్సప్ గ్రూప్ నీ ఈనాడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. నెలకు రెండు బహుమతులతో - వచన కవుల్ని గౌరవించి ప్రోత్సహిస్తున్నారు. ఆమె నిబద్ధతకూ, అంకితభావానికీ కవిలోకం ధన్యవాదాలు అందిస్తున్నది.
కుందుర్తిని నేను తొలిసారి ‘గృహకల్ప’లో ‘ఆంధ్రప్రదేశ్’ పత్రిక ఆఫీస్ లో కలిశాను. గుత్తికొండ సుబ్బారావుతో కలిసి వెళ్లాను. శీలావీ కూడా అప్పుడు అందులో పనిచేస్తున్నారు. శీలావీతో నాకు అంతకుముందే పరిచయం. (ఆయన కృష్ణా పత్రికను చూస్తున్నప్పుడు) ఆ సందర్భంలోనే కుందుర్తి సుబ్బారావుకు ఒక దిశానిర్దేశం చేశాడు. ‘ఉంటే కార్యకర్తగా వుండు లేదా కవిగా వుండు’ అని. సుబ్బారావు కార్యకర్తగా మిగిలేడు, నిలిచాడు, గెలిచాడు!
నాకూ ప్రసంగవశాత్తూ కుందుర్తి ఇచ్చిన సలహా - ‘వచన కవితని ఇంకా వేగంగా రాయండి, కథల్లో పడటంవలన కవిత్వంపట్ల మీలో అలసత్వం కనిపిస్తోంది’ అని. నేనూ వారి సలహా పాటించాను. నా ‘చలనమ్’ కవితా సంపుటి వచ్చింది. ఆ తర్వాత ఆ సంపుటికి ఒక ప్రతిష్ఠాత్మక బహుమతి తప్పిపోయింది. అప్పుడు భమిడిపాటి జగన్నాథరావుగారు వివరం చెబుతూ ‘నిరుత్సాహ పడవద్దు’అని చెబితే, కుందుర్తి ఒక కార్డు రాశారు - ‘కావ్య గుణాన్ని నిర్ణయించేది అవార్డులూ, రివార్డులూ కావు. మీరు నిఖార్సయిన కవిత్వం రాశారు. రాస్తూ వుండండి’ అని!
స్పందన సాహితీ సమాఖ్య తరఫున కుందుర్తిని రెండుసార్లు బందరు ఆహ్వానించాము గానీ, రాలేకపోయారు. విజయవాడ సభకు వచ్చారొకసారి.
1977లో స్పందన సాహితీసమాఖ్య తరఫున కుందుర్తి పీఠికలు పుస్తకం వేశాము. దానిలో ఒక చమత్కారం చేశాడు కుందుర్తి. ‘ఒకరిద్దరిలో ఒకడు’ అని ముందుమాట రాస్తూ - అది రాస్తున్నవారూ, కుందుర్తీ వేరు వేరు అన్నట్టు రూపింపజేశాడు! ముందుమాటలోనూ, ఆ పుస్తకంలోని వివిధ పీఠికల్లోనూ అటు వ్యక్తిత్వపరంగా ఇటు సాహిత్య వ్యక్తిత్వ పరంగా తానేమిటో వివరంగానే పునరుక్తం చేశాడు. తన ఊహలో వచన కవిత్వం అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెప్పాడు: స్పందన సాహితీసమాఖ్య ప్రచురించిన శతాధిక పుస్తకాల్లో, సినారె ‘తరంతరాల తెలుగు వెలుగు’తో పాటు ‘కుందుర్తి పీఠికలు’ కూడా సాహితీలోకం విశేష ఆదరణని పొందింది.
‘మానవజాతి పురోగమనానికి దోహదం చేయని భావాలు ప్రదర్శించిన కవినీ - ప్రపంచమూ, దేశమూ మాట అలా వుంచి తన భాషా ప్రాంతంలోనే ప్రజల మనస్సులలో హత్తుకోలేరు. ఒకవేళ ప్రజలు అతనిని గుర్తించుకున్నా ఒక శైలిలో, ఒక విశేష సమాస రచనా సామర్థ్యానికో, ఒక వికారపు పోకడకో, ఒక కవిత్వపు గారడీకో, మరేదో ఒక దానికి గుర్తుంచుకుంటారు గాని సంపూర్ణమైన కవిగా, ‘తమ కవి’గా వారు అతనిని ఆదరించరు’ అన్నారు. కుందుర్తి వెల్లడించిన ఆయన నిబద్ధత- ఒకవిధంగా కవి సమూహానికి హెచ్చరికే! కుందుర్తి దార్శనికతకు సంభావ్యతను కూరుస్తూ వచన కవిత - ఈ యుగం సాహిత్యంలో శిఖరాయమానంగా నిలిచి వెలుగుల్ని పంచుతోంది! *
సాహితీమిత్రులు విజయవాడ వారు ప్రచురించిన కవిత -2022 కవితా వార్షిక అట్టవెనుక కుందుర్తి శతజయంతి సమాపనం స్మరణలో ప్రచురించిన కుందుర్తి కవిత
- విహారి