Telugu Global
Arts & Literature

బహుమతి (కథ)

బహుమతి (కథ)
X

ధర్మయ్యకు కష్టపడి పనిచేయటం తప్ప మరొక ధ్యాస లేనివాడు. ఒకరోజు నాంచారయ్య పొలంలో మొక్కలు నాటే పనిచేస్తున్నాడు. తాను తవ్వుతున్న గుంటలో రెండు బంగారు నాణాలు లభించాయి. వెంటనే వాటిని నిజాయితీగా నాంచారయ్యకు ఇచ్చేశాడు.

బంగారు నాణాలు తీసుకున్న నాంచారయ్య కన్నుకుట్టింది. అంతే! దుర్బుద్ధితో ఒక నక్కజిత్తుల ఎత్తుగడ వేశాడు.చూడు ధర్మయ్యా! ‘‘ఇవి చూస్తే ఇత్తడి నాణాలు లాగా ఉన్నాయి’’ అని తికమకగా మాట్లాడాడు. "అయినా ఆ విషయాలన్నీ నాకెందుకు బాబుగారు? "అని చెప్పి ధర్మయ్య సాయంత్రం వరకూ మొక్కలు నాటే పని పూర్తిచేసేసి, తన కూలి డబ్బులు తీసుకొని ఇంటికొచ్చేశాడు.

రాత్రి భోజనం చేస్తూ ఈ విషయాన్ని భార్య ధనలక్ష్మితో చెప్పాడు. ఆమె భర్తకు అన్నంతోపాటు చెడామడా చివాట్లు కూడా కడుపునిండా పెట్టింది. "నీకేమైనా మతిపోయిందా? లేక తిక్కగా ఉందా? అసలు నువ్వు గొయ్యి తవ్వితేనే కదా, నీకు రెండు బంగారు నాణాలు దొరికాయి! మరి వాటిని యజమానికి ఎందుకిచ్చావు? ఇంచక్కా ‘బంగారు లక్ష్మిని’ ఇంటికి తీసుకొస్తే మన దరిద్రం కాస్తా తీరిపోయేది గదా!

పోనీలే! బంగారు నాణాలు యజమానికి ఇచ్చావే అనుకో, నువ్వు చేసిన మంచి పనికి అంతో ఇంతో బహుమానం అడగచ్చు కదా! ఓరి పిచ్చిమాలోకమా!" అంటూ నానాయాగీ చేసింది.

అకారణంగా పాపం ధర్మయ్య మనసును బాధపెట్టింది. భార్య ధనలక్ష్మి.

"చూడు ధనలక్ష్మి, నా పేరు ధర్మయ్య అని ఎందుకు పెట్టారు మా తల్లిదండ్రులు? నేను ధర్మంగా జీవించాలనే కదా! నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ రెండు బంగారు నాణాలు నాంచారయ్య పొలంలో దొరికాయి కాబట్టి, అవి ఆయనకే చెందుతాయి. అందుకే ధర్మంగా ఆయనకే ఇచ్చేశాను."

"మరి నా పేరు ధనలక్ష్మి కదా! మరి నాకు ధనం దొరకటం లేదే? "అని చిర్రుబుర్రులాడిరది. ‘‘నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి’’ అని నిందించింది.

వీరిద్దరి మధ్య గొడవ పెరగటంతో ఇంట్లో పిల్లలు కూడా ఏడవటం మొదలుపెట్టారు. ‘‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు’’ పిల్లల్ని చావబాదింది ఇల్లాలు. వాళ్ళు ఏడుస్తూ నిద్రపోయారు.

కానీ ధనలక్ష్మికి నిద్రపట్టలేదు. రోజంతా పనిచేసి అలసిపోయిన ధర్మయ్య మటుకు హాయిగా నిద్రపోయాడు.

బంగారు నాణాలు విషయాన్ని తెలుసుకున్న మహారాజు ధర్మయ్యనూ, నాంచారయ్యను వెంటనే ఆస్తానానికి రమ్మని ఆజ్ఞాపించాడు.

సభకి మహామంత్రి, రాజ పరివారంతోపాటు నగర పౌరులు కూడా హాజరయ్యారు.

మన రాజ్యంలో దొరికిన వజ్రవైఢూర్యాలు, బంగారు నాణాలు, సంపదను తక్షణమే ఆస్థాన కోశాధికారికి అందజేయాలి కదా! మరి నువ్వెందుకు బంగారు నాణాలను నీ దగ్గరే దొంగలా దాచిపెట్టుకున్నావు అని మహారాజు కోపంగా నాంచారయ్యను ప్రశ్నించాడు.

అయ్యా! నేను ఇద్దామనే అనుకున్నాను, కానీ ఈ లోపలే తమరు కబురు చేశారు అని నీళ్ళు నమిలాడు నాంచారయ్య.

అతని దొంగ చూపులనూ, నక్క జిత్తులనూ ఇట్టే పసిగట్టేశాడు మహారాజు.

"చూడు ధర్మయ్యా! నీకు పొలంలో దొరికిన రెండు బంగారు నాణాలు నాంచారయ్యకు ఇచ్చిన సంగతి నువ్వెందుకు మాకు చెప్పలేదు! "అని ఆగ్రహించాడు.

"అయ్యా! నాకు చదువురాదు, ఈ శాశనాలు, చట్టాలు తెలియవు" అని నిజాయితీగా చెప్పాడు. ధర్మయ్యకున్న ధర్మగుణాన్ని, న్యాయాన్ని మెచ్చుకొని, అతనికి ఒక బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చాడు మహారాజు. అంతేకాకుండా ధర్మయ్యకు తన ఆస్థానంలో ఉద్యోగాన్ని కూడా ఇస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించాడు రాజు.

మహారాజా! మరి నాంచారయ్య చేసిన నేరానికి శిక్షను కూడా విధించమని మహామంత్రి ప్రస్తావించాడు.

ఒక బంగారు నాణాన్ని ధర్మయ్యకు ఇవ్వటం ధర్మం. ఇక రెండవ నాణాన్ని ప్రజాసంక్షేమానికి మనం ఉపయోగించటమే ‘‘నిజమైన రామరాజ్యమని’’ అత్యున్నతమైన తీర్పునిచ్చాడు మహారాజు.

నాంచారయ్య పశ్చాత్తాపంతో తను చేసిన తప్పును క్షమించమని మహారాజును వేడుకున్నాడు. ఈ శాసనం, చట్టం గూర్చి నాంచారయ్య చాటింపు వేయించి, ప్రజలకు మళ్ళీ తెలియజేశాడు.

భర్తకు రాజ కొలువులో ఉద్యోగం వచ్చినందుకు, ధర్మయ్య ధర్మబుద్ధికి ‘‘బంగారు బహుమతి’’ కూడా వచ్చినందుకు ‘‘ధనలక్ష్మి పూజ’’ చేసి ఇరుగు పొరుగు వారందరికీ పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు వడ్డించింది ధనలక్ష్మి.

-కొండూరి కాశీవిశ్వేశ్వరరావు

First Published:  5 Aug 2023 4:30 PM IST
Next Story