నీవూ త్రినేత్రుడివే ! (కవిత)
వైవిధ్యభరిత ప్రపంచంలో...
సమన్వయింప బడ్డ...
ప్రకృతి ఇది.... !
కనిపించే దానికి... మనకర్ధమయేడొకటి !
దాని పరమార్ధం వేరొకటి !!
నీచర్మచక్షువులుచూపించేదాన్ని
నీబుద్ధి విశ్లేషించలేదు... !
భ్రమ - ప్రమాదాలకు...
దారితీయిస్తుంది... !!
ఈ సంకటంనుండి...
నువ్ గట్టెక్కాలంటే...,
నీకు ఉపనయనం కావాల్సిందే
దానికోసం...
వ్యయ - ప్రయాసల... బాహ్య కార్యకలాపాల పనిలేదు... !
అది... నీఫాల భాగంలో...
పరివేష్టింపబడే ఉంది.. !!
నీ శోధన - సాధన అంతా....
బాహ్యంగా కాదు...,
అంతర్ముఖంగా జరగాల్సిందే!
ఉపయోగించు..... !
నీమూడోకన్నును....
ఉపయోగించు...!!
అది...నీఆత్మప్రకాశ
జ్ఞానజ్యోతి
ఎంత నిగూఢ రహస్యాలైనా...
తేట తెల్లమైపోతాయి... !
సత్యా సత్యాలను...
సుస్పష్టం చేసేస్తుందది.. !!
నీవూ... త్రినేత్రుడవే.... !
ఆ పరమశివుని వారసునివే!!
ఇది తెలుసుకుంటే...
నీబ్రతుకు శివము,సుందరము
లేకుంటే.. నిర్జీవ సదృశం !
జీవచ్ఛవమే.... !!
- కోరాడ నరసింహా రావు