Telugu Global
Arts & Literature

సాగర సంసారం

సాగర సంసారం
X

అంబుధి కడుపున అక్కలి బిడ్డల

అలల ఆటలు అల్లిబిల్లులు

పయనమునందున పలకరింపులు

ఆరోహణలు అవరోహణలు

కదలాడెను కడలి తరంగం

పొరలాడగ తడి ఇసుకల

వడివడిగా సడి చేయుచు

తీరానికి తెచ్చెనేమో

చిరు గవ్వల శంకులంట

గలగలమని వెనుతిరుగుచు

అందినవన్నిటి చిలిపిగ వాటిని

వాలుగ వీలుగ నీడ్చుకు పోవగ

ఎదురొచ్చెను పెను లహరులు

ఢీకొని పడద్రోసివేసి

బరువుగ మీదన కమ్మిరించగా

నురుగులు గ్రక్కుచు సోలుచు

మెల్లమెల్లనా పాకుచు దేకుచు

చెలియలికట్టన చెంగున జారగ

జలలతలకు నురగల మల్లెలు

తరములు నిరతములై

కడలంతను కేరింతల

కెరటంబుల జలకేళులు

హోరెత్తెను కడలి భాష

చక్కని సాగరమొక సంసారం

చిక్కని సంసారమొక సాగరం

ఆటుపోటులకు అమ్మో! అనకు

సహనమె నీ గతి చక్కదిద్దును.

- క్రొవ్విడి వెంకట బలరామమూర్తి

(హైదరాబాదు)

First Published:  12 Aug 2023 11:50 PM IST
Next Story